visakha

09:00 - July 22, 2017

విశాఖ : జిల్లాలో వెలుగులోకి వచ్చిన భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. అందిన ఫిర్యాదులను విశ్లేషించిన సిట్‌.. ఇప్పుడు విచారణను షురూ చేసింది. కుంభకోణంతో సంబంధం ఉందని తేలిన వారిపై కేసులు పెట్టడం ప్రారంభించింది. సిట్‌కు చాలా ఫిర్యాదులు అందాయి. గతనెల 28న ప్రత్యేక దర్యాప్తు బృందం పని ప్రారంభించింది. ఈనెల 15 వరకు ప్రజలు, ప్రజాసంఘాలు, బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుంది. రాజకీయాల పార్టీల నేతల నుంచి ఈనెల 20 వరకు కంప్లెంటులు స్వీకరించింది. వామపక్షాలతోపాటు లోక్‌సత్తా, వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తన వద్ద ఉన్న ఆధారాలను అందించారు. మొత్తం 2296 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూమి రికార్డుల తారుమారుపై 246, భూ ఆక్రమణలనకు సంబంధించి 398 ఫిర్యాదులు ఉన్నాయి. ఇతరితర భూసమస్యలకు సంబంధించి 1652 ఫిర్యాదులు సిట్‌కు అందాయి. వీటన్నింటికీ సంబంధించి విచారణ ప్రారంభించారు. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని ప్రత్యేక ద్యాప్తు బృందం భూ రికార్డుల తారుమారు వ్యవహారాలను క్షణ్ణంగా పరిశీలించింది. అక్రమాలకు పాల్పడ్డారని ప్రాథమికంగా తేలిన 59 మందిపై పీఎం పాలెం, అరిలోవ పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేసింది. ఇక అరెస్టులే మిగిలాయి.

బడా బాబులపై సిట్‌ ప్రత్యేక దృష్టి
2002 నుంచి 2017 వరకు విశాఖ నగరంతోపాటు, జిల్లాలోని 11 మండలాల పరిధిలో భూ బదలాయింపులపై జారీ చేసిన 69 ఎన్‌వోసీలను సిట్‌ క్షణ్ణంగా పరిశీలించింది. మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితుల పేరుతో నిరభ్యంతర ధ్రువపత్రాలు ఇచ్చారు. కొందరు రాజకీయ నేతల అండంతో ఈ భూములను ఆక్రమించుకున్న బడా బాబులపై సిట్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ వ్యవహారం వెనుక ఉన్న రెవెన్యూ సిబ్బంది పాత్రను నిగ్గు తేల్చే పనిలో పడింది. భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో విశాఖ రూరల్‌లో తహశీల్దార్‌గా పనిచేసి రామారావును సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఆనందపురం మండలం వేములవలసలో ప్రభుత్వ భూములను తమవిగాచూపి మెడ్‌ టెక్‌ కంపెనీ బ్యాంకుల నుంచి 190 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువులపై ఆరోపణలు వచ్చాయి. మంత్రి అయ్యన్నపాత్రుడు మెడ్‌ టెక్‌ భూములపైనే సిట్‌కు ఆధారాలు అందించారు.

ప్రతిపక్షాల ఫిర్యాదు
వైసీపీ నేతలు కూడా తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చారు. సీపీఎం, సీపీఐ నేతలు అనందపురం, ముదపాక, భీమిలి మండలాల్లో భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. విశాఖ భూకుంభకోణం వ్యవహారంపై తేనెతుట్టె కదిపిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మాత్రం సిట్‌కు దూరంగా ఉంటున్నారు. విశాఖ భూకుంభకోణంలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు, గ్రామీణ ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తున్నాయి. తనపై వస్తున్న ఆరోపణల గురించి వివరణ ఇచ్చేందుకు మంత్రి గంటా ఇంతవరకు సిట్‌ ముందుకు రాలేదు. భూకుంభకోణంపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన సిట్‌... రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజానిజాలను నిగ్గుతేల్చి, నిందితులను పట్టుకుంటుందో ? లేక తూతూమంత్రంగా విచారణను ముగిస్తుందో చూడాలి. 

08:18 - July 18, 2017

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళఖతంలో ఏర్పాడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. 48గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర భారీ వర్షలు కురిస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 50 కి.మీ నుంచి 55కి,మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అటు శ్రీకాకుళంలో భారీ వర్షాలతో వరద ముప్పు ఉండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికాలు జారీ చేశారు. వంశధార, నాగావళి ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:18 - July 17, 2017

విశాఖ : జిల్లా కేంద్రంలోని పోర్ట్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తాపడి 16 మందికి గాయాలయ్యాయి. ఆటోను తప్పించబోయి బస్సు బోల్తా పడినట్టు తెలుస్తోంది. బస్సు నర్సిపట్నం నుంచి విశాఖ వస్తుంది. వర్షం కారణంగా టైర్లు స్కిడ్ అవడంతో బోల్తా పడినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫీక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

08:03 - July 17, 2017

విశాఖ : విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో మెడికల్‌ పరికరాల విడిభాగాల తయారీ కేంద్రం మెడ్‌టెక్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గతేడాదే శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మొత్తంగా 270.7 ఎకరాల భూమిని సేకరించింది. 196 ఎకరాల్లో 172 మంది రైతులు ఉన్నట్టు, వారు ఎన్నోఏళ్లుగా ఆ భూముల్లో తోటలు సాగు చేసుకుంటున్నట్టు రెవెన్యూ అధికారులు జాబితా రూపొందించారు. ఎకరానికి వీరికి 12 లక్షల చొప్పున.. మొత్తంగా 23.52 కోట్ల పరిహారం రైతులకు ప్రభుత్వం చెల్లించింది. అయితే 196 ఎకరాల్లో కేవలం ఇద్దరి పేరిట మాత్రమే డీ- పట్టాలు ఉన్నాయి. వాస్తవానికి వారికి మాత్రమే పరిహారం అందాలి. కానీ భూసేకరణ సమయంలో ఆ భూమిని గత కొంతకాలంగా ఆక్రమించుకొని సాగుచేసుకుంటున్న వారికీ పరిహారం అందించాలన్న నిబంధన కూడా ప్రభుత్వం చేర్చింది. దీన్నే అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పరిహారం విషయంలో అధికారులు చేతివాటం ప్రదర్శించారని మంత్రి అయ్యన్న ఆరోపిస్తున్నారు. మొత్తం 170 మంది పేర్లతో అధికారులు జాబితా సిద్దంచేసినట్టు తెలిపారు. వీరంతా భూమిని సాగు చేస్తున్న దానికి నిదర్శనంగా లేని తోటలను సృష్టించారన్నారు. గ్రామంలో తమకు అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబాలను ఎంపిక చేశారని.. ఒక్కో కుటుంబం నుంచి ఆరుగురు మొదలు 43 మంది సభ్యుల పేర్లను జాబితాలో చేర్చినట్టు వివరించారు. ఈ జాబితాలో స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఉన్నారు. 196 ఎకరాల్లో తోటలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 50 ఎకరాల్లో కూడా తోటలు కనిపించవు. మొత్తంగా 172 మంది లబ్దిదారుల్లో 44 మంది పేర్లు బినామీలవేనని మంత్రి అయ్యన్న ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మి అధికారులు సొమ్ము చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై 2015లోనే రెండుసార్లు లేఖ రాసినా స్పందించలేదని, చెల్లింపులు జరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు కోట్ల ప్రభుత్వ ధనాన్ని బినామీల పేరిట స్వాహా చేశారని.. దీనికి సిట్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు.

పరిహారం పంపిణీ
గ్రామ సభ నిర్వహించిన తర్వాతే అర్హులకు పరిహారం పంపిణీ చేశామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అనర్హులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదన్నారు. పరిహారం విషయంలో కొంతమంది కావాలనే వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. మెడ్‌టెక్‌ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు మంత్రికి వివరించామని... అయినా మరోసారి ఆయనను కలుస్తామన్నారు. పరిహారం చెల్లింపులో అధికారులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి మెడ్‌టెక్‌ భూముల పరిహారం వ్యవహారం మంత్రి, కలెక్టర్‌ మధ్య వివాదానికి తెరలేపింది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి

08:01 - July 17, 2017

విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌ భూ అక్రమాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. గోవింద్‌ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కుటుంబ సభ్యుల పేరుమీద ఏకంగా 48.55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఆనందపురం మండలం రామవరంలో సర్వే నంబర్‌ 126, 127, 128,130లో 95.89 ఎకరాల భూమిని కాజేసినట్టు ఎమ్మెల్యే గోవింద్‌పై ఆరోపణలు ఉన్నాయి. గోవింద్‌ అండ్‌ కో ఈ 95.89 ఎకరాలను తమ పేర్లమీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దాదాపు 14 మంది పేరిట రాయించుకున్నారు. వీరిలో ఎమ్మెల్యే గోవింద్‌తోపాటు ఆయన బంధువుల పేర్లు కూడా ఉన్నాయి.

సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌
ప్రభుత్వ భూములను కాజేయడానికి పీలా గోవింద్‌ అండ్‌ కో... సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌ రికార్డును ట్యాంపర్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. ఆ రికార్డులో కొన్నిచోట్ల రెడ్‌ ఇంక్‌తో దిద్దినట్టు తహసీల్దార్‌ నివేదిక సమర్పించారు. సర్వే నంబర్‌ 130 /2లోని 11.45 ఎకరాలకు అప్పటి కాంగ్రెస్‌ నేత ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ దగ్గర ఎమ్మెల్యే ఎన్‌వోసీ తీసుకున్నారు. ఆ భూమి పక్కనే ఉన్న మరో 48.55 ఎకరాల ప్రభుత్వ భూమినీ వదల్లేదు. వాటిపై కన్నేసి రికార్డులను తారుమారు చేసి దర్జాగా ఆక్రమించుకున్నారు. దశాబ్దాలుగా ఆ భూమిద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాదు... సర్వేనంబర్‌ 130లో 60 ఎకరాలు ఉండగా సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అండగల్‌ మార్చేసి అందులో 17 సబ్‌ డివిజన్లు సృష్టించారు. వీటిలో కొన్ని భూములను పీలా కుటుంబీకుల పేరుమీదకు 10(1) అండగల్‌లో నమోదు చేశారు.

పాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌లను రద్దు
ఆనందపురం భూముల కేసు ఆర్‌డీవో కోర్టుకు విచారణకు రావడంతో ఎమ్మెల్యేగారి అక్రమాల బాగోతం బయటపడింది. పీలా గోవింద సత్యనారాయణ అండ్‌ కో స్వాధీనంలో ఉన్న భూముల్లో 48.55 ఎకరాలు ప్రభుత్వ భూములని తేల్చారు. వాటికి జారీ అయిన పాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన 47.34 ఎకరాల భూమికి సంబంధించి అటు జమీందార్ల కుటుంబంగానీ, ఇటు పాకలపాటి, పీలా కుటుంబంగానీ సరైన రికార్డులు చూపించకపోవడంతో వాటికి సంబంధించిన హక్కులు ఎవ్వరికీ లేకుండా రద్దు చేసింది. ఈ వివాదం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. తక్షణమే పీలా కుటుంబీకుల స్వాధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆనంతపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. తనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలపై ఎమ్మెల్యే పీలా గోవింద్ ఎట్టకేలకు స్పందించారు. తనపై కొంతమంది కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సిట్‌ విచారణకైనా తాను సిద్దమేనని చెప్పారు.పీలా గోవింద్‌ అక్రమాల డొంక కదిలించేందుకు సిట్‌ సిద్ధమవుతోంది. మరి సిట్‌ ఏం తేలుస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

20:03 - July 16, 2017

విశాఖపట్టణం : గ్రూప్‌ టూ కి సంబంధించిన ప్రాథమిక కీని ఈరోజు విడుదల చేస్తామని ..నెలరోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. గీతం యూనివర్సిటీ విద్యార్ధులు నిబంధనలు పాటించలేదన్నారు. గ్రూప్ -2 పరీక్షను పారదర్శకంగా నిర్వహిచండం జరిగిందని, బయో మెట్రిక్ అటెండెన్స్..సీసీ కెమెరాల మధ్య ఈ పరీక్ష జరిగిందన్నారు. నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేయడం జరుగుతుందని, సర్వర్లు మొరాయించడం సహజంగా జరిగేదని..గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని..ఘటన జరిగితే మాత్రం ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సమయం..తక్కువ అయ్యే అవకాశం ఉండదని..ఈ నేపథ్యంలో గీతం వర్సిటీ విద్యార్థులు బయటకు వెళ్లడం జరిగిందన్నారు. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

18:33 - July 16, 2017

విశాఖపట్టణం : రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళల ఆందోళనలు..నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులివ్వడం విశాఖ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్క వీధిలో నివాసాల మధ్య మద్యం విక్రయాలపై ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక మహిళలు నోటికి నల్లబట్ట కట్టుకుని నిరసన తెలిపారు. నివాసాల మధ్యనున్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని, గతంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు విషయం చెప్పడం జరిగిందని మహిళలు..ఐద్వా నేతలు తెలిపారు. మద్యం దుకాణాలు తొలగిస్తామని చెప్పి ఇంతవరకు ఆ పని చేయలేదని, దుకాణ యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మరి మహిళల ఆందోళనతో మద్యం దుకాణాలను తొలగిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

16:50 - July 16, 2017
16:47 - July 16, 2017

విశాఖపట్టణం : సోషల్ మీడియా నేరాల్లో కొత్త కోణం వెలుగు చూసింది. నకిలీ ఫేస్ బుక్ ఖాతా ద్వారా పరిచయమైన కొంతమందితో స్వలింగ సంపర్కం చేసి వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు లాగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఫేస్ బుక్ ఖాతాల ద్వారా 'గే' గ్రూపుల ద్వారా పరిచయమైన ఐదుగురు యువకులు..నగరానికి చెందిన ఓ యువకుడితో స్వలింగ సంపర్కం చేశారు. ఈ వ్యవహరాన్ని అంతా రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం వారు డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. రూ. 2 లక్షలు ఇవ్వకుంటే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని ఆ వ్యక్తిని బెదిరించారు. రూ. 2లక్షలు ఇచ్చిన ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బ్లాక్ మెయిల్ చేసే ఐదుగురు యువకులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

అప్రమత్తండా ఉండాలన్న పోలీస్ కమిషనర్..
ఫేస్ బుక్ లపై అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ నాగేంద్ర కుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు ముక్కాల ఆనంద్ ఉన్నాడని..మరో నలుగురు ఈ కేసులో ఉన్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లా కేంద్రంగా నడుస్తున్న 'గే' గ్రూపులో 2,335 మంది సభ్యులుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వేధింపులకు గురవుతున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

19:10 - July 15, 2017

విశాఖ : విశాఖజిల్లా, పాయకరావుపేట నియోజకవర్గ భౌగోళిక, రాజకీయ స్వరూపం భిన్నంగా ఉంటుంది. తాండవ, వరాహ నదులు ఒకవైపు.. జిల్లాలో పూర్తిగా తీరప్రాంతం ఉన్న ఏకైక నియోజక వర్గం పాయకరావు పేట. ఈ నియోజకవర్గం అంతా పంచాయితీరాజ్ వ్యవస్థ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాలు ఉన్నాయి. జిల్లాలో ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం ఇది ఒక్కటే. మొత్తం ఓటర్లు 2,08,144 మంది. ఇక్కడ బీసీల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. గొల్ల బాబూరావు ఇక్కడ రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో వంగలపూడి అనిత గెలుపుతో మళ్ళీ పాయకరావుపేటలో పసుపు జెండా రెపరెపలు మొదలయ్యాయి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా.. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని గొల్ల బాబూరావు మండిపడ్డారు.

హామీలు అత్యంత కీలకమైనవి..
నియోజకవర్గం మౌలిక సమస్యలతో సతమతమవుతోంది. గత ఎన్నికల్లో ఇప్పటి ఎమ్మెల్యే అనిత ఇచ్చిన విద్య, వైద్య, ఉపాధి, తాగునీటి హామీలు అత్యంత కీలకమైనవి. అయితే వీటిలో ఏ సమస్యా తీరలేదు. ముఖ్యంగా నియోజక వర్గంలో డిగ్రీ కళాశాల లేదు. దీంతో అమ్మాయిలు ఎక్కువ శాతం స్కూల్ ఎడ్యుకేషన్‌కే పరిమితమవుతున్నారు. మూడేళ్ళ పాలనలో ఎమ్మెల్యే అనిత నీటి ప్రాజెక్ట్‌ను శంఖుస్థాపన వరకూ తీసుకు రాగలిగారు. సుమారు 90 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తానంటున్నారు. ఇక ఫిషర్ మెన్ గ్రామాల్లో ప్రతీ ఇంటికి పైప్ లైన్ వేశారు. కానీ గ్రావెటీతో పనిచేయాల్సి రావడంతో ఎక్కువ శాతం నీరు అందడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రతీ ఇంటికీ నీటి సరఫరా
ఎమ్మెల్యే మాత్రం ప్రతీ ఇంటికీ నీటి సరఫరా చేసి.. మళ్ళీ ఎన్నికలకు వెళ్తానంటున్నారు. ఈ నియోజకవర్గ కేంద్రంలో ప్రధాన రహదారి విస్తరణ కీలకమైన డిమాండ్‌గా ఉంది. ఇప్పటికీ ఆర్‌ అండ్‌ బీ పరిధిలోనే వున్న ఈ రహదారిని.. వుడాకు అప్పగించి 6కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. ప్రధాన నీటి వనరైన వరాహనది సీజనల్‌గా వరదలు వస్తుంటాయి. ఏజెన్సీలో భారీ వర్షాలు కురిస్తే నది ఉప్పొంగుతుంది. ఈ నదికి భారీ వరదలు వస్తే ఎస్. రాయవరం మండలంలోని.. సుమారు 16 గ్రామాలకు ముంపు ఏర్పడుతుంది. ఇక్కడ ఏటి గట్లను ఆధునీకరించాలని రైతులు, ప్రజలు అడుగుతున్నారు. కానీ, ఎమ్మెల్యే ఇప్పటి వరకూ వీటిపై దృష్టి సారించలేదు. ఇక ఇక్కడ ఉన్న రెండు ఫార్మా కంపెనీలు ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. హెటిరో డ్రగ్స్, డక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారన్న ఆందోళన.. స్థానిక యువతలో ఉంది. ఏటికొప్పాక, తాండవ రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సహకార రంగంలో పనిచేస్తున్న చక్కెర కర్మాగారాల్లో.. అధిక ఉత్పత్తి సాధిస్తున్న వాటిగా గుర్తింపు ఉంది. ఏటికొప్పాక షుగర్స్ ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. మూత పడటానికి సిద్ధంగా ఉంది. కానీ తాము ఇచ్చిన హామీలలో 80 శాతం నెరవేర్చామని.. పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత చెబుతున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల కింద సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇక, నాబార్డ్ నిధుల కింద తుఫాన్ షెల్టర్లు కడుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూడా ఈ కోవకే చెందుతుంది. వీటినే ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి మాట పక్కన పెడితే గ్రూపిజం పెరిగిందని తెలుగు తమ్ముళ్ల ఇంటర్నల్‌ మాట. పైగా గ్రూపు రాజకీయాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారన్న అపవాదు అనితపై బలంగా ఉంది. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో వైసీపీ పుంజుకుంటోంది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రస్తుతం.. వైసీపీ నుంచి పాయకరావు పేట సమన్వయ కర్తగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని మారిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని వైసీపీ జోస్యం చెబుతోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - visakha