water problem

09:15 - December 1, 2017

అనంతపురం : సమృద్ధిగా సాగునీటి నిల్వలు...భారీ వర్షాలతో కళకళలాడుతున్న జలాశయాలు, చెరువులు అయినా చెరువులకు నీటి విడుదలలో అనంత నాయకులు నీటి రాజకీయాలు. తమ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమంటూ జలవనరులశాఖ అధికారులపై వత్తిడితో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు కరువుతో అల్లాడిన అనంత రైతన్నకు ఇప్పుడు నీటి విడుదలలో రాజకీయాలు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులకు, చెరువులకు నీళ్ళు రావడంతో రైతన్నల కళ్ళలో ఆనందనం కనిపించింది. హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాకు వచ్చే నీటిని జిల్లా అంతా సమానంగా విడుదల అయ్యేలా చూడాల్సిన నాయకులు నీటి రాజకీయాలు చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు. 

అనంతపురం జిల్లాలో మొత్తం 1265  చెరువులుండగా.. మొన్న కురిసిన వర్షాలకు 532 చెరువులకు నీరు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాలోని జలాశయాలు, చెరువులకు పూర్తిస్ధాయితో నీటిని నింపుకునే అవకాశముంది. ఈ కాలువ ఇప్పటివరకు ద్వారా జిల్లాలోని గుంతకల్లు, ఉరవకొండ, శింగనమల, తాడిప్రతి, రాప్తాడు, ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలోని వందకు పైగా చెరువులకు నీటిని విడుదల చేశారు.

అయితే జిల్లాలో ఎవరికి వారు పైప్రాంతంలోని నేతలు ముందుగా తమ ప్రాంతంలోని చెరువులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించడంతో...అధికారులంతా తలలు పట్టుకుంటున్నారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల పరిధిలోని బుక్కపట్నం చెరువు జిల్లాలోనే అతి పెద్దది. అర టీఎంసీకి పైగా నీటి సామర్ధం కలిగిన చెరువుకు ఎనిమిదేళ్ళుగా నీరు లేక తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సీఎం చెప్పినప్పుడు నీరు విడుదల చేశారని అన్నారు. ఇప్పుడు బుక్కపట్నం చెరువుకు నీటి విడుదలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బుక్కపట్నం చెరువు కింద 10 వేల ఎకరాల ఆయకట్టు భూమి సాగవుతోంది. మరో 200 గ్రామాలకు తాగునీరు అందుతోంది. అంతేకాక బుక్కపట్నం చెరవులో నీటిని నింపడం వల్ల చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి లభించనుంది. అయితే ఈ చెరువుకు నీటిని విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు అధికారులను, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

జలవనరులశాఖ అధికారులు మాత్రం పైప్రాంతంలోని చెరువులకు నీటిని విడుదల చేయడం వల్ల.. దిగువ ప్రాంతంలోని చెరువులకు నీరు చేరడంలో అలస్యమవుతోందని అంటున్నారు. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో బుక్కపట్నం చెరువుకు నీటిని విడుదల చేసి పది రోజుల్లోగా నీటిని నింపుతామంటున్నారు. 

11:03 - September 22, 2017

భారతదేశం అభివృద్ధిలో దూసుకపోతోంది...ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం పయనిస్తోంది..ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా ఉన్నారు..స్మార్ట్ సిటీలు..మురికివాడలు లేని ప్రాంతంగా తయారు చేస్తున్నాం..అని చెబుతున్న పాలకుల మాటలు కార్యరూపం దాలుస్తున్నాయా ? లేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే తెలుస్తోంది. కానీ 20 ఏళ్లుగా నీళ్ల కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. నిత్యం నీటి కోసం వారు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది...

ఛత్తీస్ గడ్.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన 5000 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కానీ బలరాంపూర్ జిల్లాకు చెందిన ప్రజలు మాత్రం 20 ఏళ్లుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. బలరాంపూర్ జిల్లాలోని కేంద్ర హెడ్ క్వార్టర్స్ కు కేవలం 8 కిలోల మీటర్ల దూరంలో డుమర్ పురా ఉంది. వీరంతా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక నదీ జలాలపై మనుగడ పడాల్సి వస్తోంది. గత 20 ఏళ్లుగా స్థానికంగా ఉన్న నదీ జలాలపైనే ఆధార పడాల్సి వస్తోందని అక్కడి గ్రామస్తులు ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు. కానీ ఎండకాలంలో నది నీరు అడుగంటిపోతుండడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని పేర్కొన్నారు. నదీ జలాల నుండి నీరు తాగుతుండడం వల్ల చాలా మంది ప్రజలు అనారోగ్యంతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

కానీ 20 ఏళ్లు పడుతున్న నీటి కష్టాలపై కలెక్టర్ స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని నివాస గృహాలకు స్వచ్ఛమైన తాగునీరందిస్తామని హామీనిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వారి కష్టాలు తీరుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

18:29 - August 18, 2017
20:59 - July 6, 2017

కర్నూలు : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా తయారైంది కర్నూలు జిల్లా కోడుమూరు వాసుల పరిస్థితి. చుట్టూ నీటివనరులు ఉన్నా గ్రామానికి మాత్రం మూడు నెలలుగా నీరు అందడం లేదు. ఎండాకాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా నీటి ఎద్దడి తప్పడంలేదని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 
ప్రజలు తీవ్ర ఇబ్బందులు 
కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. గాజుల దిన్నె, సుంకేశుల జలాశయాల నుండి నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన నంద్యాల పథకం కూడా పని చేయకపోవడంతో నీరు లేక ప్రజలు ఆందోళన బాట పట్టారు.  
నంద్యాల నీటి పథకం 
నంద్యాల నీటి పథకం కింద కోడుమూరుతో పాటు 16 గ్రామాలున్నాయి. గాజుల దిన్నె జలాశయం నుండి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్నూలుకు, డోన్‌కు నీటి సరఫరా జరుగుతుంది. అయితే 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోడమూరుకు మాత్రం నీరు అందడం లేదు. ఓ వైపు దాహం దాహం అంటూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
3 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
30వేల జనాభా ఉన్న కోడమూరులో కేవలం 3 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.  గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించక పోవడంతో ప్రజలు ఖాళీ బిందలతో పంచాయితీ కార్యాలయాన్ని ముట్టడించారు. కర్నూల్- బళ్లారి ప్రధాన రహదారి పై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగడంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. గాజుల దిన్నె జలాశయం నుండి నీరు వదిలి కోడమూరు గ్రామస్తుల దాహార్తిని తీర్చాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.  

20:13 - May 22, 2017

కర్నూలు : కర్నూలు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి జిల్లా రైతులు అప్పులపాలయ్యారు. తాము మన్నుతిని.. జనానికి అన్నంపెట్టేందుకు తపనపడే అన్నదాతలు కరువు రక్కసి చిక్కి విలవిల్లాడుతున్నారు. దాదాపు 50ఏళ్లనాడు జనం ప్రాణాలు తీసిన కరువు పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని కర్నూలుజిల్లా ప్రజలు అంటున్నారు. చివరికి తాగునీరు కూడా లేక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒటి రెండు బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

ట్యాంకర్లు, ఆటోల ద్వారా నీరు
అక్కడక్కడా అకరొరగా టొమాటో పంటను సాగు చేసిన అన్నదాతలు.. పైరును కాపాడుకోడానికి ట్యాంకర్లు, ఆటోల ద్వారా నీటిని తీసుకొచ్చి మొక్కల దాహాన్ని తీరుస్తున్నారు. పంటను కాపాడుకోడానికి పొద్దున్నే లేచింది మొదలు బిందెలు, చెంబులు తీసుకుని పొలంబాట పడుతున్నారు. ఇంత కష్టపడినా పంటను కాపాడుకోలేక ఇలా పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాలు ముఖం చాటేస్తుండటంతో.. దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇక్కడే ఉండి తమవారిని పోషించుకోలేక కర్నూజిల్లా రైతులు విలవిల్లాడుతున్నారు. కుటుంబపోషణకోసం పలు గ్రామాల్లో ఇలా ఇళ్లకు తాళ్లాలు వేసి వలసలు పోతున్నారు. పంటల సంగతి పక్కనపెడితే కనీసం పశువులను కూడా కాపాడుకోలేక పోతున్నామని కర్నూజిల్లా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయంలో ఆసరాగా నిలిచే కాడెద్దులు, పాడిపపశువులను కరువు కాటేసిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. పశువులను పోషించలేక కబేళాలకు అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు.

వర్షాభావ పరిస్థితులు
వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో బోర్లు, బావులో ఎపుడో ఎండిపోయాయి. జలశయాలన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్‌కోసం భూమిని సిద్ధం చేసిన రైతులు ఖాళీ ప్రాజెక్టులను చూసి భారంగా నిట్టూరుస్తున్నారు. ఈసారి పంటలు సాగయ్యే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే కర్నూలజిల్లా అన్నదాలు పంటభూములకు, పాడిపశువులకు దూరం అయ్యారని వామపక్షనేతలు అంటున్నారు. జిల్లాలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించడంతోపాటు పెండింగ్‌ ప్రాజెక్ట్‌ లను పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అమరావతి జపం చేస్తూ..
ముఖ్యమంత్రి చంద్రబాబు లేస్తే అమరావతి జపం చేస్తూ.. రాయలసీమను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఈనెల 24న రాయలసీమ బంద్‌తో ప్రభుత్వంపై నిరసన తెలపాలని రైతుసంఘాలు పిలుపునిచ్చాయి.  

20:10 - May 22, 2017

అనంతపురం : అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్న రాజ్యం సింగపూర్‌ అవుతుందా..! పాలకుల డాబుసరి మాటలు రాజధాని అమరావతి చుట్టే పరిభ్రమిస్తుంటే.. గొంతు తడుపుకోను చుక్కనీరు లేక రాయలసీమ కన్నీరుపెట్టుకుంటోంది. చివరకు పశువులకు కూడా మేత కొరత ఏర్పడటంతో కబేళాలకు తరలుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన చిత్తూరుజిల్లాలో కరవు విలయతాండవం చేస్తోంది. జిల్లాలో పడమటి మండలాలు అయిన మదనపల్లె, తంబళ్లపల్లి, బి.కొత్తకోట, ములకలచెరువు, వి.కోట. పలమనేరు, పుంగనూరు తదితర చోట్ల కరవు రక్కసి కాటేసింది. నీటి కోసం 1200 అడుగులకు పైగా బోరు తవ్వినా పాతళగంగ జాడేలేకుండా పోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో బావులు, బోర్లు ఎండిపోయాయి. నీళ్లు లేక పంటలు వడలిపోయాయి.

రెయిన్ గన్స్ ప్రచారం
పంటకుంటలు, రెయిన్‌గన్‌లు అంటూ తెగ ప్రచారం , హడావిడి చేసిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఎకరా పంటను కూడా కాపాడడం లేదు. మరోవైపు పండిన అరకొర పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధరలు లభించడంలేదు. పడిపోయిన ధరలతో మామిడి, వేరుశనగ,టొమేటో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మదనపల్లె మార్కెట్లో కిలో టొమోటో 50 పైసలకు అమ్ముకుని ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టారు కర్షకులు. కేంద్రం నుంచి కరువు బృందాలు ఎన్నిసార్లు సీమలో పర్యటించినా.. ఉపయోగం లేకుండా పోతోందని చిత్తూరు రైతులు ఆవేదన వ్యవక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు కూడా వరుసగా మూతపడుతున్నాయని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.

అదిగో హంద్రీనీవా, ఇదిగోనీళ్లు అంటూ
ఇదిలావుంటే.. అదిగో హంద్రీనీవా, ఇదిగోనీళ్లు అంటూ పాకులు చేస్తున్న ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోతోంది. హంద్రీనివాతోపాటు గాలేరు-నగరి పనులు నత్తడనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అంతా సస్యశ్యామలం అవుతుందనుకున్న కర్షకుల ఆశలు అడియశలుగానే మిగిలిపోతున్నాయి. కుప్పం నియోజకవర్గానికి హంద్రినీవా జలాలు, తిరుపతికి గాలేరు-నగరలి జలాలను తీసుకొస్తానన్న చంద్రబాబు హామీలు బీడుభూముల్లోనే తచ్చాడుతున్నాయి. ఇప్పటికీ భూసేకరణే పూర్తి కాలేదు.. ఇక కృష్ణమ్మ ఈనేలకు ఎలా చేరుతుందని వామపక్షాల నేతలు ప్రశ్రిస్తున్నారు. మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతలతో సీమకు ఒనగూరిన ప్రయోజనం శూన్యంగా మారింది. ప్రాజెక్టు పూర్తయినా..అదనంగా ఒక్క చుక్క నీరు కూడా సీమకు చేరలేదు. బాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. చిత్తూరుజిల్లా కరువుకోరల్లో చిక్కుకుందన్న విమర్శిలు వెల్లువెత్తుతున్నాయి. 

చిత్తూరుజిల్లా తోపాటు
చిత్తూరుజిల్లా తోపాటు మొత్తం రాయలసీమ ప్రాంతమే కరువతో అల్లాడి పోతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికే ఈనెల 24న సీమజిల్లాల బంద్‌కు పిలుపు ఇచ్చినట్టు ఉభయకమ్యూనిస్ట్‌ పార్టీలు చెబుతున్నాయి. బాబు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కలిసి రావాలని ప్రజలను కోరుతున్నారు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో కూరుకుపోయిన రాయలసీమ జిల్లాలకు ఇప్పటికైనా చేయూతనివ్వాలని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు సత్వరమే పూర్తిచేయాలి, సీమనాలుగు జిల్లాల్లో పశుగ్రాసం ప్రభుత్వంమే అందించాలని, దాంతోపాటు ఉపాధి హామీ కూలిబకాయిలను వెంటనే మంజూరు చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.అభివృద్ధి అంటే రాజధాని అమరావతి చుట్టుపట్టు ప్రాంతాలే కాదని.. రాయలసీమ జిల్లాల ప్రజల బాధలు కూడా పట్టించుకోవాలని సీఎం చంద్రబాబును ప్రజలు కోరుతున్నారు. ఈనెల 24న వామపక్షాల అధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌కు పూర్తి సహకారం అందించి టీడీపీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపిస్తామంటున్నారు సీమజిల్లాల ప్రజలు.

06:43 - May 22, 2017

క‌డ‌ప‌ : జిల్లా కరువుకోరల్లో చిక్కుకుంది. కనీసం తాగునీరు లేక పల్లె ప్రజలు విలవిల్లాడతున్నారు. బావులు, బోర్లు వట్టిపోవడంతో జిల్లావ్యాప్తంగా పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మరోవైపు మేత లేక పశుసంపద కబేళాలకు తరలుతోంది. జిల్లా వ్యాప్తంగా పలుగ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. మంచినీటి కోసం జనం వీధి పోరాటాలకు దిగుతున్నారు. దాదాపుగా 9నెలలుగా వర్షాల జాడే లేకుండా పోవడంతో జిల్లా దాహంతో అల్లాడి పోతోంది. బావులు, బోర్లలో నీరు అడుగంటిపోవడంతో తాగునీటికోసం గ్రామీణులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు తీవ్రమైన వ‌ర్షాభావ పరిస్థితులతో సేద్యం జూదంలా త‌యారయ్యిందని కడప జిల్లా రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన వ‌రి, చీనీ, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రాయ‌చోటి, పులివెందుల‌, క‌మలాపురం, ల‌క్కిరెడ్డిప‌ల్లె, జ‌మ్మల‌మ‌డుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తీవ్రమైన క‌రువు పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 1300 అడుగుల లోతు బోర్లు వేసినా చుక్కనీరు రాని పరిస్థితి ఈ ప్రాంతాల్లో నెలకొంది. మరోవైపు జిల్లాలోని తూర్పు ప్రాంతాలైన రాజంపేట‌, రైల్వే కోడూరుల్లో గతంలో 100 నుంచి 200 అడుగుల లోతులోనే నీళ్లు ప‌డేవి. దాదాపు 9నెలలుగా వానచినుకే లేకుండా పోవడంతో ఈ ప్రాంతాల ప‌రిస్థితి కూడ దుర్భరంగా మారింది. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వామపక్షాలు విమర్శిస్తున్నాయి.

వలసలు..
నీటితో క‌ళ‌క‌ళ‌లాడే వ‌రిమ‌ళ్లు బీట‌లు వారిన దృశ్యం జిల్లాలో వ‌ర్షాభావ‌స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. చీనీతోట‌ల‌కైతే.. ట్యాంక‌ర్‌తో నీటి స‌ర‌ఫ‌రా చేస్తూ రైతులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ట్యాంక‌రు ధ‌ర 1000 లు ప‌లుకుతోంది. మరోవైపు జిల్లాలో పశుసంపదకు కటకట పరిస్థితులు దాపురించాయి. పశుగ్రాసం కొరతతో జిల్లాలో వ్యవవసాయ, పాడిపశువులు కబేళాలకు తరలుతున్నాయని జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాకు ప్రధాన నీటి పారుద‌ల సౌకర్యాన్ని అందించే కేసీ కెనాల్ ఆయ‌క‌ట్టు ప్రాంతం త‌ప్ప... మిగతా ప్రాంతం మొత్తం తీవ్రమైన క‌రువును ఎదుర్కొంటోంది. జిల్లాకు స‌రైన నీటి పారుద‌ల వ్యవ‌స్థ లేక‌పోవ‌డం.. నీటి కేటాయింపుల్లో ఈ ప్రాంతానికి జ‌రిగిన అన్యాయం కార‌ణంగా రైతులు నిరంత‌రం కరువుబారిన పడుతున్నారు. ఈ ఏడాది కేసీ కెనాల్ కు కూడ పూర్తి స్థాయిలో నీరు అంద‌క రైతులు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఉన్నప్పటికీ.. అడ‌పాద‌డ‌పా నీటి స‌ర‌ఫ‌రానే ఉంటోంది. వ్యవ‌సాయం భార‌మైన రైతులు.. వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. ప్రధానంగా జిల్లా నుంచి గ‌ల్ప్ దేశాల‌కు పొట్టకూటి కోసం జ‌నం తరలివెళుతున్నారు.

24న బంద్..
రైతు సంక్షేమం గురించి గొప్పగా ప్రక‌టించుకుంటున్న పాల‌కుల మాటలు ఆచ‌ర‌ణ‌లో ఒట్టిపోతున్నాయి. క‌రువు నుంచి విముక్తి చేయ‌డానికి శాశ్వత నీటి పారుద‌ల వ్యవ‌స్థ ఏర్పాటు చేయ‌కుండా.. తాత్కాలికంగా ప‌శుగ్రాసం, గంజి కేంద్రాలు లాంటి స‌హాయ‌క చ‌ర్యల‌తో సరిపెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క‌రువు స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని వామ‌ప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. రాయ‌ల‌సీమ‌లో క‌రువు పరిస్థితులపై ప్రభుత్వం కళ్లుతెరిపంచాడినికే ఈనెల 24న సీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చామని వామపక్షాలు అంటున్నాయి. అన్ని వ‌ర్గాల ప్రజ‌లు బంద్ లో పాల్గొని పాల‌కుల క‌ళ్లు తెరిపించాల‌ని రైతుసంఘాల నేత‌లు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరువుకోరల్లో చిక్కుకున్న తమను ఆదుకోవాలని కడప జిల్లా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

10:47 - May 12, 2017

సంగారెడ్డి : తెలంగాణలో రాళ్ల ఏడారి ప్రాంతమది. కరవు కరాళ నృత్యం చేస్తోంది. అక్కడి వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. గుక్కెడు నీటి కోసం మైళ్లదూరం నడవాల్సిన దుస్థితి. సాగునీటి వనరు లేని దయనీయస్థితి. కరవు కాటకాలకు నిలయంగా..వలసలకు చిరునామాగా మారిన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజకవర్గం దుస్థితిపై ప్రత్యేక కథనం.

ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిసినట్లుగా.

ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిసినట్లుగా..ఇక్కడ ఎటుచూసినా రాళ్లే కనిపిస్తాయి. కోటి రతనాల వీణ తెలంగాణలో..రాళ్లు మాత్రమే దర్శనమిచ్చే ప్రాంతం. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఏళ్లుగా కరవు ఉరుముతూ..ఇక్కడి వారి జీవితాలను అగమ్యగోచరంగా మార్చేసింది. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ.. ఈ ప్రాంత రైతులు బక్కచిక్కిపోతున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులోని...

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులోని నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కరవు విలయతాండవం చేస్తోంది. నాగుల్‌గిద్ద మండలంలోని ఏ గ్రామాన్ని చూసినా..ఇళ్లకు తాళాలే కనిపిస్తాయి. తాగు,సాగునీరు లేకపోవడంతో.. పొట్టచేత్తోపట్టుకుని బతుకుజీవుడా అంటూ ముంబాయి, బీదర్‌,హైదరాబాద్‌కు వలసపోతున్నారు. తమ కుటుంబాలను బతికించుకోవడం కోసం యువకులు వలసబాటపడుతున్నారు. అమ్మనాన్నల ఆప్యాయతకు దూరంగా బతుకుజట్కా బండిని లాగుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోయినా..నెరవకుండా చమటలు చిందిస్తున్నారు. అటు తమ కొడుకులు పంపే డబ్బులు ఎప్పుడొస్తాయా అని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

యువకులు ఉపాధి వెత్తుకుంటూ పట్టణాల బాటపడితే...

యువకులు ఉపాధి వెత్తుకుంటూ పట్టణాల బాటపడితే..గ్రామాల్లో ఉంటున్న వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. జబ్బు చేసినా చూసే దిక్కులేక మౌనంగా రోదిస్తున్నారు. తమ గోడు వినే నాథుడే కరువయ్యాయడని విలపిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో వలసలు తగ్గిస్తామని..తాగు,సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామని 2009 సాధారణ ఎన్నికలతో పాటు 2016 ఉప ఎన్నికల్లోనూ సాక్షత్‌ సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ మరో అడుగు ముందుకేసి పారిశ్రామిక ప్రాంతంగా మార్చి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుతామని హామీలు గుప్పించారు. కానీ నాయకుల ఆకట్టుకునే హామీలు రాళ్ల ఏడారిలో ఒయాసిస్‌గా మారాయని జనం మండిపడుతున్నారు.

పలు తండాలు అభివృద్ధికి ఆమడదూరంలో

ఇక ఈ ప్రాంతం అభివృద్ధిలోనూ బాగా వెనుకబడిపోయింది. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నాగుల్‌గిద్ద మండలంలోని ఊట్‌పల్లి, ఎనక్‌పల్లి గ్రామాలు, పదులసంఖ్యలో తండాలు అభివృద్ధికి ఆమడదూరంలో అలమటిస్తున్నాయి. కనీసం రోడ్డు మార్గం, రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి వనరులు లేక జనం అల్లాడిపోతున్నారు. పంటభూములన్నీ బీడు భూములుగా మారిపోయాయి. వర్షాధార పంటలే దిక్కవడంతో ఆశగా ఆకాశంవైపు ఎదురుచూస్తున్నారు. మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులు ఏర్పాటైతే.. రాళ్ల ప్రాంతం జలసిరులతో సస్యశ్యామలమవుతుందనుకున్నారు. కానీ ఏలికల ఆర్భాట ప్రకటనలు...వీరి తలరాతలను మార్చలేకపోయాయి.

ఆశ నిరాశే అయ్యిందని

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ బతుకులు మారుతాయన్న ఆశ నిరాశే అయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కరవు కోరలకు చిక్కి అల్లాడిపోతున్న నారాయణఖేడ్‌ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రైతు సంఘాలు, మేధావులు కోరుతున్నారు.

కరవును తరిమికొట్టే మార్గమే లేదా?

రాళ్ల ఏడారిగా మారిన నారాయణఖేడ్‌ నియోజకవర్గం సుభిక్ష ప్రాంతంగా ఎప్పుడు మారుతుందా అని ఇక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తలాపునే సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ఉన్నా..ఈ ప్రాంతానికి నీటి కష్టాలు తీరడం లేదు. కేవలం నాలుగు కిలోమీటర్లు కాలువలు తవ్వితే.. జలసిరులు పరవళ్లు తొక్కే అవకాశం ఉంది. బీడు భూములు పంట పొలాలుగా మారనున్నాయి. ధాన్యపురాసులతో రైతుల లోగిళ్లు శోభిళ్లనున్నాయి. కానీ అది ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చిన నాయకులు మాటలు నీటిమూటలుగా మారిపోతున్నాయి. కరవును తరిమేస్తామని ఆర్భాటంగా చేసే ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.

బతుకులు మారాలంటే కరవు రక్కసిని తరిమేయాలంటే ...

రాళ్ల ఏడారిలోని ప్రజల బతుకులు రోజు రోజుకు దుర్భరమవుతున్నాయి. ఇక్కడి వారి బతుకులు మారాలంటే కరవు రక్కసిని తరిమేయాలంటే సాగునీటి వనరుల వినియోగం జరగాలని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు. పాలకులు సింగూరు జలాల తరలింపునకు ఎందుకు పూనుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. మిషన్‌ కాకతీయ కింద ఎందుకు పనులు చేపట్టడం లేదని నిలదీస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. మొక్కజొన్న, కందులు, సోయాబిన్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ప్రారంభిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. బోదన్‌-నారాయణఖేడ్‌-బీదర్‌ మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలంటున్నారు.

కావాలనే నారాయణ ఖేడ్‌ ప్రాంతాన్ని వెనకబాటుకు గురిచేస్తున్నారని..

ఏళ్లుగా పాలకులు కావాలనే నారాయణ ఖేడ్‌ ప్రాంతాన్ని వెనకబాటుకు గురిచేస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా వారి వెతలు మాత్రం తీరడం లేదంటున్నారు. 2006లోనే పాదయాత్ర ద్వారా నీటివనరులు గురించి వివరాలు అందించామని..చిన్న చిన్న కుంటలు అభివృద్ధి చేయాలని సూచించామంటున్నారు. 11 ఏళ్లు గడిచినా ఎవరూ స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి నారాయణ ఖేడ్‌ నియోజకవర్గానికి సింగూరు జలాలను తరలించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

08:36 - May 2, 2017

హైదరాబాద్ : ప్రతి నివాసానికి మంచినీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమలుపై కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు హాజరైన ఈ సమీక్షలను పలు అంశాలపై కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మిషన్‌ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా పనుల వేగాన్ని పెంచాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ఏడాది చివరి నాటికి గోదావరి, కృష్ణా జలాలు గ్రామాలకు సరఫరా అయ్యేలా చూడాలిని కోరారు. పథకం అమల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు చర్చించుకుని, సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించేంది లేదని హెచ్చరించారు. భగీరథ పైపు లైన్లతోపాటు ఫైబర్‌ కేబుల్‌ కూడా వేసి ఇంటింటికి మంచినీళ్లతోపాటు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ అమెరికా సరసన నిలవాలన్న ఆకాంక్షను కేసీఆర్‌ వ్యక్తం చేశారు. ఇన్‌టేక్‌ వెల్స్‌, నీటి శుద్ధి కర్మాగారాల నిర్మాణాన్ని తర్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోగా పంటపొలాల్లో జరగాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తైన ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ ద్వారా నీరు అందించాలని కోరారు. ఈ పథకానికి కావాల్సిన కరెంటును అందించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

 

08:27 - April 30, 2017

ఆదిలాబాద్ : జిల్లాలోని మారుమూల గిరిజన ప్రజలు ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని కొట్టు మిట్టాడుతున్నారు. భూగర్భ జలాలన్నీ అడుగంటి పోవడంతో భీంపూర్ మండలం గుంజాల సమీపంలో కొలం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వారంరోజులుగా తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడడంతో గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచివెళ్తున్నారు. 40కి పైగా జనాభా ఉన్న ఈ పల్లెలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో..పల్లెకు సమీపంలో ఉన్న వాగులో చెలిమెలు తవ్వుకొని నీళ్లను తెచ్చుకుంటున్నారు. దీంతో చెలిమలలోని కలుషిత నీటిని తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారు.భానుడి భగభగకు భూగర్భజలాలు అడుగంటి పోవడంతో ప్రజలు కన్నీటి కష్టాలు ఎదురుకుంటున్నారు. సిరికొండ మండలంలోని నిజాంగూడ ప్రజలు బిందెడు నీటికోసం పడే ఇబ్బందులు వర్ణనాతీతం. గ్రామంలోని బావులు, చేతి పంపులు పనిచేయక పోవడంతో కిలో మీటరు దూరంలో ఉన్న బావి నుండి ఎండను సైతం లెక్కచేయకుండా నీటిని తెచ్చుకుంటున్నారు. పొలం పనులకు సైతం వెళ్లడం లేదని,చిన్నా పెద్ద తేడా లేకుండా నీటికోసమే ఉంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రిబవళ్ళు పడిగపలు..
రక్షిత మంచినీటి పథకాలు..పడకేస్తుండటంతో ఇంద్రవెల్లి మండలంలోని మారుతీ గూడ, టెకడి గూడ, గట్టెపల్లి, దొండాడతండా, చిత్తగూడ, కొలాంగూడ తదితర గిరిజన గ్రామాల్లో త్రాగునీటికోసం గ్రామాల సమీపంలోని వాగులోని చెలిమెల నీటికోసం మైళ్ళ దూరంవెళ్లి రాత్రిబవళ్ళు పడిగపలు పడాల్సి వస్తుంది. వేసవి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రణాళికలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు.తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత శాఖా అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రజలపాలిట శాపంగా మారుతుంది.తాగునీటి ఎద్దడి తీర్చేందుకు రూపొందించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమౌతున్నాయి

Pages

Don't Miss

Subscribe to RSS - water problem