ఊపిరి : పార్లమెంట్ ఫలితాలతో కాంగ్రెస్‌కు బూస్ట్

Submitted on 26 May 2019
T.Congress is happy with the outcome of Parliament elections

తెలంగాణలో లోక్‌సభ ఎన్నిక‌ల ఫ‌లితాలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాయి. మూడు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల విజ‌యం సాధించి క్యాడర్‌లో తిరుగులోని జోష్‌ నింపింది. మనుగడే ప్ర‌శ్నార్ధ‌కంగా మారిన పరిస్థితి నుంచి అనూహ్యంగా పుంజుకుని... టీఆర్‌ఎస్‌ను ఎదురుదెబ్బ కొట్టడంతో హస్తం నేతలు ఖుషీ అవుతున్నారు. తమ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగానే ఉందని విశ్లేషిస్తున్నారు.

దేశవ్యాప్తంగా మోడీ హవాలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి... తెలంగాణ ఫలితాలు మాత్రం కాస్త ఉత్సాహానిచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ చేతిలో భంగపడ్డ హస్తం నేతలకు నాలుగు నెలల్లోనే వచ్చిన పార్లమెంటు ఫలితాలు బూస్ట్ ఇచ్చాయి. మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభంజనం ముందు నిలవడం కష్టమే అనుకున్న తరుణంలో ఎవరూ ఊహించని తీరిలో ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. తమ పార్టీ అభ్యర్థులు మూడుచోట్ల గెలుపొందడమే కాకుండా.. మరో రెండుచోట్ల గట్టిపోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు ఖుషీ అవుతున్నాయి.

ముఖ్యంగా ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌రెడ్డి గెలవడం... కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్‌ నింపింది. అలాగే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి సైతం విజయం సాధించడంతో గర్వంగా తలెత్తుకునే పరిస్థితి వచ్చింది. ఇక.. టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓటమి మాత్రం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఆయన కూడా చివరిదాకా గట్టి పోటీ ఇవ్వడంతో పార్టీ ఓడిపోయినా ప్రజల మనసుల్ని గెల్చుకున్నామంటూ సమాధానం చెప్తున్నారు.

తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుని ఖుషీ అవుతున్న కాంగ్రెస్ పార్టీని తమకంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడం కలవరపెడుతోంది. నిజామాబాద్‌, కరీంనగర్‌లో కీలక నేతల్ని రంగంలోకి దించినా తాము ఎందుకు ఓడిపోయామో తెలుసుకునేందుకు పోస్టుమార్టానికి సిద్ధమవుతోంది. ఈ రెండుచోట్లా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు వినోద్, కవితలు ఓడిపోవడం కంటే ఆయా స్థానాలు బీజేపీకి దక్కడమే కాంగ్రెస్‌ నేతలకు కంటగింపుగా మారింది. టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని ఆనందపడాలో బీజేపీ బలపడిందని బాధపడాలో అర్థంకాని స్థితి. కాగా... జహీరాబాద్‌లో ఇంకాస్త గట్టిగా పోరాడి ఉంటే అక్కడ కూడా విజయం దక్కేదని హస్తం నేతలు ఇప్పుడు ఫీలవుతున్నారు.

మొత్తానికి నాలుగు నెలల క్రితం టీఆర్‌ఎస్‌ చేతిలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మూడుచోట్ల జెండా ఎగరేసి తమ సత్తా చాటారు. ముగ్గురు ఎంపీ అభ్యర్థుల గెలుపుతో తెలంగాణలో మళ్లీ గుడ్‌టైమ్‌ స్టార్ట్ అయిందని సంబరపడుతున్నారు. 

T.Congress
Happy
outcome
Parliament elections Telangana
Telangana News
Maoists attack in Telangana

మరిన్ని వార్తలు