ఇంటి దగ్గరికే ఇసుక : ఆన్‌లైన్‌లో బుకింగ్ : టీసర్కార్ కొత్త విధానం

Submitted on 12 July 2019
telangana government distributes sand to the home

ఇల్లు కట్టుకుంటున్నారా.. ఇసుక కావాలా.. ఇకనుంచి దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఇంటికి ఇసుకను పంపిణీ చేస్తుంది. ఎంత ఇసుక కావాలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. డబ్బులు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తే సరిపోతుంది. రవాణా చార్జీలతో కలుపుకొని టన్నుకు రూ.1350 నుంచి రూ.1450 వరకు ఖర్చు అవుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇంటి దగ్గరకే ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించింది. వ్యక్తిగత భవన నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే.. ప్రభుత్వమే నేరుగా ఇంటికి తీసుకురానుంది. ఈ విధానం శుక్రవారం జులై12 నుంచే అమల్లోకి రానుంది. ప్రస్తుతం పరిమితంగానే ఇసుకను సరఫరా చేయాలని, ముఖ్యంగా నగరంతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమలు చేయాలని, భవిష్యత్తులో పూర్తిస్థాయిలో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) గురువారం జులై11 ప్రకటించింది.

ప్రభుత్వం నూతన పాలసీ 
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఇసుక విషయంలో ప్రభుత్వం నూతన పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వ పరిధిలోనే ఇసుకను విక్రయిస్తున్నారు. ఇసుక కావాల్సినవారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. ఇసుక రవాణాకు వాహనాలను కూడా వారే సమకూర్చుకోవాల్సివుంటుంది. గుర్తించిన నదుల్లో ఇసుకను బయటకు తీసి, దగ్గరలోనే ప్రభుత్వం స్టాక్‌ యార్డులను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వ్యక్తులు వాటి నుంచి ఇసుకను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుక్‌ చేసుకునే ఇసుకకు క్యూబిక్‌ మీటరుకు రూ.600 ప్రభుత్వానికి చెల్లించాలి. రవాణా చార్జీలు ఇందుకు అదనం. ఈ విధానంలో కూడా ఇసుక కావాల్సిన వారు మళ్లీ బ్రోకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. వ్యక్తిగతంగా ఇసుక బుక్‌ చేసుకుంటే వాహన లభ్యత ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. వ్యక్తిగత అవసరాలకు నేరుగా ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. 

ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ విధానం
ఖనిజాభివృద్ధి సంస్థ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఇసుక కావాల్సినవారు టీఎస్ఎండీసీకి చెందిన శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎస్ఎంఎంఎస్‌) వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అందులో రిజిస్టర్‌ చేసుకుని ఇసుకను బుక్‌ చేసుకోవచ్చు. 8, 9, 10, 12 టన్నుల పరిమాణంలో ఇసుకను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇసుక ధర టన్నుకు రూ.1,250 చొప్పున ఖరారు చేశారు. రవాణా ఖర్చులు కలిపితే.. వినియోగదారుడి ప్రాంతాన్ని బట్టి టన్నుకు రూ.1,350 నుంచి రూ.1,450 వరకు కావచ్చని ఎండీసీ ప్రకటించింది. 

ప్రత్యేకంగా స్టాకు యార్డుల ఏర్పాటు
ఇసుక సరఫరాకు నగర శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్‌, వట్టినాగులపల్లి, బౌరంపేటల్లో ప్రత్యేకంగా స్టాకు యార్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిలో 1.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అందుబాటులో ఉంచారు. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి స్టాక్‌ యార్డుల్లో ఇసుకను నిల్వ చేయనున్నారు. మరింత సమాచారం కోసం 040-23323150 ఫోన్‌ నంబరులో సంప్రదించవచ్చని ఎండీసీ ప్రకటించింది.
 
వాహనదారులతో ఎండీసీ ప్రత్యేకంగా ఒప్పందం
హైదరాబాద్‌లో ఇసుక సరఫరాకు వీలుగా వాహనదారులతో ఎండీసీ ప్రత్యేకంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది. నగరంలో ఇసుక రవాణాకు భారీ వాహనాలను ఉపయోగించడం సాధ్యం కాదు. 8 నుంచి 12 టన్నుల ఇసుకను సరఫరా చేయడానికి వీలైన వాహనాలనే అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిమిత స్థాయిలోనే ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. దాంతో కొన్ని రోజులపాటు పరిమిత స్థాయిలోనే బుకింగ్‌లు తీసుకునే అవకాశం ఉంది.

ఇసుక ధరల్లో మార్పు లేకుండా సరఫరా
హైదరాబాద్‌ అవసరాలకు లక్షల టన్నుల ఇసుక కావాల్సి ఉంటుంది. ఇందులో కనీసం 10 టన్నుల ఇసుకను ఎండీసీ సరఫరా చేసినా.. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణదారులకు ఊరటగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రతి వర్షాకాలంలో ఇసుక ధరలు పెరుగుతాయి. బ్రోకర్లు కొన్నిసార్లు టన్ను ఇసుకను ఏకంగా రూ.2,000 వరకు కూడా విక్రయిస్తారు. దీంతో వ్యక్తిగత నిర్మాణదారులకు ఇసుక కొనుగోలు భారంగా మారింది. నూతన ఇసుక విధానం అమలైతే ఇసుక ధరల్లో మార్పు లేకుండా సరఫరా అయ్యే అవకాశం ఉంది.
 

telangana government
distribute
SAND
home
Hyderabad
Online Booking

మరిన్ని వార్తలు