Weather Updates

20:42 - October 13, 2017

హైదరాబాద్‌ : నగరంలో మళ్లీ వర్షం దంచి కొడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్‌ నుంచి మియాపూర్ వరకు, ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. 

 

11:35 - October 13, 2017

 

హైదరాబాద్ : భారీ వర్షానికి హైదరాబాద్‌ మరోసారి తడిసి ముద్దైంది. గురువారం సాయంత్రం వరకు ప్రశాంతంగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారుమబ్బులు కమ్ముకుని.. ఉరుములు, మెరుపులతో కుండపోతగా వర్షం కురిసింది. జోరు వానకు సిటీ జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గంటసేపు కురిసిన కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి.

గంటలో 6.4 సెంటీమీటర్ల వర్షం
పంజాగుట్ట శ్రీనగర్‌కాలనీలో అత్యధికంగా గంటలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మౌలాలిలో 4.9 సెం.మీ., అంబర్‌పేటలో 3.9 సెం.మీ., కాప్రాలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అటు మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ సహా ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆగిపోయి వాహనదారులు నరకయాతన పడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, అత్యవసర బృందాలు రంగంలోకి దిగినా పరిస్థితిని చక్కదిద్దలేక చేతులెత్తేశారు. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌లోనే చిక్కుకున్న వాహనదారులు నానా అవస్థలు పడి ఇళ్లకు చేరుకున్నారు.

మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
నాంపల్లి తాజ్‌ ఐల్యాండ్‌, అఫ్జల్‌గంజ్‌ నుంచి కేంద్ర గ్రంథాలయం వరకూ 3 అడుగల మేర నీళ్లు నిండిపోవడంతో ఆర్టీసీ బస్సులు, సిటీబస్సులు రెండువైపులా భారీగా నిలిచిపోయాయి. సికింద్రాబాద్‌లోని బాంబే హోటల్‌, లక్కీ టర్నింగ్‌ వద్ద ద్విచక్రవాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గంటవ్యవధిలోనే కుండపోత వర్షానికి సిటీలో దాదాపు 200లకు పైగా కాలనీలను వర్షపునీరు ముంచెత్తింది. మలక్‌పేట, సంతోష్‌నగర్‌, సైదాబాద్‌ ప్రాంతాల్లో వరదనీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చేరింది. పాతబస్తీలో కొన్నిచోట్ల మూడడుగుల ఎత్తు నీరు ప్రవహించింది. మీరాలం మండిని వరద ముంచెత్తింది. సోమాజీగూడ యశోద ఆస్పత్రి ఏరియా, నారాయణగూడ, సికింద్రాబాద్‌లలో నాలాలకు సమీపంలోని ఇళ్లల్లోకి నీరు వెళ్లడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఇదిలావుంటే మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనానికి తోడు విదర్భ, కొంకణ్‌, మధ్య మహారాష్ట్ర, మరాట్వాడా మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి.

11:16 - October 13, 2017

 

హైదరాబాద్ : నగరంలోని మైత్రీవనంలో మృతదేహం కలకలం సృష్టించింది. మైత్రీవనంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద నాలాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచాం కోసం వీడియో చూడండి.

07:07 - October 13, 2017

హైదరాబాద్ : నగరం మరోసారి తడిసి ముద్దయింది. అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, సోమాజీగూడ, సనత్‌నగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌, రామాంతపూర్‌, ఉప్పల్‌, బేగంపేట్‌, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎక్కడికక్కడ నాలాలు పొంగడంతో వాననీరు రహదారులపై నిలిచిపోయింది. దీంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో జనం అష్టకష్టాలు పడ్డారు. వాన దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చిన్నపాటి చెరువులను తలపించాయి.  

21:45 - October 12, 2017
19:53 - October 12, 2017

అనంతపురం : భారీ వర్షాలతో రాయలసీమ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలుజిల్లాలో   'చిన్నకుహుంతి వంక' పొంగడంతో పత్తికొండ ఆస్పరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు అనంతపురం జిల్లా గుత్తిలో రాత్రి కురిసిన వర్షంతో పట్టణంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. 

 

19:51 - October 12, 2017

అనంతపురం : జిల్లాలో కురుస్తున్న వర్షాల దాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పామిడి మండలంలోని అనుంపల్లి చెరువు పొంగిపొర్లు తుండటంతో పట్టణంలోకి  నీరు చేరుకుంది. దీంతో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో నిత్యవసర సరుకులు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. సంఘటనా స్థలానికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రమణీమణి చేరుకుని బాధితులకు సహాయ చర్యలు పర్యవేక్షించారు. పామిడి పోలీసు సిబ్బంది సహాయ చర్యలకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వటంతో పామిడి పట్టణంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

07:29 - October 12, 2017

మహబుబ్ నగర్ : ప్రస్తుత సీజన్‌ చివరిలో భారీ వర్షాలు పాలమూరు జిల్లాను ముంచెత్తాయి. వర్షాలపై కొందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తుంటే, పంట నష్టపోయిన మరికొందరు ఆందోళనకు గురవుతున్నారు. ఈసారి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో 33.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కోయిలకొండ మండలంలో అత్యధికంగా 13.3 సెంటీమీర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. దీంతో జూరాల, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి, నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వర్షాలు రైతులకు చేటు తెచ్చాయి. వరి పంటనీట మునిగింది. చేతికొచ్చిన పంట నోటికి అందకుగా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

23,486 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 23,486 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పత్తికి అధిక నష్టం వాటిల్లింది. పంటదెబ్బతిన పత్తి చేలను గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పరిశీలించారు. ఎకరం పత్తిసాగుకు 28 వేల రూపాయాలు ఖర్చు చేశామని, వర్షాలతో పంట దెబ్బతినడంతో చేసిన వ్యయం తిరిగివచ్చే అవకాశంలేదని ఎమ్మెల్యే ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత వర్షాలకు ప్రాజెక్టులు నిండటంతో రబీ సాగుకు నీరు విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఖరీఫ్‌ నష్టాన్ని రబీతో పూడ్చుకుంటామని అంటున్నారు. 

21:49 - October 9, 2017

అనంతపురం : అనంతపురంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 9 గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో... లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామకృష్ణా కాలనీ, సూర్యానగర్‌, ఉమానగర్‌తో పాటు పలు కాలనీలు నీటమునిగాయి. టీవీ టవర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. అయితే వర్షం కారణంగా పలు కాలనీలలో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. అక్రమకట్టడాలు, నాలాల ఆక్రమణలతో వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరుతోందని ప్రజలు అంటున్నారు. రాత్రంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చినపుడు అధికారులు హడావిడి చేస్తున్నారని.. తర్వాత యథాతథంగా ఆక్రమణలు కొనసాగుతున్నాయిని అనంతపురం ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్‌ వీరపాండ్యన్‌ అనంతపురంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌ కుమార్‌తో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించామని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. బాధితులకు అండగా ఉంటామని, వర్షాల వల్ల నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని తెలిపారు. వెంటనే సహయక చర్యలు చేపట్టాలని మండల స్థాయి ప్రభుత్వ అధికారులకు ఆదేశించామన్నారు.

చెరువులు, నదులు జలకళను సంతరించుకున్నాయి....
భారీ వర్షాలతో జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో చెరువులు, నదులు జలకళను సంతరించుకున్నాయి. ఏడు సంవత్సరాలుగా నిండని చెరువులు ఇప్పుడు నిండుకుండలను తలపించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలో సాహెబ్‌ చెరువు నిండి చిత్రావతి నదిలోకి ఉదృతంగా నీరు వస్తుండటంతో చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అటు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురు, వేముల, లింగాలలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. లింగాల కుడి కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. గత పదేళ్లుగా... ఇలాంటి వర్షాలు కురవలేదని.. ఇప్పుడు చెక్‌ డ్యామ్‌లు, వాగులు వంకలు నిండటంతో సంతోషంగా ఉందంటున్నారు రైతులు. సీమలో కురుస్తున్న వర్షాలతో తమకు నీటి సమస్య తీరినట్లేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

15:47 - October 9, 2017

కడప : వర్షాలు సమృద్దిగా కురవడంతో రాయలసీమలో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక కరవు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సారి కురిసిన వర్షానికి పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురు, వేముల, లింగాలలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. లింగాల కుడి కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. గత పదేళ్లుగా... ఇలాంటి వర్షాలు కురవలేదని.. ఇప్పుడు చెక్‌ డ్యామ్‌లు, వాగులు వంకలు నిండటంతో సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Weather Updates