Home » మోడీకి చిన్నారి లేఖ : పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే
Published
2 years agoon
పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశం రగిలిపోతోంది. 40మంది జవాన్లను కోల్పోయి దేశం కన్నీరుపెడుతోంది. ఉగ్రదాడికి కారణమైన జైషే మహమద్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అందరూ ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. ఈ సమయంలో ఓ 10 ఏళ్ల చిన్నారి ప్రధాని నరేంద్రమోడీకి రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుజరాత్ లోని సూరత్ జిల్లాకు చెందిన మనాలి(10) నాలుగో తరగతి చదువతోంది. పుల్వామా జిల్లాల్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వార్త టీవీలో చూసి తెల్సుకున్న మనాలి చాలా భాధపడింది. తాను ప్రధానితో మాట్లాడాలని అనుకొంటున్నానని తన తల్లితో చెప్పింది. ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యం కాదని, చెప్పదల్చుకొన్నది లేఖ ద్వారా తెలియజేయమని తల్లి ఇచ్చిన సూచనమేరకు మనాలి ప్రధానికి రాసిన లేఖలో.. మోడీ గారు..మీపై నమ్మకముంది. మీరు ఏది చేసినా మంచే చేస్తారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కరిని కాల్చి చంపెయ్యాలని కోరింది. అలాంటి వాళ్లను చంపడం పాపం కాదని, దుర్మార్గులను చంపడం తప్పేమీ కాదని భగవద్గీతలోనూ చెప్పినట్లు మనాలీ గుర్తుచేసింది. మనాలి ప్రధానికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనాలి దేశభక్తిని అందరూ మొచ్చుకుంటున్నారు. చిన్నదానివైనా మనసునిండా దేశభక్తి నింపుకొన్న మనాలిని చూసి తాము గర్వపడుతున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.