ys jagan mohan reddy

15:07 - October 11, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసినా.. ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపిస్తుంటే.. వైసీపీ నాయకులు అంతే ధీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కలిస్తే మాపై కొత్తగా ఈడీ కేసులు ఎందుకు పెడతారని? వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడిన వైవీ సుబ్బారెడ్డి.. తమ రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయన్నారు. ఇక 2019 ఎన్నికల్లో నేను ఒంగోలు నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై అధినేత జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు.

16:15 - September 24, 2018

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజాసంకల్ప పాదయాత్ర సోమవారం 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. విజయనగరం జిల్లా కొత్తవలసలోని దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్ప యాత్ర 3వేల కి.మీ పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. ఈ మైలురాయికి గుర్తుగా రావి మొక్కను నాటారు. మరికాసేపట్లో కొత్తవలసలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
 

18:24 - July 29, 2018

తూ.గో : కాపు రిజర్వేషన్లు సాధ్యం కావన్న జగన్‌పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఫైర్‌ అయ్యారు. కాపు జాతి రిజర్వేషన్లపైన వ్యతిరేకతా ? లేక రిజర్వేషన్లపైనే వ్యతిరేకతా ? స్పష్టం చేయాలని ముద్రగడ డిమాండ్‌ చేశారు. తమ కులానికి రిజర్వేషన్‌ కల్పించే వారికే తమ ఓట్లు పడతాయని ముద్రగడ పద్మనాభం అన్నారు. తమను వంచించే వారిని గుర్తించి వారందరినీ వచ్చే ఎన్నికల్లో దూరం పెడతామని, దీనికోసం వ్యూహాలు రచించుకుంటున్నామని చెప్పారు. కాపు ఉద్యమం పుట్టిన జిల్లాలో.. ఉద్యమ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. తమ జాతిని అవమానించారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పదవీకాంక్షతోనే జగన్‌ తమ జాతిని అవమానిస్తున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి.. తమ కులానికి చెందిన నేతలతో విపరీతంగా ఖర్చు చేయిస్తూ.. వారి కుటుంబాలను ఆర్పేస్తున్నారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. జగన్‌ పాదయాత్ర ఖర్చులతో అప్పులపాలవుతున్న కుటుంబాలు.. ఆత్మహత్యలు చేసుకోవాలా అని ప్రశ్నించారు. 

 

17:25 - July 29, 2018

విజయవాడ : అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఉమ మండిపడ్డారు. జగన్‌ వైఖరి చూస్తుంటే దొంగే.. దొంగ అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. 

 

06:58 - July 28, 2018

చిత్తూరు : నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా తన సొంత నిధులతో వైఎస్‌ఆర్‌ చాంఫియన్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు క్రీడల్లో ప్రతిభ ఉన్నప్పటికీ.. సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్నారని ఆమె అన్నారు. టోర్నమెంట్‌లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. టోర్నమెంట్‌లో భాగంగా వైసీపీ నేతలు క్రికెట్‌ ఆడి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. 

09:16 - July 23, 2018

నెల్లూరు : మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి జగన్‌ను కలిశాక నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ వర్గాల చూపంతా ఇప్పడు వెంకటగిరి నియోజకవర్గంపై పడింది. ఆనం వెంకటగిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ ఆనం వెంకటగిరి నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యే టికెట్టుపై ఆశలు పెట్టుకున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డిల రాజకీయ భవిష్యత్‌ ఏమిటి? త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న నెదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి ఏమిటి? ఇప్పుడిదే జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. 
ఆనం వెంకటగిరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం
మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా సాగుతుంది. ఈ ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెడుతూ ఆనం వైసీపీ అధినేత జగన్‌ కలిశారు. సుదీర్ఘ చర్చల అనంతరం వైసీపీలోకి ఆనం రాక ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక ఆనం జగన్‌ కలవటంతో నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాంనారాయణ రెడ్డికి వెంకటగిరి అసెంబ్లీ సీటు కేటాయిస్తున్నారని తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన అభ్యర్థులు ఉండటంతో ఈ నియోజకవర్గం నుంచి ఆనం పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుంది. వెంకటగిరిలో ఆనంకు బలమైన సామాజిక వర్గం, పాత పరిచయాలు ఉండటంతో కూడా ఈ నియోజకవర్గంపై ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. 
రాఘవేంద్రరెడ్డి, రాంప్రసాద్‌రెడ్డిల భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ
ఇక ఆనంకు టికెట్‌ ఇస్తే.. ఇప్పటివరకు ఈ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వైసీపీ నాయకులు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డిల భవిష్యత్ ఏమిటి అనే ఆసక్తికర చర్చ జిల్లాలో సాగుతుంది. వెంకటగిరి టిక్కెట్టుపై జడ్పీచైర్మన్‌ రాఘవేంద్రరెడ్డి ముందు నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించటంతో టికెట్‌ తనదే నన్న ధీమాతో రాఘవేంద్రరెడ్డి ఉన్నారు. రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృత పర్యటను చేస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరో నాయకుడు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వ్యాపారవేత్త అయిన కలిమిలి భారీగా ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. జగన్ దగ్గర మంచి గుర్తింపు ఉండటంతో టికెట్‌ దక్కించుకోవాలని తన ప్రయత్నాలు చేస్తున్నారు. 
వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న రామ్ కుమార్‌రెడ్డి 
అలాగే రాజకీయ ఘన చరిత్ర కలిగిన నెదురుమల్లి కుటుంబ వారసుడు రామ్ కుమార్‌రెడ్డి వైసీపీ గూటికి చేరుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు. తాను వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే రామ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి ఏంటనేది కూడా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఆషాఢ మాసం వెళ్లాక ఆనం ఫ్యాన్ గూటికి రానున్నట్లు తెలుస్తుడటంతో వెంకటగిరి రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే రాఘవేంద్రరెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, రామ్‌ కుమార్ రెడ్డిలను ప్రక్కకు తోసి ఆనం రాంనారాయణరెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ను ఎగరేసుకుపోతారో లేదో వేచి చూడాల్సి ఉంది. 

06:47 - June 23, 2018

విజయవాడ : ప్రతిపక్ష పార్టీలన్నీ టీడీపీపై విష‌ప్రచారం చేస్తున్నాయ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితిపై సమీక్షించిన చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసుల మాఫీ కోసం జగన్‌ బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శించారు. వైసీపీ ఉపఎన్నికలు రాకుండా అన్నిజాగ్రత్తలు తీసుకుని.. రాజీనామాలతో డ్రామా ఆడుతోందన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాయని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు.

13:14 - May 8, 2018

విజయవాడ : వైసీపీపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి వైసీపీ అధ్యక్షుడు జగన్ కు లేదన్నారు. ఆంధ్రా రాష్ట్రానికి వెన్నుపొడిచిన వ్యక్తి జగన్ అని, బీజేపీతో చేతులు కలిపారని పేర్కొన్నారు. కేసులు నుండి బయట పడేందుకు రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద పణంగా పెట్టారని, కర్నాటక రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

18:33 - May 6, 2018

ప్రకాశం : రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్డీయే నుండి టిడిపి బైటకొచ్చినా బిజెపితో చంద్రబాబుకు సంబంధాలున్నాయని, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వారంలో రోజులుగా కురుస్తున్న అకాలవర్షాలకు నష్టపోయిన రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

12:57 - May 4, 2018

అనంతపురం : జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుడటంతో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. అందుకోసం పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు.. నియోజక వర్గ సమన్వయ కర్తలలో మార్పులు చేస్తోంది. దీంతో ఇంతకాలం నియోజక వర్గాలకు సమన్వయ కర్తలుగా పనిచేసిన వారిలో ఆందోళన మొదలైంది.

అనంతపురం జిల్లాలోని వైసీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అధినేత జగన్‌.. పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయ కర్తలను మారుస్తుడటంతో పార్టీలో కోలాహలం నెలకొంది. ఇంత కాలం అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని అసెంబ్లీ సమన్వయ కర్తగా నియమించారు. ఇన్నాళ్లు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న నదీం అహమ్మద్‌ను హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించారు. ఇక  హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా వ్వవహరిస్తున్న రంగయ్యను అనంతపురం పార్లమెంట్ సమన్వయ కర్తగా నియమించారు.

అనంత వెంకటరామిరెడ్డిని అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా పార్టీ అధినేత జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో అనంతపురం వైసీపీ కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది. వెంకటరామిరెడ్డి స్వగృహంలో వైసీపీ నేతలు హడావుడి చేస్తూ.. ఆయనను పూల మాలలతో సత్కరించారు. దీంతో అనంతపురం రాజకీయాల్లో అసలైన ఆట మొదలయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అనంతపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయడమే కాక రానున్న ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం వెంకటరామిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారానికి తెరదించుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అనంతపురం పార్లమెంట్‌ నియోజక వర్గానికి వైసీపీ తరుపున రంగయ్యను బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి వైసీపీ సమన్వయ కర్త నదీం అహమ్మద్‌ను నియమించినప్పటికీ టికెట్ల కేటాయింపు సమయానికి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక కదిరి నియోజకవర్గం నుంచి మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలనే ఎన్నికల రణక్షేత్రంలోకి పంపాలని వైసీపీ చూస్తోంది.
 
వచ్చే ఎన్నికల్లో తాజాగా నియమించిన సమన్వయకర్తలే పోటే చేస్తారనే ప్రచారం వైసీపీలో ఊపందుకుంది. దీంతో నాలుగేళ్లుగా నియోజకవర్గ సమన్వయ కర్తలుగా పనిచేస్తున్న నాయకుల్లో కలవరం మొదలయింది. ఇంత కాలం పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన తమను కాదని కొత్త నేతలను సమన్వయ కర్తలుగా నియమిస్తే తమ పరిస్థితి ఏంటని నేతలు మదనపడుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ys jagan mohan reddy