స్ఫూర్తిగా నిలుస్తున్నారు : స్కూటర్లపై పొలాలకు మహిళా రైతులు

Submitted on 10 June 2019
Woman Farmers Have Empowered Themselves With Scooters In This Telangana Village

రోజులు మారాయి. తరాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు వంటింటికే పరిమితైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలు వివేకంతో ముందుకు సాగుతున్నారు. ఎవరి సాయం లేకుండా పురుషులపై ఆధారపడకుండా సొంతంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వ్యవసాయ పనుల్లోనూ చురుకుగా పాల్గొంటూ తామేమి తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు.

మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీపూర్ గ్రామ మహిళలు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇంటి పనుల్లోనే కాదు.. పొలం పనుల్లోనూ ఎవరి సాయం లేకుండానే మహిళా రైతులంతా సొంతంగా స్కూటర్లపై డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి వస్తున్నారు. పొలాలకు త్వరగా చేరుకునేందుకు స్కూటర్లను వినియోగించుకుంటున్నారు. సొంతంగా తమ పనులు చేసుకోవడమే కాకుండా ఇతర మహిళా కూలీలకు కూడా సాయపడుతున్నారు. 

అందరికి ఆదర్శంగా : 
జగిత్యాల జిల్లాలో లక్ష్మీపూర్.. ఓ చిన్న గ్రామం. ఈ గ్రామంలో కేవలం 5వేల మంది వరకు నివసిస్తున్నారు. 12వందల కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ గ్రామంలోని మహిళలు రోజూ తమ పొలాలకు త్వరగా చేరుకుంటున్నారు.

బస్సుల కోసం గంటల కొద్ది ఎదురుచూడకుండా కొన్ని నిమిషాల వ్యవధిలోనే చేరుకుంటున్నారు. పొలానికి వెళ్లేందుకు మహిళా రైతులంతా స్కూటర్లను వినియోగించుకుంటున్నారు. స్కూటర్లపై పొలాల్లో పండించిన కూరగాయలను జగిత్యాల టౌన్ మార్కెట్, సమీప మార్కెట్లకు నేరుగా తీసుకెళ్లి విక్రయిస్తున్నట్టు ఓ నివేదిక తెలిపింది. 

ఎస్. సరిత అనే మహిళా రైతు మాట్లాడుతూ.. పురుషుల్లానే తాము కూడా రెండింతలు కష్టపడుతున్నామని, వ్యవసాయ పనుల నిమిత్తం వారిలాగే దూరం వెళ్లేందుకు స్కూటర్ల సాయంతో పనులు పూర్తిచేసుకుంటున్నట్టు తెలిపింది. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు వెళ్లేందుకు స్కూటర్లు ఎంతో హెల్ప్ అవుతున్నాయిని, సమయం కూడా ఎంతో ఆదా అవుతుందని సరిత తెలిపింది.

గ్రామంలోని 70 మంది మహిళా రైతులు తమ పొలాలకు స్కూటర్లపై వెళ్తుండగా.. వారికి ఇంట్లో మగవారు కూడా అవసరమైన మేరకు సాయం అందిస్తున్నారు. వరి, పసుపు, అల్లం, అరటి, శనగలు, కూరగాయల పంట్లను ఇక్కడ ప్రధానంగా పండిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది మహిళా రైతులే ఉండటం విశేషం. 

Woman Farmers
Scooters
Telangana Village
 Jagtial district
Lakshmipur village 

మరిన్ని వార్తలు