అందరికి ఆదర్శం : కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించిన కలెక్టర్

Submitted on 13 June 2019
Vikarabad collector joins her daughter in gurukul

ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలామందికి చిన్నచూపే. సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్య చెప్పరనే అభిప్రాయం ఉంది. దాంతో చాలామంది ప్రైవేట్ స్కూల్స్ లో తమ పిల్లలను చదివించేందుకు ఇష్టపడతారు. ఎంత డబ్బు ఖర్చు అయినా లెక్క చేయరు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వైపే మొగ్గుచూపుతారు. డబ్బున్న వారే కాదు కూలిపనులు చేసుకునే వారు సైతం తమ పిల్లలను ప్రైవేట్స్ స్కూల్స్ కే పంపుతారు. అప్పు చేసి మరీ చదివిస్తారు. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్లది కూడా ఇదే వైఖరి. అలాంటి ఈ రోజుల్లో ఓ జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఆ కలెక్టర్ తన కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తనకున్న విశ్వాసాన్ని చాటుకున్నారు. 

వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం.. తన కూతురు తబిష్ రైనాను వికారాబాద్ పట్టణ శివారు శివారెడ్డిపేట్‌లోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో డే స్కాలర్ గా చేర్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు.. స్టేటస్ పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ లో రూ.లక్షలు ఖర్చు చేసి చదివిస్తున్న ప్రస్తుత రోజుల్లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అందరిలో మార్పు కలిగించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అందుకే తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించానని కలెక్టర్ మస్రత్ ఖానం తెలిపారు. కలెక్టర్ నిర్ణయంతో మైనార్టీ గురుకులాలపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

కలెక్టర్ కి ఒక బాబు, పాప ఉన్నారు. పాప తాబిష్ రైనా.. ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ లో 4వ తరగతి చదివింది. ఈ ఏడాది కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించారు. ఏకంగా జిల్లా కలెక్టర్ తన కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించడం పట్ల.. తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ నిర్ణయం ఆదర్శప్రాయం అన్నారు. సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా విద్యాబోధన ఉంటుందని షఫీయుల్లా చెప్పారు. ఇలాంటి వాటితో సర్కారీ విద్యపై మరింత నమ్మకం పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

vikarabad collector
Ayesha Masrath Khanam
Daughter
Government School
Telangana
Minorities
Residential
educational
gurukul

మరిన్ని వార్తలు