YCP

14:40 - October 11, 2018

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఆయన పార్టీలో చేరితే కృ‌ష్ణా, గుంటూరు జిల్లాలో సామాజిక సమీకరణాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కానీ నాలుగేళ్లుగా పవన్‌తో నాదెండ్ల మైత్రి పూర్వక సంబంధం కొనసాగిస్తున్నారు. పవన్ నిర్వహించే సభలు..సమావేశాలకు మనోహర్ సూచనలు చేస్తున్నారు. జనసేన భావజాలం, పవన్ వ్యక్తిత్వం..నాదెండ్ల నిర్ణయానికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కులాల మధ్య సఖ్యత పెంచాలని ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉందనే చెప్పవచ్చు. అంతేగాకుండా జనసేనకు దూరంగా ఉన్న సామాజిక వర్గాన్ని అక్కున్న చేర్చుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నాదెండ్ల మనోహర్ వ్యక్తిగతంగా వివాదరహితుడిగా పేరొందారు. మరి నాదెండ్ల ఎంతమేరకు సక్సెస్ అవుతారు ? ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

15:10 - September 30, 2018

విజయనగరం : ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు వాగ్ధానాల పర్వం ఏపీలో కూడా ఊపందుకుంది. మహిళా ఓటు బ్యాంకులను ఆకర్షించేందుకు నేతలు వాగ్ధానాల పరంపర కొనసాగుతోంది. గన ఎన్నికల్లో విజయం చేతివరకూ వచ్చి చేజారిపోయిన జగన్ రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో మహిళలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, మరో కీలక హామీ ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి అక్కకూ రూ. 75 వేలను నాలుగు దఫాలుగా అందిస్తానని హామీ ఇచ్చారు. కోరుకొండ వద్ద తనను కలిసిన విశ్వబ్రాహ్మణులతో మాట్లాడిన ఆయన, వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈ పథకాన్ని అమలు చేయిస్తానని, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళ ఏ ఇంట ఉన్నా, వారికి డబ్బు అందించేలా చర్యలు చేపడతానని అన్నారు. విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, బంగారం వ్యాపారంలో కార్పొరేట్లను తగ్గిస్తూ, తాళిబొట్లను కేవలం విశ్వబ్రాహ్మణులే తయారు చేసేలా చట్ట సవరణ తీసుకువస్తానని అన్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని, జీవో 272లోని అభ్యంతరకర క్లాజులను తొలగిస్తానని చెప్పారు.

 

13:38 - September 22, 2018

నెల్లూరు : వైసీపీకి అసంతృప్తికి సెగ తగులుతోంది. నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. జిల్లా జెడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం దక్కక ఆత్మగౌరవం కోసం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి మాట్లాడుతూ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఒక డిక్టేటర్ అని విమర్శించారు. జగన్ చెప్పిందే వేదం, ఆయన చెప్పినట్లే నడుచుకోవాలని, అలాంటి పార్టీలో తాను ఉండలేనని చెప్పారు. డబ్బులు పెట్టే వారికే పార్టీలో ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. అయితే పార్టీ మారే విషయంలో బొమ్మిరెడ్డి స్పష్టత ఇవ్వలేదు. 

 

09:27 - September 19, 2018

కృష్ణా : బెజవాడ వైసీపీలో అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ సీటు వ్యవహారం...వైసీపీలో దుమారం రేపుతోంది. వంగవీటి రాధాను సెంట్రల్ నుంచి తూర్పు నియోజకవర్గానికి మార్చారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న రాధా...అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు రాధాకు ఎలాంటి అన్యాయం జరగలేదని...అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కృష్టా జిల్లాలో తాజాగా జ‌రిగిన నాయ‌క‌త్వమార్పులు పార్టీ నేత‌ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నాయి. 

బెజవాడ వైసీపీలో...సీట్ల కేటాయింపు లొల్లి మొదలైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాలని భావిస్తోన్న వైసీపి అధినేత జ‌గ‌న్... పార్టీలొ నూత‌న మార్పులు చేప‌డుతున్నారు. ఈ మార్పుల‌ను కృష్టా జిల్లా నుంచే ప్రారంభించారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌క్కు సీట్లు రావ‌డంతో కృష్టా జిల్లాపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. విజ‌య‌వాడ‌ సెంట్ర‌ల్ తో ప్రారంభ‌మైన నాయ‌క‌త్వ మార్పు.. ఈస్ట్, వెస్ల్ లను కూడా తాకింది. సెంట్రల్ నియోజ‌క‌ర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి వంగ‌వీటి రాధాను త‌ప్పించిన అధిస్టానం... ఆ స్టానాన్ని మ‌ల్లాది విష్టుకు అప్పగించింది. విజయవాడ సెంట్రల్‌ సీటు గెలిపించుకుంటామని.. బ్రాహ్మణ సంఘాలు అడిగినందునే టికెట్ మల్లాది విష్ణుకు ఇచ్చామని అంబటి తెలిపారు. 

విజయవాడ సెంట్రల్ సీటు...మల్లాది విష్ణుకు కేటాయించడంతో వంగవీటి రాధా శిబిరంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సెంట్రల్ సీటును రాధాకే కేటాయించాలంటూ....ఆయన అనుచరులు రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం తూర్పు నియోజకవర్గానికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. పార్టీ నిర్ణయంపై అసంతృప్తికి లోనైన వంగవీటి రాధా...అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తూర్పు ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచ‌లి ర‌వి ఉన్నారు. ఇటీవ‌లే యలమంచలి రవి వైసీపీలో చేరడంతో....సీటు విషయంలో రాధా, రవి ఇద్దరూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నియోజ‌క‌ర్గాల మార్పుల విష‌యంలో పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌ర్గంలో కూడా నాయ‌కత్వ మార్పులు చేయాలని పార్టీ నిర్ణయించింది. వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ను త‌ప్పించి...పోతిన ప్రసాద్ కు ఇవ్వాల‌ని పార్టీ నిర్ణయించింది. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

విజ‌య‌వాడ ప‌రిస్తితి ఇలా ఉంటే.. జిల్లాలో మ‌రో రెండు నియోజ‌క‌ర్గాల్లోనూ ఇలాంటి మ‌ర్పులే చోటుచేసుకున్నాయి. పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల జ‌రిగిన మార్పులు నేత‌ల‌కు ఇబ్బందిగా మారింది. పెడ‌న‌లో ఉప్పాల రామ్ ప్ర‌సాద్ ఇంచార్జ్ గా ఉన్నారు. అయితే ఇటీవ‌ల జోగి ర‌మేష్ ను పెడ‌న ఇంచార్జ్ గా నియమించింది పార్టీ అధిష్టానం. దీంతో ఉప్పాల శిభిరంలో రగిలిపోతోంది. అటు అవనిగడ్డలో కూడా ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నాయ్. ప్రస్తుతం అవనిగడ్డ ఇన్ చార్జ్ గా ఉన్న సింహాద్రి రమేశ్ ను తప్పించి....బందరు పార్లమెంట్ ఇన్ చార్జ్ గాఉన్న బాలశౌరికి బాధ్యతలు అప్పగించింది. దీంతో సింహాద్రి ర‌మేష్ లో అలకబూనారు. మెత్తానికి కృష్ణా జిల్లా వైసీపీలో అసంతృప్తి...సెగలు పుట్టిస్తోంది. పార్టీలో చోటుచేసుకున్న మార్పులల‌తో... నేత‌లు ఇబ్బందుల‌ పాలవుతున్నారు. మ‌రి జిల్లా పార్టీలో ముస‌లంపై పార్టీ ఎలాంటి స‌ర్దుబాటు చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి...

07:38 - September 17, 2018

విజయవాడ : ప్రశాంత్ కిశోర్ ...ఎలక్షన్ గురుగా పేరు పొందారు. వివిధ రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. వెనుకనుండి పార్టీలను నడిపించిన ఈ వ్యక్తి ప్రస్తుతం రాజకీయ నేతగా మారిపోయారు. జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. దీనికంటే ముందు వైసీపీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో ఆయన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంమైంది. కానీ  ఆయన జేడీయూలో చేరడంతో ివైసీపీకీ వ్యూహకర్తగా ఉంటారా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది....

ఇక ప్రశాంత్ కిశోర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే...ప్రశాంత్ కిశోర్ స్వస్థలం బీహార్‌లోని సాసారం. గతంలో ఐక్యరాజ్యసమితిలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా ఈయన పని చేశారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) వ్యవస్థాపక సభ్యుల్లో కూడా పని చేశారు. అనంతరం రాజకీయ వ్యూహకర్తగా మారిపోయారు. 2015 బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తరపున పని చేసి విజయం సాధించారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా ఉండి..కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. కానీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పని చేసి విఫలమయ్యారు. 

ఏపీ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ప్రతిష్ట పెంచేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేది పీకేనంటూ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత ఇండియన్ యాక్షన్ టీం పేరుతో పీకే టీం హల్ చల్ చేసింది. జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర ద్వారానే నవరత్నాలను ప్రచారం చేయడంలో పీకే టీం కీలక పాత్ర పోషిస్తోంది. కానీ అనూహ్యంగా ఆయన జేడీయూ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీకి వ్యూహాలు రచిస్తారా ? లేదా ? అనేది చర్చ జరుగుతోంది. 

2019 ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి ఆఫర్్స వచ్చినట్లు టాక్. కానీ ప్రాంతీయ పార్టీలో చేరితే రాజకీయంగా ఎదగవచ్చని ప్రశాంత్ యోచించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షాలైన జేడీయూ, బీజేపీ మధ్య  ఎంపీ సీట్ల పంపకాపై చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి ? తదితర కొన్నింటిపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ జేడీయూలో చేరడంతో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

11:35 - September 11, 2018

విజయవాడ : ఏపీలో కూడా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ రాజకీయ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తాజాగా వైసీపీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళశారం విశాఖలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సమావేశాలకు కూడా వైసీపీ గైర్హాజర్ అయ్యింది. దీనిపై టిడిపి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వేతనాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా...ప్రజా సమస్యలపై చర్చించకుండా వైసీపీ నాటకాలు ఆడుతోందని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. దీనితో సంచలన నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు. మూకుమ్మడిగా ఎమ్మెల్యెలు రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందని సమావేశంలో చర్చించనున్నారు. కానీ దీనిపై కొంతమంది ఎమ్మెల్యేలు విబేధిస్తున్నట్లు సమాచారం. మరి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

08:41 - September 6, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరుగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ లేకుండానే మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు సమావేశాలకు హాజరుకాకూడదని వైపీపీ సభ్యులు నిర్ణయించుకున్నారు. గతంలో రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ గైర్హాజరైంది. ఈసారి కూడా మళ్లీ అదే నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షం గైర్హాజరవుతుండడంతో.. ఆ పాత్రను తామే పోషిస్తామని అధికారపక్షం అంటోంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరిపై సభావేదికగా టీడీపీ ఎండగట్టేందుకు సిద్ధమవుతుంటే.. రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఖర్చులపై బీజేపీ ఎదురుదాడికి సిద్ధమవుతోంది. 8 నుంచి 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 
ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గత రెండు పర్యాయాలు శాసనసభను బహిష్కరించిన వైసీపీ ఈ సారి కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. అటు అధికారపక్షం మాత్రం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభలో స్పష్టంగా చెప్పాలని నిర్ణయించుకుంది. గత రెండు సమావేశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లే, ఈ సారి కూడా చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను ఆదేశించారు. 
మిత్రపక్షంలో ఉన్న బీజేపీ, ఇప్పుడు వైరి పక్షం 
గతంలో మిత్రపక్షంలో ఉన్న బీజేపీ, ఇప్పుడు వైరి పక్షం అయ్యింది. దీంతో ఆ పార్టీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఏ సమస్యలు లేవనెత్తుతారన్నది చర్చనీయాంశమయ్యింది. బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే మాత్రం, కేంద్రంపై ఎదురు దాడికి దిగుతామంటున్నారు టీడీపీ సభ్యులు. ఎలాంటి ఆరోపణలు చేసినా, రాష్ట్ర మంత్రులుగా కేబినెట్‌లో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీయనున్నారు. ఇక ఇప్పటి వరకూ కేంద్రం చేసిన సాయం, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పథకాల అమలుపై అసెంబ్లీలో చర్చించనుంది తెలుగుదేశం పార్టీ. పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెరుగుతుండడాన్ని చర్చకు తెచ్చి, కేంద్రం పన్నులు తగ్గించాలని ఒత్తిడి తేవాలనుకొంటోంది. 
సమావేశాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష  
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సభాపతి కోడెల శివప్రసాదరావు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సభ్యులైన ప్రతి ఒక్కరూ సమావేశాలకు రావాలని ఆయన కోరారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపే విషయంలో జాప్యం చేయకూడదని ఆయన అధికారులకు దిశానిర్థేశం చేశారు. అటు, ప్రతిపక్షనేత జగన్‌ స్పీకర్‌కు లేఖ రాశారు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి మారిన 22 మంది ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే అసెంబ్లీకి వస్తామని తేల్చి చెప్పారు. స్పీకర్‌ కోడెలపైనా ఈ లేఖలో విమర్శలు చేశారు జగన్‌. స్పీకర్‌ కుర్చీకి అవమానం కలిగేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్రం సాయంపైనా చర్చకు వస్తుంది కాబట్టి ఈ సారి సమావేశాలు వాడీవేడిగానే జరిగే అవకాశం ఉంది. 

 

17:17 - September 5, 2018

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కంటే హీట్ ను పెంచుతున్నాయి. ఈ సారి కూడా వైసీపీ సభకు హాజరవుతుందా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. సమావేశాలకు హాజరుపై వైసీపీ ఓ లేఖ రాసింది. స్పీకర్ కోడెల, సీఎం చంద్రబాబు నాయుడులకు వైసీపీ నాలుగు పేజీల లేఖ రాసింది. స్పీకర్ కోడెల విజ్ఞాపన మేరకు ఈ లేఖను రాస్తున్నామని, పార్టీ ఫిరాయించిన మంత్రులను, 22 మంది ఎమ్మెల్యేలను తక్షణం తొలగించాలని లేఖలో డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, ఈ విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పామని గుర్తు చేశారు. వెంటనే వారిని తొలగిస్తే తాము సమావేశాలకు హాజరవుతామని కండీషన్ పెట్టింది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఈ అంశాలను ప్రభుత్వం, స్పీకర్ పరిష్కరిస్తారా ? అనేది వేచి చూడాలి. 

21:45 - July 25, 2018

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి నిరసన తెలిపారు విద్యార్థులు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉధృతమవుతోన్న ఏపీకి ప్రత్యేకహోదా పోరు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా పోరు ఉధృతమవుతోంది. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు మానవహారాలు నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. హామీలు అమలు చేయడం లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాత విషయమై కేంద్రం దిగొచ్చేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని వామపక్షాలు, విద్యార్థి జేఏసీ హెచ్చరించాయి. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన అంశాల హామీల అమలు చేయాలంటూ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద మానవ హారం చేపట్టారు. ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలోని క్లాక్‌ టవర్‌ వద్ద కోటి మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈ మేరకు సప్తగిరి సర్కిల్ వరకు వందలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు చేపట్టిన మానవహారం కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మద్దతు ప్రకటించారు.

విద్యార్థులు డిమాండ్..
ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంలో సిఎం చంద్రబాబునాయుడు కలిసి రావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికిచ్చిన విభజన హామీలను నెరవేర్చకపోతే బిజెపి, టిడిపిలకు తగిన బుద్ధ చెబుతామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ మేరకు విజయనగరంలో విద్యార్థి సంఘాలు, రాజకీయ, ప్రజా సంఘాల ప్రతినిధులు ధర్నా చేపట్టారు. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం ఇచ్చిన విభజనహామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. SFI, PDSU, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలు మానవహారం నిర్వహించారు.

ఒంగోలులో మానవహారం
విభజన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో విద్యార్ధి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో మానవహారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధి, యువజన జేఏసీ ఇచ్చిన కోటిమందితో మానవహారం కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో మానవహారం నిర్వహించారు. విద్యార్ధులు కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం చర్చి సెంటర్ లో మానవహారం నిర్వహించారు.

గుంటూరులో వేలాది మంది విద్యార్థులు మానవహారం
ప్రత్యేకహోదా డిమాండ్‌తో గుంటూరులో వేలాది మంది విద్యార్థులు మానవహారం నిర్వహించారు. బృందావన్‌ గార్డెన్‌ నుండి హిందూ కాలేజీ వరకు వేలాది మంది విద్యార్థులు, జేఏసీ నాయకులు ఈ మానవహారంలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక, హోదా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు విశాఖలో మానవహారం నిర్వహించారు. ఆంధ్ర ఎంపీలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే జోన్‌ విషయంలో స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని విద్యార్థులు మండిపడ్డారు.

ఎంపీ హరిబాబుపై నిరసన
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేజోన్‌ తీసుకురావడంలో విశాఖ ఎంపీ హరిబాబు విఫలమయ్యారని జన జాగృతి సమతి సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు జన జాగృతి సమితి సభ్యులు చెవిలో పువ్వులు పెట్టుకొని విశాఖ జీవీఎంసీ వద్ద నిరసన తెలిపారు. తక్షణమే హరిబాబు ఎంపీ పదవికి రాజీనామా చేసి రైల్వే జోన్‌ కోసం పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు. 

12:10 - July 25, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా కోరుతూ మొదటి నుండి ఆందోళన చేపడుతున్న వామపక్షాలు మరోసారి నిరసనలు చేపట్టాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద మానవహారం నిర్వహించింది. ఇందులో సీపీఐ, సీపీఎం, వైసీపీ, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు టెన్ టివితో మాట్లాడారు. కేంద్రం దిగగొచ్చే వరకు హోదా కోసం పోరాడుతామన్నారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కూడా మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - YCP