YCP leaders

13:31 - November 16, 2018

విజయవాడ : ఏపీలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సీబీఐ విచారణకు ప్రభుత్వం భయపడే సాధారణ సమ్మతి నోటిఫికేషన్ వెనక్కి తీసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. నాలుగేళ్ల కాలంలో పలు అక్రమాలు జరిగాయని..ఎంతో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో సీబీఐకు అనుమతించిన కన్సెంట్‌ను విరమించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15వ తేదీ గురువారం సంచలన నిర్ణయం తీసుకొంది. 
ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయంపై నవంబర్ 16వ తేదీ శుక్రవారం వైసీపీ స్పందించింది. రాజధాని భూ సేకరణ...పోలవరం...పట్టిసీమ, మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని గత కొంతకాలంగా వైసీపీ ఆరోపిస్తోంది. అంతేగాకుండా విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ సరిపోదని, సీబీఐ విచారణ చేయించాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా అగ్రిగోల్డ్..ఉపాధి హామీ పథకంలో భారీగా జరిగిన స్కాం..రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు - మీరు పథకంలో కూడా అవకతవకలు జరిగాయని పేర్కొంటోంది. జగన్ పై జరిగిన దాడి కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 
వీటన్నింటిపై తాము సీబీఐ విచారణ డిమాండ్ చేయడం జరిగిందని, విచారణలో అవినీతి ఎక్కడ బయటపడుతోందనని భయపడి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ పేర్కొంటోంది. సీబీఐ దర్యాప్తు లేకపోతే అవినీతి తారాస్థాయికి చేరుకుంటుందని వైసీపీ పేర్కొంటుంటే దీనిని ప్రభుత్వం తప్పంటోంది. సీబీఐ డైరెక్టర్ అధికారి అవినీతిలో ఇరుక్కపోయారని..దీనితో సీబీఐపై నమ్మకం లేదని..నిజాయితీగా పనిచేయడం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు కలుగవని ఏపీ సర్కార్ వెల్లడిస్తోంది. 

13:38 - November 3, 2018

హైదరాబాద్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవడంపై రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ భేటీపై పలు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆనాడు కాంగ్రెస్ ను విమర్శించిన బాబు నేడు కలవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. శనివారం ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి మౌనదీక్ష చేపట్టారు. 
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందని, కానీ బాబు సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని, నాలుగేళ్లపాటు బీజేపీ ప్రభుత్వంతో అంటకాగి, ఎన్నికల ముందు కాంగ్రెస్ తో జతకట్టడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నారని, దీనిపై న్యాయపోరాటం చేసే అవకాశాలుంటే పరిశీలిస్తానన్నారు. 

14:34 - October 25, 2018

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరగడం సంచలనం సృష్టించింది. ఆయనపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. విశాఖ ఎయిర్‌పోర్టులోని వెయిటర్స్ లాంజ్‌లో జగన్ ఉండగా.. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజంకి గాయమైంది. వెంటనే ఆయనకు చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్‌కు వెళుతున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. 
ప్రభుత్వ లోపం..నిఘా వైఫల్యం కారణంగానే దాడి జరిగిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. దాడి జరిగిన అనంతరం వైసీపీ నేతలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. దాడి చేసింది శ్రీనివాస్ రెడ్డి అని, పందెం కోళ్లకు ఉపయోగించిన కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. కత్తికి విషం కూడా ఉందని తెలుస్తోందని...అసలు కత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం..సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. జగన్ హత్య చేసేందుకు పథకం రూపొందించారని, సీఎం చంద్రబాబు నాయుడికి హత్యా రాజకీయాలు చేసే పేరుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఇంకా తీవ్ర విమర్శలు...ఆరోపణలు పెల్లుబికే అవకాశం ఉంది.

11:22 - October 19, 2018

కృష్ణా : జిల్లాలో జనసేన కార్యకర్త చలమల శ్రీనివాస్‌పై వైసీపీ నేతలు దాడికి దిగడం సంచలనం సృష్టించింది. వైసీపీ నేతలు గంటుపల్లి రామకృష్ణ, శేషగిరి, షేక్ సయిదాలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చలమల శ్రీనివాస్ వెళుతుండగా దారి కాచిన ఆ ముగ్గురు రాళ్లు..మారణాయుధాలతో హత్యాయత్నానికి ఒడిగట్టారు. కిందపడేసి విచక్షణారహితంగా కట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ సమీప సీసీ టీవీ ఫుటేజ్‌‌లో రికార్డయ్యాయి. 
నందిగామలో జనసేన కార్యక్రమాలు విసృత్తమయిన సంగతి తెలిసిందే. వైసీపీకి ధీటుగా ప్రజల్లోకి ఆ పార్టీ వెళుతోంది. పార్టీ ఎదుగదలను ఓర్వలేక శ్రీనివాస్‌పై దాడికి పాల్పడినట్లు జనసేన నేతలు పేర్కొంటున్నారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని..చనిపోయానని అనుకుని వెళ్లిపోయారని శ్రీనివాస్ తెలిపారు. దాడికి పాల్పడిన అనంతరం తన వద్దనున్న బంగారం, సెల్ ఫోన్ తీసుకున్నారని వెల్లడించారు. తనపై హత్యాయత్నం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు

21:01 - August 25, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్‌ను సాంబశివరావు కలిశారు. సాంబశివరావు పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు.గతంలో సాంబశివరావు ఏపీ డీజీపీగా..ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను సాంబశివరావు ఖండించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ఫోన్ లో మాట్లాడారు. రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు.  

 

20:49 - August 25, 2018

విశాఖ : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. సాంబశివరావు పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్‌ను సాంబశివరావు కలిశారు. గతంలో సాంబశివరావు ఏపీ డీజీపీగా..ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 

 

19:42 - August 23, 2018

2019 ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజన హామీల అమలు..రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఏపీ విషయంలో బీజేపీ అవలంభించిన తీరును సవాల్ చేస్తు ఎన్డీయే ప్రభుత్వం నుండి టీడీపీ విడిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర విభజనకు కారణం కాబట్టి ఏపీని అభివృద్ధి చేసేందుకు..విభజన హామీలు కాంగ్రెస్ తోనే సాధ్యం అని కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు..రాష్ట్ర విభజన తరువాత ఏపీలోనే కాక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో మళ్లీ తిరిగి పార్టీని నిలబెట్టేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ నెరవేరుస్తామని పదే పదే కాంగ్రెస్ చెబుతోంది. అలాగే ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానాకి కాంగ్రెస్ మద్ధతునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ కాంగ్రెస్ తో 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు ఇటీవల హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఆయా పార్టీల అధిష్టానం మాత్రం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది? ఎవరి దారెటు? అనే అంశంపై 10టీవీ చర్చా కార్యక్రమం. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు రఘునాథ బాబు, టీడీపీ శాసన సభ్యులు రామకృష్ణ, జీవీ రెడ్డి పాల్గొన్నారు. 

07:12 - August 14, 2018

గుంటూరు : గురజాలలో అక్రమ గనుల పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌ అడ్డుకోలేక అమాయకులపై కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

భారీగా మోహరించిన పోలీసులు..
గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్తత నెలకొంది. గురజాలలో అక్రమ మైనింగ్‌ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేత కాసు మహేశ్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై హై కోర్టు మైనింగ్‌ ఆరోపణలు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్‌ అధికారులు గురజాలలో ఉన్న మైనింగ్‌ విలువను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మైనింగ్‌ ప్రాంతాన్ని వైసీపీ నిజనిర్దారణ కమిటీ సందర్శించి బహిరంగ సభను నిర్వహించాలని వైసీపీ నిర్ణయించుకుంది. దీనికి పోలీసులు అనుమతి కోరగా వారు నిరాకరించారు.

వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మర్రి రాజశేఖర్‌లు దాచేపల్లికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు లోపలికి దూసుకు రావడంతో కాసు మహేష్ రెడ్డి పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను అడ్డుకోవాల్సింది పోయి అక్రమాలను అడ్డుకుంటున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తుందని కాసు మహేశ్‌ రెడ్డి ఆరోపించారు.

బొత్స సత్యనారాయణ అరెస్ట్
అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజాలునిగ్గు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ మైనింగ్‌ వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ప్రమేయం ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌ ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్‌ను ఆపకపోతే భవిష్యత్‌లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

21:04 - August 11, 2018

విజయవాడ : ఈడీ కేసులో భారతి పేరు ఉందంటూ వచ్చిన వార్తలపై జగన్‌ లేఖ రాయడం మీద.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈడీ కేసులో భారతి పేరుంటే టీడీపీకి సంబంధం ఏంటిని ప్రశ్నిస్తున్నారు. అవినీతిలో కుటుంబ సభ్యులను భాగస్వాములను చేసిన జగన్‌... ఇప్పుడు పేరు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారన్నారు. ఈడీ కేసులో భారతి పేరు ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాల్సిన జగన్‌.. దీన్ని కూడా సానుభూతి పొందేందుకే యత్నిస్తున్నారన్నారు. ఈడీ కేసులో వైఎస్‌ భారతి వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్‌ బహిరంగ లేఖ రాయడంపై ఏపీ టీడీపీ నేతలు స్పందించారు. అవినీతిలో భార్యను భాగస్వామిని చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మీ భార్య నిందితురాలిగా నమోదైతే దాని ద్వారా కూడా సానుభూతి పొందాలనుకుంటే.. ప్రజల్లో అభాసుపాలు కాక తప్పదన్నారు. నీ అవినీతికి ఆమెను బాధ్యురాలిని చేసినందుకు నిన్ను నీవే ప్రశ్నించుకోవాలన్నారు. నువ్వు చేసిన పాపాలే నిన్ను, నీ కుటుంబాన్ని వెంటపడి తరుముతున్నాయన్నారు కళా వెంకట్రావు.

ఈడీ కేసులో భారతి పేరు రావడానికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు కళా వెంకట్రావు. నీ భార్యకు ఈ పరిస్థితి వచ్చినందుకు నిన్ను నువ్వే ప్రశ్నించుకోకుండా.. సీబీఐ, ఈడీనీ, కోర్టులను ప్రశ్నిస్తే లాభమేంటని అన్నారు. వేల కోట్లు అవినీతికి పాల్పడిన నీవు... దర్యాప్తు సంస్థలను, వ్యవస్థలను ఎలా ప్రశ్నిస్తున్నావన్నారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడి బెయిల్‌ తెచ్చుకున్నది వాస్తవం కాదా అని కళావెంకట్రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రకారం ఏడాదిలో విచారణ పూర్తి కావాల్సిన కేసులు... బీజేపీతో లాలూచీ వల్ల నాలుగేళ్లయినా పూర్తి కాకపోవడం నిజం కాదా ? అని ప్రశ్నించారు. కేంద్రం ద్వారా నీ కేసులను మాఫీ చేయించుకునేందుకే... నీ కేసులో ఎ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా చేయించుకోలేదా ? అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఊడిగం చేస్తూ లాలూచీ పడడం నీ నైజం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు కళా. అక్రమంగా సంపాదించిన 43 వేల కోట్ల రూపాయలు పేదప్రజలకు పంచి.. భారతి కేసుల నుండి విముక్తి చేసేందుకు ప్రయత్నించకుండా అధికారులు, కోర్టులు, పత్రికలు, టీడీపీపై నిందలు వేస్తే సానుభూతి రాదని కళా వెంకట్రావు అన్నారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ పోరాటం చేస్తుంటే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారన్నారు మంత్రి దేవినేని. గతంలో కాంగ్రెస్‌తో చేసుకున్న ఒప్పందం వల్లే.. అప్పుడు బయటపడని పాపాలన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు దేవినేని.

ఇక ఈడీ కేసులో జగన్‌ వాదన విచిత్రంగా ఉందన్నారు మంత్రి యనమల. జగన్‌ లేఖ ద్వారా అవినీతిలో కుటుంబసభ్యులకు ప్రమేయమున్నట్లు స్పష్టమైందన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలకు టీడీపీకి సంబంధం ఏంటని యనమల ప్రశ్నించారు. మొత్తానికి జగన్‌ అవినీతిపై మరోసారి టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఈడీ కేసులో భారతి పేరు ఎందుకు వచ్చిందో చూసుకోకుండా టీడీపీ, సీబీఐ, ఈడీ, కోర్టులపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే... జగన్‌పై టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

21:02 - August 10, 2018

విజయవాడ : ఈడీ కేసులో.. వైఎస్‌ భారతిని నిందితురాలిగా చేర్చినట్లు వచ్చిన వార్తలపై.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చార్జిషీట్‌ను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోకముందే.. ఈ విషయాలు ఎలా బయటకు వచ్చాయంటూ ప్రశ్నించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ చేస్తోన్న కుట్ర అని జగన్‌ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి.. వైఎస్‌ భారతిని.. ఈడీ కేసులో నిందితురాలిగా చేర్చినట్లు.. వార్తలు వచ్చాయి. దీనిపై జగన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రజలు, ప్రజాస్వామికవాదులను ఉద్దేశించి.. బహిరంగ లేఖను విడుదల చేశారు. తనపైనే కాకుండా.. తన కుటుంబ సభ్యుల్నీ టార్గెట్‌ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికి ఉందో.. ఇన్నేళ్ల తర్వాత చార్జిషీట్లలో భారతి పేరును చేర్చడం వెనుక కుట్ర ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు తనపై కుట్ర పన్ని.. 2011 ఆగస్టు పదోతేదీన అక్రమ కేసులు బనాయించి.. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని జగన్‌ లేఖలో ఆరోపించారు. కేసు ప్రారంభమై శుక్రవారం నాటికి పదేళ్లు గడచిపోయిన తరుణంలో.. ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి భారతి పేరును తేవడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గమనించాలని జగన్‌ కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో చంద్రబాబు మనుషులున్నారని జగన్‌ ఆరోపించారు. బాబు ఆదేశాలకు అనుగుణంగా.. ఉమాశంకర్‌గౌడ్‌, గాంధీ అనే ఇద్దరు పనిచేస్తున్నారని, వీరిపై నిరుడు ఫిబ్రవరిలో ప్రధానికి కూడా ఫిర్యాదు చేశామని జగన్‌ వెల్లడించారు. ఆ అధికారుల చేతే టీడీపీ వారు తమపై కక్షసాధింపు రిపోర్టులను రాయించారని జగన్‌ ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు పగలు కాంగ్రెస్‌తో కాపురం చేస్తూ, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు ఏపార్టీలో ఉన్నా మా మిత్రుడే అని కేంద్ర హోంమత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పడం.. చంద్రబాబు లాలూచీ రాజకీయాలకు అద్దం పడుతోందని జగన్‌ విమర్శించారు. బీజేపీతో బంధాలు, సంబంధాలు బాగున్నాయి కాబట్టే.. ఓటుకు కోట్లిస్తూ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డా.. చంద్రబాబు రొమ్ము విరుచుకు తిరుగుతున్నారని జగన్‌ ఆరోపించారు.

చంద్రబాబు.. రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని సీఎంఎస్‌, ఆమ్నెస్టీ లాంటి సంస్థలు.. నివేదించాయని జగన్‌ తన లేఖలో ప్రస్తావించారు. కేంద్రం చంద్రబాబుపై విచారణ జరపకపోవడమే ఆయన లాలూచీ వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. విపక్షాన్ని ప్రజల్లో ఎదుర్కోలేక.. చంద్రబాబు ముందుగా తన తండ్రిని.. తర్వాత తనను.. ఇప్పుడు తన భార్యను టార్గెట్‌ చేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యవహారాలను ఆమోదిస్తే.. ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుందని ప్రశ్నిస్తూ.. ఈ అంశాన్ని ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - YCP leaders