కమలం ఆకర్ష్ : బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు!

Submitted on 13 June 2019
Two Congress MPs into BJP..!

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే మెజార్టీ అసెంబ్లీ సభ్యులను కోల్పోయి అల్లాడుతోంది. అధికార టీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్రంలో విలవిల్లాడుతోంది. ఇంతలోనే ఆ పార్టీకి మరో గట్టి షాక్ తగలడం ఖాయమని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కమలం గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వారిద్దరితో బీజేపీ నేత రామ్‌మాధవ్‌‌ చర్చలు జరిపారనడం  హస్తం పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ.. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. 4 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. మోడీ మేనియాతో సత్తా చాటిన ఆ పార్టీ.. ప్రస్తుతం దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ నాయకులపై కన్నేసి.. వారిపై ఆకర్ష్ వల విసురుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌‌కు చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగినట్లుగానే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారన్న వార్త తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కించింది. వారిద్దరితో రాంమాధవ్ రహస్యప్రాంతంలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం దీనిని గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ ఆ ఇద్దరు ఎంపీలు కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైతే... మరికొంతమంది నాయకులు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలను వారు ఖండిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడంతోనే వారు బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున ముగ్గురు ఎంపీలుగా గెలవగా.. ఇద్దరు కమలదళంలో చేరడం ఖాయమైతే మాత్రం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలినట్టే. 
 

Two Congress
MPs
BJP
Hyderabad

మరిన్ని వార్తలు