women

13:04 - October 18, 2018

ఢిల్లీ : దేవభూమిగా చెప్పుకునే కేరళ అట్టుడుకుతోంది. శబరిమలలో మహిళల ప్రవేశం విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థిలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తామని ప్రకటించిన అంశంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోను మహిళలను ప్రవేశించనివ్వం అని రోడ్లపైనా..శబరిమలకు వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలలో జరుగుతున్న అంశాలను కవర్ చేసేందుకు వచ్చిన న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ సుహాసినీ రాజ్, శబరిమలకు వెళ్లాలన్న ప్రయత్నం విఫలమైంది. ఆమెను అడ్డుకున్న నిరసనకారులు, రాళ్లను విసిరి తరిమికొట్టారు. తన సహచరుడైన ఓ విదేశీయుడితో కలసి ఆమె పంబ గేట్ వేను దాటుతున్న సమయంలో పెద్దఎత్తున నిరసనకారులు, ముఖ్యంగా మహిళలు ఆమెను అడ్డుకున్నారు. అప్పటివరకూ సుహాసినీకి రక్షణగా వచ్చిన పోలీసులు సైతం చేతులెత్తేయడంతో, వారిద్దరూ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. 

Image result for suhasini rajతాను దేవాలయంలోకి వెళ్లి దేవుడిని దర్శించుకునేందుకు రావడం లేదని, కేవలం రిపోర్టింగ్ చేయడానికి మాత్రమే వచ్చానని అమె చెబుతున్నా, నిరసనకారులు ఎవరూ వినలేదు.భక్తులు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. మార్గమధ్యంలో కూర్చుని నినాదాలు చేశారు. రాళ్లు విసిరారు. ఇక ఆమెకు వెనుదిరగడం మినహా మరో మార్గం కనిపించలేదు. కాగా శబరిమలలో నిన్న గర్భగుడి తలుపులు తెరచుకోగా, ఇంతవరకూ నిషేధిత వయసులో ఉన్న ఏ మహిళా స్వామిని దర్శించుకోలేకపోవటం గమనించాల్సిన విషయం. 

15:03 - October 17, 2018

ఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తన స్టైల్లో స్పదించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత ఈరోజు శబరిమల ఆలయం తెరుచుకుంటున్న నేపథ్యంలో పలువురు మహిళలు స్వామి దర్శనానికి వస్తారనే సమాచారంతో కేరళలోని కొన్ని సంఘాలవారు మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్న క్రమంలో కేరళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Image result for triple talaq supreme courtఈ అంశంపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తు..శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఆలయంలోకి మహిళలు వెళ్లకూడదు, అది సంప్రదాయానికి విరుద్ధం అని మీరు అంటున్నారు. ఆ రకంగా ఆలోచిస్తే ట్రిపుల్ తలాక్ కూడా ఒక మత సంప్రదాయమే. ట్రిపుల్ తలాక్ ను నిషేధించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ఆ సందర్భంగా ఎవరైతే హిందువులు వారి సంతోషాన్ని వెలిబుచ్చారో... ఇప్పుడు వారే రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు?  అని ప్రశ్నించారు. 

Image result for supreme court sabarimala judgement
శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా అడ్డుకోవాలనుకోవడం సరైంది కాదని..ఇది హిందూ పునరుజ్జీవనానికి, తిరోగమనానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఈ అంశాన్ని అభివర్ణించారు. పుట్టుక ద్వారానే కులం సంక్రమిస్తుందని ఎక్కడ రాశారని ప్రశ్నించారు. హిందూ శాస్త్రాలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

16:42 - October 16, 2018

కేరళ : శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిననాటినుండి ఈ అంశంపై కేరళ అట్టుడుకుతోంది. సుప్రీం తీర్పును నిరసిస్తు కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. ఈ వేడి చల్లారకముందే సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ కేరళ ప్రభుత్వానికి మరో ఝలక్ ఇచ్చింది. తాను రేపు శబరిమలకు వస్తున్నానని..నా రక్షణ బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని అగ్నికి ఆజ్యం పోసింది. కాగా మహిళలకు ప్రవేశం లేని ఆలయాల్లో ప్రవేశం కోరుతూ, సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, పోలీసుల సాయంతో ఆలయాల్లోకి వెళ్లి పూజలు చేసి వస్తున్న హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్, రేపు శబరిమలకు వస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. 
సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని, తాను అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు రేపు అంటే బుధవారం నాడు వెళుతున్నానని ప్రకటించారు. కాగా తన రక్షణ బాద్యత కేరళ ప్రభుత్వం వహించాలన్నారు. కేరళలో జరుగుతున్న నిరసనల గురించి తాను పట్టించుకోబోనని, ఓ వర్గం వారు చేస్తున్న నిరసనలు కోర్టు తీర్పులను అడ్డుకోలేవని తృప్తీ దేశాయ్ మరోసారి స్పష్టం చేశారు. 
కాగా, తృప్తీ దేశాయ్ చేసిన ప్రకటన గురించి తెలుసుకున్న కేరళ సంఘాలు మరింతగా మండిపడుతున్నాయి. అమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం వద్దకు వెళ్లనివ్వబోమని..ఆమెను అడ్డుకునేందుకు ఆత్మహత్య కూడా చేసుకుంటామని హెచ్చరించారు. కేరళ మహిళల మనోభావాలను దెబ్బతీయకుండా తృప్తీదేశాయ్ వెనక్కు వెళ్లిపోవాలన్నారు. కాగా తృప్తీ తన నిర్ణయం మార్చుకోకుంటే ఆమె తీవ్ర పరిణామాలను  ఎదుర్కోవాల్సిందేనని మహిళలు హెచ్చరించారు. కాగా లంచగొండితనం, స్త్రీల అసమానత, గృహహింస, అధికార దుర్వినియోగం మొదలగు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకర్త తృప్తీ దేశాయ్  పదవ తరగతిలోనే సామాజిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టింది. కాగా ఆమె  ఇటీవల శనిసింగణాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం ఉదంతంతో మరింత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ప్రస్తుతం వున్న పరిస్థితుల రీత్యా తృప్తీ ఎంట్రీతో ఎటువంటి పరిణామాలు సంభవించనున్నాయో వేచి చూడాల్సిందే.

15:36 - October 16, 2018

నల్గొండ :  చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం. క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు పరిపాలించిన ఇక్ష్వాకుల వైభవాన్ని చాటిన ప్రాంతం. శాతవాహన, ఇక్ష్వాకులు, రాష్ట్రకూటులు, విష్ణుకుండిన, చాళుక్య, కాకతీయ, పద్మనాయక, కుతుబ్‌షాహీ, ఆసఫ్‌ జాహీ వంటి పలు చారిత్రక పాలనలను రుచి చూసిన జిల్లా నల్లగొండ ప్రాంతం. అంతేకాదు ఆధునిక రాజకీయ పరిపాలన అంతటికీ ఈ జిల్లా  ఒక ప్రదర్శనశాలవంటిది.  మహాకవులు, పోరాటయోధులు, సాహితీవేత్తలు పుట్టిన గడ్డ నల్గొండ గడ్డ.
జిల్లా పుట్టు పూర్వోత్తరాలు..
గ్రంథాలయ ఉద్యమాలకు, భూదానోద్యమాలకు, తెలంగాణా సాయుధ పోరాటాలకు, విప్లవోద్యమాలకు పుట్టినిల్లయిన నల్గొండ జిల్లా ఎన్నెన్నో మార్పులతో 1905లో ప్రత్యేకంగా ఏర్పడింది. పట్టణం ప్రాచీన నామం నీలగిరి. రెండు నల్లరాతి కొండల నడుమ ఉన్న ప్రదేశం కావడంతో దీనికి నీలగిరి అని పేరు వచ్చింది. నీలగిరి క్రమంగా నల్లకొండ.. నల్లగొండ... నల్గొండగా స్థిరపడింది. 1961 దాకా జిల్లా సరిహద్దుల్లో  ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనతరం తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పాలనలో కూడా కొత్త జిల్లాల ఏర్పటులో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా నల్లగొండ నుంచి సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు అవతరించాయి. 

నల్గొండ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
నియోజకవర్గం మహిళలు ఫురుషులు
నల్గొండ 1,06,989  1,04,780 
నాగార్జునసాగర్ 1,02,841  1,01,769 
మిర్యాలగూడ 1,04,023  1,01,817 
హుజూర్‌నగర్  1,10,581 1,08,104 
సూర్యాపేట 1,02,506 1,00,850 
కోదాడ 1,07,564  1,04,780 

రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఇటీవల ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఓటరు జాబితాలో పూర్వ నల్గొండ జిల్లాలోని పన్నెండింటిలో సగం స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువున్నారు. అయినా.. వారికి ఆ సెగ్మెంటుల్లో పోటీచేసే అవకాశం నామమాత్రంగానే ఉంది. నల్గొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఒక్క కోదాడలో మినహాయిస్తే ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలే కాదు చిన్న పార్టీలు కూడా మహిళలకు టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖత చూపించకపోవడం గమనార్హం.   కమ్యూనిస్టుల ప్రభావం అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువగా పోరాటాలు సాగేవి. చైతన్యం వెల్లివిరిసేది. అయినా మహిళలకు రాజకీయాల్లో ఎమ్మెల్యే తరహా పదవులను చేరుకోవడం కష్టంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని నాగార్జునసాగర్, మునుగోడు, మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఒక్కరు కూడా మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికకాకపోవడం గమనార్హం. మహిళలు ఎన్నికకాని ఆరు నియోజకవర్గాల్లో నాలుగింటిలో మహిళ ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారని తాజాగా ప్రకటించిన ఓటరు జాబితాలో వెల్లడించడం తెలిసిందే. 

 

11:50 - October 16, 2018

కేరళ : శబరిమలలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ కొనసాగుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఓవైపు రాష్ట్రంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతుండగా.. ఈరోజు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సమావేశం కానుంది. నెలవారీ పూజల కోసం రేపు ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే అంశంపై బోర్డు చర్చించనుంది. 

ఇదిలావుంటే.. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుపై ఆందోళనలు ఉధృతస్థాయికి చేరాయి. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గత వారం ప్రారంభించిన భారీ ర్యాలీ కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంది. మరోవైపు రేపు ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. 

ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు హిందూ సంఘాలు కూడా సుప్రీంతీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకోబోమని వెల్లడించింది. అయితే.. మహిళల ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నందుకు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇలాంటి తరుణంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

 

13:38 - October 11, 2018

కేరళ : శబరిబలలో మహిళల దర్శనం విషయంలో వివాదాలు కొనసాగుతునేవున్నాయి. మహిళలు కూడా శబరిమల స్వామి దర్శనానికి వెళ్ళవచ్చుఅంటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేరళ సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆలయాలకు వెళ్లేది భక్తితో కాదని, అంగాంగ ప్రదర్శనతో పురుషులను ఆకట్టుకోవడానికే వారు ఆలయానికి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అలా చూసి ఆనందించడానికే పురుషులు కూడా ఆలయానికి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆలయాల్లోని కోనేరులో స్నానం చేసే మహిళలు తడిసిన దుస్తులతో అంగాంగ ప్రదర్శనకే మొగ్గు చూపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Image result for sabarimala temple in supreme court

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తిరుగుబాటుకు ఆరెస్సెస్, కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఎంపీ  శ్రీమతి ఆరోపించారు. సుప్రీం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న శ్రీమతి.. సమానత్వ హక్కును ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు. 

కేరళలోని అనేక సామాజిక దురాచారాలను కమ్యూనిస్టు పార్టీ రూపుమాపిందని శ్రీమతి అన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను ఇంత ఘోరంగా అవమానించడమేంటంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తక్షణం ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఎంపీ శ్రీమతి ఎలా స్పందిస్తారో చూడాలి.
 

11:08 - October 2, 2018

కేరళ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు నేపథ్యంలో ఆలయ బోర్డు మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పంపానది వద్ద మహిళల కోసం ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక టాయిలెట్లు, బస్సుల్లో మహిళలకు సీట్లలో రిజర్వేషన్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం బోర్టు సన్నాహాలు చేస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పంపానది నుంచి సన్నిధానం వరకు ఉన్న అడవి మార్గంలో లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేశన్‌ వెల్లడించారు. మహిళల కోసం ‘మహిళా మిత్ర’ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని, నీలక్కల్-పంప మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామని పేర్కొన్నారు. అయితే, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయడం అసాధ్యమని, కాబట్టి వారు పురుషులతో కలిసే వెళ్లాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
 

 

15:10 - September 30, 2018

విజయనగరం : ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు వాగ్ధానాల పర్వం ఏపీలో కూడా ఊపందుకుంది. మహిళా ఓటు బ్యాంకులను ఆకర్షించేందుకు నేతలు వాగ్ధానాల పరంపర కొనసాగుతోంది. గన ఎన్నికల్లో విజయం చేతివరకూ వచ్చి చేజారిపోయిన జగన్ రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో మహిళలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, మరో కీలక హామీ ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి అక్కకూ రూ. 75 వేలను నాలుగు దఫాలుగా అందిస్తానని హామీ ఇచ్చారు. కోరుకొండ వద్ద తనను కలిసిన విశ్వబ్రాహ్మణులతో మాట్లాడిన ఆయన, వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈ పథకాన్ని అమలు చేయిస్తానని, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళ ఏ ఇంట ఉన్నా, వారికి డబ్బు అందించేలా చర్యలు చేపడతానని అన్నారు. విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, బంగారం వ్యాపారంలో కార్పొరేట్లను తగ్గిస్తూ, తాళిబొట్లను కేవలం విశ్వబ్రాహ్మణులే తయారు చేసేలా చట్ట సవరణ తీసుకువస్తానని అన్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని, జీవో 272లోని అభ్యంతరకర క్లాజులను తొలగిస్తానని చెప్పారు.

 

14:05 - September 28, 2018

కేరళ : శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునన్న సుప్రీం కోర్టు తీర్పుపై ఆలయ ప్రతినిధుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. అయ్యప్ప ఆలయం ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్పందిస్తూ ‘కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, అమలు చేస్తాం కూడా.. కానీ థార్మిక అంశాలతో ముడిపడివున్న సమస్యపై  కోర్టు ఇచ్చిన తీర్పు సహేతుకంగా లేదు’ అని వ్యాఖ్యానించారు.
సుప్రీం తీర్పుపై భిన్నాభిప్రాయాలు..
శబరిమలలో మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసులో శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మహిళలకు అనుమతిపై నిషేధం ఎత్తివేస్తూ తీర్పును ప్రకటించింది. 4-1 తేడాతో తీర్పును ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. దీనితో పలువురు సుప్రీంను తీర్పును స్వాగతించారు.
తీర్పు ప్రతి అందాక సమగ్రంగా పరిశీలించి నిర్ణయం : ఎ.పద్మకుమార్‌ 
ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్‌ స్పందిస్తూ తీర్పు ప్రతి అందాక సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని కొనసాగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. ‘మా విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక మాకు మరో మార్గం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
చట్టాలు..సమాజం అందరినీ గౌరవించాలి : జస్టిస్ దీపక్ మిశ్రా 
చట్టాలు..సమాజం అందరినీ గౌరవించాలని జస్టిస్ దీపక్ మిశ్రా వెల్లడించారు. ఆలయాల్లో లింగ వివక్షకు తావులేదని, పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువేమి కాదని వ్యాఖ్యానించారు. ఓవైపు దేవతలను పూజిస్తూనే మరోవైపు మహిళలను సమదృష్టితో చూడకపోవడం సరికాదని పేర్కొన్నారు. మహిళలను దేవతలుగా పూజించే దేశం మనదని, మహిళల నిషేధమనేది హిందూ మత స్వేచ్చకు భంగం కలిగిస్తుందని తెలిపారు. మతమనేది ప్రాథమిక జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు - పురుషులపై లేని వివక్ష మహిళలపై ఎందుకు? - ప్రైవేటు ఆలయాలు ఉండవు.. ఎవరైనా వెళ్లొచ్చు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో కీలకవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శబరిమల ఆలయంలో పూజలు చేయడానికి మగవారిపై లేని వివక్ష ఆడవారిపై ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్కడ పూజలకు స్త్రీలు అర్హులేనని వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలోకి 10-50 ఏండ్ల మధ్య వయసు మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం తీర్పుపై భిన్నవాదనలు కొనసాగుతున్నాయి.

 

16:09 - September 25, 2018

వరంగల్‌ : స్త్రీలకు చీరలపై మక్కువ ఎక్కువని అందరికీ తెలిసిందే. డబ్బులుండాలి కానీ తమకు ఇష్టమైన చీర తీసుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. సాధారణంగా ఒక చీర ధర 200 వందల నుండి ఆపైన ఉంటుంది. కేవలం 3 రూపాయలకే ఒక చీర అమ్ముతున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. అది ఎక్కడో కాదు..వరంగల్‌లో. వరంగల్‌లోని కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌ తెలుసా..? ఆ మాల్‌లోనే కేవలం 3 రూపాయిలకే ఒక చీర ఇస్తున్నారంట. 

3 రూపాయల చీరను సొంతం చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున్న షాప్‌కు పోటెత్తారు. దీంతో కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అధిక సంఖ్యలో మహిళలు రావడంతో పరిస్థితిని అదుపు చేయలేక షాపింగ్‌ మాల్‌ సిబ్బంది పోలీసులకు ఫోన్‌ చేశారు. షాపింగ్‌ మాల్‌ను మూసివేశారు. ఆఫర్లు ప్రకటించి, షాపింగ్‌ మాల్‌ మూసివేయడంపై మహిళలు తిరగబడ్డారు. ఏం చేయాలో తోచక పోలీసులు కూడా చేతులెత్తేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - women