మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ : కత్తులతో వచ్చిన దొంగలను తరిమికొట్టిన వృద్ధ దంపతులు

Submitted on 12 August 2019
viral video, old couple fight with thieves

దొంగలను చూస్తేనే ప్రాణ భయంతో ఒళ్లంతా చెమట్లు పడతాయి. భూమి కింద నేల కదిలిపోతోంది. కాళ్లు చేతులు వణుకుతాయి. ఇక వారి చేతులో కత్తులు, కటార్లు ఉంటే.. అంతే సంగతులు. పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఆ వృద్ధ దంపతులు మాత్రం సాహసం చేశారు. గుండె ధైర్యంతో దొంగలను ఎదురించారు. కత్తులతో వచ్చిన దొంగలపై తిరగబడ్డారు. ప్లాస్టిక్ కుర్చీలతో భార్య, భర్తలు పోరాటం చేశారు. దొంగలు కత్తులతో మీదికి వచ్చినా వారు భయపడలేదు. చివరికి ఆ దొంగలు కాళ్లకి పని చెప్పారు. వృద్ధ దంపతుల పోరాటం ముందు నిలవలేక అక్కడి నుంచి పారిపోయారు.

తమిళనాడు తిరునల్వేలిలోని కల్యాణపురంలో ఈ ఘటన జరిగింది. తమపై దాడికి వచ్చిన దుండగులను తీవ్రంగా ప్రతిఘటించి తరిమికొట్టారు ఓల్డ్ కపుల్. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో వీరి సాహసం ప్రపంచానికి తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

రాత్రి సమయంలో ఇంటి బయట వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన దొంగ వెనక నుంచి దాడి చేశాడు. తువాల్ తో అతడి మెడను బిగించాడు. తప్పించుకునేందుకు పెద్దాయన తీవ్రంగా     ప్రయత్నించాడు. ఇంతలో మరో వ్యక్తి కూడా ఎంటర్ అయ్యాడు. ఇద్దరూ మంకీ క్యాప్‌లు ధరించి ఉన్నారు. బయట అరుపులు, కేకలు విన్న పెద్దావిడ.. లోపలి నుంచి బయటికి వచ్చింది. అక్కడ జరుగుతున్న దాన్ని చూసి షాక్ తింది. వెంటనే తేరుకుని దొంగలపై తిరగబడింది. దొంగలు లోపలికి వెళ్లకుండా ముందుగా ఆమె ఇంటి తలుపులు మూసివేసింది.

చేతికి దొరికినదాన్ని దొంగలపైకి విసరడం మొదలుపెట్టింది. చెప్పులు, చెత్త బుట్టలు, ప్లాస్టిక్ కుర్చీల ఇలా ఏది దొరికితే అది వారిపైకి విసిరింది. పెద్దావిడ అటాక్ తో కంగుతిన్ని దొంగలు.. వృద్ధుడిని వదిలేసి ఆమె మీదకి వెళ్లారు. ఇంతలో పైకి లేచిన వృద్ధుడు తన శక్తినంతా కూడదీశాడు. దొంగలపైకి తిరగబడ్డాడు. దొంగల చేతిలో కత్తులున్నా భయపడకుండా వృద్ధులిద్దరూ ఎదురు దాడి చేశారు. ఒక్కసారిగా వృద్ధుల నుంచి ప్రతిఘటన ఎదురవ్వడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధ దంపతుల ధైర్య సాహసాలను పోలీసులు అభినందించారు. నెటిజన్లు సైతం ఆ ఓల్డ్ కపుల్ ని ప్రశంసిస్తున్నారు. మీ గుండె ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. దొంగలకే చెమట్లు పట్టించిన మీరు వృద్ధ దంపతులు కాదు వృద్ధ వీరులు అని పొగుడుతున్నారు.

Also Read : జియో గిగా ఫైబర్ ఆఫర్ : 4K టీవీ, సెట్ టాప్ బాక్స్, DTH ఫ్రీ

old couple
fought
thieves
Viral Video
Tamil Nadu
Robbery
tirunelveli
daring

మరిన్ని వార్తలు