Categories
Education and Job

ఏపీ బంద్‌ : ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి1, 2019 శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి1, 2019న జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వాయిదా పడిన ఈ పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంతోపాటు విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక హోదా సాధనసమితి ఫిబ్రవరి1, 2019 శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Categories
Business International

పెద్ద వజ్రం : 552 క్యారెట్ల బరువున్న డైమండ్ గుర్తింపు

ఉత్తర అమెరికాలో 552 క్యారెట్ల బరువు కలిగిన భారీ డైమండ్ ను కనుగొన్నారు.

న్యూయార్క్ : ఉత్తర అమెరికాలో 552 క్యారెట్ల బరువు కలిగిన భారీ డైమండ్ ను కనుగొన్నారు. కెనడా వాయువ్య ప్రాంతంలో డొమినియమ్ వజ్రాల గనిలో ఈ డైమండ్ ను గుర్తించారు. 552 క్యారెట్ల బరువుతో పసుపు రంగులో మెరిసిపోతున్న ఈ డైమండ్ దాదాపు కొడిగుడ్డంత పరిమాణంలో ఉంది. ఇప్పటివరకు కొనుగొన్న పెద్ద వజ్రాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. బరువునే పేరుగా 552 అని ఈ వజ్రాన్ని పిలుస్తున్నారు. న్యూయార్క్ లోని ఫిలిప్స్ వేలం కేంద్రంలో అదివారం వరకు ఈ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. 

Categories
Business National

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్ : అదనపు డాటా సేవలు కొనసాగింపు 

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు వినియోగదారులకు అందిస్తున్న అదనపు డాటా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది.

ఢిల్లీ : వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్‌ జియోకు పోటీ ఇచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వినియోగదారులకు అందిస్తున్న అదనపు డాటా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది. సెలక్ట్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో అందిస్తున్న రోజుకు 2.2జీబీ డాటా ఆఫర్‌ను ఏప్రిల్‌30 వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ అదనపు డాటా ఆఫర్‌ రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ. 999 ప్రీపెయిడ్ మొబైల్‌ రీఛార్జ్‌పై, రూ.187, రూ.333, రూ.349, రూ.444, రూ. 448 ప్రీపెయిడ్ ఎస్టీవీ రీఛార్జ్ పై అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటితో పాటు ఒక సంవత్సరం వర్తించేలా ఎస్టీవీ1699, ఎస్టీవీ2099 రీఛార్జ్‌లను కూడా ఈ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది.

మరో టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్‌-ఐడియా కూడా సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చిది. రూ.154తో రీఛార్జ్‌ చేసుకుంటే 600 నిమిషాల లోకల్‌ వాయిస్‌ కాల్స్‌ను ఆరు నెలలు వర్తించేలా అందిస్తున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే ఇతర నెట్‌వర్క్‌ లోకల్, నేషనల్ కాల్‌ అయితే సెకన్‌కు 2.5 పైసలు, 10కేబీ డాటాకి 4పైసలు, లోకల్‌ ఎస్‌ఎంఎస్‌కి రూ.1, నేషనల్‌ ఎస్‌ఎంఎస్‌కైతే రూ. 1.5గా కంపెనీ నిర్ణయం తీసుకుంది.
 

Categories
Crime

జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ 

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది.

విజయవాడ : వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. దాడికి ముందే శ్రీనివాసరావు ఫుడ్ కోర్టులోని సహ ఉద్యోగులతో చర్చించినట్లు చార్జిషీట్ లో పేర్కొంది. జగన్ గాయం తీవ్రమైనది కాదని ఎన్ఐఏ రిపోర్ట్ తెలిపింది. జగన్ ఎడమ భుజంపై గాయమైందన్న డాక్టర్ నివేదికను చార్జిషీట్ లో ప్రస్తావించింది. సిట్ రిపోర్టుతోపాటు ఎన్ఐఏ ఏకీభవించింది. 

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జగన్ పై దాడి కేసు ఏపీలో సంచలనం కలిగించింది. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై సీఎం చంద్రబాబు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. 

Categories
Hyderabad Political

కేబినెట్‌ విస్తరణ ఎప్పుడు : ఆ ఇద్దరికి చోటుదక్కేనా?

తెలంగాణ కేబినెట్‌ విస్తరణ ఎప్పుడు.. మంత్రివర్గాన్ని విస్తరిస్తే కేటీఆర్, హరీష్‌రావుకు చోటు ఉంటుందా.. ఉండదా?

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ విస్తరణ ఎప్పుడు.. మంత్రివర్గాన్ని విస్తరిస్తే కేటీఆర్, హరీష్‌రావుకు చోటు ఉంటుందా.. ఉండదా? ఏ ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు కలిసినా.. ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. రెండోసారి అధికారం చేజిక్కించుకున్న సీఎం కేసీఆర్.. మంత్రివర్గ విస్తరణకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. తొలి విడ‌త‌లో కేసీఆర్‌తో పాటు హోం మంత్రి మ‌హమూద్ అలీ ప‌ద‌వీ బాధ్యతలు చేప‌ట్టారు. రెండో విడ‌త మంత్రి వ‌ర్గ విస్తర‌ణ కోసం టీఆర్ఎస్‌ నేతలు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే టీఆర్ఎస్‌ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుకు ఈ విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందా.. లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

 
కేసీఆర్ సెంటిమెంట్ కు అనుగుణంగా శుభముహూర్తాల స‌మ‌యం కూడా వ‌చ్చింది.   ఫిబ్రవ‌రి  5 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుంది. ఆర‌వ తేదీ తర్వాత… మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడైనా జ‌రిగే  అవ‌కాశాలున్నాయ‌ని  తెలుస్తోంది.  అయితే ఈ విడతలో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ జరగకపోవచ్చని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరుతుందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మినీ కేబినెట్‌ ఏర్పాటు చేస్తే కేటీఆర్, హరీష్‌రావుకు చోటు ఉండబోదన్న వార్తలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాతే వీరిని కేబినెట్‌లోకి తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మంత్రి వ‌ర్గంలో కొందరికే ఛాన్స్‌ ఉండటంతో.. వారికి స‌హాయ‌కులుగా పార్లమెంట‌రీ కార్యద‌ర్శుల‌ను నియ‌మించేందుకు  సీఎం కేసీఆర్  నిర్ణయం తీసుకున్నార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన సీఎం కేసీఆర్.. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారో వేచి చూడాలి మరి.

Categories
Hyderabad

ఎంపీ కవితకు శ్రేష్ట్ సంసద్ అవార్డు 

తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే తనకు శ్రేష్ట్ సంసద్ అవార్డు లభించిందని ఎంపీ కవిత అన్నారు.

ఢిల్లీ : ఎంపీ కవిత శ్రేష్ట్ సంసద్ అవార్డును అందుకుంది. ఫేమ్ ఇండియా ఏషియా ఫోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కవితకు వివిధ అంశాలలో 90 శాతంపైగా పాయింట్లు దక్కాయి. తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామాజిక సేవా దృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఎంపీ కవితకు అవార్డు దక్కింది. ఫేమ్ ఇండియా దేశవ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే తనకు అవార్డు లభించిందన్నారు.

మరింత ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రిజర్వేషన్ల కోసం పోరాడుతామన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొసాగిస్తామని పేర్కొన్నారు.

Categories
Hyderabad Movies

సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తా : సిరివెన్నెల 

పద్మశ్రీ అవార్డుకు తనను సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు.

హైదరాబాద్ : సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువగా ప్రేమిస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. పద్మశ్రీ అవార్డుకు తనను సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఆయన తెలిపారు. తెలుగు చలన చిత్ర మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. లక్షల మంది తెలుగువారు నాకు పద్మశ్రీ రావాలని కోరుకున్నారని తెలిపారు.

’నా సాహితీ వ్యవసాయానికి అందిన ఫలసాయం పద్మశ్రీ’ అని అన్నారు. ’ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా పాటలు రాశా’ అని పేర్కొన్నారు. ’నాకు కఠినమైన పాట రాసేంత భాష రాదు’ అని అన్నారు. సినిమా వల్ల సమాజం ఎప్పుడూ చెడిపోదని.. సినిమా అనేది అద్దం లాంటిదని అభిర్ణించారు. సినిమా అనేది అత్యంత ధర్మమైన వ్యాపారమన్నారు. 

Categories
Crime Hyderabad

జూబ్లీహిల్స్ వెంకటగిరిలో కార్డన్ సెర్చ్ 

జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 150 పోలీసులు పాల్గొన్నారు. 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలులేని 43 బైకులు, 10 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. నగరంలో పోలీసులు తరచూ కార్డన్ సెర్చ్, డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అనునిత్యం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతూ కొంతమంది, మద్యం తాగి డ్రైవ్ చేస్తూ మరికొంతమంది పట్టుపడుతున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేస్తున్నారు. 

Categories
Political

కేసులు ఎత్తివేత, పెన్షన్లు పెంపు : ఏపీ కేబినెట్ నిర్ణయాలు

అమరావతి: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించారు. కాపులకు

అమరావతి: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. పెన్షన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే.. నాయీ బ్రాహ్మణులకు 150యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నాలుగన్నర గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది.

 

* సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత
* జీవితఖైదు అనుభవిస్తున్న 33మందికి విముక్తి
* పెన్షన్ల పెంపునకు ఆమోదం
* డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయం
* కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం
* అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులపై నిర్ణయం
* హైకోర్టులో రూ.250కోట్లు డిపాజిట్ చేసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని నిర్ణయం

Categories
Hyderabad

వీళ్లు మారరు : బతికుండగానే చంపేసిన డాక్టర్లు

సికింద్రాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం మరోసారి వెలుగు చూసింది. బతికి ఉన్న యువకుడిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2019, జనవరి 28వ తేదీన రోడ్డు

సికింద్రాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం మరోసారి వెలుగు చూసింది. బతికి ఉన్న యువకుడిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2019, జనవరి 28వ తేదీన రోడ్డు ప్రమాదంలో భాను అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. భాను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. భాను తండ్రి పఠాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్లు చనిపోయినట్లు చెప్పడంతో శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. అయితే భాను బతికే ఉన్నట్లు మరో డాక్టర్‌ తేల్చడంతో.. తిరిగి వైద్య పరీక్షలు ప్రారంభించారు.