ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన తమ్మినేని సీతారాం

Submitted on 13 June 2019
tammineni Seetharam Take charge as AP Assembly Speaker

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌ పదవికి నోటిఫికేషన్‌ వెలువడగా.. ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనను బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం (జూన్ 13, 2019) 11 గంటలకు ఆయన స్పీకర్‌గా పదవీబాధ్యతలు చేపట్టారు.

మంత్రివర్గం, కీలక పదవుల విషయంలో అటు అనుభవాన్ని, ఇటు సామాజికవర్గం అంశాన్ని లెక్కలోకి తీసుకుంటున్న వైఎస్‌ జగన్.. స్పీకర్‌ పదవిలోనూ అదే సమతూకం పాటించారు. ఎన్నడూ లేని విధంగా వైసీపీకి పట్టం కట్టిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సభాపతిగా తమ్మినేని సీతారాంను ఎంపిక చేశారు. తన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని మొదటి నుంచి చెబుతున్నారు వైఎస్‌ జగన్. ఇందులో భాగంగానే బీసీ నేతకు స్పీకర్‌ పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికొచ్చారు. సీనియారిటీ ఉండడం, బీసీలో కళింగ సామాజికవర్గానికి చెంది ఉండడం, ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం నుంచి ఎన్నికవడం తమ్మినేని సీతారాంకు కలిసొచ్చాయి. 

తమ్మినేని సీతారాం.. ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించిన సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1983లో మొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 1989లో ఓటమి చవిచూశారు. ఆ తరువాత 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. చంద్రబాబు హయాంలో 9 ఏళ్ల పాటు మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. 2004లో టీడీపీ ప్రభుత్వం పడిపోయాక చంద్రబాబు నాయుడుతో విబేధాలు రావడంతో పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్‌ మరణం తరువాత తమ్మినేని సీతారాం వైసీపీలో చేరారు. 2014లో ఫ్యాన్‌ గుర్తుపై పోటీ చేసి మరో అపజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. 2019లో అదే పార్టీ నుంచి తన మేనల్లుడు కూన రవికుమార్‌పై 14వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

టీడీపీని వీడినప్పటి నుంచి తమ్మినేని సీతారాం చంద్రబాబు లక్ష్యంగా ఎన్నో విమర్శలు చేశారు. దీంతో తమ్మినేని అయితేనే టీడీపీతో సమర్ధవంతంగా వ్యవహరించగలరని జగన్‌ నమ్మకం. అందుకే ఆయనకు స్పీకర్‌ పదవి కట్టబెట్టారు. తనకు ఈ పదవిని ఇవ్వడం బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తమ్మినేని అన్నారు.  సభను హుందాగా నడిపిస్తానని తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యులందరికీ తగిన సమయం కేటాయించి... అందరూ చర్చల్లో పాల్గొనేలా చూస్తానని తెలిపారు. 


 

Tammineni Seetharam
take
charge
AP
assembly speaker
Amaravathi

మరిన్ని వార్తలు