"దోస్త్" లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాదు

Submitted on 25 May 2019
Telangana Government has decided not issue fees reimbursement colleges not covered DOST

హైదరాబాద్: ప్రయివేటు డిగ్రీ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల (DOST-Degree Online Services Telangana-దోస్త్) పరిధిలోకి రాని కాలేజీల్లో చేరే విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.  దోస్త్ పరిధిలోకి రాని కాలేజీలు కోర్టుకు వెళ్లి  ఆన్ లైన్ ప్రవేశాల పరిధిలోకి రాకుండా సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి 27 కాలేజీలు ఉన్నాయి. అలాంటి కాలేజీల్లో చేరే విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వొద్దని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వద్దనుకునే విద్యార్ధులు ఆ కాలేజీల్లో చేరాలని సూచించింది. ఈ విషయాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేసే సంక్షేమ శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు పంపింది. ఈ విషయమై గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులనే ఈ ఏడాది అమలు చేయాలని ఆదేశించింది.

రాష్ట్రంలో 1,084 వరకు ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 47 కాలేజీలు దోస్త్ పరిధిలోకి రాలేదు. మొత్తం కాలేజీల్లో 4.2 లక్షల సీట్లు ఉండగా వాటిలో 23 వేల సీట్లు దోస్త్‌ పరిధిలో లేని కాలేజీల్లోనే ఉన్నాయి. దోస్త్ పరిధిలోకి రాని కాలేజీలు సొంతంగానే ప్రవేశాలు చేపడుతున్నాయి. అందులో 20 మైనారిటీ కాలేజీలు సొంతంగా ప్రవేశాలు చేపట్టుకునేందుకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. మరో 27 టాప్‌ కాలేజీలు మాత్రం కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. వీటిలో సుమారు 15 వేల సీట్లు ఆ కాలేజీలు భర్తీ చేస్తున్నాయి. ఈ కాలేజీలను దోస్త్ పరిధిలోకి తేవాలని కమిటీ ఎన్నిప్రయత్నాలు చేసినా ప్రయోజనంలేకుండా పోయింది. ఆ కాలేజీల్లో ఫీజులు సంవత్సరానికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఉన్నాయి. యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు మాత్రం రూ.25 వేలకు (యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుకు అదనంగా రూ. 10 వేలు వసూలు చేసుకునేలా కల్పించిన వెసులుబాటుతో కలిపి) మించి లేదని, దానివల్ల తాము కాలేజీలను కొనసాగించలేమని సదరు యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

 ఈ విద్యా సంవత్సరంలోనూ 27 కాలేజీలు సొంతంగా ప్రవేశాలకు చర్యలు చేపట్టాయి. దీంతో ఈ కాలేజీల్లో చేరే విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరంలో  డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్ధులు  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఈ పాస్ వెబ్ సైట్ ద్వారా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా  దోస్త్ చర్యలు చేపట్టింది. దోస్త్‌ ఆధ్వర్యంలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాలను ఈ–పాస్‌ విభాగానికి కాలేజీలు, దోస్త్‌ కమిటీ కూడా పంపిస్తుందని, ఈ–పాస్‌ విభాగం వాటినే పరిగణనలోకి తీసుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు దోస్త్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Fee reimbursement scheme
 Colleges
Students
Degree online Entries
DOST

మరిన్ని వార్తలు