US

18:19 - November 8, 2018

కాలిఫోర్నియా: అమెరికాలో కాలిఫోర్నియాలోని ధౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని బార్ లో గురువారం తెల్లవారు ఝూమున ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 13మంది మరణించారు. పలువురికి  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు ఘటనాస్దలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలిఫోర్నియాలోని బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్ అనే పబ్ లో ఓకళాశాలకు చెందిన సుమారు 200 మందికి పైగా విద్యార్ధులు పార్టీ చేసుకుంటుండగా ఆగంతకుడు పబ్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. పబ్ లోకి వస్తూనే పొగ వచ్చే గ్రెనేడ్లు విసిరి కాల్పులుకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపిన ఆంగతకుడు కూడా బార్ లోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఇటీవల అమెరికాలో  స్కూళ్లు, ప్రార్ధనా మందిరాలు, పబ్ లు రెస్టారెంట్లుతో సహా బహిరంగప్రదేశాలలో ఇటీవల  దుండగులుకాల్పులు జరిపే ఘటనలు ఎక్కువయ్యాయి. 

18:20 - November 1, 2018

అరిజోనా (అమెరికా): రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఓ మహిళ 6 రోజులపాటు కారులోనే ఉండిపోయింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అరిజోనాలో అక్టోబర్ 12న మహిళ ఒక్కతే డ్రైవ్ చేస్తూ ఉండగా కారు అదుపుతప్పి రైలింగ్‌ను ఢీ కొట్టి 17 మీటర్ల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది. కారు చెట్టు కొమ్మలో ఇరుక్కుపోవడంతో ఆరు రోజులపాటు కారులోనే ఉండిపోయింది. అక్టోబర్ 18న రైలింగ్ డ్యామేజీని గమనించిన భద్రతా సిబ్బంది చెట్టుపై ఉన్న కారును గమనించి కిందకి దిగారు. కానీ కారులో ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగారు. ఆ మహిళ చిన్నగా చెట్టుపైనుంచి పైకి వచ్చి రైల్-రోడ్డుకు చేరుకొనేందుకు ప్రయాసపడింది. అయితే శరీరంలో నీరు తక్కువ కావడంతో అక్కడికి చేరుకోలేకపోయింది. స్థానికులు కొందరు ఆ మహిళను గమనించడంతో ఆసుపత్రిలో చేర్చడంతో కోలుకుంటోంది. 
 

13:27 - October 19, 2018

ఢిల్లీ : సాక్షాత్తు సౌదీ దేశస్థుడైన ఓ జర్నలిస్టుని సౌదీ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా హత్య చేసింది. కాగా గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ దారుణహత్యకు గురయ్యారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తు ఆర్టికల్స్ రాసినందుకు జమాల్ ఖషోగ్గీ  అనే జర్నలిస్ట్ ని దారుణంగా చంపేసారు. రియాద్ నుంచి రెండు విమానాల్లో టర్కీ వచ్చిన 15 మంది స్క్వాడ్ ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. అనంతరం ఖసోగ్గీ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. 
ఖషోగ్గీని హత్య చేసిన అనంతరం అదే విమానాల్లో వారు తిరిగి రియాద్ వెళ్లినట్లు టర్కీ ప్రకటించింది. సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ అమెరికాలో ఉంటూ సౌదీ అరేబియా ప్రభుత్వంపై విమర్శనాత్మక వ్యాసాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా రాయబార కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు..ఈ నేపథ్యంలో ఖషోగ్గీ దారుణ హత్యకు గురయ్యారు. 
ఈ దారుణహత్యతో సౌదీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జమాల్ హత్యపై అమెరికా, బ్రిటన్‌లు సౌదీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో సౌదీలో జరగనున్న పెట్టుబడుల సదస్సు నుంచి యూఎస్ ట్రజరీ సెక్రటరీ స్టీవెన్ మ్నుచిన్, బ్రిటన్ అంతర్జాతీయ కార్యదర్శి లియామ్ ఫాక్స్ వైదొలిగారు. 

15:57 - September 10, 2018

హైదరాబాద్ : డాలరు విలువతో పోల్చితే రూపాయి విలువ సోమవారం మరింత దిగజారింది. రూపాయి మరింత పతనమై డాలర్ రేటుతో 72.67 స్థాయికి పడిపోయింది. వాణిజ్య లోటుతోపాటు అమెరికా డాలర్ కు ఎగుమతి  దారుల వల్ల డిమాండ్ పెరగటంతో రూపాయి విలువ పడినట్టు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

దేశీయ ద్రవ్య విలువ ఈరోజు డాలర్ రేట్ పై 71.73 దగ్గర మొదలై అత్యల్పంగా 72.15 వద్ద ముగిసింది. నిన్నటి 72.11 విలువను రికార్డు స్థాయిలో దాటి 72.67 గా నమోదయ్యింది.

10:42 - May 21, 2018

హైదరాబాద్ : ప్రముఖ నవలా రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన కుమార్తె ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. యుద్దనపూడి సులోచనారాణి అనేక నవలలు రాశారు. మౌనపోరాటం, ఆగమనం, ఆరాధన, ప్రేమ పీఠం, వెన్నెల్లో మల్లిక లాంటి అనేక నవలలను ఆమె రచించారు. ఆమె రాసిన అనేక నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. యుద్దనపూడి నవలల ఆధారంగా గిరిజా కల్యాణం, ఆత్మీయులు, మీన, జీవన తరంగాలు, అగ్నిపూలతోపాటు మరికొన్ని చిత్రాలు తెరకెక్కాయి. కుటుంబ కథనాలు రాయడంలో తనకు తానే సాటిగా యుద్దనపూడి నిలిచారు. నవలా దేశపు రాణిగానూ అమె ప్రసిద్ధి చెందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో 1940లో ఆమె జన్మించారు. సులోచనారాణి మృతితో సాహిత్యలోకంలో విషాదం నెలకొంది. 
తెలుగు నవలా జగత్తుఓ ధృవతార ..
తెలుగు నవలా జగత్తు నుండి ఓ ధృవతార రాలిపోయింది. యుతుల కలల ప్రపంచంలో విహరించే కథానాయుడిని సృష్టించిన ఓ అద్భుతమైన, వ్యక్తిత్వ పాత్రల సృష్టికర్త, ప్రజల జీవన శైలిని, ఊహాలోకపు ఊయలలో విహరింపజేసిన అద్భుతమైన రచయిత్రి నవలాలోకపు రాణి యుద్ధనపూడి సులోచనాణి మరణించారు. తన రచనల్లో పాత్రలను తన నిజజీవితంలో తనకు తారసపడిన జీవితాలనే వస్తువులుగా తీసుకుని నవలలు రాడం ప్రారంభించిన యద్దనపూడి, ఆపై మారుతున్న ప్రజల జీవన విధానాలను అనుసరించి పాత్రలను సృష్టిస్తూ దూసుకెళ్లారు. ఆమె నవలలు భార్యాభర్తల మధ్య దాంపత్యం, కుటుంబ బాంధవ్యాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మధ్య తరగతి అమ్మాయిల ఆత్మవిశ్వాసం, మాటకారితనంతో నిండి వుంటాయి. డబ్బున్న అబ్బాయి, పేదింటి అమ్మాయి మధ్య నెలకొనే ప్రేమ ఆధారిత నవలల సృష్టిలో యద్దనపూడి స్వంతం. ఆమె రచనలు ఊహలే కావచ్చు..కానీ మనిషికి వుండాల్సిన సామాజిక కోణాలను తన రచనల్లో ప్రతిబింభే గొప్ప రచయిత్రి యుద్ధనపూడి.

యుద్ధనపూడి నవలతోనే వాణిశ్రీ స్టార్ హీరోయిన్ అయ్యింది : తెలకపల్లి
తెలుగు సాహిత్యంలోను, మహిళల యొక్క గౌరవ గొంతుకగా యుద్ధనపూడి తన రచనల్లో ప్రతిబింభించేవారని..నవలా రంగంలో ఆమె ఒక ఒరవడిని సృష్టించారని కొనియాడారు. ప్రముఖ హీరోయిన్ వాణిశ్రీ స్టార్ హీరోయిన్ గా ఎదిగటానికి కారణం యుద్ధనపూడి సులోచనారాణి నవలలే కారణమని తెలకపల్లి తెలిపారు. ఆమె రచించిన ఎన్నో నవలలు చిత్రాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ చిత్రాలలో వాణిశ్రీనే కథానాయికగా వుండేవారు. అంతేకాదు సులోచనారాణి గొప్ప మానవతావాది అని..ఎందోమందికి ఎన్నో విధాలుగా సహాయం, సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి అన్నారు. స్వతహాగా కూడా తన రచనల్లోని వివిధ అంశాలను, గొప్పతనాలను తన జీవితంలో ఆచరించి చూపించారన్నారు. జీవితంలో రాణిస్తున్న మహిళల జీవితాలను ప్రతిబింభేచేవారనీ..స్త్రీలను గౌరవించేలా సమాజం వుండాలని స్త్రీల వ్యక్తిత్వాన్ని తన రచనల్లో చూపించేవారని తెలకపల్లి పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆమె ఒక స్టార్ అని పేర్కొన్నారు. ఆమెకు సాటి వచ్చే రచనలు ఇప్పటికీ లేవంటే ఆమె రచనల ప్రభావం, శక్తి లేవంటే అతిశయోక్తి కాదన్నారు. ఆమె రచనల ప్రభావం అటు యూత్ లో పలు ప్రభావాలు చూపించేవానీ..అటువవంటి రచనాపటిమ అటువంటిదని తెలకపల్లి పేర్కొన్నారు. సులోచనారాణి ప్రభావంతో పురుషులు కూడా ప్రభావితం అయ్యారన్నారు. అంతేకాకుండా మహిళల శ్రేయస్సుకోసం, వారి అభివృద్ధి కోసం యుద్ధనపూడి ఎంతో కృషి చేశారని..దాని కోసం ఒక సంస్థను కూడా స్థాపించారని తెలకపల్లి రవి తెలిపారు.

ఆమె నలవలు ఒక ప్రభంజనం : లక్ష్మీపార్వతి
ఆమె నవలలు సృష్టించిన ప్రభంజనం అసాధారణమైనది ప్రముఖ రచయిత్రి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆమె నవలలో కథానాయకుడు ఆరోజుల్లో యువతులపై ప్రభావం చూపించేవారన్నారు. అంత గొప్ప కథానాయకుడు కూడా పేదింటి అమ్మాయిని వివాహం చేసుకునే ఆదర్శం ఆమె రచనల్లో ప్రతిబింభించేవారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

 

07:56 - November 2, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల పోరు ఉత్కంఠగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే ఫలితాలు తారు మారవుతున్నాయి. మద్దతుదారుల్లో ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు తాజాగా నిర్వహించిన సర్వేలో హిల్లరీ వెనకబడిపోయారు. రిపబ్లిక్‌ అభ్యర్థి ట్రంప్‌ ఒక్క శాతం తేడాతో హిల్లరీని బీట్‌ చేశారు.

రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మరో వారం రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా ఓటర్ల నాడీ అంతు చిక్కడం లేదు. మూడో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ అనంతరం పోల్‌ సర్వేల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌పై స్పష్టమైన ఆధిక్యం చూపారు. రాను రాను ఆమె ఆధిక్యం తగ్గుతూ వస్తోంది.

తాజా పోల్‌లో రిపబ్లికన్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా హిల్లరీపై స్వల్ప ఆధిక్యం
వాషింగ్టన్‌ పోస్ట్‌-ఎబిసి న్యూస్‌ ట్రాకింగ్‌ నిర్వహించిన తాజా పోల్‌లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా హిల్లరీపై స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. ఈ సర్వేలో ట్రంప్‌కు 46 శాతం మద్దతు రాగా... హిల్లరీకి 45 శాతం మద్దతు లభించినట్లు సర్వే తెలిపింది. ఇద్దరి మధ్య తేడా కేవలం ఒక్కశాతం మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.

మెయిళ్ల వ్యవహారంపై ఎఫ్‌బిఐ దర్యాప్తు ..వెనకబడిన హిల్లరీ
హిల్లరీ క్లింటన్‌ ఈ-మెయిళ్ల వ్యవహారంపై ఎఫ్‌బిఐ దర్యాప్తుకు ఆదేశించడంతో ఆమె ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ అంశాన్ని ట్రంప్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. హిల్లరీ నేరపూరిత చర్యలన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవేనని ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. హిల్లరీ విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు 60వేల ఈమెయిళ్ల గల్లంతు వ్యవహారంపై ఎఫ్‌బీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎఫ్‌బిఐ దర్యాప్తు ఆమె విజయావకాశాలను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నవంబరు 8న అధ్యక్ష ఎన్నికలు
తాజా సర్వే ద్వారా ట్రంప్‌ మద్దతుదారుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తుండగా.... క్లింటన్‌ మద్దతుదారుల్లో నిరుత్సాహం ఆవరించింది... నవంబరు 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 

21:57 - September 18, 2016

అమెరికా : న్యూయార్క్‌ పరిధిలోగల మన్‌హటన్‌లోని డంప్‌ యార్డులో రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. అగ్నిమాపక దళాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉగ్రవాదుల కుట్రా? అన్న నేపథ్యంలో ఎఫ్‌బీఐ అధికారులు విచారణ జరుపుతున్నట్లు న్యూయార్క్‌ మేయర్‌ తెలిపారు. శనివారం ఉదయం న్యూజెర్సీలో ఛారిటీ రేస్‌ జరుగుతున్న సమయంలో పైప్‌ బాంబు పేలిందని..ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సమావేశానికి హాజరుకావడానికి కొద్ది గంటల ముందే పేలుడు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

 

08:27 - July 18, 2016

వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో మరో నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. నల్లజాతి పౌరుడు స్టెర్లింగ్‌ కాల్చివేత అనంతరం పలు రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలాలు మిన్నంటుతూనే ఉన్నాయి..
పోలీస్ ఆఫీసర్లపై విచక్షణా రహితంగా కాల్పులు 
అమెరికా మళ్లీ రక్తసిక్తమైంది. లూసియానా బాటన్ రౌగ్‌లోని హమ్మాంద్ ఐరే ప్లాజా ఆదివారం ఉదయం కాల్పులతో దద్దరిల్లింది. సాయుధుడు ఎనిమిది మంది పోలీస్ ఆఫీసర్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు.
క్షతగాత్రులకు చికిత్స 
క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారైన సాయుధుడి గురించి వేట మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే అసాల్ట్‌ రైఫిల్‌తో ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకోగా.. వారిపై దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా కాల్పులు జరిపిన ఆగంతకుడిని పోలీసులు మట్టుబెట్టగా.. అతని వద్ద ఆత్మహుతి బాంబులు ఏమైన ఉన్నాయని పరిశీలించారు. 
కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించిన ఒబామా  
కాల్పుల ఘటనను అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులపై ఈ తరహా దాడులు సమంజసం కాదని తెలిపారు. ఇదిలాఉంటే  కొద్ది రోజుల క్రితం లూసియానాలోనే అల్టాన్‌ స్టెర్లింగ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు కాల్చిచంపడంతో దేశమంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సద్దుమణుగుతోందనుకున్న తరుణంలోనే మళ్లీ భగ్గుమంది. 

 

21:13 - June 13, 2016

ఓ పక్క తానే పెంచి పోషించిన ఉగ్రవాదం .. మరో పక్క అడ్డూ అదుపు లేని గన్ కల్చర్ .. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచానికి పెద్ద అన్నట్టుగా భావించే అమెరికా ఇప్పుడు సొంతింట్లో రేగుతున్న చిచ్చుని అదుపుచేయలేని పరిస్థితిలో పడింది. అక్కడ చాక్లెట్లు దొరికినట్టుగా తుపాకులు దొరుకుతున్నాయి. .. వీడియో గేమ్ ఆడినంత ఈజీగా గన్ పేలుస్తున్నారు.. బ్లైండ్ గా ఫిక్సవుతున్నారు...వైల్డ్ గా ఎటాక్ చేస్తున్నారు.. ఓవరాల్ గా అమెరికాలో ఎప్పుడే ఘటన జరుగుతుందో తెలియని ఆందోళన ఏర్పడింది. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ కథనం చూద్దాం. అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమౌతోంది . ప్రపంచానికి నీతి బోధలు చేసే అమెరికా ఇప్పుడు తన ఇల్లు తగలబడుతుంటే దిక్కుతోచని స్థితిలో పడింది. అడ్డూ అదుపు లేకుండా బహిరంగ మార్కెట్ లో దొరికే ఆయుధాలు ఇప్పుడా దేశాన్ని దారుణ అభద్రతలోకి నెడుతున్నాయి. మారణాయుధాలనే నమ్ముకుంది అమెరికా. కానీ, చివరకు తన బిడ్డలను కూడా అవే మారణాయుధాలకు బలితీసుకుంటుంటే విలవిల్లాడుతోంది . అమెరికాలో జరుగుతున్నన్ని తుపాకీ చావులు ప్రపంచంలో మరెక్కడా జరగడం లేదు. అమెరికాలో తుపాకీ కాల్పులు వినిపించని రోజంటూ కనిపించటం లేదు. బుల్లెట్ కు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు.. ఏ భాషా రాదు. అందుకే పెంచి పోషించిన వారినే బలితీసుకుంటోంది.. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత.. అతడికి గే సంస్కృతి అంటే ఇష్టం లేదు. అలాంటి విషయాల్ని కలలో కూడా ఊహించలేడు. వాళ్లని చూస్తే అతడికి తీవ్ర అసహనం. అదే లక్షణం అతడిని మారణహోమానికి కారణంగా మార్చింది. 50మందిని బలితీసుకునేలా చేసింది. ఓర్లాండోలో జరిగిన ఘటనలో ఒమర్ మతీన్ స్వలింగ సంపర్కులను యాక్సెప్ట్ చేయలేని స్థితిలో దారుణానికి తెగబడ్డాడు. అమెరికాలో తుపాకుల సంస్కృతిని మళ్లీ గుర్తు చేశాడు. ఓ పక్క ఆయుధాలు తయారు చేసి ప్రపంచంపై డంప్ చేస్తారు.. తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తారు.. తన ఆయుధ సంస్థలకు లాభాల కోసం ప్రపంచాన్ని నాశనం చేయటానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు అదే సమస్య ఆ దేశానికే ఎదురవుతోంది. ఇప్పటికైనా అమెరికా ద్వంద్వ ప్రమాణాలను వదులుకుంటుందా? లాభాపేక్షతో, సామ్రాజ్యవాద ధోరణులతో వ్యవహరించినంత కాలం ఆయుధాలే రాజ్యమేలుతాయి. అక్కడ కన్నీటికి స్థానం ఉండదు.. ఎందుకంటే బుల్లెట్ కు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు.. ఏ భాషా రాదు. అందుకే మొదట.. ప్రపంచం నుదుటిపై గురిపెట్టిన ఆయుధాన్ని అమెరికా గుర్తించాల్సి ఉంది. అదే సమయంలో నిజాయితీగా తన సమస్య పరిష్కారానికి కృషిచేయాలి. లేదంటే మరిన్ని మారణకాండలు తప్పవు..

08:02 - May 28, 2016

అమెరికా : 26/11 ముంబై దాడుల కేసు విచారణలో భారత్‌కు సహకరించాలని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరక్కుండా చర్యలు చేపట్టాలని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్‌కు విజ్ఞప్తి చేసింది. ముంబైలో జరిగిన ఉగ్రదాడి ఓ భయంకరమైన విపత్తని, బాధితులకు న్యాయంము జరిగేందుకు భారత అధికారులకు సహకరించాలని అమెరికా పాక్‌ను కోరింది. ఈ విషయంలో పాక్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా పేర్కొంది. తాలిబన్లతో పాటు పాక్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్ర వాద సంస్థలను నిర్మూలించేందుకు కృషి చేయాలని సూచించింది.

Pages

Don't Miss

Subscribe to RSS - US