పెళ్లి చేసుకునేందుకు ఒంటరిగా 80కి.మీ నడిచిన యువతి

20-Year-Old Woman In Kanpur Walks 80 km Alone To Get Married

పెళ్లి చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ లో ఓ యువతి ఒంటరిగా 80కిలోమీటర్లు నడిచింది. పెళ్లి చేసుకునేందుకు కాన్పూర్ నుంచి కన్నౌజ్ లోని తన ఫియాన్సీ ఇంటివరకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. చివరకు సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ తనకు నచ్చినవాడితో మూడు ముళ్లు వేయించుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని లక్ష్మణ్ పూర్ తిలక్ గ్రామంలో నివసించే గోల్దీ(20)కి కన్నౌజ్ కి దగ్గర్లోని ఓ గ్రామంలో నివసించే వీరేంద్రకుమార్(23)కి లాక్ డౌన్ కు ముందు వివాహం నిశ్చయమైంది. మే-4న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఇంతలో కరోనా వైరస్ రాకతో దేశంలో లాక్ డౌన్ విధించబడింది. అయితే ఆంక్షల నేపథ్యంలో గోల్దీ తల్లిదండ్రులు ఇప్పటికే వీరి పెళ్లిని రెండు సార్లు వాయిదా వేశారు. అయితే వివాహం నిశ్చమైన రోజు నుంచి గోల్దీ,వీరేంద్రకుమార్  ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు.

రెండు సార్లు పెళ్లి వాయిదా పడటంపై గోల్దీ,వీరేంద్రకుమార్ బాధపడ్డారు. అయితే ఈ లాక్ డౌన్ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందో,ఇప్పుడల్లా సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కన్పించడం లేదని భావించి ఎలాగైనా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో తన గ్రామం నుంచి వీరేంద్రకుమార్ గ్రామం వరకు దాదాపు 80 కిలోమీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది గోల్దీ.  వీరేంద్రకుమార్ కుటుంబం ఓ పురాతన ఆలయంలో వీరి పెళ్లికి ఏర్పాటు చేసింది. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు పాటిస్తూ తనకు నచ్చిన వాడితో మూడు ముళ్లు వేయించుకుంది గోల్దీ. పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు ఇద్దరూ మాస్క్ లు ధరించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా గడిచిన రెండు నెలల్లో వేలసంఖ్యల్లో వివాహాలు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాం చేసుకోగా,మరికొందరు వర్చువల్ వివాహాలు కూడా చేసుకున్నారు. చాలామంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 5,700దాటింది. దాదాపు 130మంది ప్రాణాలు కోల్పోయారు.

Read: లాక్‌డౌన్ వల్లే ప్రాణాలతో ఉన్నాం.. 78వేల మందిని కాపాడుకున్నాం!

మరిన్ని తాజా వార్తలు