Categories
Uncategorized

అమరావతిలో భూ యాజమానుల వివరాలు సేకరిస్తున్న సిట్.. అజ్ఞాతంలోకి నేతలు

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు భూములు కొన్నదెవరు..? ఎవరెవరు ఎంత మొత్తంలో ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను అతి రహస్యంగా సేకరిస్తోంది. దీంతో ఏ అధికారి ఎప్పుడు తమ తలుపు తడతారోనని నేతలు హడలిపోతున్నారు. కొందరు పనులు చక్కబెట్టుకునే కార్యక్రమంలో ఉంటే ఇంకొందరు పత్తాలేకుండా పోతున్నారు. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దూకుడు పెంచిన సిట్‌:
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ స్పీడప్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అవినీతి, అక్రమాల ఆరోపణలతో పాటు తమకందిన నివేదికలో ఉన్న వివరాల ఆధారంగా అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది. రాజధాని ప్రకటనకు ముందు అమరావతిలో భూములు ఎవరెవరు.. ఎప్పుడు కొన్నారు.. ఎవరి పేరు మీద కొనుగోలు చేశారనే అంశాలపై కూపీ లాగుతోంది. ఇందులోభాగంగా ఒక్కొక్కర్ని సెలెక్ట్‌ చేసుకుని వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో తనిఖీలు చేసేలా అధికారులు ప్లాన్ చేశారు. వీలైనంత త్వరగా అక్రమాల నిగ్గు తేల్చాలని భావిస్తోంది సిట్ బృందం. అదే సమయంలో బినామీలపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. 

మాజీ మంత్రి వియ్యంకుడి ఇంట్లో రహస్య విచారణ:
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేత వియ్యంకుడి ఇంట్లో సిట్‌ అధికారులు రహస్యంగా సోదాలు చేశారు. విజయవాడలోని పటమటలంక, రామవరప్పాడులోని ఆయన ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించారు. విచారణలో అసైన్డ్‌ భూముల కోనుగోళ్లకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అలాగే విలువైన భూముల పత్రాలతో పాటు కంప్యూటర్ హర్డ్‌ డిస్క్, బ్యాంకు లాకర్స్‌లోని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సీట్ అధికారులు ఎప్పుడు తమ ఇంటికి వస్తారోనని నేతలు, అధికారుల హడలిపోతున్నారు.  స్పాట్..

నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి నోటీసులు:
మరోవైపు కృష్ణాజిల్లా కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీడీపీ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలుపై అనేక అక్రమాలకు పాల్పడారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు టీడీపీ హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఉన్నారు. సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ ఇంట్లోకి పోలీసులెవర్నీ అనుమతించ లేదు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో అక్రమాలపై ఓ వైపు సీఐడీ మరోవైపు సిట్‌ అధికారులు విచారణ వేగవంతం చేయడంతో అమరావతిలో భూములు కొన్న నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

Categories
National

మహిళా శక్తి.. లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ పొందిన 3వ మహిళగా మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ ఘనత

మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతిలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందారు. భారత సైన్యంలో ఈ పదోన్నతి పొందిన మూడవ మహిళగా

మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతిలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందారు. భారత సైన్యంలో ఈ పదోన్నతి పొందిన మూడవ మహిళగా గుర్తింపు పొందారు. అదే సమయంలో ఆర్మీలో రెండవ అత్యున్నత పదవిని సాధించిన మొదటి మహిళా పీడియట్ రీషియన్ గా(పిల్లల డాక్టర్) ఘనత సాధించారు. మాధురి కనిత్కర్ భారత మిలటరీలో 37 సంవత్సరాలు పనిచేశారు.

మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద నియమించబడ్డారు. ఇది కేటాయించిన బడ్జెట్ వాంఛనీయ వినియోగాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి ప్రణాళిక, సమైక్యత ద్వారా సేవల సేకరణ, శిక్షణ కార్యకలాపాలలో మరింత సినర్జీని తీసుకుంటుంది. పూణే సాయుధ దళాల మెడికల్ కాలేజీ మాజీ డీన్ మేజర్ జనరల్ మాధురి కనిత్కర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయానికి పంపారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్, లెఫ్టినెంట్ జనరల్ అయిన ఆమె భర్త రాజీవ్.. సాయుధ దళాలలో ర్యాంకు సాధించిన మొదటి జంటగా గుర్తింపు పొందారు.

లెఫ్టినెంట్ జనరల్ పదవిని మొదట పొందిన మహిళా అధికారిగా పునితా అరోరా రికార్డ్ సృష్టించారు. ఆమె సర్జన్ వైస్ అడ్మిరల్, భారత నావికాదళం, సైన్యంలో మాజీ 3-స్టార్ ఫ్లాగ్ ఆఫీసర్ గా పని చేశారు. పునితా అరోరా తర్వాత భారత సైన్యంలో రెండవ అత్యధిక టైటిల్‌ను దక్కించుకున్న రెండవ మహిళా అధికారిగా పద్మావతి బందోపాధ్యాయ గుర్తింపు పొందారు. ఆమె భారత వైమానిక దళం (ఐఎఎఫ్) నుండి ఈ హోదా సాధించారు. త్రివిధ దళాల కోసం మొత్తం రక్షణ సముపార్జన ప్రణాళికను రూపొందిస్తూ, ఆయుధాలు, సామగ్రిని స్వదేశీకరించడానికి వీలైనంత వరకు సులభతరం చేయడం CDS ప్రధాన ఉద్దేశం.

Categories
International

18ఏళ్ల యుద్ధానికి తెర.. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం

అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా

అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా తాలిబన్లు, అమెరికా బలగాలకు మధ్య 18ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికినట్టు అయ్యింది. కొంతకాలంగా జరుగుతున్న చర్చలు ఫలించాయి. ఇరు వర్గాలు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటూ సంతకాలు చేశాయి. దీంతో అమెరికా బలగాలు, తాలిబన్లు.. దాడులు, ప్రతిదాడులకు ముగింపు పలకనున్నాయి. ఖతార్ లోని దోహా లో ఇరు వర్గాలు చారిత్రక పీస్ డీల్ పై సంతకం చేశాయి. తాలిబన్లు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటే.. 14 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటామని అమెరికా, నాటో మిత్ర దేశాలు అంగీకారం తెలిపాయి. మార్చి 10 నుంచి శాంతి చర్చలు ప్రారంభమవుతాయి.

ఈ ఒప్పందంపై అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మయ్ ఖలీల్జాద్, తాలిబాన్ పొలిటికల్ చీఫ్ ముల్లా అబ్దుల్ ఘని బరదార్‌లు.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ పర్యవేక్షణలో సంతకం చేశారు. ఈ శాంతి ఒప్పందాన్ని పాంపియో చారిత్రక ఒప్పందంగా పేర్కొన్నారు. “అల్-ఖైదాతో సంబంధాలను తగ్గించుకోవటానికి మీ వాగ్దానాలను పాటించాలని” పోంపీ ఉగ్రవాద సంస్థను కోరారు. నాలుగు దశాబ్దాల సంఘర్షణ నుండి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఉద్భవించగలదని తాను నమ్ముతున్నానని బరాదర్ అన్నారు. “ఆఫ్ఘనిస్తాన్ నుండి అన్ని విదేశీ శక్తుల ఉపసంహరణతో ఇస్లామిక్ పాలనలో ఆఫ్ఘన్ దేశం దాని ఉపశమనం పొందుతుందని, కొత్త సంపన్న జీవితాన్ని ప్రారంభిస్తుందని” ఆయన అన్నారు.

భారత్ తో పాటు 30 దేశాల ప్రతినిధులు ఈ శాంతి ఒప్పంద కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్ఘన్ ప్రభుత్వం మాత్రం ఈ శాంతి ఒప్పందానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. తాలిబన్లకు, అమెరికా బలగాలకు మధ్య కొన్నేళ్లుగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు వర్గాలు పరస్పరం పైచేయి సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇరు వర్గాల చర్యల కారణంగా వందలమంది అమాయక ప్రజలు బలవ్వడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది.

ఈ శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాలిబాన్లు చాలా కాలంగా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ లో మాది సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణం అన్న ట్రంప్.. 18ఏళ్ల తర్వాత మా ప్రజలను ఇంటికి తీసుకురావడానికి సమయం ఆసన్నమైందన్నారు. కాగా, ఆఫ్ఘన్ ప్రభుత్వం- తాలిబాన్ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులు అల్-ఖైదా లేదా మరే ఇతర ఉగ్రవాద సంస్థను తాము నియంత్రించే ప్రాంతాల్లో పనిచేయడానికి అనుమతించకూడదని అంగీకరించారు. ఇప్పటివరకు అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులను చంపాయన్న ట్రంప్.. ఇప్పుడు తాలిబాన్లు ఆ పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. 

సెప్టెంబర్ 2001లో న్యూయార్క్‌లో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అల్-ఖైదా గ్రూప్ దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఈ దాడుల్లో అమెరికా దళాలకు చెందిన 2,400 మంది మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికీ 12వేల మంది అమెరికా దళానికి చెందిన వారున్నారు.

* ఒప్పందం జరిగిన మొదటి 135 రోజుల్లోనే అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో తన బలగాలను 8,600 కు తగ్గిస్తుంది. మిత్రదేశాలు కూడా తమ బలగాలను దామాషా ప్రకారం తగ్గించుకుంటాయి.
* ఈ చర్య నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే దళాలను ట్రంప్ ఇంటికి తీసుకొచ్చినట్లు చూపించడానికి వీలు కల్పిస్తుంది.
* ఈ ఒప్పందం ఖైదీల మార్పిడికి కూడా అవకాశం కల్పిస్తుంది. మార్చి 10 నాటికి తాలిబాన్, ఆఫ్ఘన్ ప్రభుత్వం మధ్య చర్చలు ప్రారంభం కానున్న సమయంలో 5,000 మంది తాలిబాన్ ఖైదీలు, 1,000 మంది ఆఫ్ఘన్ సెక్యూరిటీ ఫోర్స్ ఖైదీలను మార్పిడి చేస్తారు.
* అమెరికా కూడా తాలిబాన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తుంది.

కాగా, ఈ ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల పరిస్థితిని మరింత దిగజార్చగలదని తాను భయపడుతున్నానని కాబూల్‌లో కార్యకర్త జహ్రా హుస్సేనీ అన్నారు. ”నేను తాలిబాన్లను విశ్వసించను, వారు పాలించేటప్పుడు మహిళలను ఎలా అణచివేశారో గుర్తుంచుకోండి” అని అన్నారు.

Categories
Andhrapradesh

తిరుపతిలో కరోనా కలకలం.. భయాందోళనలో జనం

చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్‌కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం

చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్‌కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం ఆ వ్యక్తి భారత్‌కు వచ్చాడు. గత రెండు రోజులుగా తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో రుయా ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆ యువకుడిని ఐసోలేటేడ్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. మరో రెండు రోజుల్లో అతనికి కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయాన్ని డాక్టర్లు తేల్చనున్నారు.

కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో తైవాన్ వ్యక్తి ఆసుపత్రిలో చేరడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో తిరుపతి వాసుల్లో భయాందోళన నెలకొంది. అసలే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా సోకిన మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు. దీంతో జనాలు భయపడుతున్నారు.

చైనాలోని వుహాన్(wuhan) ప్రావిన్స్ నుంచి ప్రపంచానికి పాకిన ఈ కోవిడ్19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 83వేల మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. సుమారు 50 దేశాలకు కరోనా వ్యాపించింది. చైనా తర్వాత దక్షిణ కొరియా, ఇటలీ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పడింది. పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.

Categories
National

బీఎస్ఎఫ్ గొప్ప మనసు.. ఢిల్లీ అల్లర్లలో తగలబడిన జవాన్ ఇంటి పునర్ నిర్మాణానికి సాయం

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్-BSF) మానవత్వం చూపింది. తన గొప్ప మనసు చాటుకుంది. ఢిల్లీ అల్లరల్లో(delhi riots) ఇంటిని కోల్పోయిన జవాన్ కి బీఎస్ఎఫ్ అండగా

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్-BSF) మానవత్వం చూపింది. తన గొప్ప మనసు చాటుకుంది. ఢిల్లీ అల్లరల్లో(delhi riots) ఇంటిని కోల్పోయిన జవాన్ కి బీఎస్ఎఫ్ అండగా నిలిచింది. అల్లర్లలో కాలి బూడిదైన జవాన్ ఇంటిని తిరిగి నిర్మించి.. అతడికి పెళ్లి కానుకగా ఇస్తామని బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ పుష్పేంద్ర రాథోర్ చెప్పారు. ఈశాన్య ఢిల్లీలోని కాస్ ఖజూరి(khas khajuri) గలిలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లను తగలబెట్టాయి. అలా తగలబెట్టిన వాటిలో బీఎస్ఎఫ్ జవాన్ మహమ్మద్ అనీస్(29)(mohd anees) ఇల్లు కూడా ఉంది. ఇల్లు తగలబడటంతో అనీస్ తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. ఈ విషయం గురించి ఆలస్యంగా తెలుసుకున్న బీఎస్ఎఫ్ అధికారులు అనీస్ కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇంటి పునర్ నిర్మాణానికి సహకారం చేస్తామని, ఇంటిని నిర్మించి దాన్ని అనీస్ పెళ్లి కానుకగా ఇస్తామని బీఎస్ఎఫ్ డీఐజీ తెలిపారు.

అనీస్ పెళ్లి కానుకగా ఇల్లు:
బీఎస్ఎఫ్ జవాన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని.. బీఎస్ఎఫ్ ఇంజనీరింగ్ విభాగం పక్షం రోజుల్లోనే ఇంటిని పునర్ నిర్మిస్తుందని వెల్లడించారు. అంతేకాదు, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో పనిచేస్తున్న అనీస్‌ను అతి త్వరలోనే ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేస్తామన్నారు. ఆ విధంగా కుటుంబంతో పాటు ఉండి పెళ్లి పనులు చూసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనీస్.. 2013లో బీఎస్ఎఫ్ జవాన్ గా చేరాడు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ లోని మారుమూల ప్రాంతం రాధాబారిలో విధులు నిర్వహిస్తున్నాడు.

జవాన్ ఇంటిని కూడా వదలని అల్లరిమూకలు:
ఇటీవల ఢిల్లీలో సీఏఏ విషయంలో అల్లర్లు జరిగాయి. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అల్లరిమూకలు రెచ్చిపోయాయి. వందల ఇళ్లను తగలబెట్టారు. ఇందులో అనీస్ ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో అనీస్ తండ్రి, ఇతర కుటుంబసభ్యులు ఉంటున్నారు. రెండంతస్తుల ఆ ఇంటికి ‘ఇంటి నం.76, మహమ్మద్ అనీస్, బీఎస్ఎఫ్’ అనే నేమ్‌ ప్లేట్ ఉంటుంది. ఆరోజు రాత్రి కాలనీలోకి చొరబడ్డ అల్లరిమూకలు కనీసం తమ ఇంటి ముందు నేమ్‌ప్లేట్‌లో ఉన్న ‘బీఎస్ఎఫ్’ను చూసైనా వదిలిపెడుతారని భావించారు. కానీ అల్లరిమూకలు ఆ ఇంటినీ వదిలి పెట్టలేదు. రెండంతస్తుల ఆ భవాన్ని తగలబెట్టడంతో ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. మరో మూడు నెలల్లో ఆ ఇంట్లో జరగాల్సి ఉన్న రెండు పెళ్లిళ్ల కోసం డబ్బు దాచుకోగా.. అది కూడా తగలబడిపోయింది.

bsff

ఇంత విషాదం జరిగినా అధికారులకు చెప్పలేదు:
ఇంత విషాదం జరిగినా అనీస్ కనీసం తన తోటి సిబ్బంది కూడా చెప్పలేదు. మీడియాలో వార్తల ద్వారా విషయం తెలుసుకున్న బీఎస్ఎఫ్ అధికారులు వెంటనే స్పందించారు. అనీస్ కు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. జవాన్ అనీస్ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఇంటి నిర్మాణం కోసం సహకారం ఇస్తామన్నారు. మూడు నెలల్లో పెళ్లి చేసుకోబోతున్న అనీస్ కు.. ఇంటిని నిర్మించి పెళ్లి కానుకగా ఇస్తామన్నారు. పెళ్లి ముహూర్తం లోపు అనీస్ కుటుంబం నష్టపోయిన ఆస్తిని తిరిగి పొందేలా బీఎస్ఎఫ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

బీఎస్ఎఫ్ మానవత్వం.. జవాన్ కి సాయం:
అనీస్ పెళ్లి కంటే ముందే ఇంటిని పునర్ నిర్మిస్తామన్న నమ్మకం ఉందని బీఎస్ఎఫ్ డీఐజీ రాథోర్ తెలిపారు. బీఎస్ఎఫ్ అనేది ఒక కుటుంబం లాంటిదని.. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా.. అసవరమైన అన్ని వనరులను ఉపయోగించుకుంటామని చెప్పారు. అనీస్ కుటుంబానికి ఇంకా ఏదైనా సాయం కావాలన్నా తమను అడగాల్సిందిగా చెప్పామన్నారు. బీఎస్ఎఫ్ చేస్తున్న సాయానికి అనీస్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. బీఎస్ఎఫ్ చూపిన మానవత్వాన్ని, గొప్ప మనసుని అందరూ అభినందిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించే జవాన్లకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

Categories
Crime Hyderabad

మియాపూర్‌లో విషాదం.. ట్యాబ్ ఇవ్వలేదని 12ఏళ్ల బాలుడు ఆత్మహత్య

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో గేమ్‌ ఆడుకునేందుకు ట్యాబ్‌ ఇవ్వలేదనే కోపంతో 12ఏళ్ల బాలుడు అపార్ట్‌మెంట్‌

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో గేమ్‌ ఆడుకునేందుకు ట్యాబ్‌ ఇవ్వలేదనే కోపంతో 12ఏళ్ల బాలుడు అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని స్వప్న నిర్మాణ్ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్‌లో ఉంటున్న శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు బాల వెంకట సత్య ప్రసాద్ ట్యాబ్‌తో ఆడుకుంటున్నాడు. పెద్ద కొడుకు నంద కిషోర్ ట్యాబ్ కావాలని అడిగాడు. దీంతో తండ్రి శ్రీనివాస్ చిన్న కొడుకు సత్య ప్రసాద్ నుంచి ట్యాబ్‌ తీసుకుని..పెద్ద కుమారుడు నంద కిషోర్‌కు ఇచ్చాడు.

గేమ్‌ ఆడుకుంటుండగా తండ్రి ట్యాబ్ లాక్కోవడంపై మనస్థాపానికి గురైన సత్య ప్రసాద్ క్షణాల్లో బిల్డింగ్ పైనుంచి దూకాడు. తీవ్రగాయాలతో స్పాట్ లోనే మృతి చెందాడు. మృతుడు సత్య ప్రసాద్ కొండాపూర్‌లోని మహర్షి విద్యా మందిర్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

అప్పటివరకు ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా బిల్డింగ్ పై నుండి దూకి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్న విషయానికే ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 12ఏళ్ల బాలుడు మనస్తాపానికి గురి కావడం, ఆత్మహత్య చేసుకోవడం చర్చకు దారితీసింది. పిల్లల విపరీత ప్రవర్తనకు ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ పరిణామం పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Categories
Crime National

డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో రూ.78లక్షలు స్వాధీనం.. ఇంటి నిండా నోట్ల కట్టలే.. ఎంత కష్టపడి సంపాదించాడో

తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో

తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దినకరన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. వారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. తనిఖీల్లో భారీగా నగదు బయటపడింది. దినకరన్ ఇంట్లో ఇప్పటివరకు రూ.78లక్షల నగదు దొరికింది.

రూ.50వేలు లంచం డిమాండ్:
వేలూరు కలెక్టరేట్ లో స్టాంప్స్ సెక్షన్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా దినకరన్ విధులు నిర్వహిస్తున్నారు. రూ.50వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భూమి రిజిస్ట్రేషన్ స్టాంప్ ఫీజుకి సంబంధించి రంజిత్ కుమార్ అనే వ్యక్తిని దినకరన్ రూ.50వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంజిత్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని దినకరన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

నేషనల్ హైవేపై కారు చేజింగ్ సీన్:
లంచం డబ్బు తీసుకున్న తర్వాత దినకరన్ కారులో వేగంగా వెళ్లిపోయారు. ఏసీబీ అధికారులు దినకరన్ కారుని వెంబడించాల్సి వచ్చింది. చెన్న-బెంగళూరు నేషనల్ హైవేపై కాసేపు చేజింగ్ సీన్ కనిపించింది. చివరికి దినకరన్ కారుని అడ్డగించిన అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దినకరన్ కారు నుంచి రూ.1.94లక్షల నగదుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దినకరన్ వ్యక్తిగత డ్రైవర్ రమేష్ కుమార్ ని కూడా అరెస్ట్ చేశారు. 

డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో కట్టలకట్టల డబ్బు:
శనివారం(ఫిబ్రవరి 29,2020) ఉదయం ఏసీబీ అధికారులు కాట్పాడిలోని తంగల్ లో దినకరన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.78లక్షల నగదు దొరికింది. ఇంత డబ్బు ఇంట్లో నుంచి దొరికేసరికి అధికారులు షాక్ తిన్నారు. ఇంట్లో ఎక్కడ చూసినా కట్టల కట్టల డబ్బు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ డబ్బంతా లంచంగా తీసుకున్నట్టు అధికారుల విచారణలో తేలింది. పలు ప్రభుత్వ శాఖల్లో పని చేసిన దినకరన్ భారీగా లంచాలు తీసుకున్నట్టు తేలింది. దినకరన్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఆయన అవినీతి, అక్రమాల గురించి ఆరా తీస్తున్నారు. ఓ ప్రభుత్వ అధికారి ఈ రేంజ్ లో లంచాలు వసూలు చేయడం అధికార వర్గాల్లో సంచలనంగా మారింది.

ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదా?
ఉద్యోగులకు ప్రభుత్వం నెల నెల జీతం ఇస్తుంది. వారి శాలరీ వేల రూపాయల్లో ఉంటుంది. కొందరి లక్షల్లో ఉంటుంది. అయినా.. కొందరు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. లంచాలకు రుచి మరిగి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. లంచం ఇవ్వనిదే పనులు చెయ్యడం లేదు. లంచం తీసుకునే అధికారులను అరెస్ట్ చేసి జైలుకి పంపుతున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. ఏ మాత్రం భయపడకుండా లంచాలు తీసుకుంటున్నారు.

Categories
Crime Telangana

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో మృతదేహం కలకలం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నల్గొండ పట్టణ శివారులోని మారుతీరావుకి సంబంధించిన ఓ పాడుబడిన షెడ్ లో మృతదేహం లభ్యం కావడం సంచలనం రేపుతోంది. రక్తపు మడుగులో కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని డెడ్ బాడీ ఉంది. షెడ్డు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు షెడ్డుని పరిశీలించారు. అక్కడ మృతదేహం లభ్యమైంది. వారం రోజుల క్రితం మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. గుర్తుపట్టకుండా మృతదేహంపై దుండగులు ఆయిల్ పోసి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. నల్గొండ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించింది.

మృతదేహం ఎవరిది?
ఈ ఘటనతో మిర్యాలగూడలో మరోసారి కలకలం మొదలైంది. మారుతీరావుకి చెందిన షెడ్ లో డెడ్ బాడీ లభించడం మరింత చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది? మారుతీరావు షెడ్డులోకి ఎలా వచ్చింది? షెడ్డులోనే మర్డర్ జరిగిందా? లేక ఎక్కడైనా చంపి.. షెడ్డులో పడేశారా? ఇప్పుడీ ప్రశ్నలు మిస్టరీగా మారాయి. దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు.

ప్రణయ్ ని చంపించిన మారుతీరావు:
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. తన కుతూరు అమృత.. దళితుడైన ప్రణయ్ ని కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో మారుతీరావు.. ప్రణయ్‌ను హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరి ఈ మర్డర్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఈ కేసులో ముగ్గురు నిందితుల(మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, కరీం) పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటున్న నిందితులు ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం వారు బయటే ఉన్నారు. ఈ క్రమంలో మారుతీరావు షెడ్‌లో మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. మారుతీరావు మరో వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది. మారుతీరావుకి, ఈ డెడ్ బాడీకి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

ప్రణయ్ కుటుంబసభ్యులతో ఉంటున్న అమృత:
మారుతీరావు కూతురు అమృత ప్రస్తుతం ప్రణయ్‌ కుటుంబ సభ్యులతోనే కలిసి ఉంటోంది. నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల అమృత తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. తాను పీడీ చట్టం కింద పెట్టిన కేసును తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చి కుట్రదారులకు బెయిల్ మంజూరు చేయడం బాధకరమని తెలిపింది. నా బాధను అర్థం చేసుకోలేదంది. దేవుడు తనవైపే ఉన్నాడని, తాను సరైన మార్గంలో వెళ్తున్నాని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది. తనకు పుట్టిన బిడ్డలో భర్త ప్రణయ్‌ను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది అమృత.

Categories
Andhrapradesh Political

కోడెల ఫ్యామిలీకి చంద్రబాబు రాంరాం.. ఇంఛార్జ్ పదవి కోసం శివరాం పాట్లు!

గుంటూరు జిల్లా టీడీపీ నేతలంతా ఆప్యాయంగా పల్నాటి పులి అని పిలుచుకునే కోడెల శివప్రసాద్ ఫ్యామిలీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఒక డాక్టర్‌గా ఉంటూ చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి, మంత్రిగా పని చేసిన చరిత్ర ఆయనది. వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచిన చరిత్ర కోడెలది. తర్వాత ఒకసారి సత్తెనపల్లి నుంచి గెలిచారు. ఆయన సిఫారసుతో అనేకమంది కొత్త నేతలకు అసెంబ్లీ టికెట్లు వచ్చాయి. ఎన్టీఆర్ హయాంలో  గుంటూరు జిల్లాలో ఏదైనా కోడెల  చేతి మీద నుంచి జరగాల్సిందే. ప్రస్తుతం టీడీపీలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రి పుల్లారావు, యరపతినేని, జీవీ ఆంజనేయులు, చలమారెడ్డి, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే చలపతి ఆంజనేయులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీమంత్రి శనక్కాయల అరుణ, ఇలా అనేక మంది నేతలకు ఎమ్మెల్యే టికెట్లు  ఇప్పించిన ఘనత కోడెలదే. 

శివరాం పెత్తనంపై బాబుకు ఫిర్యాదు :
కోడెల శివప్రసాద్‌ పేరు చెప్తేనే యువతలో ఉత్తేజం కనబడుతుంది. కానీ, గత ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రతిష్ట మసకబారి అనేక అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కుటుంబ సభ్యులు కూడా కొంత కారణం అని టీడీపీ కేడర్ ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఆయన చనిపోయే వరకు కూడా సత్తెనపల్లి , నరసరావుపేట రెండు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను చూశారు. కోడెల స్పీకర్‌గా ఉన్న ఐదేళ్లలో ఆయన వారసుడు శివరాం రెండు నియోజకవర్గాల్లో పెత్తనం చేశారు. శివరాం ఆధిపత్యం సహించని సీనియర్ నేతలంతా అనేకసార్లు చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేశారు. 

ఇంఛార్జ్ పోస్టు అప్పగించాలని విజ్ఞప్తి :
ఈలోపే సార్వత్రిక ఎన్నికలు రావడం, కోడెల ఓడిపోవడం జరిగిపోయాయి. అనంతర పరిణామాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సాధారణంగా అయితే సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కోడెల శివరాంని నియమించాలి. ఇప్పటికీ కోడెల మరణించి ఆరు నెలలు దాటినా ఆయన కుమారుడుకి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించలేదు టీడీపీ అధిష్ఠానం. సత్తెనపల్లి నియోజకవర్గాన్ని తనకు అప్పగించాలని పలుసార్లు చంద్రబాబుని కలిసి విజ్ఞప్తి చేశారు కోడెల శివరాం. మొన్ననే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పాత విషయాలు పట్టించుకోవద్దు ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని అధినేతకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు మాత్రం కోడెల కుటుంబ సభ్యులకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు. 

రెండు నియోజకవర్గాల్లో ఉన్న శివరాం బాధితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవద్దని అధినేతపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు ఒక ఫోన్ కాల్‌తో అసెంబ్లీ టికెట్ ఇప్పించారు కోడెల. నేడు ఆయన కుటుంబ సభ్యులు సత్తెనపల్లి ఇన్‌చార్జ్ కోసం అష్టకష్టాలు పడాల్సివస్తుందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు కోడెల కుమార్తె సైతం రాజకీయ అరంగేట్రానికి పావులు కదుపుతున్నారని అంటున్నారు. కానీ, ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అందుకు ధైర్యం చేసే పరిస్థితులు లేవని చెబుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాల్సిందే. 

Categories
Andhrapradesh Political

రాజోలు వైసీపీలో వర్గపోరు.. రాపాక ఎంట్రీకి అడ్డుకట్ట?

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు తార స్థాయికి చేరాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి పెదపాటి అమ్మాజీ, మాజీ ఇన్‌చార్జి బొంతు రాజేశ్వరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు కేడర్‌ను రెండు వర్గాలుగా విభజించిందట. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు అని తేడా లేకుండా నాయకులు వ్యవహరిస్తున్న తీరు కార్యకర్తల్లో గందరగోళానికి కారణం అవుతోందని అంటున్నారు. రోడ్డెక్కి రచ్చ చేస్తుండడంతో పార్టీ పరువుకు భంగం వాటిల్లుతోంది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రతినిధ్యం వహిస్తోన్న ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు కేడర్‌, ప్రజలు, అధికారులకు చికాకు తెప్పిస్తోందని అంటున్నారు. 

అసంతృప్తిలో వైసీపీ కేడర్ :
వర్గ పోరుతో గత ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులు ఇంకా వాటిని కొనసాగించడంతో వైసీపీ కేడర్‌ అసంతృప్తిగా ఉంది. ఇన్‌చార్జిల నియామకం విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం నియోజకవర్గంలో వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసిందన్నది టాక్‌. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావును వైసీపీ అధిష్టానం ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జి భాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో తుని నియోజకవర్గానికి చెందిన పెదపాటి అమ్మాజీని ఇన్చార్జిగా నియమించింది. ఇటీవల మాల కార్పొరేషన్ చైర్మన్‌గా అమ్మాజీని నియమించిన కొద్ది రోజుల్లోనే మళ్లీ రాజోలుకు ఇన్‌చార్జిని చేయడం వెనుక అధిష్టానం స్కెచ్ ఉందంటున్నారు. 

బొంతును పక్కన పెట్టి :
రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీకి సానుభూతిపరుడిగా మారారు. దీంతో ఆయన కోసమే బొంతును పక్కన పెట్టి అమ్మాజీని తెరపైకి తీసుకువచ్చారని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. గతం నుంచి బొంతుకు, రాపాకకు మధ్య విభేదాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని బొంతుకు ప్రాధాన్యం తగ్గించారని అంటున్నారు. ఒకవేళ రాపాక వైసీపీలో చేరితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు అమ్మాజీని తాత్కాలిక ఇన్‌చార్జిగా నియమించారనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో రాపాక విజయానికి పనిచేసిన కొంతమంది నాయకులు ఇటీవల వైసీపీలో చేరడం, వారంతా కూడా అమ్మాజీకి మద్దతు ఇవ్వడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోందట. 

మరోపక్క, పదేళ్ల పాటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసి, పార్టీ అధినేత జగన్‌కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న రాజేశ్వరరావు ఇటీవల నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారట. తాను ఓడిపోయినా పార్టీ అధికారంలోకి రావడంతో అనధికార ఎమ్మెల్యేగా చలామణీ అవుదామనుకున్నారట. కానీ, ఆయన ఆశలకు రాపాక, అమ్మాజీ వర్గాలు గండికొట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మాజీ ఆధిపత్యానికి, రాపాక ఎంట్రీకి అడ్డుపడేందుకు బొంతు రాజేశ్వరరావు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. 

ప్రభుత్వ, పార్టీ కార్యక్రమం అని తేడా లేకుండా వారిద్దరితో పోటీ పడుతున్నారట బొంతు. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెబుతున్నారు. ఒకవేళ అధికారులు లేదా అమ్మాజీ వర్గం నుంచి వ్యతిరేకత ఎదురైతే తమ వర్గం ద్వారా ప్రత్యక్ష ఆందోళన చేయించడానికి కూడా వెనుకాడటం లేదట. ఇటీవల జరిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కమిటీ సభ్యుల విషయంలో ఇదే జరిగిందంట. ఎవరికి వారు కళ్యాణం కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారాలను సిద్ధం అయ్యారని అంటున్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరు వలన పోలీసులు, రాపాక హీరో అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య మరోసారి విభేధాలు రచ్చకెక్కాయని చెబుతున్నారు. అధిష్టానం దృష్టి పెట్టకపోతే నియోజకవర్గాన్ని వైసీపీ శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు.