visakhapatnam

19:02 - May 25, 2018

విశాఖ : తిరుమలలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేయడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. రమణ దీక్షితుల వెనుక బీజేపీ ఉందని టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. శ్రీవారి అలయ తవ్వకాలపై విచారణ చేయాలని మాధవ్‌ డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని మాధవ్‌ ఆరోపించారు. 

 

18:59 - May 25, 2018

విశాఖ : నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఎలాంటి ఇబ్బందిలేదని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గనుల కేటాయింపు సాధ్యంకాదని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని...అలాగే హోదా వల్ల వచ్చే అన్ని సౌకర్యాలు రాష్ట్రానికి కల్పించనుందన్నారు. కేంద్రం ఇచ్చే ప్రయోజనాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీపై వచ్చిన ఆరోపణలను హరిబాబు ఖండించారు. 

 

11:23 - May 24, 2018

విశాఖపట్టణం : కాసుల కోసం ఏమైనా చేసేస్తారా ? డబ్బులే పరమావధిగా వ్యవహరిస్తున్న పలు ఆసుపత్రులు రోగుల పట్ల అనాగకరింగా ప్రవరిస్తున్నారు. ఇటీవలే కొన్ని ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆసుపత్రి యాజమాన్యం తనపట్ల దుస్సాహాసినికి ఒడిగట్టినట్లు, తన అనుమతి లేకుండానే కడుపులో పిండాలు అమర్చినట్లు దళిత మహిళ పేర్కొంటోంది. కానీ ఆసుపత్రి యాజమాన్యం దీనిని ఖండిస్తోంది. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే ఈ చర్యకు పూనుకున్నామని యాజమాన్యం పేర్కొంటోంది.

బాపూజీ కాలనీకి చెందిన ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తానంటూ తనను ఆసుపత్రికి తీసుకొచ్చిందని దళిత మహిళ పేర్కొంది. పద్మ శ్రీ ఆసుపత్రికి తీసుకొచ్చిందని, అనంతరం కొన్ని ఇంజెక్షన్ లు ఇచ్చారని దీనివల్ల నరకం చూశానని తెలిపింది. అనంతరం ఓ రోజు ఆపరషన్ థియేటర్ కు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చారని వెల్లడించింది. కడుపులో రెండు పిండాలు పెట్టినట్లు డాక్టర్ పేర్కొన్నారని, దీనితో తాను హతాశురాలయ్యానని పేర్కొంది. ఇందుకు డబ్బులు కూడా చెల్లిస్తామని యాజమాన్యం తెలిపిందని, ఈ విషయం తన భర్తకు తెలియచేసినట్లు తెలిపింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:50 - May 24, 2018

విశాఖపట్టణం : జిల్లా రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. టీడీపీపై ప్రధాన ప్రతిపక్షం విమర్శలదాడి పెంచింది. ముఖ్యమంత్రిపైనే తీవ్ర స్థాయిలో అరోపణలు ఎక్కుపెడుతోంది. దాంతోపాటు మంత్రి లోకేష్‌ సవాల్‌కు ప్రతి సవాల్ విసరడం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీపై వైసీపీ ఆరోపణలు తీవ్రస్థాయికి చేరాయి. తిరుమల శ్రీవారి నగలు, సంపద మాయం కావడంలో సీఎం చంద్రబాబు హస్తముందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. ధర్మపోరాట సభలో మంత్రి లోకేషన్‌ చేసిన సవాల్‌కు వైసీపీ నేతలు ప్రతిసవాళ్లు విసరడం విశాఖ జిల్లా రాజకీయాలను రసకందాయంలో పడవేశాయి.

టీడీపీ విశాఖ అంధ్రా యూనివర్సిటీలో ధర్మపోరాట దీక్ష సందర్భంగా టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు దీటుగా వైసీపీ ప్రత్యారోపణలు మొదలు పెట్టింది. మంత్రి నారా లోకేష్ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదా అంటూ హడావిడి చేస్తూనే.. డిల్లీలో ప్రధాని కార్యాలయంలో తిరుగుతారని ఎద్దేవా చేయడం.. టీడీపీ - వైసీపీల మధ్య మాటయుద్ధానికి దారి తీసింది. తనపై వైసీపీ నేతలు చెస్తున్న అవినీతి అరోపణలను దమ్ముంటే నిరూపించాలని లోకేష్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్‌లపై పలు ఆరోపణలు చేశారు. కనిపించకుండా పోయిన తిరుమల శ్రీవారి నగలు సీఎం చంద్రబాబు ఇళ్లలో ఉన్నాయని ఆరోపించడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇళ్లలో తెలంగాణ పోలీసుసోదాలు చేస్తే.. నగలు బయటపడతాయని విజయసాయి రెడ్డి అనడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. వైసీపీ నేతలు సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం...టీడీపీ నాయకులు కుతకుతా ఉడికి పోతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు పలువురు టీడీపీ లీడర్లు వైసీపీపై విమర్శల దాడి పెంచారు. నిన్నటిదాకా టీడీపీ దూకుడును అడ్డుకోవడంలో తమపార్టీ నేతలు వెనుకంజలో ఉన్నారని భావిస్తున్న వైసీపీ కేడర్‌.. ఇపుడు ఫుల్‌ జోష్‌లోకి వచ్చేశారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి దూకుడుగా ఆరోపణలు చేయడంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

11:13 - May 22, 2018

విశాఖపట్నం : పోలీసులు కొత్త వ్యక్తుల పై దాడులు చేయవద్దని హెచ్చరిస్తున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా నర్సీపట్నంలో పోలీస్ స్టేషన్‌ ఎదురుగా రాకేష్‌ పటేల్‌ అనే యువకుడిని స్థానికులు చితకబాధిన ఘటన కలకలం సృష్టించింది. దొంగల గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయన్న వదంతుల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. తెల్లవారు జామున వాకింగ్‌కు వెళ్లిన రాకేష్‌ పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వదంతులకు అనుగుణంగా దాడులు జరగడంతో పోలీసులు చర్యలు తీవ్రతరం చేశారు. 

09:03 - May 22, 2018

 

విశాఖపట్టణం : ధర్మపోరాట దీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాయి జిల్లా టీడీపీ శ్రేణులు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్రంగా జరిగే ధర్మ పోరాట దీక్షకు సర్వం సిద్ధం చేశారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించే అంశాన్ని ఈ సభ ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 22న.. తలపెట్టిన ధర్మపోరాట సభను తిరుపతిలో కంటే భారీస్థాయిలో నిర్వహించాలని టీడీపీ కృత నిశ్చయంతో ఉంది. దాదాపు ఒక లక్ష మందిని ఈ సభకు తరలించాలన్నది టీడీపీ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. జనసమీకరణ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది ఆ పార్టీ నాయకత్వం.

రాష్ర్టంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ కోసం ఆ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా విశాఖ నగర పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలతోపాటు.. అనకాపల్లి నుంచి కూడా భారీగా జనాన్ని సమీకరించనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి పదివేల చొప్పున... 80 వేల మందిని తరలించాలన్నది ఆలోచన. మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కనీసం లక్ష నుంచి 1.25 లక్షల మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు..

గత మూడు రోజులుగా డిఫ్యూటీ సీఎం చినరాజప్ప విశాఖలోనే మఖాం వేసి.. సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జనసమీకరణ, వాహనాల పార్కింగ్‌ పై మూడు సార్లు ఎమ్మేల్యేలు, మంత్రులతో చర్చించారు. దాదాపు రెండు వేలకు పైగా బస్సులను ఏర్పాటు చేసి సుధూర ప్రాంతాల్లోని నియోజక వర్గాలనుంచి కూడా జనాలను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కర్నాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. తెలుగువారి దెబ్బ వల్లనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయారని ఇప్పటికే మంత్రులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెల్లడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ధర్మపోరాట సభ ప్రధాన వేదికపై వందమంది నాయకులు ఆశీనులయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. సభా కార్యక్రమాలు అందరికీ కనిపించేలా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. దానితో పాటుగా ట్రాఫిక్‌ను కూడా పూర్తి స్థాయిలో మళ్లిస్తారు. మద్దిలపాలెం, సిరిపురం నుంచి వచ్చే వాహనాలను పూర్తిగా మళ్లిస్తున్నారు.

21:15 - May 17, 2018

విశాఖపట్టణం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల ఇరవై నుంచి పవన్‌ బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. విభజన హామీలు అమలు.. ప్రత్యేక హోదా.. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్‌ ఈ యాత్రను ప్రారంభిచనున్నారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 2019 ఎన్నికలకు గాను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తామని పవన్‌ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్‌ ఇప్పటికే పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తుండగా.. పవన్‌ కూడా దీన్నే ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ముందుగా వెనుక బడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. మరో వైపు పార్టీని బలోపేతం చేయడం పై కూడా పవన్‌ దృష్టి సారించారు.

పవన్‌ యాత్రకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు యాత్రని సక్సెస్‌ చేయడం ద్వారా క్యాడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా పవన్‌ యాత్ర కొనసాగనుందని తెలిపారు. ఆగస్టులో పవన్‌ మ్యానిఫెస్టో ప్రకటిస్తారని వారు ప్రకటించారు. ఇందులో భాగంగా పవన్‌ తనతో పాటు మ్యానిఫెస్టో కమిటీని కూడా యాత్రలో తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రజల సమస్యల ఆధారంగా మేనిఫెస్టో రూపొందించాలని భావిస్తున్నారు. పవన్‌ సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలు కూడా చూపాలని వ్యూహరచన చేస్తున్నారు. మరో వైపు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై 175 నియోజక వర్గాల్లో కవాతు నిర్వహిస్తామని పవన్‌ తెలిపారు. బస్సు యాత్రతో జనసేనకు కొత్త ఊపు తీసుకురావాలని పవన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

18:05 - April 29, 2018

విశాఖ : గీతం యూనివర్శటీ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష గ్యాట్‌ ఫలితాలను వైస్‌ ఛాన్సలర్‌ ఎమ్‌.ఎస్‌ ప్రసాదరావు విడుదల చేశారు. మే 16 నుంచి మూడు రాష్ట్రాల్లోని క్యాంపస్‌లలో అడ్మిషన్‌ కౌన్సిలింగ్‌ జరగనుందని తెలిపారు. హైదరాబాద్‌ గీతం క్యాంపస్‌లో ఈ ఏడాది నుంచి కొత్తగా బిఆర్క్‌ కోర్సు ప్రారంభిస్తున్నామని, విశాఖ క్యాంపస్‌లో ఎమ్‌ఆర్క్‌ కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. మొదటి పది ర్యాంకర్లకు ఫీజులో పూర్తి రాయితీ.. తరువాతి 90 ర్యాంకర్లకు 50 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దేశంలో 11 యూనివర్శటీలకు మాత్రమే ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా ఇప్పుడు గీతంకు రావడం గర్వకారణమని తెలిపారు. దీని ద్వారా సొంత కోర్సుల నిర్వహణ, ఫారెన్‌ ఫ్యాకల్టీని నియమించుకోవడంలో వెసులుబాటు కలుగుతుందని ఎమ్‌.ఎస్ ప్రసాదరావు అన్నారు.

 

06:39 - April 29, 2018

విజయవాడ : నిరుద్యోగులకు ఏపి ప్రభుత్వం శుభవార్త అందించింది. టెట్, డీఎస్సీ షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 10వేల 351 టీచర్‌ పోస్టులను జులైలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో వారం రోజుల్లో సిలబస్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక మే 4న టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మే 5 నుంచి 22 వరకూ ఫీజు చెల్లించవచ్చన్నారు. మే 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. టెట్‌ అభ్యర్థులకు మే 25 నుంచి మాక్‌టెస్టులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. టెట్‌ హాల్‌టికెట్లను జూన్‌ 3 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. జూన్‌ 10 నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు గంటా తెలిపారు.

అలాగే డీఎస్సీకి సంబంధించిన వివరాలు కూడా మంత్రి వెల్లడించారు. జూలై 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జూలై 6 నుంచి ఆగస్టు 8 వరకు ఫీజు చెల్లించవచ్చాన్నారు. జూలై 7నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. మొత్తం 10వేల 351 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించనున్నట్లు గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే డీఎస్సీని అన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో డీఎస్సీకి సంబంధించిన సిలబస్‌ను వెల్లడిస్తామన్నారు.

ఏపీని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు గంటా శ్రీనివాసరావు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ ఉన్నా... విద్యకు అధికంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. 

13:10 - April 28, 2018

విశాఖపట్టణం : రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు పలువురు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. తాజాగా జిల్లాలో జరిగిన ఓ ప్రమాదంలో 7 నెలల గర్బిణీ మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. తాటిచెట్ల మండలం మసీదు జంక్షన్ వద్ద నివాసం ఉంటున్న మున్న ఏడు నెలల గర్భిణీ. ఆమె భర్త విశాఖ డాక్ యార్డులో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం మామతో కలిసి బైక్ పై ఆసుపత్రికి వెళుతోంది. కప్పరాడు జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కిందకు పడిపోయింది. వెనుకాలే భారీ లోడ్ తో వచ్చిన లారీ మున్నపై నుండి దూసుకెళ్లింది. దీనితో అక్కడికక్కడనే మృతి చెందింది. దీనితో మున్నా జంక్షన్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - visakhapatnam