wide angle

20:11 - November 15, 2017

కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట...గరగపర్రు, మంథని, నేరెళ్ల, కందుకూరు, నవీపేట....ఎన్ని గ్రామాలు? ఎందరు బాధితులు? ఇంకా ఎన్నేళ్లు? అణిగిమణిగి బతకాలని దళితులను అనునిత్యం శాసిస్తున్న ఆధిపత్య కులాల అహంకారానికి, పెత్తందారీ వ్యవస్థ స్వభావానికి ముగింపు ఎప్పుడు? చేసిన తప్పేమీ లేదు.. కేవలం ప్రశ్నించారు. అతగాడి అక్రమాన్ని అడ్డుకున్నారు.. అంతే పెత్తందారీ లక్షణం నిద్రలేచింది. ఆధిపత్య కుల అహంకారం జూలు విదిలించింది. ఫలితం అమానవీయం.. అరాచకం... దుర్మార్గం.. మీసం పెంచితే ఒకడికి కోపం... గుర్రంపై ఊరేగాలని ముచ్చట పడితే మరొకడికి కోపం...ప్రేమిస్తే ఇంకొడికి, ప్రశ్నిస్తే మరొకడికి... ఎంతకాలమీ పెత్తందారీ కులాల అరాచకం.

నీ బాంచన్ కాల్మొక్త దొరా అనాలి..కూర్చోమంటే కూర్చోవాలి.. నిల్చోమంటే నిల్చోవాలి..ఎదురు చెప్తే మురిగ్గుంటలో ముంచేస్తారు.. బెత్తంతో బెదిరిస్తారు.. అమ్మ ఆలి అంటూ బూతులు లంకించుకుంటారు.. ఎవరీ భరత్ రెడ్డి? నవీపేటలో ఏం జరిగింది? కులమా ఇంకెక్కడుంది ? అనేవాళ్లకు ఇవిగో ఉదాహరణలు.. గరగపర్రు గాయం సలుపుతూనే ఉంది.. నిజామాబాద్ నవీపేట లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.. నేరెళ్ల ఘటన ఇంకా కళ్లముందునుంచి చెరిగిపోలేదు.. మంథని మధుకర్ హత్య ఇంకా పచ్చిగానే ఉంది.. ఒంగోలు రెవిన్యూ ఉద్యోగిపై దాడి తాజా తాజాగా వాతలు తేలి కనిపిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దేశంలో నిత్యం దళితులపై అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి..

ఏడు దశాబ్దాలు దాటుతున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో ఏడు దశాబ్దాలైనా వస్తుందనే నమ్మకం కనిపించటం లేదు.. అన్ని రకాలుగా అణచివేత, అంతులేని దోపిడీ, అంతం లేని వివక్ష... వెరసి దారుణమైన వెనుకబాటు. దేశంలో దళితుల స్థితిగతులు ఎప్పుడు మారతాయి. ఈ వివక్ష ఎప్పుడు అంతమౌతుంది? స్వతంత్ర భారతంలో నిత్యం దళితులకు జరుగుతున్న అవమానాలెన్నో. కులం, పేరుతో మతం పేరుతో జరుగుతున్న దాడులెన్నో. ఏళ్లకేళ్లు న్యాయం జరగక, దళితులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దళితున్ని రాష్ట్రపతి చేయడం దళితుల సమస్యలకు పరిష్కారం కాదు. వ్యవస్థ రూపాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరగాలి. గ్రామాల్లో, పట్టణాల్లో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష, దాడులు, వెలివేతలపై ప్రభుత్వాలు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే అణచివేతకు ఫలితం తిరుగుబాటే అని చరిత్ర చెప్తోంది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:37 - November 14, 2017

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు పర్యాటకానికి ఓ రేంజ్ లో ప్రచారం కల్పిస్తూ కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా గాలికి వదిలేయంటం చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని బాధితులు మండిపడుతున్నారు..

ఎలాంటి అనుమతులు లేవు..ఏ దారిలో వెళ్లాలో బోట్ నడిపేవాడికి తెలియదు.. దీనివెనుక ఎవరెవరు కుమ్మక్కయ్యారో అంతా గప్ చుప్.. ఎక్స్ గ్రేషియా ఇస్తాం.. కమిటీ వేస్తాం.. విచారణ జరుపుతాం.. ఆ విధంగా ముందుకెళతాం.. జాతరకెళితే ఇంటికి సేఫ్ గా రాగలరా? ఏదైనా దేవాలయ ఉత్సవానికెళితే సరైన రక్షణ ఉంటుందా? ఏ మాత్రం లేదని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివి కాదు. అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటిలో మొన్నటి పుష్కరాల ఘటన మొదటి కాదు.. నేటి పడవ ప్రమాదం ఆఖరికాకపోవచ్చు.. ప్రభుత్వాల నిర్లక్షం ఆ రేంజ్ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదాల చిట్టా చూస్తే అర్ధమయ్యేది ఒక్కటే..సామాన్య ప్రజలంటే పాలకులకు ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది. హడావుడి చేసి, రండి రండి అంటూ పర్యాటకులను, భక్తులను ప్రచారార్భాటంతో ఆకర్షించటం తప్ప , హడావుడిగా ఉత్సవాలు నిర్వహించటం తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించని పరిస్థితి. గాల్లో దీపంలా ప్రజారక్షణను వదిలేసే పాలకులదే నూటికి నూరుపాళ్లూ ఈ పాపం.. అసలీ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ మంత్రి హస్తం కూడా ఉందనే వార్తలో నిజమెంత?

పవిత్ర సంగమంలో భక్తులు మరణించారంటే దానికి కారణం నూటికి నూరుపాళ్లూ ఏలికల నిర్లక్ష్యమే. ప్రచారం చేసుకున్నంత ఉత్సాహంగా ఏర్పాట్లు కూడా చేసి ఉంటే, ఇలాంటి విషాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వకుండా, పర్యాటక ప్రాంతాల్లో పుణ్య క్షేత్రాల్లో ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్యంలో మార్పు రావలసిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:51 - November 13, 2017

పిల్లలకు కూడా హక్కులుంటాయా? వాళ్లకేం తెలుసు..? పెద్దవాళ్లు ఏది చెప్తే అది చేయాల్సిందే.. ఇంకా వినకపోతే వీపు పగలగొట్టాల్సిందే.. ఈ మాటలు మన సమాజంలో కొత్తవేం కాదు. కానీ, వాళ్లకూ హక్కులుంటాయి. సీతాకోక చిలుక రెక్కలపై ఎగిరే రంగురంగుల బాల్యాన్ని చిదిమేసే హక్కు... ఆఖరికి తల్లిదండ్రులకు కూడా లేదని.. గుర్తించాల్సిన సమయం వస్తోంది. ఈ క్రమంలో విద్య, వైద్యం. అక్రమ రవాణా, పేదరికం.. ఇలా ఎన్నో సవాళ్లు.. ఇలా చిన్నారుల హక్కుల పరిరక్షణకు ఎదురవుతున్న సవాళ్ల గురించి బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 
ప్రమాదంలో బాల్యం
మాటలకే పరిమితమౌవటం చాలా సాధారణంగా మారింది... వాళ్లు తారే జమీన్ పర్ లాంటివాళ్లు అని సినిమా చూసి కళ్లు తుడుచుకుంటాం.. తెల్లారాక మళ్లీ మామూలే .. అటు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇటు తల్లిదండ్రుల నిస్సాహాయత, పేదరికం, తెలియనితనం, అక్రమార్కుల కుట్రలు..జైలు గదుల పాఠశాలలు... వెరసి బాల్యం ప్రమాదంలో పడుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:36 - November 9, 2017

మామూలుగా గాలి పీల్చక పోతే చస్తారు.. కానీ, అక్కడ గాలి పీలిస్తే చస్తారు.. అది మామూలు గాలి కాదు..  మూతికి మాస్కు లేకుండా బయటికి రాలేని పరిస్థితి.. ముందున్న వాహనం కనిపించని దుస్థితి.. వాయు కాలుష్యం అన్ని వైపులనుంచి కప్పేస్తుంటే హస్తిన ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. దీంతో దేశ రాజధాని కాస్తా కాలుష్యానికి క్యాపిటల్ గా మారింది. ఏటా ఢిల్లీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను చూస్తోంది. దీనికి పరిష్కారం లేదా? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
పట్టపగలే పొగమంచు 
రాజధాని ఢిల్లీ.. పట్టపగలే పొగమంచు పేరుకుని ఎదురుగా వచ్చే వాహనాలే కనిపించని పరిస్థితి. పొల్యూషన్ లో ప్రపంచ నగరాల్లో టాప్ ప్లేస్ కి  శరగవేగంగా దూసుకుపోతోంది ఢిల్లీ..  ఢిల్లీలో ప్రజారోగ్యం  ప్రమాదంలో పడింది. ఇల్లూ, ఆఫీసు, మెట్రో స్టేషన్లు, రోడ్లు.. పార్కులు... ఎక్కడా తేడా లేదు.. అన్ని చోట్లా కలుషిత గాలి చేరుతోంది. ఇదిలాగే సాగితే కొన్నాళ్లకు దేశ రాజధాని లో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఊహించటం కూడా కష్టమే అనిపిస్తోంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:54 - November 8, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా..తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బ్లాక్‌డేని పాటించాయి. వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలుతో సామన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని వామపక్షాలు ఆరోపించగా.. నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కాంగ్రెస్ విమర్శించింది. 

పెద్దనోట్ల రద్దుతో దేశంలో ప్రకంపనలు రేపిన నవంబర్‌ 8వ తేదీని నిరసనదినంగా విపక్షాలు నిర్వహించాయి. ఏపీ, తెలంగాణలో సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున  నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా హైదరాబాద్‌లో వామపక్షపార్టీలు ర్యాలీ నిర్వహించాయి. పోలీసులు ర్యాలీని అడ్డుకొని లెఫ్ట్ పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. 

పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలుతో సామన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర భారతాన్ని అమితంగా ప్రేమిస్తూ.. దక్షిణ భారతంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, వాటి వల్ల లాభపడింది మోదీ భజన బృందం మాత్రమేనని అన్నారు. మోదీ ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతుందని సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ ఆరోపించారు. 

ప్రధాని నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దుతో రైతులు, చిరు వ్యాపారులు  తీవ్రంగా నష్టపోయారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

అటు విజయవాడలో నోట్లరద్దును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో ఏపీ పీసీసీచీఫ్‌ రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నమై 2  లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. నోట్ల రద్దు నుంచి సామాన్యులు తేరుకొనేలోపే జీఎస్‌టీ పేరుతో కేంద్రం మరో గుదిబండ వేసిందన్నారు. మరోవైపు లెనిన్‌ సెంటర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి. మధు, సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె. రామకృష్ణ హాజరయ్యారు.   

గుంటూరులో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట వామపక్షనేతలు నిరసన తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలోని నల్లధనాన్ని బయటకు రప్పిస్తామని ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసం చేశారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ మండిపడ్డారు. పెద్ద నోట్లు  రద్దై ఏడాది పూర్తైన సందర్భంగా కర్నూలులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నోట్ల రద్దుతో కార్పొరేట్ కంపెనీలకు లాభం తప్ప.. పేదలకు ఎలాంటి మేలు జరగలేదని ప్రజాక్షేత్రంలో విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టాయి. 

21:52 - November 8, 2017

ఢిల్లీ : మోది ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా విపక్షాలు దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే నిర్వహించాయి. నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చించిందని...లక్షలాది మంది ప్రజలకు కష్టాలు, నష్టాలు తెచ్చిపెట్టిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. మరోవైపు  నోట్ల రద్దు సానుకూల ఫలితాలు ఇచ్చిందంటూ బీజేపీ నల్లధనం వ్యతిరేక దినాన్ని పాటించింది.
నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తి
మోది సర్కార్‌  పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 6 వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఢిల్లీలోని మండీ హౌస్‌ నుంచి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వరకు సిపిఎం ఆధ్వర్యంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.
మోదీ నిర్ణయంతో దేశం సర్వనాశనమైందన్న వాపపక్షాలు 
పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశం సర్వనాశనమైందని వాపపక్షాలు మండిపడ్డాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశాయి. లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని, ధరలు పెరిగాయని ఆవేదన వెలిబుచ్చాయి. నోట్లరద్దుతో నల్లధనం తెల్లధనంగా మారిందని వామపక్షాలు ధ్వజమెత్తాయి.
కాంగ్రెస్‌ నేతృత్వంలోని 18 పార్టీలు దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే 
నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని 18 పార్టీలు దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే నిర్వహించాయి.  ఢిల్లీలో యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. నోట్ల రద్దు నిర్ణయం ద్వారా బ్యాంకు క్యూలైన్లలో నిల్చుని వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయరని....భారత ఆర్థిక వ్యవస్థను వీల్‌చైర్‌పైకి తెచ్చారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రధాని మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం దేశంలో మహా విషాదాన్ని మిగిల్చిందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. కోట్లాది భారతీయులను డిమానిటైజేషన్‌ నిర్ణయం ఇబ్బందుల్లోకి, బాధల్లోకి నెట్టిందని పేర్కొన్నారు. 
నల్లధనంపై ఓ యుద్ధం : నరేంద్రమోది 
పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన ఓ యుద్ధమని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. 'నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన  ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా' అని ప్రధాని ట్వీట్‌ చేశారు.
'నల్లధనం వ్యతిరేక దినం'గా బిజెపి భారీ ర్యాలీ 
నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ 'నల్లధనం వ్యతిరేక దినం'గా బిజెపి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. మోది ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు వల్ల నల్ల కుబేరులు బెంబేలెత్తిపోతున్నారని, ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని బిజెపి నేతలు వెల్లడించారు. నోట్లరద్దు నిర్ణయంపై ఏడాది పూర్తయినందున అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా దేశవ్యాప్తంగా అనుకూల, వ్యతిరేక ర్యాలీలతో హోరెత్తించాయి.

 

21:25 - November 8, 2017

సరిగ్గా ఏడాది క్రితం... రాత్రి ఎనిమిది గంటలకు అంటే, 2016 నవంబర్ 8న, దాదాపు ఇదే సమయానికి టీవీలో ప్రధాని మోడీ ప్రత్యక్షమయ్యారు.. దేశ ప్రజానీకం తెల్లబోయే ప్రకటనలు చేశారు.. 500, వెయ్యి నోట్లకు అంత్యక్రియలు చేసి, దేశమంతటినీ క్యూలో నిలబెట్టిన సందర్భానికి ఏడాది గడుస్తోంది.. మరి డీమానిటైజేషన్ తో సాధించినదేమిటి? చెప్పిందొకటి, జరిగింది మరొకటా..? ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టినట్టు పరిస్థితి మారిందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టొరీ.. 
ఏం చెప్పారు? ఏం జరిగింది? 
ఏం చెప్పారు? ఏం జరిగింది? నోట్లరద్దు దేశానికి ఏం మిగిల్చింది? సామాన్యుడికి ఏ అనుభవాలిచ్చింది? ఎంత నల్లధనం వెలికి తీశారు? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్పాయి? సర్కారు వాదనల్లో అసంబద్ధత ఎంత? మోడీ సర్కారు డీమానిటైజేషన్ తో తప్పులో కాలేసిందా? తగ్గిన జీడీపీ గణాంకాలేం చెప్తున్నాయి? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:01 - October 30, 2017

పునాదులు కదిలిపోతున్నాయా? అసలు ఉనికిలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోందా? ఒకనాటి వెలుగులు అంతమయినట్టేనా? సైకిల్ ఫ్యూచర్ లో ఒక రాష్ట్రానికే పరిమితం కాబోతోందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ  ఫ్యూచరేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. అనూహ్య పరిణామాలు.. రేవంత్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో టీడీపీ ఇక నామ మాత్రమే అనే వాదనలు. మిగతా నేతలు, కేడర్ కూడా పార్టీ మారుతున్నారనే వాదనలతో పార్టీ వర్గాల్లో అయోమయం.. గత కొన్నాళ్లుగా జరుగుతున్ పరిణామాలకు ఇప్పుడు ఓ ముగింపు వచ్చినట్టయిందా? రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోవటంతో టీటీడీపీ గట్టి దెబ్బ తింటోందా? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:20 - October 26, 2017

పోలవరానికి పీటముడి ఎందుకు పడింది? కాంట్రాక్టర్ ను మార్చాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఎందుకు ఆగిపోయాయి. పనులు ఆగిపోతే ప్రభుత్వం సైలెంట్ గా ఎందుకు చూస్తోంది. కొత్త టెండర్ల అవసరమేంటి? అంచనా వ్యవయం పెంచాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇవన్నీ పోలవరం చుట్టూ ఉన్న అనేక ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలేమిటి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. పోలవారం పోలవారం అంటూ సోమవారాన్ని పిలుస్తున్న సర్కారు ఎంతో శ్రద్ధతో సనులు చేయిస్తుందనుకున్నారు. కానీ, అంతిమంగా దాన్ని పోలభారంగా మారుస్తున్నారన్న సంగతి ఇప్పుడు తేలుతోంది. మరి ఈ పరిస్థితుల మధ్య 2019కల్లా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలున్నాయా? 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:21 - October 23, 2017

ఈ భూమిపై మానవ జాతి అడుగులకి ఎన్నేళ్ల వయసుంటుంది? దీనికి రకరకాల ఆధారాలు వెతికి అందాజుగా ఓ అంకె చెప్పగలరు సైంటిస్టులు.. మరి మానవజాతి ఈ భూమ్మీద ఇంకా ఎంత కాలం బతుకుతుంది? చెప్పగలరా? మహా అయితే ఓ వెయ్యేళ్లు మాత్రమే అంటున్నారు సైంటిస్టులు. అవును మరి... పక్కలో బాంబును పెట్టుకుని, పీలిస్తే చచ్చేంత ప్రమాదకర వాయువుల్ని నింపుకుని, తాకితే నాశనమయ్యే రసాయనాల్ని పోగేసుకుని, భూమిని వేలసార్లు భస్మీపటలం చేయగల అణ్వాయుధాలతో దేశాన్ని నింపుకుంటుంటే వెయ్యేళ్లదాకా ఎందుకు ...ఇంకా ముందే సర్వనాశనం జరగొచ్చు.. ఇదే మాట చెప్తున్నారు.. సైంటిస్టులు.. బతకాలనే ఆలోచన ఉంటే ఇంకో గ్రహాన్ని వెతుక్కోమని సలహా కూడా ఇస్తున్నారు.. కూర్చున్న కొమ్మని నరుక్కోవటం అనే మాట చాలా సార్లు వినే ఉంటారు.. ఇప్పుడు అనేక ప్రపంచ దేశాలు అదే పని చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకర విష రసాయనాలు అణ్వాయుధాలు, జీవాయుధాలు పోగేసుకుని తమదే పై చేయి అని మూర్ఖంగా నవ్వుకుంటున్నాయి. కానీ, తాము కూడా ఈ పోటీలో అంతమౌతామనే నిజాల్ని విస్మరిస్తున్నాయి.

జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించకుంటే.. భూమిపై మానవ జీవనం మరో వెయ్యేళ్లకు మించి ఉండదని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇప్పటికే హెచ్చరించాడు. సాంకేతిక అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవలంబిస్తున్న దుందుడుకు చర్యల వల్ల భవిష్యత్తులో అణు, బయోలాజికల్‌ యుద్ధాలు తప్పవని చెప్పాడు.

విషరసాయనాలు, బయో ఆయుధాలు ఎక్కడ తయారవుతున్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? పనికొచ్చే పరిశోధనలు చేస్తున్నట్టుగా చెప్తూ అండర్ గ్రౌండ్ లో వినాశన కారకాలను తయారు చేస్తున్నారా? అగ్రరాజ్యాల శాస్త్ర సాంకేతిక పరిశోధనలు వినాశనకారకాలుగా మారుతున్నాయా? ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాలు అమెరికా ల్యాబుల్లో తయారయ్యాయా? భవిష్యత్‌లో అణు యుద్ధాలు, జీవరసాయనిక దాడులు తప్పేలా లేవని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంటున్నాడు. సాంకేతిక రంగంలో అనేక దేశాలు అవలంభిస్తున్న చర్యల వల్ల ఈ తరహా యుద్ధాలు తప్పేలా కనిపించడం లేదంటున్నాడు. మరోపక్క అనూహ్యంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ , భూమిపైన అనేక జాతులు అంతరించిపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేషన్ వెరసి మనిషి తన తోకకు తానే నిప్పంటికుంటున్నాడన్నది ఇక్కడ సారాంశం..

ఊరికే ఉన్న ప్రాణానికి ఉరేసుకోవటం అనే మాట ఎప్పుడన్నా విన్నారా? ఇది మానవుడి అభివృద్ధి పరిణామానికి సరిగ్గా వర్తిస్తుంది. పనికొచ్చే ఆవిష్కరణల మాట తర్వాత.. నిండా ముంచే అనేక ప్రమాదాలను మాత్రం తయారు చేసిపెట్టుకున్నాడు. తన వినాశనానికి తానే కారకుడౌతున్నాడు. ఈ లోగా ఏ గురుగ్రహానికో మనుషులు కొందరు షిఫ్టవకపోతే... ఈ భూమిపై మనిషి అనేవాడు త్వరలో చరిత్ర అవ్వకతప్పదు...ఇదీ సైంటిస్టుల మాట. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - wide angle