Vijayawada

20:53 - January 18, 2017

కృష్ణా : నందివాడ మండలం ఇలపర్రులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. అక్రమ చేపల చెరువులను ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. గ్రామంలో 165 ఎకరా పేదల భూములను ఆక్రమించి చెరువుల తవ్వుతున్నారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6లోగా ఆగ్రమించిన భూములను పేదలకు అప్పగించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. పేదలకోసం చేస్తున్న పోరాటంలో జనసేన, కాంగ్రెస్‌, వైసీపీపార్టీలు కలిసి రావాలని మధు పిలుపునిచ్చారు. 

 

20:51 - January 18, 2017

గుంటూరు : డీఎస్ పీ దుర్గాప్రసాద్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడుల విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్‌ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో తమపై తప్పుడు కేసులు బనాయించి.. ఇబ్బందులకు గురిచేశాడని దుర్గా ప్రసాద్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గా ప్రసాద్‌ను సర్వీస్‌ నుంచి తొలగించాలని, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

20:48 - January 18, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నోట్ల రద్దును నిరసిస్తూ విజయవాడలోని ఎస్‌బీఐ జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. నోట్ల రద్దుతో మోదీ సర్కార్ భారీ కుంభకుణానికి పాల్పడిందని.. దీనిపై సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

 

13:14 - January 18, 2017

విజయవాడ: నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ప్రధాని మోదీ ఒక విధ్వంసకర శక్తి అని విమర్శించారు. నోట్ల రద్దు వ్యతిరేకంగా విజయవాడ ఎస్ బీఐ జోనల్ కార్యాలయం వద్ద ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ నేతలు, జాతీయ నేత కుంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ.. నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణం అని... సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం బయటికి వచ్చిందో బయటపెట్టాలని కోరారు.

12:46 - January 18, 2017

ప్రకాశం : ఏసీబీ కి మరో అవినీతి తిమింగళం చిక్కింది... ప్రకాశం జిల్లా చీరాలలో డీఎస్పీ దుర్గాప్రసాద్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.. ఆదాయానికిమించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో 13చోట్ల ఏకకాలంలో దాడులుచేశారు.. చీరాలతోపాటు దుర్గాప్రసాద్‌ బంధువులున్న విజయవాడ.... గుంటూరులోకూడా సోదాలు జరుపుతున్నారు.. గుంటూరులో లెక్కకుమించి ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.. తవ్వేకొద్ది బయటకొస్తున్న ఆస్తులుచూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.. దాదాపు 200కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.. భారీగా ఆదాయాన్ని సంపాదించిన దుర్గాప్రసాద్‌ కొద్దిరోజుల్లో దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారని తెలుస్తోంది.. దుర్గాప్రసాద్‌ ఒంగోలు పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీకి డీఎస్‌పీగా పనిచేస్తున్నాడు..  ఏసీబీ అధికారులు మొత్తం 11 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13 ప్రాంతాల్లో విచారణ చేస్తున్నట్లు, దుర్గా ప్రసాద్‌ బినామీలపై కూడా దాడులు చేస్తున్నట్లు చెప్పారు.

07:02 - January 18, 2017

అమరావతి : ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్నింటినీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం అమల్లో అలసత్వం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకవైపు పరీక్షల సమయం దగ్గరపడుతున్నా నేటికీ ఆన్ లైన్ లో ప్రవేశ పరీక్షలకు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఈ పరీక్షల తేదీల ఖరారు విషయంలో క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన తెలంగాణ సర్కార్....

తెలంగాణలో ఈ ప్రవేశ పరీక్షల తేదీలను ఇప్పటీకే ప్రకటించడంతో పాటుగా అవసరమైన కార్యాచరణ చేపట్టారు. తొలిసారిగా ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించడంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ప్రస్తుత సెట్ల నిర్వహణకు ....

ఏపీలో ప్రస్తుతం సెట్ల నిర్వహణకు ఆయా యూనివర్సిటీలు, కన్వీనర్లను ప్రకటించినా, పరీక్షలు నిర్వహించే ఏజెన్సీల ఖరారు ఆలస్యమవుతోంది. సంస్థల ఎంపిక కోసం అధ్యయనం చేసిన ప్రత్యేక కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి పంపింది. అయితే సంస్థల ఎంపికకు మార్గదర్శకాలు జారీకాలేదు. ఆన్ లైన్ లో పరీక్షల్ని మొదటిసారిగా నిర్వహిస్తున్నందున విద్యార్థులకు తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు.

ఇంజనీరింగ్‌కే ప్రతి ఏడాది 3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు...

ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్‌లో చేపట్టాలంటే కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే కార్యాచరణ ప్రారంభించాలి. ప్రతి ఏడాది ఇంజనీరింగ్‌కే దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరందరికీ ఆన్ లైన్‌లో పరీక్షలంటే కనీసం రెండు రోజులైనా నిర్వహించాల్సి ఉంటుంది. జనవరి మాసం గడిచినపోతున్నా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ పరీక్షల తేదీలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

06:51 - January 17, 2017

కృష్ణా : విగ్రాహాల ధ్వంసం, ఫ్లెక్సీల చించివేత ఘటనలు కృష్ణా జిల్లాలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌లో రంగా విగ్రహం ధ్వంసం, జిల్లాలోని కైకలూరులో చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 ఫ్లెక్సీల చించివేత ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వంగవీట సినిమా తర్వాత కృష్ణా జిల్లాలో...

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ్ తీసిన వంగవీట సినిమా తర్వాత కృష్ణా జిల్లాలో ప్రారంభమైన అలజడి సద్దుమణకగముందే, విజయవాడ సింగ్‌నగర్‌లో రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ రాధా-రంగా మంత్రిమండలి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాలు, రాస్తోరోకోలతో దద్దరిల్లింది. దీంతో రంగంలోని దిగిన రంగా తనయుడ రాధాకృష్ణ... రాధా-రంగా మిత్రమండలి సభ్యులకు సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగినా, నివురుకప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదం ఎప్పుడైనా భగ్గుమనే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. రంగా విగ్రహం ధ్వంసం టీడీపీ పనేనని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రంగా విగ్రహం ధ్వంసం వివాదం తర్వాత...

రంగా విగ్రహం ధ్వంసం వివాదం తర్వాత జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాకలో చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 ఫ్లెక్సీ చించివేత ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో రంగాతోపాటు చిరంజీవి అభిమానలు గ్రామలో రాస్తారోకో నిర్వహించారు. ఆటపాక నుంచి కైకలూరు వరకు ర్యాలీ తీశారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా ర్యాలీలో పాల్గోవడంతో ఫ్లెక్సీ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది.

ప్రభుత్వంతోపాటు, అధికార పార్టీలో ఆందోళన...

విగ్రాహాల ధ్వంసం, ఫ్లెక్సీల చించివేత గొడవలు, ఘర్షణలతో ప్రభుత్వంతోపాటు, అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచివేయాలన్న ఉద్దేశంతో విధ్వంసకారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. విగ్రహాల ధ్వంసం, ఫ్లెక్సీల చించివేత వంటి దుశ్చర్యలకు పాల్పడి, ఉద్రిక్తతలు, ఘర్షణలకు కారమవుతున్న సంఘ వ్యతిరేక శక్తులపై కన్నేసి ఉంచాలి పోలీసులు నిర్ణయించారు.

21:22 - January 16, 2017

హైదరాబాద్ : సంక్రాంతి సెలవులు ముగియడంతో .. జనం మళ్లీ నగరబాట పట్టారు. మూడురోజుల పాటు సంక్రాంతి పండగను సొంతూళ్లలో ఆనందోత్సహాలతో జరురపుకుని తిరుగుప్రయాణం కావడంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నారు. మరోవైపు సందంట్లో సడేమియాగా ఆర్టీసీ సహా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు తరలివెళ్లిన జనం... తిరుగు ప్రయాణమవుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ముగియడంతో తిరిగి ఉద్యోగ, వ్యాపారాల కోసం వారు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా పంతంగి, గొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఒక్కో వాహనం టోల్ గేట్‌ను దాటి వెళ్లేందుకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు పడుతోంది. వాహనాల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద తిరిగి అదనపు కౌంటర్లను ప్రారంభించారు. పోలీసులు రంగంలోకి దిగి వాహనాలు త్వరగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మారుమూల పల్లెల నుండి..
ఏపీలోని మారుమూల పల్లెల నుంచి విజయవాడ నెహ్రూబస్టాండ్‌కు చేరుకుంటున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్టుగా బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీంతో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. టిక్కెట్‌ రేటుపై రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 400గా ఉన్నటికెట్‌కు వెయ్యికిపైగా వసూలు చేస్తున్నారు. మరికొందరు 1300 నుంచి 1500 వరకు దండుకుంటున్నారు. మరోవైపు దోపిడీ విషయంలో ఆర్టీసీ ఏమీ తక్కువ తినలేదు. ప్రత్యేక బస్సులకు యాభై శాతం అదనపు రేట్లు వసూలు చేస్తోంది. అదనపు చార్జీలు వసూలు చేస్తున్నా కిటికీలు, సీట్లు సరిగాలేని బస్సులను నడుపుతున్నారు. దీంతో రాత్రివేళల్లో చలికితట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

15:39 - January 16, 2017

విజయవాడ : సాంకేతిక టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దూసుకెళ్తున్నారు. మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏపీని భద్రతా వలయంగా మార్చుతున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్‌ పహారాకు తోడు సరికొత్త యాప్‌లతో ప్రజలకు చేరువకావడానికి కృషి చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఎంతటి కేసులైనా ఛేదిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీకి తమ ఆలోచనలను జోడించి విధి నిర్వహణలో సమర్ధత చాటుకుంటున్న ఏపీ పోలీసులపై 10టీవీ ప్రత్యేక కథనం. సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బెజవాడ పోలీసులు ఆరితేరుతున్నారు. టెక్నాలజీ సహాయంతో క్రైమ్‌ను అదుపుచేయడానికి వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. నేరగాళ్లను, క్రైమ్‌ను సాధ్యమైనంత వరకు అదుపు చేసే విషయంలో రాజీపడకూడదని భావించి.... ఇందుకోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. సాంకేతికతతోనే సవాలక్ష సమస్యలను ధీటుగా ఎదుర్కొంటూ నేరగాళ్లకు సింహస్వప్నంలా మారుతున్నారు.

మిగిలిన జిల్లాల్లోనూ రెట్టింపు భద్రత..
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలుగా విలసిల్లుతున్న విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భద్రతను పోలీసులు మరింతగా కట్టుదిట్టం చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ అదేస్థాయి భద్రతను రెట్టింపు చేస్తున్నారు. అటు యాప్ లను వినియోగించుకుంటూనే టెక్నాలజీ పరంగా ఇంకేం కావాలో, ఏం చేయాలనే వాటిపై పరిశోధన కొనసాగిస్తున్నారు. విజయవాడ, గుంటూరు పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీస్ వ్యవస్థ అంతటిని ఒకేతాటిపైకి తీసుకొస్తున్నారు. ఈ రెండు నగరాల్లో అడుగడుగునా పోలీసుల పహారా ఉండేటట్లు ముందుకెళ్తున్నారు. యాప్ లతో ఫలితాలు వచ్చినా రాకపోయినా వెనకడుగేయకుండా సీసీ కెమెరాలు, పోలీస్ పహారా, యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం కూడా దీనిలో భాగమే.

13 జిల్లాల్లో..
ప్రజలకు మరింత మెరుగ్గా సేవలదించడం, పోలీస్ పనితీరును నిరంతరాయంగా సులభతరం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ సాంకేతిక సేవల విభాగం ఇప్పటికే పలు యాప్‌లను ప్రవేశపెట్టింది. చాణక్య, అభయ్, ఫోర్త్ లయన్, ఈ-గస్తీ, ఈ-నేత్రం వంటి యాప్ లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా క్రైం మ్యాపింగ్ పేరుతో మరో యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నేరస్తుల పూర్తి సమాచారం నిక్షిప్తం చేయడానికి ఈ యాప్ ను వినియోగించనున్నారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ఠాణాలకు జియో ట్యాగింగ్ కు అనుసంధానించి మరిన్ని ప్రయోజనాలను పొందాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో నేరస్తుడు ఎక్కడ అరెస్టైనా ఆ నిందితుడి గురించి అన్ని ఠాణాల్లోనూ తెలిసేలా పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. యాప్ లో బటన్ నొక్కగానే నేరస్తుని పుట్టు పూర్వోత్తరాలతో సహా అతనికి సంబంధించిన సమస్త సమాచారం రావడం క్రైం మ్యాపింగ్ యాప్‌ ముఖ్యోద్దేశం. ఏపీలో అమలవుతున్న ఈ యాప్ లు, వాటి ప్రత్యేకతలు, విశేషాలపై కేంద్రం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. అంతేకాదు... ఇతర రాష్ట్రాలు సైతం వీటిపై దృష్టి సారిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నాయి.

15:34 - January 16, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - Vijayawada