YSRCP

15:06 - October 19, 2018

తిరుమల: దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి ఆమె తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి 2019 ఎన్నికల్లో పోటీ విషయమై స్పష్టత ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని ఆమె తేల్చి చెప్పారు. కాగా, కృష్ణా జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మీపార్వతి పోటీ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఊహాగానాలకు లక్ష్మీపార్వతి ఇవాళ తెరదించారు.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం మాత్రం చేస్తానని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా తెలిపారు. జగన్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఆమె అన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రాంగోపాల్ వర్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పోస్టర్ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ, లక్ష్మీపార్వతిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

 

21:23 - October 15, 2018

హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లు, సంస్థలపై జరిగిన ఐటీ దాడులను టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని వైసీపీ విమర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎంపీ రమేష్ బినామీగా పని చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబును అడ్డం పెట్టుకుని పెద్ద కాంట్రాక్టర్లను బెదిరించి సబ్ కాంట్రాక్టులు సీఎం రమేష్ పొందుతున్నారని అంబటి రాంబాబు అన్నారు.

సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థ ఎప్పుడైనా భారీ కాంట్రాక్టు చేసిందా అని అంబటి ప్రశ్నించారు. ఆ సంస్థవన్నీ సబ్‌ కాంట్రాక్టులేనని, అవన్నీ బెదిరించి తీసుకున్నవేనని ఆరోపించారు. సీఎం రమేష్ తన కుటుంబసభ్యులకు తెలియకుండా వేలిముద్ర ఉంటేనే తెరుచుకునే లాకర్లు ఉండటమేంటని అంబటి ప్రశ్నించారు. ఆ లాకర్లలో ఏమి దాచారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రమేశ్‌ ఓ గజదొంగ, బినామీ, బ్రోకర్‌ కాబట్టే అలాంటి లాకర్లు ఇంట్లో పెట్టుకున్నారని అంబటి వ్యాఖ్యానించారు. సీఎం రమేష్ సారా కాంట్రాక్టర్‌ దశ నుంచి ఎంపీ స్థాయికి రావడానికి గెస్ట్‌హౌజ్‌ రాజకీయాలే కారణమని అంబటి ఆరోపించారు. అసలు సీఎం రమేష్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే అధికార టీడీపీకి భయమెందుకు? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఐటీ దాడులను ప్రేరేపిత దాడులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

15:07 - October 11, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసినా.. ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపిస్తుంటే.. వైసీపీ నాయకులు అంతే ధీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కలిస్తే మాపై కొత్తగా ఈడీ కేసులు ఎందుకు పెడతారని? వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడిన వైవీ సుబ్బారెడ్డి.. తమ రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయన్నారు. ఇక 2019 ఎన్నికల్లో నేను ఒంగోలు నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై అధినేత జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు.

16:15 - September 24, 2018

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజాసంకల్ప పాదయాత్ర సోమవారం 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. విజయనగరం జిల్లా కొత్తవలసలోని దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్ప యాత్ర 3వేల కి.మీ పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. ఈ మైలురాయికి గుర్తుగా రావి మొక్కను నాటారు. మరికాసేపట్లో కొత్తవలసలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
 

19:41 - April 4, 2018

ఢిల్లీ : ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. ప్రతి రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టిందని చెప్పారు. స్నేహం కంటే దేశ ప్రజలు, అభివృద్ధికి ఎక్కువ విలువ ఇస్తామని చెప్పారు.

21:50 - March 5, 2018

ఢిల్లీ : 'ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు' అనే నినాదాలు ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌లో మార్మోగాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని... విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ హస్తినలో వైసీపీ మహాధర్నా నిర్వహించింది. నాలుగేళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఢిల్లీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. పార్లమెంట్‌ లోపల, బయట కూడా ఏపీ నేతలు ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. పార్లమెంట్‌ స్ట్రీట్‌లో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు పేరుతో వైసీపీ మహాధర్నా చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ ధర్నాకు వామపక్షాల నేతలు మద్దతిచ్చారు. కేంద్రం తమ హామీలను నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని... కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని వైసీపీ ఎంపీలు హెచ్చరించారు. ర్యాలీ అనంతరం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సింది పోయి... తమ పోరాటాన్ని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. తమను అరెస్ట్‌ చేసినా పోరాటంపై వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. 

రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించడమే కాకుండా.. నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోకుండా కేంద్రం అన్యాయం చేసిందన్నారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు... మళ్లీ ప్రజలను వంచించేందుకు యత్నిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయని... ప్రజలే చంద్రబాబుకు బుద్ది చెబుతారన్నారు వైసీపీ నేతలు. 

వైసీపీ నేతల ఆందోళనలకు వామపక్షాలు మద్దతిచ్చాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. పార్లమెంట్‌ ఎదుట మంగళవారం, బుధవారం ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ఒత్తిడితోనే టీడీపీ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు నాటకమాడుతుందే తప్ప.... రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం లేదన్నారు మధు. 

విభజన హామీలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మోదీ చేస్తున్న అన్యాయంపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని... కేంద్రం కచ్చితంగా దిగి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు రామకృష్ణ. మొత్తానికి నిన్నటి వరకు రాష్ట్రానికి పరిమితమైన ఆందోళనలు ఢిల్లీని చుట్టుముట్టాయి. ప్రత్యేక హోదా సాధించుకునే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని వామపక్షాలు, ప్రజాసంఘాలు  హెచ్చరించడంతో... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

17:45 - March 5, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలు అమలు చేయాలంటూ ఢిల్లీ వేదికగా వామపక్షాలు ఆందోళనలు ఉధృతమయ్యాయి. మోదీ చేస్తున్న అన్యాయాలపై ప్రతిపక్షాలన్నీ గళమెత్తుతున్నాయి. హక్కులన్నీ సాధించే వరకు పోరాడుతామంటున్న  సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. విభజన హామీల కోసం ఏపీకి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని తెలిపారు. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

16:53 - March 5, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రేపు, ఎల్లుండి పార్లమెంట్‌ ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు వామపక్షాలు సమాయత్తమయ్యాయి. రాష్ట్రానికి ప్రత్యేక తీసుకువచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామంటున్న సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఆందోళనలు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ఆలోచన విధానపరంగా నిలబడదన్నారు. కేసీఆర్‌ విధానాలు మార్చుకోకుండా థర్డ్‌ ఫ్రంట్‌ అంటే ప్రజలు నమ్మరని తెలిపారు. రాజకీయ పార్టీల ఒత్తిడితోనే టీడీపీ కేంద్రంపై పోరాట నాటకం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పని చేయడం లేదని పేర్కొన్నారు.

15:43 - March 5, 2018

ఢిల్లీ : మోడీ ప్రధానిగా ఉన్నత కాలం ఏపీకి ప్రత్యేకహోదా రాదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఢిల్లీలోని వైసీపీ ధర్నాకు లెఫ్ట్ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీని వాయిదా వేసి ముఖ్యమంత్రి ఢిల్లీలో పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. 

15:33 - March 5, 2018

ఢిల్లీ : హస్తినలో వైసీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సంసద్ మార్గ్ లో వైసీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వినతిపత్రం ఇచ్చేందుకు నేతలు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని, నేతలను అరెస్టు చేసి, పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ కు తరలించారు. అరెస్టైనవారిలో విజయసాయిరెడ్డి, వరప్రసాద్, సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి సహా పులువురు నేతలున్నారు. అయితే నేతలను తరలిస్తున్న పోలీసులను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - YSRCP