Categories
Andhrapradesh Political

పవన్ కన్నా చిరంజీవి మేలు.. అందుకే జగన్ కి మద్దతిచ్చారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే ఉంటారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదన్నారు. కొన్నేళ్లుగా చంద్రబాబు తొత్తుగా పవన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏదైనా లాభం ఉంటుందేమోనని పవన్ అమరావతిలో తిరుగుతున్నారని మంత్రి విమర్శించారు. పవన్ కన్నా ఆయన అన్న చిరంజీవి మేలు అని మంత్రి చెప్పారు. చిరంజీవికి ప్రజల బాధలు తెలుసని.. అందుకే రాజధాని అంశంలో జగన్ కు మద్దతు పలికారని మంత్రి అన్నారు.

మంగళవారం(డిసెంబర్ 31,2019) రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు జైలుకెళ్లొచ్చిన వారు కాదు.. సూట్ కేసుల కంపెనీవారు కాదు ..కష్టాన్ని నమ్ముకున్న వారు ..మట్టిని సాగు చేసి బంగారాన్ని పండిచేవారు. అటువంటి రైతుల్ని కష్టాల పాలు చేసే ప్రభుత్వం మనుగడ సాగించదని పవన్ హెచ్చరించారు.

జగన్ రెడ్డిగారికి ప్రజలు అధికారం ఇచ్చింది నాలుగు గోడల మధ్య ఉండే ఆడ బిడ్డలను నడి రోడ్డు మీద కూర్చోబెట్టడానికి కాదన్నారు. ప్రజలను సంతోషంగా ఉంచటానికి అధికారం ఇస్తే రైతుల కళ్ల నుంచి రక్తాన్ని చిందిస్తున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగిన జగన్ రెడ్డిగారికి 151 సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే ఇలా జరిగిందన్నారు. మరోసారి అధికారం ఇస్తారో లేదో ప్రజలే నిర్ణయించుకోవాలని పవన్ సూచించారు.

Categories
Hyderabad

ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలు : జనవరి 26న అందజేత

తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌(విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, యాంటీ కరప్షన్‌ బ్యూరో), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది.(జనవరి 26, 2020) సీఎం కేసీఆర్, మంత్రుల చేతుల మీదుగా ఈ పతకాలను అందించనున్నారు.

ఆయా పోలీసు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌) పతకాలు, పోలీస్‌ సేవా పతకాలు, తెలంగాణ స్టేట్‌ శౌర్య పతకం, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌/ఫైర్‌ సర్వీసెస్‌/ఎస్‌పీఎఫ్‌ మహోన్నత సేవా పతకం, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌/ఫైర్‌ సర్వీసెస్‌/ఎస్‌పీఎఫ్‌ ఉత్తమ సేవా పతకం, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ కఠిన సేవా పతకాలను అందించనున్నారు. 
 

Categories
International

నారింజ రంగులోకి మారిన ఆకాశం…బీచ్ కు పరుగెత్తిన వేల మంది

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సంక్షోభం మంగళవారం(డిసెంబర్-31,2019)తీవ్రతరమైంది. ఆగ్నేయంలోని తీరప్రాంత పట్టణాలు మంటలు చెలరేగడంతో వేలాది మంది స్థానికులు, పర్యాటకులు బీచ్ లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. కార్చిచ్చు వేడిని త‌ట్టుకోలేని ప్ర‌జ‌లు..స‌ముద్ర తీరం దిశ‌గా ప‌రుగులు తీశారు. సుమారు నాలుగు వేల మంది విక్టోరియా బీచ్ వ‌ద్ద త‌ల‌దాచుకుంటున్న‌ారు..

మెల్‌బోర్న్‌కు తూర్పున సుమారు 500 కిలోమీటర్ల దూరాన విక్టోరియా రాష్ట్రంలో మల్లకూట అనే పర్యటక పట్టణం ఉంది. చాలా మంది ఆస్ట్రేలియన్లు ఈ తీర ప్రాంతానికి విహారానికి వస్తారు. మంగళవారం ఉదయం ఈ ప్రాంతాన్ని కార్చిచ్చు కమ్మేసింది. స్థానికులు నిద్రలేచే సరికి అంతటా దట్టమైన పొగ ఆవరించి ఉంది. ఆకాశం నారింజ పండు రంగులో కనిపించింది. తొమ్మిదిన్నరకల్లా నింగి నల్లగా మారిపోయింది.  ప్రజలందరూ నీటి దగ్గరకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. దీంతో వేల మంది ప్రజలు బీచ్‌కు పరుగులు తీయగా, మంటలార్పే సిబ్బంది వారిని అనుసరించారు. అదే సమయంలో కొంత మంది బోట్లలో ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. పొగ నుంచి రక్షణ కోసం చాలా మంది మాస్కులు ధరించారు. మంగళవారం ఉదయం 10:30 గంటల సమయానికి మల్లకూట రేవు దగ్గర నీటి అంచున ప్రజలు గడపాల్సి వచ్చింది. మరోవైపు అత్యవసర సేవల సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. 

విపత్తు పర్యవసానాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధమవుతున్నామని ఓ స్థానికుడు తెలిపారు. నల్లటి పొగ కమ్మేయడంతో పగలే రాత్రిలా అయ్యిందన్నారు. తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నామన్నారు. మల్లకూటలో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నీరు అందించేందుకు, విద్యుత్ సదుపాయం కల్పించేందుకు నౌకాదళ ఓడలను పంపే అవకాశముందని విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ తెలిపారు. కార్చిచ్చు వ‌ల్ల ఆస్ట్రేలియాలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 12కు చేరుకున్న‌ది. విక్టోరియాలో న‌లుగురు ఆచూకీ లేకుండాపోయారు.

Categories
Hyderabad

భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంపు

తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచింది. పెండింగ్ లో ఉన్న భూముల క్రమద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును (జనవరి 31, 2019) వరకు పొడిగించింది.

తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచింది. పెండింగ్ లో ఉన్న భూముల క్రమద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును (జనవరి 31, 2019) వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 31, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి నేటితో గడువు ముగిసింది. 

రాష్ట్రంలో మరోసారి భూముల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌ విలువలతో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఒక జీవో, పేద వర్గాలకు ఉచితంగా క్రమబద్ధీకరణకు మరో జీవో ఇవ్వనుంది. దీనికోసం త్వరలో విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. 

2014 డిసెంబరు 31న రాష్ట్రంలో పేద వర్గాల భూములను ఉచితంగా క్రమబద్ధీకరించడానికి జీవో 58, మార్కెట్‌ విలువలో రాయితీతో జీవో 59 తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయా జీవోల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రభుత్వం పలు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ దఫా సమగ్రంగా రెండు వేర్వేరు జీవోలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పాత జీవోల ప్రకారం వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. 
 

Categories
Andhrapradesh

చచ్చిపోతాం.. అనుమతి ఇవ్వండి : రాజధాని రైతులు

రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని, చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో తామంతా రోడ్డున పడ్డామని రైతులు వాపోయారు. నాడు అమరావతి రాజధానికి అంగీకారం తెలిపిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి స్వలాభం కోసం సీఎం జగన్.. రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 14 రోజులుగా కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేస్తున్నా తమ గోడు వినిపించుకున్నవారు లేరని రైతులు వాపోయారు.
 
రాష్ట్రపతికి రైతులు రాసిన లేఖ:
‘‘అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని.. మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు. అధికారం అడ్డు పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం. ఈ బతుకులు మాకొద్దు.. మాకు మరణమే శరణ్యం. దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి’’.

Also Read : పెరిగిన రైల్వే ఛార్జీలు…అర్ధరాత్రి నుంచి అమల్లోకి

Categories
International Life Style

2020 న్యూ ఇయర్ : ఏ దేశంలో ఫస్ట్.. ఏ దేశంలో లాస్ట్ తెలుసా?

న్యూ ఇయర్ 2020 ఏడాదికి వెల్ కమ్ చెప్పేందుకు ప్రపంచ దేశాలన్నీ రెడీగా ఉన్నాయి. డిసెంబర్ 31 రోజు రాత్రి 12 గంటలకు మరి కొద్ది గంటలే సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. 2019 కి వీడ్కోలు పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా 2020లోకి అడుగుపెట్టిన ఐలాండ్ దేశాల్లో ఒసినీయా తొలి ఐలాండ్ దేశంగా అవతరించింది.

చిన్న పసిఫిక్ ఐలాండ్ దేశాల్లో టొంగా (tonga), సమోవా (samoa), కిరిబాటి (Kiribati) ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ 2020లోకి అడుగుపెట్టిన రెండో దేశంగా నిలవగా, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాయి. ఇక చివరిగా సెంట్రల్ పసిఫిక్ ఒసియన్‌లో ఉన్న బేకర్స్ ద్వీపంలో చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుగనున్నాయి. అయితే, ఆ దేశ స్థానిక కాలమానం ప్రకారం.. న్యూ ఇయర్ ఏ దేశంలో ముందుగా వస్తుంది.. ఏ దేశంలో చివరగా వస్తుందో తెలుసుకుందాం..

భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 31, మధ్యాహ్నం 3.30 గంటలకు ఐలాండ్ దేశాల్లో సమోవా, టొంగాతో పాటు క్రిస్మస్ ఐలాండ్/కిరిబాటిలో ముందుగా న్యూ ఇయర్ బెల్స్ మోగాయి. ఆ తర్వాత సమయానుగుణంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే దేశాలెంటో ఓసారి చూద్దాం..

* మధ్యాహ్నం 3:45 గంటలకు చాతమ్ (Chatham) ఐలాండ్‌లో న్యూ ఇయర్ వస్తుంది.
* సాయంత్రం 4:30 గంటలకు న్యూజిలాండ్‌ 2020లోకి అడుగుపెడుతుంది.
* సాయంత్రం 5:30 గంటలకు రష్యా సంబంధిత భూభాగాల్లో న్యూ ఇయర్ వస్తుంది.
* సాయంత్రం 6:30 గంటలకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీ, కెన్ బెర్రా, హానియారాలో న్యూ ఇయర్ వస్తుంది.
* రాత్రి 7 గంటలకు అడిలైడ్, బ్రోకెన్ హిల్, సెడునా (Ceduna)లో కొత్త ఏడాది వస్తుంది.
* రాత్రి 7:30 గంటలకు బ్రెస్బేన్, పోర్ట్ మోర్సెబే, హగత్నా (Hagatna)లో న్యూ ఇయర్ ప్రారంభం.
* రాత్రి 8 గంటలకు డార్విన్, అలైస్ స్ర్పింగ్స్, టెన్నంట్ క్రీక్ లకు న్యూ ఇయర్ వస్తుంది.
* రాత్రి 8:30 గంటలకు జపాన్, టోక్యో, సౌత్ కొరియా, సీయోల్, ప్యాంగ్యాంగ్, దిలి (Dili), ఎన్గెరుల్ముడ్ (Ngerulmud)

* రాత్రి 9:30 గంటలకు చైనా, ఫిలిఫ్పైన్స్ లో న్యూ ఇయర్ ప్రారంభం అవుతుంది.
* రాత్రి 10:30 గంటలకు ఇండోనేషియా, థాయిలాండ్ 2020లోకి అడుగుపెడతాయి.
* రాత్రి 11 గంటలకు మయన్మార్ లో 2020 కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.
* రాత్రి 11:30 గంటలకు బంగ్లాదేశ్ 2020లోకి అడుగు పెడుతుంది.
* రాత్రి 11:45 గంటలకు నేపాల్‌లోని ఖాట్మాండు, పొక్హారా, బిరాత్ నగర్, ధరాన్ భూభాగాల్లో కొత్త ఏడాది వస్తుంది.
* రాత్రి 12:00 గంటలకు భారత్, శ్రీలంక దేశాల్లో 2020 కొత్త ఏడాది వస్తుంది.
* రాత్రి 12:30 (జనవరి 1) గంటలకు పాకిస్థాన్ 2020లోకి అడుగుపెడుతుంది.

* రాత్రి 1 గంటకు (జనవరి 1)  అఫ్గానిస్థాన్ దేశంలో న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. ఆ తర్వాత అజెర్ బాయిజన్, ఇరాన్, మాస్కో, గ్రీస్, జర్మనీ దేశాల్లో 2020 కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.

* తెల్లవారుజామున 5:30 గంటలకు (జనవరి 1) యూనైటెడ్ కింగ్ డమ్ (UK)లో కొత్త ఏడాదికి వెల్ కమ్ చెబుతారు. ఆ తర్వాత బ్రెజిల్, న్యూఫౌండ్ ల్యాండ్ కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి.

* భారత కాలమానం ప్రకారం.. (జనవరి 1) ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు కెనడాలో ముందుగా కొత్త సంవత్సరం వస్తుంది.. ఆ తర్వాత USAలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి.

* సాయంత్రం 5:50 గంటలకు (జనవరి 1) మార్క్యూసాస్ ద్వీపాలు, అమెరికన్ సమోవా ప్రాంతంలో చివరిగా న్యూ ఇయర్ మొదలువుతుంది. ఆ తర్వాత చిట్టచివరిగా బయటి ద్వీపమైన బేకర్ ఐలాండ్‌లో 2020 కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.

Categories
Uncategorized

ఏపీలో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది. లాభాపేక్ష రహిత సంస్థగా కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీ పనిచేయనుంది. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 31, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

సీఎస్ఆర్ నిధుల నిర్వహణ కోసం ఉన్నత, క్షేత్ర స్థాయిల్లో 2 కమిటీలు వేశారు. కనెక్ట్ టు ఆంధ్రా కోసం సీఎం జగన్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థికమంత్రి, సీఎస్ సహా మూడు ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉంటారు.

జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేశారు. సీఎస్ఆర్ నిధులకు నవరత్నాల పూల్ ఫండ్ కు కేటాయించేందుకు కార్యాచరణ రూపొందించారు. అభివృద్ధి చేయాల్సిన పనుల జాబితానూ కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీ సిద్ధం చేయనుంది. నవరత్నాల పథకాలతో విద్య, వైద్య రంగాల్లోనూ సీఎస్ఆర్ నిధుల వినియోగం జరుగనుంది. 
 

Categories
National

పెరిగిన రైల్వే ఛార్జీలు…అర్ధరాత్రి నుంచి అమల్లోకి

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది.

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కు కి.మీకు పైసా చొప్పున పెంచింది. మెయిల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కు కి.మీకు 2 పైసలు పెంచారు. అదేవిధంగా ఏసీ ఛైర్ కార్, ఏసీ3, 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్ కు కి.మీకు 4 పైసల చొప్పున పెంచారు. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే సబర్బన్ రైళ్లలో ఛార్జీల పెంపుదల లేదని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

ఆదాయం విషయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైల్వే శాఖ ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా రైల్వే ఛార్జీల పెంపుపై ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టికెట్‌ ధరలు పెంచుతూ మంగళవారం (డిసెంబర్ 31, 2019) రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. సబర్బన్‌(సింగిల్‌ జర్నీ ఫేర్‌), సీజన్‌ టికెట్లు(సబర్బన్‌ అండ్‌ నాన్‌ సబర్బన్‌) మినహా అన్ని క్లాస్‌ల్లో కిలోమీటర్‌కు కనీసం ఒక పైసా నుంచి 4 పైసలకు పెంచారు. 

పెంచిన రైల్వే ఛార్జీలు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఛార్జీలను స్వల్పంగా పెంచింది. మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారంలో వచ్చిన 2014లో చివరిసారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. అప్పట్లో ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం, సరకు రవాణా ఛార్జీలు 6.5 శాతం పెరిగాయి. 
 

Categories
International Life Style

2020లోకి అడుగుపెట్టిన తొలి రెండు దేశాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కంటే ముందే ఆ దేశం 2020లో అడుగుపెట్టేసింది. ముందుగానే న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. 2019కి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికిన తొలి దేశంగా సమోవా  (Samoa) నిలవగా, ఆ తర్వాత న్యూజిలాండ్, అక్లాండ్ 2020 సంవత్సరానికి స్వాగతం పలికాయి.

న్యూజిలాండ్ దేశ పౌరులంతా సాంప్రదాయక పద్ధతిలో మ్యూజిక్, డ్యాన్స్ లతో కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పారు. ఆకాశంలో ఫైర్ వర్క్స్ కాలుస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మునిగితేలారు. ప్రపంచంలో స్థానిక కాలమానం ప్రకారం.. (10AM GMT) కొత్త దశబ్దంలోకి ముందుగా అడుగుపెట్టిన తొలి దేశం సమోవా (Samoa) కాగా, ఆ తర్వాత న్యూజిలాండ్ 2020లోకి అధికారికంగా అడుగుపెట్టి రెండో స్థానంలో నిలిచింది. 
Newzland

దక్షిణ పసిఫిక్ వ్యాప్తంగా న్యూ ఇయర్ పార్టీలతో ఫైర్ వర్క్స్ తో ఆకాశమంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. న్యూజిలాండ్‌లో 13 గంటలకు ముందుగానే దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ పార్టీలు వేడుకలు మొదలయ్యాయి. ప్రధాన నగరాల్లోని వీధులన్నీ ఫైర్ వర్క్స్‌తో పండు వెన్నలలా వెలిగిపోతున్నాయి.

కొద్ది క్షణాల్లో 2020 కొత్త ఏడాది వస్తుందనగా.. అక్లాండ్ లోని నగరవాసులంతా కౌంట్ డౌన్ చెబుతూ వెల్ కమ్ చెప్పారు. 2019లో ఎన్నో విషాదకరమైన సంఘటనలను ఎదుర్కొన్న తర్వాత వస్తున్న సంవత్సరం కావడంతో ఈ ఏడాది అంతా బాగుండాలని న్యూజిలాండ్ వాసులంతా దేవున్నీ ప్రార్థిస్తున్నారు. 

Categories
Political

పవన్ కళ్యాణ్ వి చిల్లర రాజకీయాలు : మంత్రి అవంతి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై మంత్రి ఆవంతి తీవ్ర విమర్శలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై మంత్రి ఆవంతి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

అమరావతి అభివృద్ధి చేస్తే సరిపోతుందా?..ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా? అని ప్రశ్నించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే..అమరావతిలో పెట్టాలని బాబు చెప్పడంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లారని తెలిపారు. పవన్, చంద్రబాబు వైఖరిని అవలంభిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతే ఎద్దేవా చేశారు. 

అసెంబ్లీని మారుస్తానని సీఎం జగన్ చెప్పలేదని మంత్రి ఆవంతి స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయరని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కోసం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు చేయడం పవన్ తగదని హితవు పలికారు.