కూటమి కూలిపోతుందన్న బీజేపీకి ఈ ఫలితాలు చెంపపెట్టు : కుమారస్వామి

15:04 - November 6, 2018

కర్ణాటక : ఉప ఎన్నికల్లో బీజేపీకి కేవలం ట్రైలర్ మాత్రమే చూపించామని పూర్తి సినిమా వచ్చే స్వార్వత్రిక ఎన్నికల్లో చూపిస్తామని కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన  ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని... 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 28 లోక్ సభ స్థానాలు ఉన్నాయని... కాంగ్రెస్ పార్టీతో కలసి అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు గెలిచాం కాబట్టి తాను ఈ మాటలు అనడం లేదని... ఈ విషయం తమపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. 
ఇంతటి ఘన విజయానికి కారణమైన జేడీఎస్ నేతలను, కార్యకర్తలను కూడా అభినందిస్తున్నానని కుమారస్వామి సంతోషంతో తెలిపారు. జీడీఎస్-కాంగ్రెస్ లది అపవిత్ర కలయిక అని వ్యాఖ్యానించిన బీజేపీకి... ఈ ఫలితాలు చెంపపెట్టువంటివని చెప్పారు. తమ కూటమి ఎంతో కాలం బతకదని ఎద్దేవా చేసిన బీజేపీ నేతలు... ఈ ఫలితాల తర్వాత ఏం మాట్లాడతారని అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేయడమే తమ కూటమి తదుపరి లక్ష్యమని కుమారస్వామి తెలిపారు. 
 

Don't Miss