టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పక్ష నేత ఎవరు?

Submitted on 13 June 2019
Who is the TRS Parliamentary Leader?

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ తరపున ఎవరు గళం వినిపించబోతున్నారు? టీఆర్‌ఎస్‌ పక్ష నేతగా కేసీఆర్ ఎవరిని నియ‌మించ‌బోతున్నారు? కీలక నేతల ఓటమి కారణంగా లోక్‌సభలో కొత్త లీడర్‌ను వెతికే పనిలో పడ్డారు గులాబీ బాస్. గురువారం (జూన్ 13, 2019) పార్లమెంట్‌ క‌మిటీ స‌మావేశంలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ ప‌క్ష నేత‌ను నిర్ణయించనున్నారు.

(జూన్ 17, 2019) నుంచి పార్లమెంట్ స‌మావేశాలు ప్రారంభమవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ తరపున పార్లమెంటరీ పక్ష నేతను నియమించలేదు. లోక్‌సభ వేదికగా జాతీయ స్థాయిలో తెలంగాణ గళాన్ని వినిపించే నేత కోసం కేసీఆర్‌ వెతుకుతూనే ఉన్నారు. సీనియర్‌ నేత అయిన జితేందర్ రెడ్డి బీజేపీ గూటికి చేరగా.. మరో సీనియర్ నేత వినోద్ కుమార్ ఓడిపోయారు. కవిత కూడా ఓడిపోవడంతో ఎవరిని నియమించాలన్నది ఇబ్బందికరంగా మారింది. ఈక్రమంలో ఇవాళ ప్రగతి భవన్‌లో జరుగబోయే పార్లమెంటరీ కమిటీ సమావేశం ఆసక్తిగా మారింది. 

రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగనున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 9 మంది ఎంపీల్లో ఒకరికి లోక్‌సభాపక్ష నేత, మరొకరికి ఉపనేత పదవి దక్కనున్నాయి. రెండుసార్లు గెలిచి పార్లమెంటులో పనిచేసిన అనుభవం ఉన్న నేత కోసం సీఎం కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ప్రధానంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ ఉన్నారు. బీబీ పాటిల్ కు సరైన వాగ్ధాటి లేదని, కొత్త ప్రభాకర్ రెడ్డికి భాషా సమస్య ఇబ్బందిగా మారింద‌ని పార్టీలో చర్చించుకుంటున్నారు. రెండోసారి గెలిచిన పసునూరి దయాకర్ కూడా మంచి వక్తేమి కాదని చర్చించుకుంటున్నారు. దీంతో నామా నాగేశ్వరరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. 

టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటరీ పక్ష నేతగా పని చేసిన అనుభవం నామాకు ఉంది. కానీ ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చిన నామాకు ఈ పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. దీంతో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు పార్లమెంటుకు కొత్త ముఖం అయినా.. సీనియర్‌ నేత కావడంతో సీఎం కేసీఆర్ ఈయన పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తొలిసారి ఎంపీ అయినప్పటికీ కార్పోరేట్ అడ్మిస్ట్రేటర్‌గా అనుభవం ఉండంతో అయ‌న పేరును కూడా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా రాష్ట్రం తరపున గళం విప్పడం, కేంద్రానికి టీఆర్‌ఎస్‌కు మధ్య మంచి సంబంధాలు నెలకొల్పే నేత కోసం సీఎం కేసీఆర్‌ సెర్చింగ్‌లో ఉన్నారు. 
 

who
TRS
Parliamentary Leader
Hyderabad
Parliament Committee Meeting

మరిన్ని వార్తలు