ugc

16:04 - September 21, 2018

న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు సెస్టెంబర్ 29 తేదీని సర్జికల్ దినోత్సవం రోజుగా పాటించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీచేసింది. పాకిస్థాన్ భూభాగంలో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు సంఘీభావంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆరోజు ప్రతిజ్ఞ నిర్వహించాలని కోరింది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఉత్తరాలను యూజీసీ పంపించింది.

యూజీసీ ఇచ్చిన ఆదేశాలపై జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) అద్యాపకులు విమర్శించారు. ఇది విశ్వవిద్యాలయాల్లో యుధ్ధ టాంకులను మొహరింపచేయడమేనని.. దీని ద్వారా బీజేపీ నేతలు తమను తాము జాతీయవాదులుగా నిరూపించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.


రాజకీయ లబ్దికి బీజేపీ కుట్ర : కాంగ్రెస్

సర్జికల్ స్ట్రైక్ దినోత్సవాన్ని జరపాలని యూజీసీ ఆదేశించడం రాజకీయ దురుద్దేశమేనని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీని ద్వారా రాజకీయ లబ్దిపొందేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కపిల్ సిబాల్ విమర్శించారు. ఇటువంటి చర్యలవల్ల విశ్వవిద్యాలయాలు స్వతంత్రతను కోల్పోతాయని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూజీసీ ఈ తరహా సర్కులర్‌లను జారీచేయలేదని సిబాల్ పేర్కొన్నారు.

21:30 - November 14, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 123 విద్యాసంస్థలు యూనివర్సిటీ ట్యాగ్‌లైన్‌ను కోల్పోయాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. విశాఖకు చెందిన గీతం, గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, తిరుపతికి చెందిన రాష్ట్రీయ సాంస్క్రీట్‌ విద్యాపీఠ్‌, అనంతపురంకు చెందిన శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌, గుంటూరుకు చెందిన విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ రీసెర్చ్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు. వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు కొత్త పేరు కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ ఆదేశించింది. 

08:22 - July 31, 2017

కామారెడ్డి : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం రాబోతుంది. ఇన్నాళ్లు అన్యాక్రాంతమైన ఆస్తులన్నీ కాలేజీకే చెందడంతో యూజీసీ గుర్తింపు లభించింది. 20 ఏళ్ల తమ పోరాటానికి గుర్తింపు లభించినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
1964లో డిగ్రీ కళాశాల ప్రారంభం 
ఇది కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల. 1964లో అప్పటి కలెక్టర్‌ బి.ఎస్‌.రామన్‌ ఆధ్వర్యంలో కాలేజి ఎడ్యుకేషనల్‌ సొసైటీని స్థాపించి ఈ కాలేజీని ప్రారంభించారు. 268 ఎకరాల్లో ప్రారంభించిన ఈ కాలేజీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. అయితే ఆ తర్వాత... ఈ కాలేజీ ఆదరణకు నోచుకోకుండా పోయింది. కాలేజీ ఆస్తులన్నీ అన్యాక్రాంతమయ్యాయి. 
కాలేజీ ఆస్తులను కాపాడాలంటూ విద్యార్థులు పోరాటాలు 
కాలేజీ ఆస్తులను కాపాడాలంటూ విద్యార్థులు అనేక పోరాటాలు చేశారు. విద్యార్థులు పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. దీంతో 1987లో ఈ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే... సొసైటీ సభ్యులు కోర్టుకెళ్లడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై మళ్లీ విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేశాయి. దీంతో కాలేజీ ప్రభుత్వం చేతికైతే వచ్చింది గానీ... ఆస్తులు మాత్రం సొసైటీ చేతుల్లోనే ఉండిపోయాయి. కాలేజీ ఆస్తుల కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో కాలేజీకి యూజీసీ గుర్తింపురాకుండాపోయింది. ఆ తర్వాత నిధులు లేక కాలేజీ పరిస్థితి దారుణంగా తయారైంది. 
కాలేజీకి యూజీసీ గుర్తింపు  
అయితే... ఎన్నో ఏళ్లుగా విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. కాలేజీ పరిస్థితిపై 10టీవీ ఎన్నోసార్లు ప్రసారం చేసిన కథనాలు చూసిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గంప గోవర్ధన్‌ స్పందించారు. ఎడ్యుకేషనల్‌ సొసైటీతో మాట్లాడి... ఆస్తులను కాలేజీకి అప్పగించేలా చేశారు. ఈ తీర్మాన కాపీలను సీఎం కేసీఆర్‌కు పంపించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూజీసీ గుర్తింపు కాలేజీకి వచ్చింది. దీంతో కాలేజీకి ప్రతి ఏడాది 30-40 లక్షలు వస్తాయని విద్యార్థులు, లెక్చరర్లు అంటున్నారు. యూజీసీ నుంచి వచ్చే నిధులతో కాలేజీ మరింత అభివృద్ధి చెందుతుందని విద్యార్థి సంఘాల నేతలంటున్నారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా తాము చేసిన పోరాటానికి ఫలితం దక్కడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

06:41 - August 31, 2015

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై యుజీసీ కన్నెర్రజేసింది. యూనివర్సిటీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడింది. ఇక నుంచి యూజీసీ గ్రాంట్ల నుంచి కోతలు కూడా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పొంతనలేని లోపాలు చూపి నాణ్యతలేని పరిశోధనలు కుప్పలుగా పంపుతున్నారంటూ ఫైర్ అయింది. తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలకు ఇంకా గడ్డుకాలం వెంటాడుతూనే వుంది. అసలే యూనివర్సిటీలు ప్రొఫెసర్లు లేక విలవిలాడుతుంటే..ఇప్పుడు యూజీసీ క్లాస్‌తీసుకోవడం తలనొప్పిగా మారింది.

అభిప్రాయాలు వ్యక్తం చేసిన యూజీసీ..
విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీల క్వాలిటీ తగ్గిపోతున్న నేపథ్యంలో యూజీసీ తన అభిప్రాయాలను వెల్లగక్కింది. ఒక్క ప్రొఫెసర్ కింద ఎనిమిది మంది పీహెచ్‌డీ స్కాలర్స్ మాత్రమే ఉండాలి. కానీ రాష్ట్రంలో ఏకంగా పది నుంచి పదిహేను మందికిపైగా కొనసాగుతున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగితే కఠిన చర్యలు తప్పవనే హింట్‌ని తాజాగా యూజీసీ వర్గాలు అందించాయి. దీంతో...వర్సిటీలకు నిధులకు ఎక్కడ అడ్డుకోగలుగుతారోనని వర్సిటీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

తప్పులను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం..
యూజీసీ ఆగ్రహం చెందడంపై వర్సిటీ ప్రొఫెసర్లు తమ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల ఒత్తిడిమేరకు కొందరు సూపర్‌వైజర్స్ విద్యార్థులకు గైడ్‌లుగా వ్యవహరిస్తున్నారని కొందరు ప్రొఫెసర్‌లు చెబుతున్నారు. అధికారుల సమాధానం అలా ఉంటే...యూనివర్శిటీ ఇంజనీరింగ్ విభాగాలతో పోలిస్తే సగానికి పైగా సోషల్ సైన్స్ డిపార్టుమెంట్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. అటు విద్యావేత్తలు కూడా యూనివర్సిటీల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గైడ్ కింద పదుల సంఖల్లో పరిశోధనలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విధానాన్ని నియంత్రించలేకపోతే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లోపాలను సరిదిద్ది యూనివర్శిటీలను, ఉన్నత విద్యను బతికించాలని విద్యావేత్తలు సైతం సూచిస్తున్నారు.

Don't Miss

Subscribe to RSS - ugc