Categories
International

అమెరికాలో ఆందోళనల్లో పాల్గొన్న వారితో కరోనా వ్యాప్తి

అమెరికన్ పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌కి మద్దతుగా అగ్రరాజ్యంలో కొనసాగుతున్న ఆందోళనలు ట్రంప్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. నిరసనల్లో పాల్గొన్న కొంతమంది ఆందోళకారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. మినియాపోలీస్‌ నగరంలో అంటుకున్న నిరసన జ్వాలలు దేశమంతా విస్తరించగా.. చాలాచోట్లు నిరసకారులు వైరస్‌ బారిన పడ్డట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. 

ఈ క్రమంలోనే అట్లాంటా సిటీ మేయర్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. శనివారం నాటి ఆందోళనల్లో పాల్గాన్న కొంతమందికి వైరస్‌ సోకినట్లు తేలిందని అట్లాంటా సిటీ మేయర్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని, ఇలాంటి సమయంలో గుంపులు గుంపులుగా మెలగడం అంత శ్రేయస్కరం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుంటే పెద్ద విపత్తును ఎదుర్కొక తప్పదని మేయర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం రాత్రి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.

 నిరసనల నేపథ్యంలో అమెరికా వైద్యలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సమూహాలు ఏర్పడటంతో వైరస్‌ సులువుగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18లక్షలు దాటింది. లక్షకుపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా ఆందోళనలతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న భయం అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది.

కాగా జార్జి ఫ్లాయిడ్‌ పోలీస్‌ కస్టడీలో మృతి చెందడంతో కోవిడ్‌ నేపథ్యంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను ఆందోళనకారులు ధిక్కరించారు. మినియాపోలిస్‌లో పాటు మరికొన్ని నగరాల్లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. జార్జ్‌ మృతికి కారణమైన పోలీసులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ను కింద పడేసి, డెరెక్‌ చౌవిన్‌ అనే అధికారి అతడి మెడపై 9 నిమిషాల పాటు మోకాలితో తొక్కిపెట్టి ఉంచడంతో అతడు ఊపిరాడక చనిపోయిన విషయం తెలిసిందే.

Categories
International Technology

బిగ్ బ్రేకింగ్ : నాసా వ్యోమగాయులతో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేరుకున్న SpaceX అంతరిక్ష నౌక

శనివారం  ఇద్దరు నాసా వ్యోమగాములతో బయలుదేరిన స్పేస్ x కంపెనీకి చెందిన అంతరిక్ష నౌక  విజయవంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరకు చేరుకుంది. స్పేస్ x సంస్థ.. ఈ మిషన్‌కు “క్రూ డ్రాగన్-2″గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. స్పేస్ స్టేషన్ కు క్రూ డ్రాగన్ చేరుకున్నట్లు స్పేస్ x ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ మిషన్‌ ను శనివారం అమెరికాలో ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు.

ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరిక్షంలోకి పంపడం ఇదే మొదటిసారి. ఎలన్ మస్క్ సారథ్యంలోని SpaceX అనే ప్రేవేట్ అమెరికన్ ఏరోస్పేస్ మానుఫ్యాక్చరర్ మరియు స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీసెస్ కంపెనీ ఈ ఘనత సాధించింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇద్దరు నాసా వ్యోమగాములని అంతరిక్షంలోకి పంపింది SpaceX. దీంతో అంతరిక్షయానం చరిత్రలో సరికొత్త శకం మొదలైంది.

క్రూ డ్రాగన్ అంతరిక్షనౌకలో వెళ్లిన వ్యోమగాముల పేర్లు బాబ్ బెంకెన్, డగ్ హార్లీ. వీరిని 2000 సంవత్సరంలో ఈ మిషన్ కోసం ఎంపిక చేశారు. ఇద్దరూ స్పేస్ షటిల్ ద్వారా రెండేసి సార్లు అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు. వీరు నాసా ఆస్ట్రనట్ కోర్స్ తీసుకున్న అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాములు. ఇద్దరూ ఇప్పుడు ఎలాన్ మస్క్ కంపెనీ- స్పేస్ఎక్స్ ‘ద క్రూ డ్రాగన్’ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్(అంతర్జాతీయ స్పేస్ స్టేషన్) దగ్గరకు వెళ్లారు. అమెరికా సహా, ప్రపంచాన్ని కరోనా కల్లోలం కుదిపేస్తున్న సమయంలో శనివారం ఈ ప్రయోగం నిర్వహించారు. 

2011లో చివరిసారి అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఆ ప్రయోగంతో అమెరికా వ్యోమనౌక రిటైర్‌ కావడంతో నాటి నుంచి రష్యాకు చెందిన సూయజ్‌ అంతరిక్ష నౌకలోనే ఐఎస్‌ఎస్‌కు వెళ్తున్నారు. దీనికోసం రష్యాకు అమెరికా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. చంద్రుడు, అంగారక గ్రహంపైకి వెళ్లే ప్రాజెక్టుల్లో నాసా తలమునకలై ఉంది. దీంతో ఐఎస్‌ఎస్‌ సహా ఇతర రోదసీయానాలకు అవసరమయ్యే వ్యోమనౌకల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇందుకు ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌, మరో ప్రముఖ సంస్థ బోయింగ్ ముందుకు వచ్చాయి. తాజాగా స్పేస్‌ఎక్స్‌ తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలుసార్లు స్పేస్‌ఎక్స్‌ నిర్మించిన డ్రాగన్‌ ఐఎస్‌ఎస్‌కు సరకులను మోసుకెళ్లిన అనుభవం ఉండడం గమనార్హం.

Categories
National

కరోనా విజృంభణ.. టాప్-10దేశాల్లో 8వ స్థానానికి చేరిన భారత్

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి.. భారత్‌లోనూ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న టాప్ 10దేశాల లిస్ట్ లో భారత్ 8వ స్థానానికి చేరింది. నిన్నటివరకు 9వ స్థానంలో నిలిచిన భారత్…1లక్షా 85వేలకు పైగా కోవిడ్-19 కేసులతో ఇప్పుడు ఒక స్థానం ఎగబాకింది. ఇక, కరోనా కేసులు,మరణాల్లో వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనాను ఎప్పుడో భారత్ దాటిన విషయం తెలిసిందే.

18లక్షలకు పైగా కేసులతో ప్రపంచంలో మొదటి స్థానంలో అమెరికా నిలవగా,5లక్షలకు పైగా కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో నిలిచింది. 4లక్షల 5వేలకు పైగా కేసులతో రష్యా మూడవ స్థానంలో,2లక్షల 86వేలకు పైగా కేసులతో నాల్గవ స్థానంలో స్పెయిన్, 2లక్షల 7వేలకు పైగా కేసులతో ఐదవ స్థానంలో బ్రిటన్,2లక్షల 32వేలకు పైగా కేసులతో ఆరవ స్థానంలో ఇటలీ,1లక్షా 88వేలకు పైగా కేసులతో ఏడవ స్థానంలో ఫ్రాన్స్,1లక్షా 85వేలకు పైగా కేసులతో భారత్ 8వ స్థానంలో నిలిచింది. ఇక 1లక్షా 83వేలకు పైగా కేసులతో జర్మనీ తొమ్మిదవ స్థానంలో నిలవగా,1లక్షా 63వేల కేసులతో టర్కీ పదవ స్థానంలో నిలిచింది.

భారత్ లో  గంటలకు దాదాపు 300కేసుల వరకు నమోదవుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే దేశంలో రికార్డు స్థాయిలో 8,380 కొత్త కరోనా కేసులు,193మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒక్కరోజులో కరోనా కేసుల సంఖ్య 8వేలు దాటడం ఇదే మొదటిసారి. మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ ను రెండు నెలల తర్వాత దశలవారీగా తొలగించేందుకు భారత్ సిద్దమైన సమయంలో రికార్డు స్థాయిలో కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇక దేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 5,266మంది చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 61లక్షల 20వేలకు చేరుకుంది ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కు 3లక్షల 71వేల మందికి పైగా బలైపోయారు.

Categories
International National

సమోసాలు చేసిన ఆస్ట్రేలియా ప్రధాని….కలిసి తిందామన్న మోడీ

మనదేశంలో సమోసా గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. గరం గరం సమోసాను  నూనెలో వేయించిన పచ్చిమిర్చితో కలిపి తింటే ఆ టేస్టే వేరు. ఈ లాక్ డౌన్ సమయంలో మనదేశంలోని చాలామంది ఇళ్లల్లో తాము కోరిన విధంగా సమోసాలు చేసుకుని తింటున్నారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఈ జాబితాలోకి చేరారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారతీయ స్టైల్ లో సమోసా, మామిడికాయ పచ్చడి చేశారు.

ఈ విషయాన్ని ప్రధాని మోడీతో పంచుకోవడానికి స్కాట్… తాను చేసిన వంటకాల ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మ్యాంగో చట్నతో సండే సమోసా చేశా. ఈ వారం నేను భారత ప్రధాని మోడీతో వీడియోలింక్ ద్వారా మీటింగ్ కాబోతున్నా. ఆయన వెజిటేరియన్. ఈ సమోసాను నేను ఆయనతో పంచుకోవాలనుకుంటున్నా అంటూ ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ ట్వీట్ చేశారు. ప్లేట్లో నోరూరించే సమోసాలు పట్టుకుని, ఆ ఫొటోలను షేర్ చేశారు. 

ఆస్ట్రేలియా ప్రధాని చేసిన సమోసా ట్వీట్‌కు భారత ప్రధాని స్పందించారు. బాగా నోరూరించేలా సమోసాలు ఉన్నట్టున్నాయంటూ మోడీ ట్వీట్ చేశారు. స్కాట్‌ షేర్‌ చేసిన సమోసాలను చూసి సంతోషపడిన మోడీ.. ఇండియన్‌ ఓషియన్‌తో రెండు దేశాలు కలువగా…భారతీయ సమోసాతో ఐక్యంగా ఉన్నాయని ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌ పై విజయం సాధించాక ఇద్దరం కలుసుకొని సమోసాలను తింటూ ఎంజాయ్‌ చేద్దాం, ఆ రోజు త్వరలోనే రావాలని ఆశిస్తున్నాను అని స్కాట్ ట్వీట్ కు మోడీ రిప్లై ఇచ్చారు.

జూన్‌4న ఆస్ట్రేలియా-భారత్ ప్రధానులు వర్చువల్‌ ప్లాట్‌ఫాంపై సమావేశం కావాలని, ఆర్థిక, సామాజికాంశాలపై చర్చించాలని ఇదివరకే నిర్ణయించారు. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా విదేశీ ప్రయాణం చేసేందుకు ఆంక్షలు ఉన్నందున విదేశీ ప్రభుత్వంతో నరేంద్రమోడీ పాల్గొంటున్న తొలి ద్వైపాక్షిక శిక్షరాగ్ర సమావేశంగా రికార్డులకెక్కనున్నది. ఈ శిఖరాగ్ర సమావేశంలో మిలిటరీ సరుకు రవాణా సౌకర్యాలతోపాటు మరికొన్ని ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

 

 

Categories
National

రేపట్నించే ప్రత్యేక రైళ్ళు.. విధి విధానాలు విడుదల చేసిన రైల్వే శాఖ

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ  కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు వెలువరించిన నేపథ్యంలో రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. రేపటి నుంచి (జూన్‌1) దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్నట్టు భారతీయ రైల్వేశాఖ ఆదివారం ప్రకటించింది. ఈ రైళ్ల ద్వారా తొలిరోజున దాదాపు 1.45 లక్షల మంది ప్రయాణికులను చేరవేయనున్నట్లు తెలిపింది. ఈ నేపధ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు కీలక సూచనలు చేశారు. 
 

> రైలు బయల్దేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావాలని సూచించించారు. 
> టికెట్లు ఉన్నవారికి మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి అనుమతి ఉంటుంది. 
> ఈ రైళ్లకు రిజర్వు చేయని టికెట్లు జారీ చేయమని అధికారులు చెప్పారు. 
> కరోనా లక్షణాలున్న ప్రయాణికులను అనుమతించమని స్పష్టం చేశారు. 
> రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోమని పేర్కొన్నారు. 
> ప్రతి ఒక్కరూ కనీస సామాన్లతోనే ప్రయాణించాలి. 

> అనారోగ్యంతో ఉన్న వారు ప్రయాణం చేయకపోవడమే మంచిది. 
> రేపటి నుంచి రైళ్లలో ప్రయాణించే వారు విధిగా ముఖానికి మాస్క్‌ ధరించాలి.
> గర్భిణీలు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వాళ్లు ప్రయాణించవద్దు. 
> టిక్కెట్‌ కన్ఫామ్‌ అయినవాళ్లు, ఆర్‌ఏసీ పొందినవారు మాత్రమే ప్రయాణించేందుకు సిద్ధం కావాలని సూచించింది.
> రైళ్లలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. 
> రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలి అని అధికారులు కోరారు. 

Categories
National

సరిహద్దుల్లో మళ్లీ జవాన్ల ఫైటింగ్…వైరల్ వీడియోపై స్పందించిన భారత ఆర్మీ

లఢఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన దేశ సైనికులకు పిలుపునిచ్చారు. దీంతో లడక్ సమీపంలో సరిహద్దులకు అవతల చైనా ఆర్మీ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరింపజేసింది. యుద్ధ సామాగ్రిని తరలించింది. మరోవైపు భారత్ కూడా సరిహద్దు దగ్గర భారీగానే సైన్యాన్ని మొహరించింది. ఇటీవల ఆర్మీచీఫ్ కూడా లఢఖ్,లేహ్ లో పర్యటించారు.

ఇలాంటి సమయంలో లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు దగ్గర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాంగాంగ్ లేక్ దగ్గర భారత సైనికులపై చైనా సైనికులు రాళ్ల దాడికి పాల్పడటంతో… భారత సైనికులు చైనా జవాన్‌ లను అడ్డుకుని.. బంధించినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండో -టిబెట్ సరిహద్దు పోలీసులు చైనా సైనికుడిని బంధించారని, అతణ్ని చితగ్గొట్టి,వాళ్ల ఆర్మీ వాహనాన్ని ధ్వంసంచేసినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.

లఢఖ్ సమీపంలో భారత్, చైనా సరిహద్దుల వద్ద ఫింగర్-4, ఫింగర్-5 ప్రాంతం వద్ద భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చిన చైనా జవాన్లు, ఓ యుద్ధ ట్యాంకును ఐటీబీపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. యుద్ధ ట్యాంకును భారత జవాన్లు ధ్వంసం చేయడం, చైనా సైనికుడిని బంధించడం,  కొద్దిసేపటి తరువాత ఆ సైనికుడిని మనదేశ జవాన్లు విడిచి పెట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ఎక్కడిదనేది, ఎప్పటిదనేది కూడా తెలియరావట్లేదు.

అయితే,సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై భారత ఆర్మీ స్పందించింది. సరిహద్దుల్లో జరిగిన ఒక సంఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని విషయాలు ప్రామాణీకరించబడలేదని మరియు ఉత్తర సరిహద్దుల్లోని పరిస్థితులతో దానిని అనుసంధానించే ప్రయత్నాలు ఉద్దేశ్యపూర్వకంగా చిత్రీకరించిన అబద్దాలు అని ఆర్మీ తెలిపింది. ప్రస్తుతం బోర్డర్ లో ఎటువంటి హింస జరగడం లేదని భారత ఆర్మీ తెలిపింది. ఇరు దేశాల మధ్య వివాదాలు సైనిక కమాండర్ల మధ్య పరస్పర చర్యల ద్వారా పరిష్కరించబడతాయని, రెండు దేశాల మధ్య సరిహద్దుల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌లచే మార్గనిర్దేశం చేయబడతాయని తెలిపింది.

Categories
International Latest

ఈ వైరస్ కరోనా కన్నా డేంజరస్, ప్రపంచ జనాభాలో సగం మంది చనిపోతారు, సైంటిస్ట్ వార్నింగ్

అసలే యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు ప్రాణ భయంతో బతుకుంటే, ఇప్పుడు అమెరికా సైంటిస్ట్,

అసలే యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు ప్రాణ భయంతో బతుకుంటే, ఇప్పుడు అమెరికా సైంటిస్ట్, పౌష్టికాహార డాక్టర్ మైఖేల్ గ్రెగర్ మరో బాంబు పేల్చారు. ‘కరోనా వైరస్’ కన్నా అతి భయంకరమైన వైరస్(బర్డ్ ఫ్లూ లాంటిది) ఒకటి ప్రపంచాన్ని వణికించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచ జనాభాలోని సగం మందిని కోల్పోతామని తెలిపారు. అంటు వ్యాధులను ఎలా నివారించాలి?(How To Survive a Pandemic) అనే కొత్త పుస్తకం డాక్టర్ మైఖేల్ గ్రెగర్ రాశారు. అందులో శాఖాహారం ప్రయోజనాలను వివరించారు. జంతువుల మాంసం వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని.. ఈ కారణంగా మొత్తం మానవ జాతికి ముప్పు ఉంటుందన్నారు. జంతువుల పెంపకం, వాటి వేట, మాంసాన్ని తినడం మావనాళిని ప్రమాదంలో పడేస్తుందనేది ఆయన వాదన.

జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే చాలా వైరస్‌లు ఎటువంటి హాని కలిగించవు. కానీ క్షయ, సార్స్ వంటి కొన్ని రకాల వైరస్‌లు మాత్రం చాలా వేగంగా పెరుగుతాయన్నారు. నిజానికి అవి చాలా ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించారు. కాగా ఆయన రాసిన బుక్‌లో ముఖ్యంగా చికెన్ కారణంగా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు.

చికెన్ లో వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువ:
నేటి పశు వ్యవసాయంలో కోళ్ల పెంపకం పెద్ద భాగమైంది. ఇఫ్పుడు దాదాపు అన్ని దేశాల్లో కోడి గుడ్లు ఎక్కువగానే తింటున్నారు. ఇక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. కోళ్లను చాలా క్రూరంగా బోనులో ఉంచుతారు. వాటికి రసాయనాలు కలిగిన ఆహారాలు ఇస్తారు. ఈ కారణంగానే చికెన్‌లో వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్ మైఖేల్ గ్రెగర్ అభిప్రాయ పడ్డారు. ఎక్కువ సంఖ్యలో ఎంత క్రూరంగా మనం చికెన్ తయారు చేస్తున్నామో.. వైరస్ వ్యాప్తి కూడా అంతే స్థాయిలో ఎక్కువగా ఉంటుందని బుక్‌లో తెలిపారు. ఇది మహమ్మారిని ఆహ్వానించడం లాంటిదన్నారు డాక్టర్ మైఖేల్.

doctor

చరిత్రలో అత్యంత భయంకరమైనది స్పానిష్ బర్డ్ ఫ్లూ:
‘ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా దీన్నే స్పానిష్ బర్డ్ ఫ్లూ’ అని పిలుస్తారు. 1918-1920 మధ్య ప్రపంచ జనాభాలో మూడింట.. ఒక వంతు మందికి సోకింది. మొత్తం 10 శాతం మరణాలు ఈ కారణంగానే జరిగాయి. ఇది చరిత్రలో అత్యంత భయంకరమైన అంటువ్యాధిగా నమోదు చేయబడింది. కాగా 1997లో హాంకాంగ్ లో పక్షుల మార్కెట్ లో వెలుగుచూసిన H5N1 అనే కొత్త రకం బర్డ్ ఫ్లూ ఆ దేశంలో భయంకరమైన వినాశనాన్ని కలిగించిందన్నారు.

కొత్త H5N1 మరింత ప్రమాదకరం:
కొత్త H5N1 మరింత ప్రమాదకరంగా ఉంటుందన్నారు నిపుణులు. దీని ద్వారా ఎక్కువ మరణాలు సంభవిస్తాయని, మొత్తం మానవ జాతికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. H5N1 లంగ్స్‌ను ప్రభావితం చేస్తుంది. కానీ దాని కొత్త వైరస్ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మునుపటి కంటే పది రెట్లు వేగంగా మారుతుంది. ఇది 1918 మహమ్మారి కంటే ప్రమాదకరమైనది కావచ్చు. ఈ కారణంగా మరణాల రేటు 50 శాతం ఉంటుంది. అందువల్ల, మొత్తం ప్రపంచంలోని సగం జనాభాకు ఇది ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్ లోని జంతువుల మాంసం ద్వారా కరోనా వైరస్ సంక్రమించి, మానవుల శరీరంలోకి ప్రవేశించిందని డాక్టర్ గ్రెగర్ అంటారు. కాగా, చికెన్ వల్ల కరోనా సోకదని పలువురు నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈయనేమో చికెన్ నుంచి వైరస్ చాలా డేంజర్ అని, ప్రపంచ జనాభాలో సగంమంది పోతారని అంటున్నారు. దీంతో ఏది నిజమో.. ఏది కాదో తెలీక జనాలు తలలు పట్టుకుంటున్నారు. అసలే జనాలు కరోనా భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి మహమ్మారిని జీవితంలో ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఈ కరోనా నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ కన్నా డేంజర్ వైరస్ తో మానవ జాతికి ముప్పు పొంచి ఉందని, ప్రపంచ జనాభాలో సగంమంది పోతారని చెప్పడం మరింత ఆందోళన పెంచింది.

Categories
Movies

2 వేల మంది టీవీ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ ను ఆదుకున్న త‌ల‌సాని ట్రస్ట్ 

కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో షూటింగ్స్ నిలిపివేసిన సంగతి  తెలిసిందే…. ఈ తరుణంలో షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది టీవీ కళాకారులు, టెక్నీషియన్స్ ను ఆయా టీవీ సంఘాలు ,దాతలు ఆదుకోవడం జరిగింది. ఇటీవల సినీ పరిశ్రమలోని ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ఇండ్రస్ట్రీ పెద్దలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాసయాద‌వ్. 

టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ బాల, సెక్రటరీ విజయ్ యాదవ్, టివి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రసాద్, కెమెరా అసోసియేషన్ సెక్రటరీ నర్సింగ్ రావుతో సహా పలు సంఘాల నాయకులు మంత్రిని కలిసి టీవీ పరిశ్రమ సమస్యలను వివరించారు. టీవీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించేందుకు సుముఖత వ్యక్తం చేసిన మంత్రి తలసాని తన “తలసాని ట్రస్ట్” ద్వారా 2 వేల మంది టీవీ కార్మికులకు  నిత్యావసర వస్తువులను అందచేయడం  జరిగింది. 

మంత్రి తలసాని ఇచ్చిన నిత్యావసర వస్తువులను అన్ని సంఘాల నాయకుల సమక్షంలో  మే 31న హైదరాబాద్  జూబ్లీ హిల్స్ లో టీవీ కళాకారులకు  పంపిణీ చేయడం జరిగింది.. సహాయం  పొందిన  కార్మికులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుగా.. టివి పరిశ్రమ అభివృద్ధికి మరింతగా తోడ్పాడాలని నాయకులు కోరారు. 

telugu tv artists

Categories
Andhrapradesh Crime Latest

విశాఖలో నాటుసారా అనుకుని స్పిరిట్ ముగ్గురు మృతి

విశాఖ జిల్లా కశింకోటలోని గోవిందరావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాటు సారా అనుకుని సర్జికల్‌ స్పిరిట్‌

విశాఖ జిల్లా కశింకోటలోని గోవిందరావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాటు సారా అనుకుని సర్జికల్‌ స్పిరిట్‌ తాగి ముగ్గురు మృతి చెందారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు స్పిరిట్‌ తాగగా.. అందులో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో వ్యక్తి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతులను నూకరాజు, ఆనంద్‌, అప్పారావుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు ముగ్గురూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి మరణంతో ఆయా కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.

Categories
Latest Telangana Weather

జాగ్రత్త, మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. ఇన్నాళ్లూ ఎండ వేడి,

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. ఇన్నాళ్లూ ఎండ వేడి, వడగాలులు, ఉక్కపోతతో విలవిలలాడిన ప్రజలు ఉపశమనం పొందారు. ఆదివారం(మే 31,2020) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం నీరు రోడ్లపై పారింది. హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన పడింది. ఇది నైరుతి రుతుపవాల ఎఫెక్ట్ అని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కాగా వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది. రానున్న 3 రోజుల్లో తెలంగాణలో కుండపోత వానలు పడతాయంది.

అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం:
ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. జూన్‌ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్‌ తీరాలను చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఛత్తీ‌స్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మధ్యకర్ణాటక మీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపిందది. నైరుతి రుతుపవనాలు రేపు(జూన్ 1,2020) కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల 3 రోజులు అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఉక్కపోత, వడగాలుల నుంచి రిలీఫ్:
హైదరాబాద్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తీవ్రమైన ఎండ ఉంది. సడెన్ గా మధ్యాహ్నం 1.30 గంటలకు వాతావరణం మారిపోయింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఈదురు గాలి మొదలైంది. కాసేపటికి భారీ వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో నగరవ్యాప్తంగా భారీ వాన పడింది. వానలో నగరం తడిసి ముద్దయింది. వాన కురవడంతో ఒక్కసారిగా వాతావరణం కూల్ గా మారింది. కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరయిన జనాలు.. వర్షం పలకరింపుతో వేసవితాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు. రాష్ట్రంపై భానుడి ప్రతాపం కాస్త తగ్గింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.