వాయు తుపాన్ : విజయవాడ నుంచి గుజరాత్‌కు NDRF బలగాలు

Submitted on 12 June 2019
vayu Cyclone : Vijayawada NDRF forces to Gujarat

వాయు తుపాన్ గుజరాత్‌ని వణికిస్తోంది. రాష్ట్రంలో ‘వాయు’ తుపాన్‌ హెచ్చరికలతో విజయవాడ నుంచి ఆరు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (జాతీయ విపత్తు నిర్వహణ) బలగాలను జూన్ 12వ తేదీన మంగళవారం తరలించారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన IAF - 17 విమానంలో 159 మంది సభ్యులతో పాటు.. విపత్తు నిర్వహణకు కావాల్సిన సామగ్రిని పంపించారు. ఈ బృందం గన్నవరం నుంచి జామ్‌నగర్‌ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తక్కువ సమయంలో తగిన సదుపాయాలు కల్పించామని గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌ మధుసూదనరావు వెల్లడించారు. 

మరోవైపు గుజరాత్‌ తీరాన్ని ‘వాయు’ తుపాన్‌ గురువారం నాడు తాకనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ముందు జాగ్రత్తగా తరలించింది. కచ్‌నుంచి దక్షిణ గుజరాత్‌ వరకూ ఉన్న కోస్తా తీర ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గుజరాత్‌లో స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుజరాత్‌, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలకు సమగ్ర సమాచారాన్ని, సలహాలను అందజేసింది.

వాయు తుపాన్‌ కారణంగా తలెత్తే ఇబ్బందులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేరకు సన్నద్ధమయ్యాయనే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధికారులతో సమావేశమై సమీక్షించారు. తుపాన్‌ తాకిడికి గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అమిత్‌షా అధికారులను ఆదేశించారు. అలాగే కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటలూ పని చేసేలా చూడాలని, కోస్‌గార్డ్‌, నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాలకు చెందిన సిబ్బందిని అప్రమత్తం చేసి సిద్ధంగా ఉంచామని ఆయన అన్నారు. నిఘా విమానాలను రంగంలోకి దింపామని ఆయన చెప్పారు.

vayu cyclone
Vijayawada NDRF
forces
Gujarat
Amith Sha Cyclone

మరిన్ని వార్తలు