10న టీఆర్ఎస్ 12మంది అభ్యర్థుల ప్రకటన..

09:39 - November 9, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నికల తుది ప్రణాళికపై రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం  సమీక్షించారు. ఎన్నికల కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గల ఎస్సీ, ఎస్టీ ప్రణాళిక కమిటీ సమర్పించిన ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం పలువురు నేతలు, కార్యకర్తలు, ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం భావిస్తున్నారు.
ఈ నెల 10న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే అదే రోజు తెరాస సైతం.. మిగిలిన 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. ఆ రోజు ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాబితా వస్తే సాయంత్రం తెరాస జాబితాను కేసీఆర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. కాంగ్రెస్‌ జాబితా పర్యవసానాలను పరిశీలించిన అనంతరం తెరాస తమ జాబితాలో మిగిలిన అభ్యర్థులను ఖరారు చేసే వీలుంది.
 

Don't Miss