YCP Party

17:21 - March 14, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా, నేనా అన్నట్లు తలపడ్డాయి. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురెదురుగా తలబడి నినాదాలు చేసుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు గోకవరం బస్టాండ్‌ వద్ద నున్న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేయగా వివాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీలు హోరా హోరిగా నినాదాలు చేసుకోవటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్క దిద్దారు. 

 

18:24 - February 28, 2018

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి అడ్డంపడుతూ ఓ సైకోలా జగన్‌ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జగన్‌ తీరుతో విసుగుచెందిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. భవిష్యత్‌ మరికొంతమంది చేరుతారని చెప్పారు. అసెంబ్లీ రూల్స్‌ తెలియని ప్రతిపక్ష నేత జగన్‌ అంటూ ఎద్దేవా చేశారు. 

07:12 - December 1, 2017

గుంటూరు : ఓవైపు ప్రజా సంకల్పయాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్‌ ప్రజల్లోకి దూసుకుపోతుంటే.. మరోవైపు పార్టీ నుంచి నేతల వలసలు మాత్రం ఆగడం లేదు. పార్టీని బలోపేతం చేయాలన్న జగన్‌ ప్రయత్నాలు.. కీలక నేతలు పార్టీని వీడటం వైసీపీని కలవరపెడుతోంది. ఏపీలో  ప్రతిపక్ష వైసపీ వలసలతో సతమతమవుతోంది. ఇప్పటికే 22 మంది సిట్టింగ్ శాసనసభ్యులు, పలువురు శాసనమండలి సభ్యులు టీడీపీ గూటికి చేరిపోగా  తాగాజా అనంతపురంజిల్లాలో మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీ కండువా కప్పుకున్నారు. వరుసగా నాయకులు వెళ్లపోతున్న నాయకులను అడ్డుకోడానికి వైసీపీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. 

వచ్చే  సాధారణ ఎన్నికల నాటికి  పార్టీ నేతలను ఏకత్రాటిపై తెచ్చి ,అధికారం  పీఠం అందుకోవాలని భావిస్తున్న జగన్‌..  సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కాని పార్టీ అధినేత ప్రయత్నాలు ఫలించే సూచనలు లేవని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. పాదయాత్ర మొదలైనాటి నుంచి కీలక నేతలు  ఒక్కొక్కరుగా చేజారి పోతున్నారు. మొన్నటికి మొన్న ఇద్దరు మహిళా నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ అనుచరుడిగా గుర్తింపు పొందిన  గుర్నాథ్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అనంతపురంజిల్లాలో వైసీపీకి   గట్టి ఎదురుదెబ్బ తగిలనట్టేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

మరోవైపు మరికొంత మంది కీలక నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారన్న టీడీపీ నేతల సంకేతాలతో వైసిపి అధిష్ఠానాన్ని ఆలోచనలో పడేస్తోంది. నాయకుల వలసలను అడ్డుకోడానికి ఫ్యాన్‌గుర్తుపార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్‌అవుతాయో వేచిచూడాలి. 

20:12 - November 9, 2017

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో వైసీపీ నేత మల్లాది విష్ణు, పీడీఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, టీడీపీ అధికార ప్రతినిధి దినకర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:23 - November 3, 2017

పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. కానీ, ఓ పక్క సర్కారులో అసహనం.. మరో పక్క పాదయాత్రకు సై అంటున్న వైసీపీ శ్రేణులు.. వెరసి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ తరుణంలో జగన్ పాదయాత్రకు అడ్డంకులున్నాయా? ప్రభుత్వం అడ్డుపడుతుందా? లేక సవ్యంగా సాగి... ప్రజాసంకల్ప యాత్రతో తన సంకల్పం కోసం జగన్ ప్రయత్నిస్తారా? దీనిపై ప్రత్యేక కథనం.. ఎన్ని మీటింగులు, ప్రెస్ మీట్లు పెట్టినా, పాదయాత్రకున్న క్రేజ్ వేరు. పాదయాత్ర ఓ దీక్ష లాంటింది. అది నమ్మిన వారికి ఫలితాన్నిచ్చింది. క్రమశిక్షణగా, చిత్తశుద్ధితో ప్రజలముందుకు వెళ్లినవారిని ఆదరించింది. ఇప్పుడు ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారు విపక్షనేత. గతంలో ఓ పాదయాత్ర తర్వాత బలం పుంజుకున్న చంద్రబాబు.. ఇప్పుడా పాదయాత్ర పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తమ్మీద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్రకు స‌ర్వం సిద్ద‌మ‌వుతోంది. ఓ వైపు ఇడుపుల‌పాయ‌లో ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతుండ‌గా మ‌రోవైపు రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేత‌లు విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేశారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారని, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర మొదలౌతుందని తెలుస్తోంది.

జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోంది? ప్రజాసంకల్ప యాత్ర లక్ష్యమేమిటి? అధికారపక్షాన్ని ఎండగడుతూ, వచ్చే ఎన్నికలే టార్గెట్ జగన్ ముందుకు సాగనున్నారా? పాదయాత్ర షెడ్యూల్ దగ్గరకొచ్చేకొద్దీ ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కుతున్నాయి. జగన్ యాత్రను ఆపే ప్రయత్నంలో ఏపీ సర్కారు ఉందా? తెలుగు నేల ఇప్పటికే పలు పాదయాత్రలను చూసింది. అధికారంలోకి తెచ్చిన అడుగులను, తమ అభిమాన్ని కొల్లగొట్టిన యాత్రలను అనేకం చూశారు ఏపీ ప్రజలు. మరి జగన్ పాదయాత్ర తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? గత పాదయాత్రల అనుభవాలు ఏం చెప్తున్నాయి?

రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలు..అధికారపక్షం మాటలకు చేతలకు పొంతనలేని పరిస్థితి..రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తులు పై ఎత్తులు, అరచేతిలో వైకుంఠం చూపటం తప్ప వాస్తవంగా జరుగుతున్నది శూన్యం అనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా అంశం, రైతుల సమస్యలు, ఇలా ఏపీని అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రాజకీయ రంగంలో విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు , ప్రతిసవాళ్లూ మామూలే. అదే సమయంలో అధికారం కోసం నేతలు చేసే ప్రయత్నాలూ సాధారణమే. ఇవేవీ ప్రజల దృష్టి నుండి దూరంగా పోయేవి కాదు. కానీ, ఏం మాట్లాడుతున్నా, ఏ యాత్రలు చేస్తున్నా, అడ్డుకున్నా ప్రజలకు అందాల్సిన సంకేతాలు అందుతూనే ఉంటాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:29 - November 3, 2017

కడప : వైఎస్‌ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సర్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి ఇడుపులపాయలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే పాదయాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను విజయవాడలో ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. ఆరో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులు అర్పించి.. అనంతరం ప్రజలను ఉద్దేశించి.. ప్రసంగిస్తారని .. అనంతరం పాదయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ నేత రఘురామ్‌ చెప్పారు. ఏడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారన్నారు. 

18:31 - November 2, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమైంది.ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10వ తేదీన జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే స్పష్టత వస్తుంది. దాదాపు 7 నుంచి 10 రోజుల పాటు సభను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.45 గం.కు శాసనసభ ప్రారంభం కానుంది. 10.30గంటలకు శాసనమండలి సమావేశం కానుంది. సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. వీటితో పాటు పలు పెండింగ్ బిల్లులు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయి. విశ్వ విద్యాలయాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలను చేపట్టేందుకు ఏపీపీఎస్సీకి అదనపు అధికారం కల్పించే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. జల వనరుల శాఖ బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు పొందేందుకు ఉన్న రుణపరిమితిని తొలగించేందుకు కూడా చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

నాలా పన్ను మినహాయింపు బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ భూమిని నివాస భూమిగా మార్పు చేసేందుకు కట్టే నాలా పన్నును గణనీయంగా తగ్గించే దిశగా ఈ బిల్లు రూపొందనుంది. నిరుద్యోగ భృతి అమలు, విద్యార్థుల ఆత్మహత్యలు, పోలవరం నిర్మాణం, రైతు రుణాల మాఫీ, అమరావతి నిర్మాణం తదితర అంశాలపై కీలక చర్చలు చేపట్టాలని సర్కారు యోచిస్తొంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్షం వైసీపీ ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా సభను మలుచుకునేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.

14:21 - November 2, 2017

విజయవాడ : ఫాతిమా మెడికల్‌ కాలేజి విద్యార్థుల సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు కడప వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి. విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఫాతిమా కాలేజి విద్యార్థులు చేపట్టిన శాంతియుత ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని మానవీయకోణంలో పరిష్కరించాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. నంద్యాల ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఫాతిమా విద్యార్థులను రీ లొకేట్‌ చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యను ప్రభుత్వం తీర్చాలన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు వైసీపీ పోరాడుతుందన్నారు. 

06:42 - October 28, 2017

విజయవాడ : ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే వరకూ అసెంబ్లీకి వచ్చేది లేదని ప్రకటించిన వైసీపీ.. ఇదే అంశాన్ని జాతీయ స్ధాయిలో తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్.జగన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. చంద్రబాబు సర్కారు అక్రమాలు.. అరాచకాలకు పాల్పడుతోందంటూ లేఖలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు జగన్. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని వైసీపీ.. మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా రాష్ట్రంలో అసెంబ్లీని బాయ్‌ కాట్ చేసిన వైసీపీ పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే వరకూ అసెంబ్లీకి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఓసారి ఢిల్లీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేసిన పార్టీ అధినేత జగన్ ఈ అంశాన్ని మరోసారి జాతీయ స్ధాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జగన్ లేఖ రాశారు.

శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో లేఖలో రాష్ట్రపతికి వివరించారు వైఎస్.జగన్. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని లేఖలో ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే రెండేళ్ల నుండి అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నుండి స్పందన రాలేదని తెలిపారు. తమ పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఆశ చూపి కొనుగోలు చేశారని.. అంతేకాకుండా వారిలో నలుగురికి రాజ్యంగ విరుద్ధంగా మంత్రి పదవులు ఇచ్చారని జగన్ లేఖలో వివరించారు. చంద్రబాబు, స్పీకర్ రాజ్యాంగ విలువలు కాపాడకుండా ఫిరాయింపుదారులతో సభ నడుపుతున్నారని జగన్ లేఖలో ఆరోపించారు. షెడ్యూల్ 10 ప్రకారం ఈ అంశంపై... చర్యలు తీసుకునే విధంగా జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని జగన్ కోరారు.

ఏపీలో పరిపాలన అన్నది లేకుండా పోయిందని జగన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. గడచిన 41 నెలల్లో లక్షా 9 వేల 422 కోట్ల రూపాయలు అప్పులు చేశారని వెల్లడించారు. శాసనసభ సమావేశాలను అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తూ సభలో విపక్షం గొంతు వినపడకుండా నొక్కేస్తున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న ప్రజాస్వామ్య అపహాస్యాన్ని అడ్డుకోవాలని లేఖలో రాష్ట్రపతిని కోరారు జగన్. మొత్తానికి ఫిరాయింపుల అంశాన్ని మరోసారి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు వైఎస్.జగన్. దీని ద్వారా చంద్రబాబు సర్కార్‌పై మరింత ఒత్తిడి తేవాలన్న వైసీపీ ఉద్దేశ్యం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి. 

21:24 - October 17, 2017

అనంతపురం : చేనేత కార్మికులకు టీడీపీ చేసిందేమీ లేదని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించిన ఆయన.. టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో చేనేతల బతుకు మరింత దుర్భరంగా మారాయన్నారు. నెల రోజులకు పైగా నిరాహార దీక్షచేస్తున్న చేనేత కార్మికులపై సీఎం చంద్రబాబుకు కనీసం సానుభూతికూడా లేదన్నారు. చేనేత కార్మికుల దీక్షకు జగన్‌ సంఘీభావం ప్రకటించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటనలో వైసీపీ అధినేత జగన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. ధర్మవరంలో అరవై ఐదు మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు జగన్‌ సంఘీభావం తెలిపారు. ధర్మవరంలో తన పర్యటన నేపథ్యంలో 11 మందికి అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మరోసారి చేనేతలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను, వృత్తి పనుల కూలీలను అన్నివిధాల ఆదుకుంటామని జగన్‌ ప్రకటించారు. 45ఏళ్లు దాటిన ప్రతి చేనేత కార్మికునికి ప్రతినెలా 2000 రూపాయల పెన్షన్‌ ఇస్తామన్నారు.

అంతకు ముందు అకాలవర్షాల వల్ల దెబ్బతిన్న టమాటా పంటలను జగన్‌ పరిశీలించారు. నష్టాలపాలై కుమిలిపోతున్న రైతులను ఓదార్చారు. రాయలసీమలో టమాట పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తారు. మొత్తానికి ధర్మవరంలో జగన్‌ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - YCP Party