warangal

07:16 - October 21, 2017

వరంగల్ : వస్త్రప్రపంచంలో ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఓరుగల్లుకు పూర్వవైభవం రాబోతోంది. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాటన్ టు క్లాత్ పేరుతో సంగెం మండ‌లం చింత‌ల‌ప‌ల్లి, గీసుగొండ మండ‌లం శాయంపేట గ్రామాల స‌రిహ‌ద్దులో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మించబోతోంది టీ-సర్కారు. ఈనెల 22న సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజాంజాహి మిల్లు
వరంగల్‌ జిల్లాలో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజాంజాహి మిల్లు ఒకప్పుడు వెలుగువెలిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలమందికి ఉపాధి కల్పించింది. ఐదు దశాబ్దాల ఆజంజాహి చరిత్ర ఏలికల నిర్లక్ష్యం ఫలితంగా కాలగర్భంలో కలిసింది. అయితే, ఇప్పుడు వరంగల్‌ జిల్లాలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మెగా టెక్స్‌టైల్‌ నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసిన అధికారులు ప్రాజెక్టును ఆచరణలోకి తెచ్చారు. స్పిన్నింగ్, టెక్స్‌టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఉవెన్ ఫ్యాబ్రిక్, యార్న్‌డైయింగ్, టవల్-షీటింగ్, ప్రింటింగ్ యూనిట్స్, రెడీమేడ్ వస్ర్త పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. టెక్స్‌టైల్ పార్కువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 87వేల 539 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని రాంకీ సంస్థ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ పార్కుకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుగా నామకరణం చేసినట్లుగా గత ఆర్థిక సర్వేలో సర్కార్‌ పేర్కొంది. టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 1200 ఎకరాల భూమి సేకరించింది. గీసుగొండలోని శాయం పేట, రాయినికుంట, వెంకటాపూర్‌, ఊకల్‌, సంగెం మండలంలోని చింతలపల్లి, కాట్రపల్లి, వెంకటాపూర్‌ గ్రామాల్లో 2800 ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించారు. ఎకరాకు రూ.9.95లక్షల చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం 110కోట్లు చెల్లించారు. బహిరంగ మార్కెట్‌ విలువకు.. ఇచ్చే పరిహారానికి పొంతన లేదని అన్నదాతలు పెదవివిరుస్తున్నారు.

6.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు
పత్తి ఉత్పత్తిలో రాష్టంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా రెండో స్థానంలో వుంది. జిల్లాలో 6.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. వరంగల్ తోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల రైతులు వరంగల్ మార్కెట్ కే పత్తిని తీసుకొస్తున్నారు. ఇక్కడ తయారైన పత్తి బేళ్ళను కోయంబత్తూరు, సేలం, మధురైలోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుతో పత్తి రైతులకు మద్దతు ధరతో పాటు ప్రోత్సాహం లభించనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగారు. ముందస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సేకరించిన భూ వివరాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోబోతున్న చర్యలపై ఆరా తీశారు. మొత్తంగా మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. 

18:28 - October 20, 2017

వరంగల్‌ : ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఈ హాస్పిటల్‌లో కనీస సౌకర్యాలూ లేవు. రోగులను పట్టించుకునే నాధుడూ లేడు. వైద్యుల కొరత ఆస్పత్రిని వేధిస్తోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉన్నది వరంగల్‌లోనే. ఇక్కడకి ఆదిలాబాద్‌ ,కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంను జిల్లాల నుంచి వైద్యం కోసం కార్మికులు వస్తుంటారు. వారిని ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకుని వైద్యం అందించాలి.

పేరుకు పోయిన చెత్తాచెదారం..
కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి సమస్యలకు కేరాఫ్‌ అడ్డాగా మారింది. ఆస్పత్రిని చూస్తుంటేనే సమస్యలకు నిలయంగా కనిపిస్తోంది. ఆస్పత్రి భవనమంతా పాతబడి పోయింది. ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే ఆస్పత్రుల్లో దర్శనమిస్తోంది. పలుచోట్ల చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన కార్మికులు, వారి వెంటవచ్చిన వారు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

నత్తనడకన సాగుతున్న పనులు
వైద్యం కోసం వచ్చే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉండవు. కనీసం దాహమేస్తే తాగడానికి నీళ్లు కూడా దొరకవు. ఆస్పత్రి భవనం పాతబడిపోవడంతో మరమ్మతులు చేపట్టారు. 8 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. అంతేకాదు మరమ్మతుపనులు అస్తవ్యస్థంగా, ఇష్టారాజ్యంగా, కనీసం వాటర్‌ క్యూరింగ్‌ లేకుండా సాగుతున్నాయి. ఆస్పత్రిలో నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఇక్కడి విలువైన వైద్య పరికరాలు స్టోర్‌రూమ్‌లకు పరిమితమయ్యాయి.

నలుగురు వైద్యులతో నడుస్తోన్న ఆస్పత్రి..
వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరిన కార్మికులు వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. ఎందుకంటే సరిపోను వైద్యులు ఇక్కడ లేరు. ఉన్నవాళ్లలో కొంతమంది వైద్యులు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇంతపెద్ద ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సర్జన్‌, పీడియాట్రిషన్‌ వైద్యులు లేరు. ఉన్న ఒక్క గైనకాలజిస్టు డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌ వెళ్లారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఒకటి ఖాళీగా ఉంది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు డాక్టర్‌ ప్రీతి, డాక్టర్‌ వాసివి వారికి నచ్చిన డిస్పెన్సరీలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. కేవలం నలుగురు సివిల్‌ అసిస్టెంట్‌ డాక్టర్లతోనే వైద్యసేవలు నెట్టుకొస్తున్నారు. దీంతో వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి సమస్యలకు అడ్డాగా మారింది.

వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు. అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. ప్రాణాలు పోసేవాడు దేవుడు అయితే... వాటిని కాపాడేవాడు వైద్యుడు. అందుకే మన సమాజంలో వైద్యుడికి అంతటి ప్రాధాన్యత ఉంది. వరంగల్‌ ఆస్పత్రిలో ఉన్నది కొద్దిమంది వైద్యులే. కేవలం నలుగురు అసిస్టెంట్‌ డాక్టర్లతోనే ఈ ఆస్పత్రిలో వైద్యసేవలు కొనసాగుతున్నాయి. స్పెషలిస్ట్‌ డాక్టర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఉన్న డాక్టర్లైనా సరిగ్గా వైద్యం చేస్తున్నారా అంటే అదీలేదు. అసలు డ్యూటీలే సరిగ్గా చేయడంలేదు. స్పెషలిస్ట్‌ డాక్టర్లు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచే డ్యూటీ చేయాలి. కానీ డాక్టర్లు అలా డ్యూటీలు చేయకుండా షేరింగ్‌ చేసుకుంటున్నారు. వారు వచ్చిందే టైమ్‌. చేసేందే డ్యూటీ. ఇష్టానుసారంగా డ్యూటీలు చేస్తుంటారు. ఇక డిస్పెన్సరీల్లో డ్యూటీలు చేసే డాక్టర్ల గురించి అయితే చెప్పనవసరమే లేదు. నాలుగు డిస్పెన్సరీల డాక్టర్లకు నైట్‌ డ్యూటీస్‌ మెయిన్‌ ఆస్పత్రిలో వేస్తే పట్టించుకోరు. డ్యూటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు రోజు 250 నుంచి 300 వరకు వచ్చే ఔట్‌పేషెంట్లు ఇప్పుడు వంద కూడా దాటడం లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు డాక్టర్లు ఏ రేంజ్‌లో పనిచేస్తున్నారు.

వైద్య సేవలపై 10టీవీ ఆరా..
రోజురోజుకు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్యసేవలు నిర్లక్ష్యానికి గురవుతుండడంతో టెన్‌ టీవీ వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిని విజిట్‌ చేసింది. వైద్య సేవలు అందుతున్న తీరును తెలుసుకునే ప్రయత్నం చేసింది. డ్యూటీ చార్ట్‌లో పేర్కొన్న ప్రకారం రాత్రి డ్యూటీ జె.రవికుమార్‌ అనే వైద్యుడు చేయాలి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ డాక్టర్‌ సార్‌ డ్యూటీ చేయాలి. 10టీవీ ఈఎస్‌ఐ ఆస్పత్రికి 7 గంటల ప్రాంతంలో విజిట్‌ చేసింది. కానీ డ్యూటీ డాక్టర్‌ అప్పటికే అక్కడ లేరు. ఎక్కడికి వెళ్లారంటే ఆస్పత్రి సిబ్బంది చాలా తెలివిగా ఏం చెబుతున్నారో వీడియోలో చూడండి. డాక్టర్‌ గారు ఇప్పుడే డిన్నర్‌కు వెళ్లారని.. వెంటనే వస్తారని ఆస్పత్రి నర్సులు, సిబ్బంది ఘంటాపథంగా చెప్తున్నారు. మరి మన డాక్టర్‌ గారు ఎక్కడికి పోయారో తెలుసా. టెన్‌ టీవీ నేరుగా నైట్‌ డ్యూటీలో ఉన్న డాక్టర్‌ జె. రవికుమార్‌తోనే మాట్లాడింది. ఏం చెబుతున్నారో మీరు వీడియోలో వినండి. ఇదీ మన డాక్టర్‌గారి వరుస. ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తే బెదిరింపులు. పైగా ఏం చేసుకుంటారో చేసుకోండని హెచ్చరికలు. ఇంతకీ సార్‌ ఎక్కడున్నారో వినండి.

గట్టిగా నిలదీస్తేనేగాని సారువారు అసలు నిజం ఒప్పుకోలేదు. నైట్‌ డ్యూటీలో ఉన్న డాక్టర్‌ రవికుమార్‌ 2 గంటలకు ఆస్పత్రికి రావాల్సి ఉండగా 4.30కు వచ్చారు. ఆ తర్వాత 6.30కు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. తాను ప్రైవేట్‌గా నడుపుతున్న క్లీనిక్‌లో రోగులను చూడడానికి వెళ్లిపోయారు. దీనికి డిన్నర్‌ అనే పేరు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం కేవలం రెండు గంటలు మాత్రమే చేస్తూ మిగతా సమయమంతా తన క్లినిక్‌కు కేటాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టెన్‌టీవీ బృందం వచ్చిందని తెలుసుకున్న డాక్టర్‌ రవికుమార్‌ ఆఘమేఘాలమీద ఆస్పత్రికి వచ్చారు. విధులకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నిస్తే..సారు వారు ఏమని సెలవిచ్చారో వీడియోలో వినండి.. రాత్రిపూట వైద్యులు డ్యూటీలేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని రోగులు చెప్తున్నారు. మధ్యాహ్నం వచ్చి చూసి వెళ్తారని.. మళ్లీ మరునాడు మధ్యాహ్నం వైద్యులు వస్తారని అంటున్నారు. అప్పటి వరకు ఏదైనా అత్యవసర వైద్యం అవసరం అయితే నర్సులే చేస్తారని చెబుతున్నారు.
ఇదీ మన వరంగల్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రి పరిస్థితి. ప్రభుత్వం కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ఒకవైపు గొప్పలు పోతోంది. మరోవైపు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు, సరిపడ డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించాలని రోగులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ రోగుల అరణ్య రోదన ప్రభుత్వం ఆలకిస్తుందా లేదో వేచి చూడాలి.

13:18 - October 17, 2017

వరంగల్‌ : జిల్లాలోని హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు రోగులు మృతి చెందారు. ఆస్పత్రిలో ఉన్న 190 మంది రోగులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

10:28 - October 17, 2017

వరంగల్ : రోహిణి ఆస్పత్రి ఘటనపై పోలీస్‌ కేసు నమోదయ్యింది. ప్రమాదంలో మృతి చెందిన కుమారస్వామి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రి యాజమాన్యంపై 304(ఎ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. నిన్న రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్ లో ఆక్సిజన్ గ్యాస్ లీక్ కావడంతో మంటలుచెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రోగులు మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

07:42 - October 17, 2017

వరంగల్ : హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో 200 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కమిటీ ఇవాళ ఆస్పత్రిని సందర్శించనుంది. 
సర్జరీ థియేటర్‌లో లీకైన ఆక్సీజన్‌ గ్యాస్‌
హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యులు సర్జరీ చేస్తుండగా  ఆక్సీజన్‌ గ్యాస్‌ లీకైంది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.  క్షణంలో ఆ ఫ్లోర్‌లో దట్టమైన పొగలు వ్యాపించాయి.  అవి మూడో అంతస్తు వరకు విస్తరించాయి. దట్టమైన పొగలు వ్యాపించడం, మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో  డాక్టర్లు, పేషెంట్లు, అటెండెంట్లు భయంతో కిందకు పరుగెత్తారు.  రెండో అంతస్తులోని న్యూరో వార్డు, ట్రామా సెంటర్‌లో ఉన్న జూనియర్‌ డాక్టర్లు సకాలంలో స్పందించి రోగులను కిందకు తరలించారు. దీంతో ఆ రెండు వార్డుల్లో ఉన్న సుమారు 35 నుంచి 40 మంది రోగుల ప్రాణాలు కాపాడగలిగారు. 
మంటలను అదుపుచేసిన ఫైర్‌ సిబ్బంది
రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న హన్మకొండ ఫైర్‌ సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్‌ చల్లుతూ మంటలను 40 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకొచ్చారు.  ఫైర్‌ సిబ్బంది, సుబేదారి, హన్మకొండ పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితోపాటు రోగుల బంధువులు ఇతరలు సకాలంలో స్పందించి చాలామంది రోగుల ప్రాణాలను కాపాడగలిగారు.  198 మంది రోగులను 32 అంబులెన్స్‌ల ద్వారా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రి ప్రధాన కూడలి ఉండడంతో రోగులను తరలించే క్రమంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా అధికారులంతా సమన్వయంతో వేగంగా స్పందించారు.  రోగులను కాపాడటంలోనూ, ఇతర ఆస్పత్రులకు తరలించడంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 
ఇద్దరు రోగులు మృతి 
రోహిణి ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జరీ చేయించుకుంటున్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లికి చెందిన జెట్టి కుమారస్వామి అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఇదే జిల్లాకు చెందిన కాటార మండలం దేవరాంపల్లి వాసి మల్లమ్మ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి చనిపోయింది. 
సమగ్ర విచారణకు ఆదేశించిన కడియం శ్రీహరి
సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,  కలెక్టర్‌ ఆమ్రపాలి, సీపీ సుధీర్‌బాబు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.  అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కడియం తెలిపారు.  రోగులకు అవసరమైన భద్రత కల్పించాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు.  రోగుల బంధువులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కడియం కోరారు. 
విచారణ కమిటీ ఏర్పాటు
రోహిణి ఆస్పత్రి ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇవాళ  ఘటనా స్థలిని సందర్శించనుంది. అనంతరం ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

 

21:55 - October 16, 2017

వరంగల్ : అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే.. అదే ఆసుపత్రిలో మృత్యువు ప్రమాదం రూపంలో మింగేసింది. వరంగల్ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదం రోగులను వణికించింది. ప్రమాద సమయంలో పేలిన సిలెండర్ ధాటికి రోగులు భయంతో పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేశారు. అప్పటికే పరిస్థితి విషమించిన ఇద్దరు రోగులు కన్నుమూశారు. రోహిణీ ఆసుపత్రి నుంచి టెన్ టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:19 - October 16, 2017

వరంగల్‌ : రోహిణి ఆస్పత్రిలో సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో మంటలు భారీగా విస్తరించాయి. సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రులో ఉన్న పేషెంట్లను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:47 - October 14, 2017

వరంగల్‌ : కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈనెల 22న సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో... వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్‌.. టెక్స్‌టైల్‌ పార్క్‌ను దేశంలోనే అగ్రగామికి నిలిచే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మరోవైపు జిల్లాలో పెండింగ్‌ పనులపై అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులకు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

వరంగల్‌లో ఈనెల 22న సీఎం కేసీఆర్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో... ప్రారంభ ఏర్పాట్లు, బహిరంగ సభ నిర్వహణపై వరంగల్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్‌ పార్క్‌ స్థలాన్ని పరిశీలించి... టెక్స్‌టైల్‌ పార్క్‌ లోగోను ఆవిష్కరించారు. 

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలుస్తుందన్నారు కేటీఆర్‌. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే అన్ని రకాల వస్త్రాలన్నీ ఇక్కడే తయారవుతాయన్నారు. టెక్స్‌టైల్‌ రంగం కార్మికులకు రెండింతల పనితో పాటు.. ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సూరత్‌ లాంటి ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న స్కిల్డ్‌ లేబర్‌ను స్వరాష్ట్రానికి రప్పిస్తామన్నారు. పార్క్‌ ఏర్పాటుతో లక్షా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కళాశాలతో ఎంఓయు కుదుర్చుకుంటున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

అనంతరం నిట్‌ ప్రాంగణంలో టాస్క్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌... విద్యార్థులతో సమావేశమయ్యారు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని ఎదుర్కొని... మరింత కసితో పని చేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు కేటీఆర్‌. జీవితలంలో రాణించాలంటే మానసికంగా, దృఢంగా ఉండాలన్నారు. అలా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. యువత సమస్యలను తట్టుకునే విధంగా టాస్క్‌లో నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు కేటీఆర్‌.

టాస్క్‌ ఏర్పాటు కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ హాజరయ్యారు. ఇక సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలో దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. కేటీఆర్‌ కూడా చాలామందికి సెల్ఫీలు తీసేందుకు అవకాశం కల్పించారు.

వరంగల్‌ పర్యటనలో అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన కేటీఆర్‌... ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని మండిపడ్డారు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో... అధికారులు, ఎమ్మెల్యే పని తీరు ఆశాజనకంగా లేదన్నారు మంత్రి. ఈసారి సమీక్ష నిర్వహించే సమయానికి పెండింగ్‌ పనులకు టెండర్లు పిలిచి.. పూర్తి చేయాలన్నారు కేటీఆర్‌. 

17:53 - October 14, 2017

వరంగల్ : జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేదని అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి...అధికారులు, ఎమ్మెల్యే పనితీరు చాలా డిసప్పాయింట్ గా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపోజల్ తెచ్చి ప్రతి పనికి టెంటర్లు పిలవాలని ఆదేశించారు. నెక్ట్స్ రివ్యూ వరకు అన్ని పనుల్లో క్లారిటీ ఉండాలని కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయాలని షరతు విధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:01 - October 14, 2017

 

జనగామ : ఇవాళ జిల్లాలో అమరుల స్ఫూర్తియాత్ర నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ జేఏసీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. లింగాలఘణపురం పోలీస్టేషన్‌లో పలువురు జేఏసీ నాయకులను నిర్బంధించారు. మరోవైపు ఇవాళ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, ఇతర టీజేఏసీ నాయకులు జనగామజిల్లాకు వస్తున్నారు. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. జేసేసీ నాయకులను నిర్బంధించడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. కోదండరాంను చూసి కేసీఆర్‌ సర్కార్‌ భయపడుతోందని విపక్షపార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - warangal