Categories
Political

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి (69) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సమస్యల కారణంగా మరణించినట్లు హాస్పిటల్ వారు తెలిపారు. ఏప్రిల్ 3నుంచి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. విషమ పరిస్థితుల్లో వెంటిలేటర్‌పైనే చికిత్స తీసుకుంటుననారు. 

2014 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలోకి చేరిన ఆయనకు నంద్యాల సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ టీడీపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఆయన ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. వయస్సు పైబడటంతో ప్రచారం చేస్తున్నప్పటి నుంచే కొద్దిపాటి అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. 

Categories
Hyderabad

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వాటి దగ్గర ఇంజనీర్లు, సిబ్బందికి క్వార్టర్లు, వాచ్ టవర్లు నిర్మించాలని తెలిపారు. సబ్ స్టేషన్ దగ్గర విద్యుత్ అధికారుల నివాసం కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మేడిగడ్డ బ్యారేజీ దగ్గర పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్యారేజీల దగ్గర రెండు చొప్పున హెలిప్యాడ్లు నిర్మించాలని చెప్పారు. కాల్వలు తెంపకుండా ప్రభుత్వమే తూములు ఏర్పాటు చేస్తోందన్నారు. చెరువులను నింపడంతోపాటు వర్షపు నీటితో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతమున్న హెచ్‌ఎఫ్‌ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్‌ఎఫ్‌ఎల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత, సీఎస్ ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

Categories
Crime Hyderabad

ఉస్మానియా యూనివర్సిటీలో గుర్తు తెలియని మృతదేహం 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ చెరువు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరణించిన వ్యక్తికి 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

డాగ్ స్క్వాడ్ తో , క్లూస్ టీంతో సంఘటనా స్ధలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. చనిపోయినవ్యక్తి, విద్యార్ధా, లేక బయటి వ్యక్తా అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాచిగూడ ఏసీపీ సుధాకర్, ఓయూ సీఐ రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది.

Categories
National

మోడీకి ఈసీ క్లీన్ చిట్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని వార్దా సిటీలో ఏప్రిల్-1,2019న వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ పోటీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందంటూ ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ నేతలు కంప్లెయింట్ చేసిన విషయం తెలిసిందే.అయితే మోడీ ఎటువంటి కోడ్ ఉల్లంఘనకు పాల్పడలేదంటూ మంగళవారం(ఏప్రిల్-30,2019) ఎలక్షన్ కమిషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.

 వార్దాలో ఏప్రిల్-1,2019న ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ హిందువులను అవమానించింది. కాంగ్రెస్ నిర్ణయానికి ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలి. ఆ పార్టీ నేతలు హిందు మెజారిటీ ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి భయపడుతున్నారు. అందుకే మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు సిద్దమయ్యారు అని మోడీ అన్నారు.

 

Categories
Political

లక్ష్మీస్ ఎన్టీఆర్ : ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే 

అమరావతి : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు విఘ్నాలు వీడలేదు.  గత 2 రెండురోజులుగా ఏపీలో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం నడుస్తోంది. ఈ సినిమా ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా గత నెలలోనే విడుదలైంది. కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సినిమా విడుదల కాలేదు.  సినిమాను మే1 న విడుదల చేయటానికి ఆర్జీవీ ప్లాన్  చేసుకుని, రెండు రోజుల క్రితం విజయవాడలో ప్రెస్ మీట్ పెడదామనుకుంటే ఏపీ పోలీసులు ఆయన్ని అడ్డగించారు. ఆఖరికి ఆయన్ని ఎయిర్ పోర్టు దాటి బయటకు రానివ్వలేదు. ప్రెస్ మీట్ విషయమై ఆర్జీవీ చేసుకున్న అన్నిప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ పరిణామాల మధ్య ఆర్జీవీ ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి సినిమా విడుదల విషయమై లేఖ రాశారు. ఆర్జీవీ లేఖకు ద్వివేది మంగళవారం తన స్పందన తెలియచేశారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం  జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు.  దేశవ్యాప్తంగా బయోపిక్ లపై నిషేధం విధిస్తూ ఏప్రిల్ 10 న ఈసీ  ఆదేశించిన విషయం తెలిసిందే.  కనుక మే 23న ఎన్నికల  ఫలితాలు వచ్చేంతవరకు ఏపీలో  ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని , బయోపిక్ లపై నిషేధం కొనసాగుతుందని ద్వివేది స్పృష్టం చేసారు. 

Categories
Crime

కిడ్నాప్‌ డ్రామా : యువతిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ప్రియుడు

పశ్చిమగోదావరి జిల్లాలో విస్సాకోడేరులో కిడ్నాప్‌ డ్రామా కలకలం రేపింది. విస్సాకోడేరులో ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రియురాలి స్కెచ్‌ వేసింది. తల్లితో కలిసి బయటకు వచ్చిన యువతిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ప్రియుడు. పోలీసుల కథనం ప్రకారం.. అరుణ కుమారి, అనూష తల్లీకూతురులు. వీరు పాలకొల్లు మండలం పూలపల్లిలో నివాసం ఉంటున్నారు. 

అనూష తల్లితో కలిసి విస్సాకోడేరుకు వెళ్లారు. అక్కడే అనూష ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. ఈక్రమంలో నయంతుల్లా అనే యువకుడితో అనూషకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి ఆరునెలలుగా పరిచయం ఉంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే అనూషను తల్లి ఇంటి నుంచి బయటికి వెళ్లనివ్వలేదు. ఈక్రమంలో మంగళవారం (ఏప్రిల్ 30, 2019)న విస్సాకోడేరు దగ్గర తల్లితో కలిసి వెళ్తున్న అనూషను నయంతుల్లా బలవంతంగా కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేశాడు. తల్లి అరుణ కుమారి అడ్డుకునే ప్రయత్నంలో ఆమె చీర కారు డోర్ లో ఇరుక్కుపోవడంతో ఒక్కసారిగా కారు ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలోనే కారును కంగారుగా డ్రైవ్ చేసిన నయంతుల్లా ఎదురుగా ఉన్న స్థంభాన్ని ఢీకొట్టడంతో కారు టైర్ పగిలిపోయింది. కారు రీమ్ తోనే దాదాపు పది కిలో మీటర్లు వెళ్లాడు. వెనుకాల బైక్ పై వస్తున్న కొంతమంది యువకులు కారును ఛేజ్ చేసి పట్టుకున్నారు. వెంటనే నయంతుల్లాకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో కిడ్నాప్ డ్రామా అంతా ఒక్కసారిగా బయటపడింది. కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

అనూష తనకు మెసేజ్ లు పెట్టి ఏదో ఒక రకంగా ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లమని చెప్పిందని నయంతుల్లా పోలీసులకు చెప్పాడు. ‘దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు. వీరిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఉన్న విషయం తెలియదు. కావాలని నా కూతురిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పోతున్నాడు’ అని తల్లి అరుణ కుమారి చెబుతోంది. ‘నాకు మత్తుగా ఉందని, బలవంతంగా కారులో ఎక్కించుకుని పోతున్నాడు’ అని అనూష పోలీసులకు చెబుతోంది. ‘ఇద్దరి మధ్య పరిచయం లేదు, కావాలని తీసుకెళ్తున్నారు’ అని తల్లి చెప్పిన దాన్ని వాంగ్మూలంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  
 

Categories
International

నాలుగు టన్నుల ఏనుగు దంతాలు తగలబెట్టిన మలేషియా

దాదాపు టన్నుల ఏనుగు దంతాలను,వాటితో తయారు చేసిన ఉత్పత్తులను బుధవారం(ఏప్రిల్-30,2019)మలేషియా అధికారులు తగలబెట్టారు.తగులబెట్టినవాటి విలువ 3.22 మిలియన్ డాలర్లు ఉటుందని అధికారులు తెలిపారు.ఆఫ్రికా నుంచి మలేషియా సరిహద్దుల మీదుగా చైనాకి,ఆసియాలోని మిగతా దేశాలకు భారీ స్థాయిలో జరుగుతున్న ఏనుగు దంతాల అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్మగ్లర్లు ఏనుగు దంతాలను చైనా, వియత్నాం వంటి మేజర్ అంతర్జాతీయ మార్కెట్‌ లకు అక్రమ రవాణా చేస్తుంటారు.

2011-17 మధ్య కాలంలో మలేషియాలోని ఎయిర్ పోర్టులు,తీర ప్రాంత పోర్టులల్లో 3.92 టన్నుల ఏనుగు దంతాలు,వాటి సంబంధిత ఉత్పత్తులను సీజ్ చేసినట్లు మలేషియా జల, సహజ వనరుల శాఖ మంత్రి జయకుమార్ తెలిపారు. స్మగ్లర్లు ఏనుగు దంతాలను చైనా, వియత్నాం,హాంకాంగ్ వంటి దేశాలకు అక్రమ రవాణా చేయడం కోసం మలేషియాను ట్రాన్స్ పోర్ట్ హబ్ గా మార్చుకున్నారని ఆయన తెలిపారు.
 

Categories
Sports

వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. టాస్ పడిన తర్వాత ఊపందుకున్న వర్షం గంటసేపు జోరుగా కురవడంతో కాసేపటి వరకూ ఆపేశారు. స్టేడియంకు వచ్చిన అభిమానులు మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ గడిపారు.

టాస్ వేసే సమయంలో వాతావరణం అనుకూలిస్తుందని భావించిన కెప్టెన్లు దానికి తగ్గట్లు జట్టు ఎంపిక చేశారు. మ్యాచ్‌పై వర్షం ప్రభావం కచ్చితంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. లీగ్ పట్టికలో ఆఖరి నుంచి వరుసగా రెండు స్థానాల్లో ఉన్న జట్లు కావడంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠత నెలకొంది. లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లు ఆడగా రాజస్థాన్ 5, బెంగళూరు 4విజయాలు నమోదుచేశాయి. 

Categories
National

కమల్ నాథ్ సర్కార్ కు మాయా వార్నింగ్

కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును సమీక్షిస్తామని మాయావతి హెచ్చరికలు చేశారు. గుణ బీఎస్పీ అభ్యర్థిని ఎన్నికల రేసు నుంచి బలవంతంగా కాంగ్రెస్ తప్పించిందని, దీనికి తమ పార్టీ గట్టి సమాధానం ఇస్తుందని మాయా అన్నారు. గుణ లోక్ సభ బీఎస్పీ-ఎస్పీ కూటమి అభ్యర్థి లోకేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఎన్నికల రేసు నుంచి తప్పుకుని కాంగ్రెస్‌ లో చేరిన సందర్భంగా మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం లోకేంద్ర సింగ్ కాంగ్రెస్‌ లో చేరడంతో పాటు గుణ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు ప్రకటించారు.కాంగ్రెస్ ఫ్యామిలీలోకి లోకేంద్రసింగ్ ను ఆహ్వానిస్తున్నామని సింధియా అన్నారు.ఆరో విడతలో భాగంగా మే- 12,2019న గుణలో పోలింగ్ జరుగనుంది.

2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230స్థానాలకు గాను కాంగ్రెస్ 114 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.బీజేపీ 109 సీట్లకు పరిమితమైంది.అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 116మంది ఎమ్మెల్యేల అవసరం ఉండటంతో బీఎస్పీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు,ఎస్పీకి చెందిన ఒక ఎమ్మెల్యే, నలుగురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 

Categories
Crime Hyderabad

శ్రీనివాస రెడ్డి సైకో కిల్లర్ : మహేష్ భగవత్ 

హైదరాబాద్: సీరియల్ రేప్స్ అండ్ మర్డర్స్ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని రావిరాల గ్రామంలో ఉండగా అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. 2015 నుండి ఇప్పటి వరకు నిందితుడు ముగ్గురు మైనర్ అమ్మాయిలపై అత్యాచారం చేసి హత్య చేశాడని ఆయన తెలిపారు. “2015లో కల్పన అనే 11 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేశాడు. డెడ్ బాడీని గొనె సంచిలో చుట్టి బావిలో పడేశాడు. 2015 సెప్టెంబర్ 28న 38 ఏళ్ల సువర్ణ అనే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో బొమ్మలరామరం పోలీసు స్టేషన్లో కేస్ బుక్ అయ్యింది. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు కొట్టారని, దీనితో అతడు సైకోలా మారాడని” ఆయన వివరించారు. శ్రీనివాస్ రెడ్డి మద్యానికి, గంజాయి కి బానిసై, నీలి చిత్రాలు చూడటం అలవాటుగా చేసుకున్నాడని ఆయన తెలిపారు.

2016లో కర్నూల్ లో సెక్స్ వర్కర్ తో డబ్బుల విషయంలో గొడవ జరగటంతో ఆమెను హత్యచేసి డెడ్ బాడీని వాటర్ ట్యాంక్ లో పడేసి పారిపోయాడు. 2019 మార్చి 9న 17ఏళ్ల  మనీషా పై అత్యాచారం చేసి హత్య చేశాడు. డెడ్ బాడీని బావిలో పూడ్చి పెట్టాడు. ఇప్పుడు శ్రావణి అనే మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేశాడని మహేష్ భగవత్ తెలిపారు. శ్రావణికి మత్తు మందు ఇచ్చి ఆ తరువాత బావిలోకి తోసేశాడు. అనంతరం బావిలోకి దిగి అత్యాచారం చేసి హత్యచేసి డెడ్ బాడీని పూడ్చేశాడని ఆయన చెప్పారు. అయిదు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి నిందితుడని, రిమాండ్ తరువాత కస్టడీలోకి తీసుకొని మరోసారి విచారిస్తామని పోలీసు కమీషనర్ తెలిపారు.  ఎవరైనా అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి బైక్ కానీ, స్కూటర్ కానీ  ఎక్కమంటే, నమ్మి వారి బైక్ లు స్కూటర్లు ఎక్కవద్దు అని, ఈ విషయమై తల్లిదండ్రులు పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని ఆయన సూచించారు.