తెలంగాణలో ఇంటింటికీ ఆరోగ్యం: హెల్త్ టెస్ట్ లు చేయనున్న ప్రభుత్వం

Submitted on 15 August 2019
Telangana Government Has Decided to Conduct  for People

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖ. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ(Public Health & Family Welfare)
కమిషనర్‌ యోగితా రాణా ఉత్తర్వులు జారీచేశారు. కుష్టూ, టీబీ, పాలియేటివ్‌ కేర్, మానసిక వైద్యం, అసంక్రమిత వ్యాధులు సహా మొత్తం 13 రకాల వ్యాధులను గుర్తించి వాటిని నయం చేసేందుకు తగు ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.

ఆగస్ట్ 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఈ పరిక్షలను చేపడుతారు. డ్వాక్రా, స్వయం సహాయక గ్రూపులు, అంగన్‌వాడీ సభ్యుల సహకారంతో స్క్రీనింగ్ చేసి నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపుతారు. అదే నివేదికను విలేజ్‌ హెల్త్‌ సర్వీస్ యాప్‌లో నమోదు చేయాలని యోగితా రాణా కోరారు.

ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇంటింటికీ తిరిగి ప్రజలకు స్క్రీనింగ్‌ చేస్తారు. రోజూ 20 ఇళ్లకు స్క్రీనింగ్‌ నిర్వహించాలని యోగితా రాణా ఆరోగ్య శాఖలను ఆదేశించారు. ఒక్కో టీమ్ కి ఇద్దరు చొప్పున ఉంటారు. దాదాపు కోటి కుటుంబాలను కలిసి ఆరోగ్య పరిక్షలు చేస్తారు. యూనివర్సల్‌ హెల్త్‌ స్క్రీనింగ్‌ ప్రోగ్రాం పేరుతో సమగ్ర ఆరోగ్య సర్వే చేపడుతుంది ప్రభుత్వం.

-హెల్త్‌ స్క్రీనింగ్‌ ప్రోగ్రాంలో ప్రతి ఇంటి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తారు. మున్ముందు గ్రామాల వారీగా ఆరోగ్య రికార్డు తయారు చేయడానికి ఈ వివరాలు ఉపయోగపడుతాయి.
-ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే ఈ పరీక్షలు మెడికల్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో జరుగుతుంది.
-ఉదయం 6.30 నుంచి 9.30 వరకు స్క్రీనింగ్‌ ప్రక్రియ జరిపి నివేదికలను సిద్దం చేసుకుంటారు. ఒకవేళ అప్పుడు ఇంట్లో ఎవరూ లేకుంటే సాయంత్రం వెళ్తారు.
-కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాధులు, అనుమానిత రోగాలను గుర్తించి వాటిని అదే రోజు జిల్లా వైద్యాధికారికి పంపిస్తారు.
-టీబీ కేసులు ఏవైనా ఉంటే నిక్షయ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
-ఏదైనా వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తే ప్రొటోకాల్‌ ప్రకారం సంబంధిత పరీక్షలను వారం రోజుల్లో చేయించాలి.  
-ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ప్రొటోకాల్‌ ప్రకారం వైద్యం చేయాలి. వైద్యం చేయించే తేదీ నమోదు చేయాలి.
-రోజువారీ స్క్రీనింగ్‌ వివరాలను గ్రామ ఆరోగ్య రికార్డులో ఏఎన్‌ఎంలు నమోదు చేయాలి.  
-రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే అందరికీ ఆరోగ్య స్క్రీనింగ్‌ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఆగస్ట్ 17న జరగనుంది. జిల్లాల్లో 20 నుంచి 22 వరకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
-కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఆగస్ట్ 24, 25 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రకటిస్తారు.

telangana government
Medical Tests

మరిన్ని వార్తలు