Categories
Uncategorized

పవన్ కళ్యాణ్ టీడీపీ కోవర్ట్ : మంత్రి పెద్దిరెడ్డి

పవన్ కళ్యాణ్ టీడీపీ కోవర్ట్ అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ 2 స్థానాల్లో పోటీ చేసి ఒక్కచోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదని ఎద్దేవా చేశారు. రాజధానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. టీడీపీ నేతలు భూముల చిట్టాను సబ్ కమిటీ తేలుస్తుందన్నారు.

అమరావతి చుట్టూ కొన్న భూములు పోతాయన్న భయం టీడీపీ నేతల్లో ఉందన్నారు. రాజధాని మారుతుందని మంత్రి బొత్స చెప్పలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రజలకు మేలు జరిగేలా రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెల 5న నూతన పాలసీని ప్రకటిస్తామని చెప్పారు. 
 

Categories
Crime Hyderabad

కుటుంబంలో విషాదం నింపిన టిక్ టాక్ : పోలీసుల నుంచి ఫోన్, ఆ వెంటనే ఆత్మహత్య

టిక్ టాక్ లో పరిచయం చివరికి విషాదంగా మారింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నేతాజీనగర్ నివాసి సాయి(24) జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట కర్నూలుకి చెందిన ఓ యువతితో సాయికి టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని సాయి తన అవసరాలకు యువతి నుంచి నగలు తీసుకున్నాడు. వ్యక్తిగత అవసరాల కోసం వాటిని తాకట్టు పెట్టాడు. కొంతకాలం తర్వాత తన నగలు తిరిగి ఇవ్వాలని యువతి సాయిని కోరింది. 

నగలు ఇవ్వకపోవడంతో యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కర్నూలు పోలీసులను ఆశ్రయించారు. సాయి తమ కూతురు దగ్గర డబ్బు, బంగారం తీసుకుని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి మీద ఫ్రాడ్ కేసు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కర్నూలు పోలీసులు సాయికి ఫోన్ చేశారు. తమ ముందు హాజరుకావాలన్నారు. కర్నూలు పోలీసుల నుంచి ఫోన్ రావడంతో సాయి తీవ్ర టెన్షన్ కు గురయ్యాడు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని బాగా భయపడ్డాడు. ఇంట్లోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సాయి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యువతి, ఆమె కుటుంబసభ్యులు, కర్నూలు పోలీసులు షాక్ తిన్నారు. సాయి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

టిక్ టాక్ కారణంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. టిక్ టాక్ లో పరిచయాలు ట్రాజెడీకి దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు చెయ్యకపోవడమే మంచిందంటున్నారు. టిక్ టాక్ ద్వారా పరిచయం చేసుకుని అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలూ ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Categories
Uncategorized

పబ్జీ ప్రేమికులకు షాకింగ్ న్యూస్

పబ్జీ.. ఈ ఆన్ లైన్ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారిలో కొందరు చనిపోతుంటే.. మరికొందరు మంచాన పడుతున్నారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా

పబ్జీ.. ఈ ఆన్ లైన్ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారిలో కొందరు చనిపోతుంటే.. మరికొందరు మంచాన పడుతున్నారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా యువతలో మార్పు రావడం లేదు. తాజాగా మరో యువకుడు పబ్జీ కారణంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. వనపర్తికి చెందిన కేశవర్థన్ కి కాలు, చేయి పడిపోయాయి. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. మంచానికే పరిమితం అయ్యాడు. కేశవర్దన్ డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. నెల రోజుల నుంచి మొబైల్ లో పబ్జీ ఆడుతున్నాడు. రాత్రి, పగలు తేడా లేకుండా గడిపేస్తున్నాడు. రాత్రి పూట దుప్పటి కప్పుకుని మరీ గేమ్ ఆడేవాడు. చివరికి కాలేజీకి వెళ్లినా అదే పని. తల్లి పిలిచినా పట్టించుకోడు. ఆకలి లేదని చెప్పి భోజనం మానేసేవాడు. లేదంటే అరకొరగా తిని అయిందనిపించేవాడు. ఇలా నెల రోజులు ఇదే తీరు. దీంతో అతడి ఆరోగ్యం పూర్తిగా పాడైంది. సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడంతో తీవ్రంగా నీరసించాడు. 

వారం రోజుల క్రితం జ్వరంతోపాటు వాంతులు రావడంతో స్థానికంగా ఓ ఆసుపత్రిలో తల్లి చూపించింది. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకున్నా.. జ్వరం తగ్గలేదు. వాంతుల వల్ల డీహైడ్రేషన్ పెరిగింది. చివరికి బ్రెయిన్ పై తీవ్ర ఒత్తిడి పడి పరిస్థితి విషమించింది. బ్రెయిన్ లో రక్తస్రావమైంది. కేశవర్ధన్ కుడికాలు, చేయి పడిపోయాయి. కంగారు పడిన తల్లి ఆగస్టు 26న సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వినోద్ ఆధ్వర్యంలోని బృందం కేశవర్ధన్ కి ట్రీట్ మెంట్ చేసింది. 

అయినా లాభం లేకపోయింది. బ్రెయిన్ కి బ్లడ్ సరఫరా చేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడినట్లు డాక్టర్లు గుర్తించారు. సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం, నిద్రలేమి వల్ల శరీరంలో సోడియం, పోటాషియం స్థాయిలు తగ్గి అది చివరికి మెదడుపై ప్రభావం చూపిందన్నారు. యువకుడు పూర్తిగా కోలుకోవడంతో ఇక తమ వల్ల కాదని డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో శనివారం(ఆగస్టు 31,2019) ఇంటికి పంపించేశారు. తనకు అండగా ఉంటాడని భావించిన తల్లి.. కొడుకు ఇలా అచేతంగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. పిల్లలు సెల్ ఫోన్ తో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది ఓ కంట కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం సందేహం వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Categories
National

రోడ్డుపై బైక్ డాన్స్ లేస్తే…జీతాలు, ఆస్తులు అమ్ముకోవాలి

పార్లమెంట్‌లో 2019 ఆగస్టు 9న ఆమోదం పొందిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన పోలీసులు… కొత్త మోటారు వాహనం చట్టంపై విస్తృతంగా ప్రచారం చేసారు. మనుషుల ప్రాణాలు కాపాడటమే ఏకైక లక్ష్యంగా 30 ఏండ్ల క్రితంనాటి మోటారు వాహనాల చట్టం 1989లో సవరణలు చేసి మోటారు వాహనాల(సవరణ) బిల్లు – 2019ను రూపొందించారు. ఈ బిల్లు ఆమోదంతో గతంలో ఉన్న జరిమానాలు అన్ని భారీగా పెరిగిపోయాయి.

వాహనదారులు ఇకపై రోడ్డుపై వాహనం నడపాలంటే  ఖచ్చితమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్‌పై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పోలీస్ అధికారులు విధించే భారీ జరిమానాలతో జేబులకు చిల్లులు పడటం ఖాయం.  తొలుత రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన పాలనాపరమైన నిబంధనలనే ఎక్కువగా అమల్లోకి తెస్తున్నారు.  దీని ప్రకారం ఇకనుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ.500 నుంచి రూ.10,000 వరకూ జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
 
అధిక లోడుతో వెళ్లే వాహనాలపై రూ.20 వేల జరిమానాతో పాటు ప్రతి అదనపు టన్నుకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తారు. పైగా వాహానంలో తీసుకు వెళుతున్న అదనపు బరువును దించేంతవరకూ ఆ వాహనాన్ని అక్కడి నుంచి కదలనివ్వరు.  పరిమితికి మించి ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకొనే వాహనాలకు ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 చొప్పున జరిమానా విధించడంతోపాటు, అదనపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు.

సీటు బెల్టు ధరించకుండా కార్లు నడిపే  డ్రైవర్లకు రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు వాహనదారులకు ఆయా మోటార్ వాహన చట్టంలో అమలైన సాధారాణ జరిమానాలు, శిక్షలతో సరిపెట్టిన అధికారులు, ప్రస్తుతం అమలులోకి రానున్న కొత్త చట్టం ద్వారా కఠినమైన నిబంధనల విషయంలో చర్యలు తీసుకోనున్నారు.  కాగా, నిబంధనలు ఉల్లఘించే వాహనదారులకు విధించే అపరాధ రుసుం వివరాలను పరిశీలిస్తే……

* హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే… కొత్త చట్టం మేరకు రూ.1000 (ప్రస్తుతం రూ.100) లేదా మూడు నెలల పాటు లైసెన్సు రద్దు చేస్తారు.
* మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు (ప్రస్తుతం రూ.2 వేలు)
* సీటుబెల్టు పెట్టుకోకుండా కారునడిపితే రూ.వెయ్యి (ప్రస్తుతం రూ.100)
* డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.500)
* రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1100)
* అతివేగం తో వాహనం నడిపితే రూ.1000 లేదా రూ.2 వేలు (ప్రస్తుతం రూ.400)
* ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1000)
* అంబులెన్స్ ల వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు (ప్రస్తుతం ఎలాంటి అపరాధం లేదు)
* వాహనానికి బీమా లేకపోతే రూ.2 వేలు (ప్రస్తుతం రూ.1000)
* పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు (ప్రస్తుతం రూ.5000)
* త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1200)
* సెల్‍‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (రూ.వెయ్యి)
* మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.25 వేలు లేదా సంరక్షకులు లేదా యజమానికి మూడు సంవత్సరాల జైలుశిక్ష మరియు అపరాధం. ప్రస్తుతం రూ.1500 మాత్రమే వసూలు చేస్తున్నారు.

Categories
National

రైలు ప్రయాణికులకు చేదువార్త

రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ప్రయాణికులపై సర్వీసు చార్జీల భారం మోపింది. 2019, సెప్టెంబర్ 1 నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో బుక్ చేసే రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జిని వసూలు చేయనుంది. కొత్త రూల్ ప్రకారం నాన్ ఏసీ క్లాస్ టిక్కెట్లపై రూ.15 (ఒక్క టిక్కెట్ కి), ఏసీ క్లాస్ టికెట్లపై రూ.30 సర్వీస్ చార్జిని వసూలు చేయనుంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకునే టిక్కెట్లపై చార్జిలను విధిస్తారు. వీటికి తోడు జీఎస్‌టీని వసూలు చేస్తారు.

దేశంలో పెద్ద నోట్లు రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించేందుకు అప్పట్లో రైలు టిక్కెట్లపై ఐఆర్‌సీటీసీ సర్వీస్ చార్జిని ఎత్తేసింది. అప్పట్లో నాన్ ఏసీ టిక్కెట్టుపై రూ.20, ఏసీ టిక్కెట్టుపై రూ.40 చార్జి వసూలు చేసేవారు. సర్వీస్ చార్జిలను ఎత్తేశాక ఆ మొత్తం భారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ భరిస్తూ వచ్చింది. ఆ భారాన్ని ఇక తాము మోయలేమని, సర్వీస్ చార్జిలను వసూలు చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే బోర్డుకు సూచించారు.

దీంతో సర్వీస్ చార్జిలను విధించేందుకు జూలైలో ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు అనుమతినిచ్చింది. అందులో భాగంగానే సెప్టెంబరు 1 నుంచి యథావిధిగా ఐఆర్‌సీటీసీ సర్వీస్ చార్జిలను రైలు టిక్కెట్ల బుకింగ్‌పై వసూలు చేయనుంది.

Categories
Hyderabad

హ్యాట్సాఫ్ : మానవత్వం చాటిన ట్రాఫిక్‌ సీఐపై హరీష్ రావు ప్రశంసలు

హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వరద నీటిలో చిక్కుకున్న వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్లిన ట్రాఫిక్ సీఐ నాగమల్లుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు. 

హైదరాబాద్‌లో వరద నీటిలో చిక్కుకున్న వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్లిన ట్రాఫిక్ సీఐ నాగమల్లుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు. విధినిర్వహణలో సీఐ చూపిన అంకితభావం స్ఫూర్తిగా నిలవాలంటూ ట్వీట్ చేశారు. హ్యాట్సాఫ్ టు ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు గారు. విధి నిర్వహణలో మీ అంకితభావం మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ.. మీకు అభినందనలు..అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.

ట్రాఫిక్‌ సీఐ నాగమల్లు మానవత్వాన్ని చాటుకున్నారు. భారీ వర్షం కురవడంతో ఎల్బీ నగర్‌ – సాగర్‌ రింగ్‌ రోడ్డుకు వెళ్లే దారిలో నీళ్లు నిలిచాయి. విధుల్లో ఉన్న నాగమల్లు వాటర్‌ క్లియర్‌ చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో అనారోగ్యంతో ఉన్న తండ్రిని ఓ కుమారుడు స్కూటీపై తీసుకెళ్తుండగా వర్షం నీటిలో బండి ఆగిపోయింది. 

నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్ తన వీపుపై మోస్తూ నీళ్ల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే… సోషల్ అవేర్‌నెస్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్న ట్రాఫిక్ సీఐ నాగమల్లుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉన్నతాధికారుల సూచనలు, వారిచ్చిన స్ఫూర్తితోనే సామాజిక సేవ చేస్తున్నానని నాగమల్లు తెలిపారు.

 

 

Categories
Uncategorized

వామ్మో : 300 కేజీల కుళ్లిన చికెన్‌ స్వాధీనం

నెల్లూరు జిల్లాలో భారీగా నిల్వ ఉంచిన చికెన్‌ పట్టుబడింది. ఆటోలో తరలించిన సుమారు 300 కేజీల కుళ్లిన చికెన్‌ పట్టుకున్నారు.

నెల్లూరు జిల్లాలో భారీగా నిల్వ ఉంచిన చికెన్‌ పట్టుబడింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుళ్లిన చికెన్‌ను నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని చికెన్‌ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆటోలో తరలించిన సుమారు 300 కేజీల కుళ్లిన చికెన్‌ పట్టుకున్నారు. వీటిలో నిల్వ చేసిన చికెన్, గుండెకాయలతోపాటు ఇతర భాగాలు ఉన్నాయి. చికెన్‌ తరలించిన ఆటోను కూడా పంచాయితీ కార్యాలయానికి తరలించారు. చెరువు సమీపంలో పెద్ద గుంత తీసి.. అందులో చికెన్‌ వేసి.. ఫినాయిల్‌ చల్లి కప్పిపెట్టారు. పీహెచ్‌సీ డాక్టర్‌ శశికళ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇలాంటిది తింటే ప్రజలు రోగాల బారిన పడతారని హెచ్చరించారు. 

చికెన్‌ వ్యాపారులు సంపాదన గురించి తప్ప ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదు. ఈతంతు కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు బయటపడుతున్నా.. అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం వల్లే ఇలా జరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిపట్ల అధికారులు కఠన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. 

కాగా కొన్నిరోజులుగా నడుస్తున్న ఈ తంతుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈక్రమంలో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన చికెన్‌ ను పట్టుకున్నారు. దీంతో ఏం తినాలో.. ఏం తినకూడదో అర్థం కాక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 
 

Categories
Uncategorized

జగన్ సర్కార్ కు మరో షాక్ : పీపీఏలు రద్దు చేయొద్దు

జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) రద్దు చేయొద్దని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పబ్లిక్ హియరింగ్ లను చేపట్టవద్దని చెప్పింది. ధరల స్వీకరణ పిటిషన్ ఉపసంహరణను తప్పుబట్టింది. పాత ఒప్పందాలనే కొనసాగించాలని స్పష్టం చేసింది.

గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను సమీక్షించాలని వైపీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పలు సోలార్, విండ్ పవర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కడప, అనంతపురంకు చెందిన మూడు విద్యుత్ కంపెనీలు ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. గత ప్రభుత్వ పీపీఏలపై సమీక్ష చేయడంతో తమకు నష్టం వాటిల్లుతుందన్నారు. భవిష్యత్ లో అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

పీపీఏలపై సమీక్షించడమంటే తమపై నమ్మకం లేకపోవడమేనని ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాయి. ఈ విషయంపై 2 నెలలుగా కొనసాగిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పీపీఏలపై సమీక్ష, రద్దు అంశాలను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం చేపట్టదలచిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. అంతకముందు చేసుకున్న ఒప్పందాలను కొనసాగించాలని తేల్చి చెప్పింది.

Categories
Crime

డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణం

అమలాపురంలో డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ ఘటన రాష్త్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం సూసైడ్ చేసుకోవడానికి కాల్ మనీ వేధింపులే కారణమని తెలుస్తోంది. రామకృష్ణంరాజు సన్నిహితులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 30, 2019) డాక్టర్, ఆయన భార్య, కొడుకు సూసైడ్ చేసుకున్నారు. 

డాక్టర్ కృష్టంరాజుది ముమ్మాటికీ వడ్డీ వేధింపుల హత్యే అని స్ధానిక డాక్టర్, ఒకప్పటి కృష్ణంరాజు పార్టనర్ కేవీ ధన్వంతరీ నాయుడు ఆరోపించారు. డాక్టర్ కృష్ణంరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టటానికి స్ధానిక వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి వడ్డీ వ్యాపారులు ప్రతిరోజు సాయంత్రం వడ్డీ వసూలు చేసుకువెళ్లేవారని ఆయన మిత్రుడు వాపోయారు. కృష్ణంరాజుకి రూ.10 కోట్లు అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడం, కృష్ణంరాజు కొన్న భూములు అమ్ముడు పోకపోవటం, వడ్డీలు కట్టటానికి చేతిలో డబ్బు లేకపోవటంతో కృష్ణంరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. సీఎం జగన్ ఇప్పటికైనా రాష్ట్రంలో కాల్ మనీ రాకెట్ ను కట్టడి చేయాలని డాక్టర్ నాయుడు కోరారు.

Categories
Uncategorized

కొత్త రూల్ : ఉ.10 నుంచి రా.9 గంటల వరకు మద్యం షాపులు.. మూడుకు మించి మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు

విడతల వారీగా మద్య పానం నిషేధమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు

విడతల వారీగా సంపూర్ణ మద్య పానం నిషేధమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించనుంది. ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో 500లకుపైగా ప్రభుత్వ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మద్యం షాపు దగ్గర ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పర్యవేక్షణ ఉంటుంది. సర్కారీ మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్ లు ఉండవు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయి. రోడ్డుపై మద్యం సేవిస్తే శిక్షిస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. ఏ వ్యక్తి దగ్గరైనా మూడుకు మించి మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటి. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముందు బెల్ట్ షాపులకు చెక్ పెడతారు. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తారు. 500 లిక్కర్ షాపుల్లో అమ్మకాలు ఆదివారం(సెప్టెంబర్ 1, 2019) నుంచి ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ స్వామి తెలిపారు. సీఎం జగన్ ప్రకటించిన ‘నవరత్నాల్లో’ మద్యం అమ్మకాలపై నిషేధం ఒకటి అన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు మద్యం బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేశారు. కొత్త పాలసీ ప్రకారం ఒక వ్యక్తి దగ్గర 3 లిక్కర్ బాటిళ్లకు మించి ఉండకూడదు.

మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి హెచ్చరించే బోర్డులను లిక్కర్ షాపుల్లో ఏర్పాటు చేస్తారు. కొత్త పాలసీ ప్రకారం ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం షాపులు నిర్వహిస్తుంది. 2018లో 4వేల 377 మద్యం షాపులు ఉండగా.. ఆ సంఖ్య 3వేల500కి తగ్గింది. అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మద్యం దుకాణాలు సర్కార్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు.