టీ. అభ్యర్థులను ఖరారు చేయనున్న బాబు..

07:47 - November 8, 2018

హైదరాబాద్ :  తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఇప్పటికే మహాకూటమిలో టీడీపీకి 14 స్థానాలు కేటాయించే అవకాశం ఉండడంతో.. ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే.. అభ్యర్థులను ఫైనల్‌ చేసేందుకు ఇవాళ టీ-టీడీపీ నేతలు అమరావతి వెళ్తున్నారు. చంద్రబాబు ఆమోదం తర్వాత.. అభ్యర్థుల జాబితా ఫైనల్‌ కానుంది. 
తెలంగాణలో సీట్ల సర్దుబాటు కసరత్తుపై దృష్టి సారించింది టీడీపీ. సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపికపై నిర్ణయం తీసుకుని తనకు సమాచారమివ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. తెలంగాణ నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు. 

దాదాపుగా రెండు నెలలుగా కూటమికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అభ్యర్థులు, నియోజకవర్గాలపై రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదరడంలో ఆలస్యమైంది. కాంగ్రెస్‌ తర్వాట ప్రధాన పార్టీగా కూటమిలో వ్యవహరిస్తున్న టీడీపీ దాదాపు 20 స్థానాలు దక్కించుకునే ప్రయత్నం చేసినా.. అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించలేదు. 14 స్థానాలు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. మరో రెండు, మూడు స్థానాలు దక్కే అవకాశం ఉందన్న ధీమాతో టీడీపీ నేతలున్నారు. దీంతో టీడీపీ నేతలు అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకున్నారు. 20 నియోజకవర్గాలపై కసరత్తు చేసి.. అభ్యర్థుల జాబితాను సిద్దం చేశారు. చివరి నిమిషంలో నియోజకవర్గాల్లో మార్పు జరిగినా... అందుకనుగుణంగా జాబితాను సిద్దం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండడంతో చంద్రబాబుతో.. టీ-టీడీపీ నేతలు సమావేశమై.. అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. 

మొత్తానికి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ 90 స్థానాలకు పరిమితమైతే... కూటమిలోని ఇతర పార్టీలకు సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబు చొరవ తీసుకుంటే టీడీపీకి 14 కంటే ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని టీ-టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Don't Miss