YS jagan

12:57 - December 9, 2018

విశాఖపట్టణం : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మెంటల్ ఉందని...నిజాయితీపరులకు మెంటల్ ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఉండవల్లి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొందరు కేజ్రీవాల్‌లా నటిస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ. 20 కోట్లు ఉండాలని...లేనిపక్షంలో పోటీ చేసే అభ్యర్థి పరాజయం చెందుతారన్నారు. గెలిచిన తరువాత ఆ రూ. 20 కోట్ల కోసం పనిచేస్తారు..నేటి రాజకీయాలు సంపాదించుకోవడం కోసమే పరిమితమయ్యాయి..ప్రజా సమస్యలను గాలికొదిలేశారంటూ తెలిపారు. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్ర కేజ్రీవాల్ నిజాయితీగా గెలవడమే కాకుండా దేశంలో గొప్ప మార్పు తీసుకొచ్చారని కొనియాడారు. భారత ప్రధాన మంత్రి మోడీ కూడా గొప్పగా గెలిచినా...ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని విమర్శించారు. 

21:22 - November 28, 2018

శ్రీకాకుళం: రుణమాఫీ విషయంలో మహిళలు, రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయం లేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ రేట్లు పెంచి కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్నారని, నదుల అనుసంధానం పేరుతో నిధుల దోపిడీకి పాల్పడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. 308వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
తిత్లీ తుఫాన్ బాధితులకు కనీసం 15శాతం న్యాయం కూడా చేయలేదని.. ప్రచార ఆర్భాటమే తప్ప బాధితులను ఆదుకోవటంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాన్ వల్ల రూ.3,435 కోట్లు నష్టం జరిగిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారని... అంత నష్టం వాటిల్లితే.. బాధితులకు ఎంత డబ్బిచ్చారు అని జగన్ ప్రశ్నించారు. అంత భారీ నష్టం జరిగిందన్న చంద్రబాబు రూ. 520 కోట్లు మాత్రమే విడుదల చేశారని.. ఆయన చెప్పిన నష్టంలో 15శాతం కూడా ఇవ్వలేదన్నారు. రూ. 520 కోట్లలో కూడా రూ. 210 కోట్లే ఖర్చు చేశారని చెప్పారు. కానీ ప్రచారం కోసం తిత్లీ బాధితులను ఆదుకున్నామని విజయవాడలో ప్లెక్సీలు, ఆర్టీసీ బస్సులపై ఫొటోలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా చంద్రబాబు తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకునే విధంగా ఉందన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు.. మీ దీవెనలతో మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. జగన్‌ అనే నేను.. ఆ 3,435 కోట్లలో ప్రతిరూపాయి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.

19:13 - November 25, 2018

రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ప్రజల కన్నీళ్లు తుడవలేని 40ఏళ్ల అనుభవం ఎందుకు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా అవినీతి జరుగుతోందని పవన్ ఆరోపించారు. ఆఖరికి స్మశానాలు కూడా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పవన్ కళ్యాన్ బహిరంగ సభలో ప్రసంగించారు. అధికార, ప్రతిపక్షాలపై పవన్ విరుచుకుపడ్డారు.
వైసీపీ, టీడీపీ నాయకులు ఇసుక దందా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని పవన్ ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లాలంటే జగన్‌కు గుండె ధైర్యం లేదన్నారు. మోడీ, కేసీఆర్, చంద్రబాబు అంటే జగన్‌కు భయపట్టుకుందన్నారు.
ప్రజల కష్టాలను తీర్చేందుకు జనసేన పార్టీ పుట్టిందని పవన్ పేర్కొన్నారు. జనం మీద బతికే నాయకులు కాదు జనంపై బతికే నాయకులు కావాలని పవన్ అన్నారు.

18:59 - November 25, 2018

శ్రీకాకుళం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, నేనున్నానే భరోసా ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. 12 జిల్లాలను పూర్తి చేసుకుని... చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించింది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ సిక్కోలు జిల్లాలోకి ప్రవేశించారు. ఆదివారం(నవంబర్ 25) మధ్యాహ్నం పాలకొండ నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం కెల్ల గ్రామం వద్ద అశేష జనసందోహం మధ్య జగన్ శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కొనసాగనుంది.
జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారంతో(నవంబర్ 25) 305 రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు ఆయన 3300 కిలోమీటర్లకు పైగా నడిచారు. రాయలసీమ నుంచి ప్రారంభమైన పాదయాత్ర 12 జిల్లాల మీదుగా శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. గత నెలలో విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాడి కారణంగా జగన్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు.

11:22 - November 23, 2018

హైదరాబాద్ : వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసు ఇంకా కొనసాగుతోంది. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్‌పై శ్రీనివాస్  రావు అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దాడికి టీడీపీయే కారణమని వైసీపీ ఆరోపించింది. ఇరు పార్టీల మధ్య తీవ్ర విమర్శలు చెలరేగాయి. నిందితుడు శ్రీనివాస్‌ రావుని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విచారిస్తున్నారు. శ్రీనివాస్ జ్యుడిషియల్ కస్టడీ నవంబర్ 23వ తేదీ శుక్రవారం ముగియనుండంతో అతడిని జిల్లా కోర్టు ఎదుట పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు. విచారణ పూర్తి కాలేదని..రిమాండ్ పొడిగించాలని సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది. 
Image result for జగన్ దాడిమరోవైపు శ్రీనివాస్‌కి బెయిల్ మంజూరు చేయాలని అబూ సలెం న్యాయవాది మరోసారి పిటిషన్ దాఖలు చేయనన్నారు. గతంలోనే బెయిల్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. విచారణ పూర్తి కాలేదన్న నేపథ్యంలో బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదని కోర్టు స్పష్టం చేసింది. 
ఇదిలా ఉంటే జగన్ వేసుకున్న షర్ట్ (అంగీ)ని సిట్ ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాడి సమయంలో కత్తికి అంటిన రక్తపు మరకలు..అంగీకి అంటుకున్న రక్తపు మరకలు ఒకటేనా అనేది ధృవీకరించాల్సి ఉంది. 27వ తేదీన హైకోర్టు తీర్పు తరువాత స్పందిస్తామని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
ఈ కేసులో మొత్తం 13 మంది..జగన్ కూడా వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. వారు స్పందించకపోవడంతో పోలీసులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ పోలీసులప నమ్మకం లేదని..థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. మరి శ్రీనివాస్‌కు బెయిల్ వస్తుందా ? రిమాండ్ పొడిగిస్తారా ? అనేది కాసేపట్లో తేలనుంది. 

10:31 - November 21, 2018

విజయనగరం: సొంతిల్లు అనేది కల.. జీవితాంతం కష్టపడితే కానీ ఓ ఇంటి వారు కాలేరు. దీనికి కూడా లక్షలకు లక్షలు అప్పు తీసుకోవాలి.. ప్రతినెలా వేలకు వేలు వడ్డీలు కట్టాలి. ఇది కామన్. ఈ సిస్టమ్ మారుస్తానంటూ హామీ ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్. విజయనగరం జిల్లా కురుపాం ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఊహించని హామీ ఇచ్చారు. పేదలు అందరికీ ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఫ్రీగా ఇచ్చే ఆ ఇంటిని ఇంట్లోని తల్లి లేదా భార్య పేరుతో రిజిస్ట్రర్ చేయించి ఇస్తామని వెల్లడించారు. 
ఉచిత ఇల్లుపై బ్యాంక్ అప్పు కూడా :
 అధికారంలోకి వస్తే ఉచితంగా కట్టించి ఇచ్చే ఇల్లుపై బ్యాంక్ అప్పు కూడా వచ్చే విధంగా చూస్తామన్నారు. అత్యవసరంగా డబ్బు అవసరం అయితే బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చన్నారు. అలా తీసుకునే అప్పుపై కేవలం 25పైసలు (పావలా) మాత్రమే వడ్డీ వసూలు చేసే విధంగా ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు జగన్. ఇల్లు కట్టించి ఇవ్వటమే కాకుండా ఆ ఇంటిపై అప్పు తీసుకోవటం, దానికి కేవలం పావలా వడ్డీ స్కీమ్ తీసుకురావటం జరుగుతుందన్నారు. దీనిపై అత్యవసర సమయంలో వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకుని.. కట్టలేని దుర్భర స్థితి ఉండదన్నారు. 2019లో దేవుడు దయతలచి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తానని ప్రకటించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్లను ఈ విధంగా నిర్మించి ఇవ్వటం జరుగుతుందన్నారు.

09:40 - November 16, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో టీడీపీని సమూలంగా రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ దగ్గర తాకట్టు పెట్టేసి...పాలనలో అవినీతి పెచ్చుమీరేలా చేసిన తెలుగుదేశం పార్టీని సమూలంగా రాష్ట్రం నుండి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  • ఢిల్లీ కోటలు బద్దలు కావాలి..కాంగ్రెస్ కోటకు బీటలు వారాలి.
  • జగన్, చంద్రబాబు మనకు వద్దు..లోకేష్ అసలే వద్దు
  • వీళ్లంతా అవినీతిని అలవాటుగా మార్చేస్తున్నారు.
  • జనసేన ప్రభుత్వంలో 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తాం

ఏపీకి అన్యాయం చేస్తున్న ఢిల్లీ కోటను బద్ధలు కొట్టాలని..కాంగ్రెస్ కోటలకు బీటలు వారేలా చేయాలని సూచించారు. ఇప్పుడున్న నాయకులు మాత్రం అవినీతిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోతున్నారని, గతంలో రూ. 100 కోట్ల అవినీతి అంటే చాలా పెద్ద విషయమని, దేశాన్ని కుదిపేసిన భోపార్స్ కుంభకోణం అలాంటిదేనని పవన్ రాజానగరంలో నిర్వహించిన బహిరంగ సభలో తెలిపారు. ప్రజా జీవితాల్లో వెలుగులు నింపేలా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్ధామని తెలిపారు.

17:29 - November 14, 2018

తిరుమల: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడేవారిపై ప్రభుత్వం, టీటీడీ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాంటి వ్యక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించవద్దని అనిత కోరారు. ఎమ్మెల్యే అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్‌పైనా ఆమె విమర్శలు గుప్పించారు. జగన్ కోడి కత్తి డ్రామాను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. విచారణకు సహకరించకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏంటి? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఏడాదిగా పోలీసుల రక్షణలోనే జగన్ పాదయాత్ర చేస్తున్నారని గుర్తు చేసిన ఆమె.. ఆంధ్రా పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ అనడం దారుణమని మండిపడ్డారు.

13:02 - November 5, 2018

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు తరపున వాదించేందుకు లాయర్ ముందుకొచ్చారు. శ్రీనివాసరావు తరపున వాదిస్తానని, అతనికి బెయిల్ ఇవ్వాలని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తానని సలీం అనే న్యాయవాది పేర్కొన్నారు. సోమవారం విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 
గత నెల 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై శ్రీనివాసరావు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దాడి వెనుక సీఎం చంద్రబాబు, ప్రభుత్వం ఉందని వైసీపీ నేతలు ఆరోపించడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును సిట్ అధికారులు విచారించారు. విచారణలో ఎలాంటి అంశాలు చెప్పారి బయటకు రాలేదు. మొన్ననే అతని పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీని పొడిగించాలని, విచారణ ఇంకా చేయాల్సి ఉందని పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు. 
ఇదిలా ఉంటే తాను ఇటీవలే శ్రీనివాసరావును కలవడం జరిగిందని లాయర్ సలీం తెలిపారు. అప్పటి నుండి తాను అతనికి లాయర్‌గా ఉండడం జరిగిందన్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేదని, మానసికస్థితి సరిగ్గా లేదని..ఆయనపై చాలా ఆరోపణలు వస్తున్నాయన్నారు.  తాను దాఖలు చేసిన పిటిషన్‌లపై కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. 

10:58 - November 3, 2018

ప్రకాశం: ఎన్నికల కాలం వచ్చిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. దాదాపు ఆరు నెలల కాలం ఉన్నా.. ఇప్పటి నుంచే పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలకు చెక్ పెట్టే పని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీకి కాయకల్ప చికిత్స ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు సమీక్షలు నిర్వహించిన ఆయన.. పద్ధతి మార్చుకోకుంటే ఫైరింగే అంటు నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు వరుసగా రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. అటు అధికారిక కార్యక్రమాలతో పాటు, ఇటు పార్టీ ప్రాధాన్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉండేలా ఈ సారి షెడ్యూల్ రూపొందించారు. శుక్రవారం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన చంద్రబాబు రాత్రి బస చేసి మరీ పార్టీలో నెలకొన్న వివాదాలను పరిష్కరించే పనిలో పడ్డారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీడీపీకి పార్టీ పరంగా అత్యంత సమస్యాత్మకమైనవి ఆరు ఉన్నాయి. వాటిలో నాలుగు నియోజకవర్గాలపై అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు. నాయకుల మధ్య పొరపొచ్చాలు, అవినీతి, ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి వంటివి ఆయా చోట్ల అసమ్మతికి కారణమైన నేపథ్యంలో సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే పని ప్రారంభించారు.

Image result for chandrababu angryపార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు, నేతల ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టే దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు జిల్లా నేతలతో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. సంతనూతల పాడు సమన్వయ కమిటీ సమావేశంలో.. పార్టీ నేతలకు చంద్రబాబు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. రాజకీయాలు తనకు నేర్పవద్దంటూ సంతనూతలపాడు నేతలపై సీరియస్ అయ్యారు. ప్రతీ ఒక్కరి జాతకం తన వద్ద ఉందన్న సీఎం.. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేను గౌరవించకుండా పార్టీ కోసం పనిచేస్తున్నామంటే అర్ధమేంటని నేతలను నిలదీశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మంత్రులు ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో.. వర్గ విబేధాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు.. ఇకనైనా తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో ఇంకా కొత్త, పాత వంటి పదాలు వినిపిస్తున్నాయని, అన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలన్నారు. దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశంలో.. పార్టీ శ్రేణులకు భవిష్యత్ దిశానిర్దేశం  చేశారు. రానున్నది ఎన్నికల కాలమన్న చంద్రబాబు.. కలికట్టుగా పనిచేసి.. పార్టీ విజయానికి దోహద పడాలని సూచించారు. మిగిలిన నియోజకవర్గ నేతలతో చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు.

Image result for veligonda projectఇక తొలి రోజు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. మార్టూరు మండలం డేగరమూడి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు....వెలిగొండ  ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టాకు నీళ్లు ఇచ్చామన్న చంద్రబాబు...త్వరలోనే గోదావరి నీళ్లను నాగార్జున సాగర్‌కు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌ స్థానానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

జగన్‌పై జరిగిన దాడిపై చంద్రబాబు తన శైలిలో స్పందించారు. కోడి కత్తిపైన వైసీపీ నానా రచ్చ చేసిందని...దాడి చేసింది జగన్ వీరాభిమాని అయితే అది టీడీపీ పెట్టారంటే తనకు ఏం చెప్పాలో  తెలియట్లేదన్నారు. అసలు ఇదెక్కడి కోడి కత్తి డ్రామానో అర్థం కావడం లేదని  చంద్రబాబు అన్నారు.

Image result for attack on ys jaganవిభజన హామీలను నెరవేర్చమంటే కేంద్రం దాడులకు దిగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాలు, ప్రత్యర్థులను వేధించడం కోసమేనని అన్నారు. ఇవన్నీ చూసి ఓ సీనియర్ నాయకుడిగా తట్టుకోలేకపోయానని..రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఉద్ధేశ్యంతోనే జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్నాని చంద్రబాబు స్పష్టం చేశారు.

తొలిరోజు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించినా.. రెండో రోజు మాత్రం పార్టీకి ఇబ్బంది పెడుతున్న సమస్యలకు చెక్ పెట్టనున్నారు. మరి చంద్రబాబు హెచ్చరికలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - YS jagan