139మంది అత్యాచారం కేసు: యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడిని ఎందుకు ఇరికించారు, మందకృష్ణ ఎందుకు రంగంలోకి దిగారు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 139మంది అత్యాచారం కేసు భారీ మలుపు తీసుకుంది. ఇందులో నిజానిజాలు తెరపైకి వచ్చాయి. తనపై 139మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నల్గొండ యువతి స్వయంగా మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటపెట్టింది. 2009 నుంచి తనపై 5వేల సార్లు అత్యాచారానికి తెగబడ్డారని ఓ ఇంటర్వ్యూలో పలువురి పేర్లను కూడా చెప్పిన యువతి ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. సోమవారం(ఆగస్టు 31,2020) మీడియా ముందుకు వచ్చిన యువతి.. తనపై 139మంది అత్యాచారం చేయలేదని చెప్పింది. డాలర్ భాయ్ అనే వ్యక్తి బెదిరించడంతోనే సెలబ్రిటీల పేర్లను ఫిర్యాదులో చేర్చానని చెప్పింది. అసలు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడులకు అత్యాచారం కేసుతో ఎలాంటి సంబంధం లేదని, వారు అమాయకులు అని క్లీన్ చిట్ ఇచ్చింది.

డాలర్ భాయ్ ఒత్తిడితోనే ప్రదీప్ పేరు:
డాలర్ బాయ్ ఒత్తిడి వల్లనే యాంకర్ ప్రదీప్ పేరు చేర్చినట్లు యువతి తెలిపింది. నటుడు కృష్ణుడుకు కూడా సంబంధం లేదంది. కేసును తప్పు దోవ పట్టించడానికి డాలర్ బాయ్ ప్రయత్నించాడని ఆరోపించింది. చెప్పినట్టు వినకపోతే తన కుటుంబ సభ్యులను చంపేస్తానని డాలర్ భాయ్ బెదిరించినట్లు తెలిపింది. ఇప్పటికీ తన కుటుంబ సభ్యులను చంపడానికి సిద్ధంగా ఉన్నారంది.

నా కుటుంబానికి ప్రాణహాని ఉంది:
డాలర్ బాయ్ తనను చంపడానికి ప్రయత్నించాడని బాధితురాలు చెప్పింది. తనతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా డాలర్ భాయ్ ట్రాప్ చేశాడంది. తాను నరకం అనుభవించానని, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధం లేదని చెప్పినా సెలిబ్రిటీల పేర్లను బలవంతంగా చేర్పించారని, సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగాలని డాలర్ భాయ్ ప్రయత్నించాడని ఆమె చెప్పింది.

నన్ను కొట్టి సెలబ్రిటీలతో మాట్లాడించాడు:
మీడియాతో తనతో బలవంతంగా మాట్లాడించారని, తనను కొట్టి సెలబ్రిటీలతో మాట్లాడించారని బాధితురాలు చెప్పింది. తన ఫొటోలు ఎవరికీ పంపించ లేదని, అవి వైరల్ అవుతున్నాయని, తన ఫొటోలు వాడొద్దని, వాడి ఉంటే వాటిని తీసేయాలని ఆమె మీడియాని కోరింది. తన ఫిర్యాదులో కూడా తాను పేరు చెప్పలేదని, దిశ అని మాత్రమే పేర్కొన్నానని ఆమె చెప్పింది. తన వ్యక్తిగత వివరాలు సేకరించి రాస్తున్నారని ఆమె చెప్పింది.

యువతి అత్యాచారం కేసులో ప్రదీప్ లేడు:
బాధితురాలికి అండగా నిలిచిన పలు కుల, మహిళా సంఘాలు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ కేసుతో యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు సంబంధం లేదని వివరించారు. ఇటువంటి సంఘటన చూస్తే పూలన్ దేవి గుర్తుకొచ్చిందని, పూలన్ దేవీ మీద ఎన్నోసార్లు అఘాయిత్యాలు జరిగాయని అన్నారు. తాజాగా పీడిత కులానికి చెందిన యువతిపై 139మంది అత్యాచారం చేశారని తెలిసి షాక్ కు గురయ్యానని ఆయన అన్నారు.

READ  139మంది అత్యాచారం కేసు.. డాలర్ భాయ్ కోసం పోలీసుల వేట, ఆఫీసులో అమ్మాయిల సర్టిఫికెట్లు, ఆడియో టేపులు

అత్యాచారం కేసులో 40శాతం మందికిపైగా సంబంధం లేదు:
తాను నిన్న(ఆగస్టు 30,2020) దాదాపు 2 గంటల పాటు బాధితురాలితో మాట్లాడానని, 39 మందిపై రేప్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని చెప్పారు. 139 మందిలో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారని తెలిసిందని చెప్పారు. మరో 30 శాతం మంది ఆమెను మానసికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేశారని, మిగతా 40 శాతం మందికి ఈ కేసుతో సంబంధం లేదని ఆయన వెల్లడించారు. పెళ్లయిన తర్వాత అమ్మాయి జీవితంలో జరిగిన నాలుగు సంఘటనలను బాదితురాలు వివరించిందని ఆయన చెప్పారు.

మొదటి విలన్ మీసాల సుమన్:
ఈ సందర్భంగా కీలక వ్యక్తి పేరుని మందకృష్ణ మాదిగ బయటపెట్టారు. ఎస్ఎఫ్ఐకి చెందిన మీసాల సుమన్ అమ్మాయి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు అమ్మాయి బ్లాక్ మెయిల్ కు గురైందని చెప్పారు. ఆ తర్వాత డాలర్ భాయ్ కూడా అమ్మాయిపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పారు. మీసాల సుమన్ తో పాటు డాలర్ బాయ్‌ను అదుపులోకి తీసుకుని, విచారిస్తే నిజాలు బయటపడతాయని మంద కృష్ణ చెప్పారు.

సీబీఐ విచారణ జరిపించాలి:
యువతి జీవితాన్ని మీసాల సుమన్‌, డాలర్‌ భాయ్‌ నాశనం చేశారని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిని డాలర్‌ భాయ్‌ బెదిరించి యాంకర్ ప్రదీప్‌పై కేసు పెట్టించాడని చెప్పారు. కవిత పీఏ సంతోష్‌రావు యువతిని బెదిరించాడన్నారు. పంజాగుట్ట యువతి ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. యువతికి ప్రాణహాని ఉంది, భద్రత కల్పించాలని మందకృష్ణ మాదిగ అన్నారు.

అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుంటాం:
ఈ కేసులో తొలి విలన్ మీసాల సుమన్ కాగా ఆఖరి విలన్ డాలర్ భాయ్. దళిత జాతికి చెందిన మీసాల సుమన్ యువతి జీవితాన్ని నాశనం చేశాడని మందకృష్ణ చెప్పారు. మీసాల సుమన్, డాలర్ భాయ్ ని అరెస్ట్ చేస్తే ఈ ఎపిసోడ్ ముగుస్తుందన్నారు. కాగా, ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టడంతో మందకృష్ణ మాదిగ రంగంలోకి దిగాల్సి వచ్చింది. మంచి ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిసి ఆయన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుంటామని, అమాయకులు, తప్పు చేయని వారు ఎవరూ ఆ చట్టానికి బలి కాకూడదని ఆయన అన్నారు.

Related Posts