Categories
Latest National

పతంజలి కరోనా మందు వివాదం.. బాబా రాందేవ్, బాలకృష్ణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

కరోనాకు మందు కనిపెట్టామని, దాని ద్వారా 100 శాతం రోగం నమయమవుతుందని చెబుతూ ఇటీవలే పతంజలి సంస్థ కరోనిల్(Coronil) పేరుతో ఔషధాన్ని మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, పతంజలి సంస్థ.. కరోనా మందు విడుదల చేసిన మరుక్షణమే వివాదానికి దారి తీసింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, పతంజలి సీఈవో బాలకృష్ణలను చిక్కుల్లో పడేసింది. బాబా రాందేవ్, బాలకృష్ణ, మరో ముగ్గురిపై రాజస్థాన్‌ జైపూర్ లో కేసు నమోదైంది. వాళ్లంతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జైపూర్‌‌లోని జ్యోగి నగర్‌‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేశారు.

బాబా రాందేవ్ సహా ఐదుగురిపై చీటింగ్ కేసు:
రాజస్థాన్‌లోని జైపూర్‌ జ్యోతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బల్బీర్‌ జఖర్‌ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణతోపాటు జైపూర్‌లోని నిమ్స్‌ యూనివర్సిటీ చైర్ పర్సన్ డాక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ తోమర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ తోమర్‌, పతంజలి ఆయుర్వేద సైంటిస్టు వర్షణేలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 420, 1954 డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ యాక్ట్‌ల ప్రకారం కేసులు నమోదు చేశామని జైపూర్‌ సౌత్‌ అడిషనల్‌ డీసీపీ అవినాష్‌ తెలిపారు.

ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే యత్నం:
ఆ ఐదుగురూ ప్రజలను తప్పుదోవ పట్టించారని, వారి ప్రాణాలకు ముప్పు కలిగించే యత్నం చేశారని లాయర్ బల్బీర్ జఖర్ ఆరోపించారు. రాజస్థాన్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు వారు తమ క్లినికల్‌ ట్రయల్స్‌ గురించి, కరోనిల్ ట్యాబ్లెట్‌ గురించి చెప్పలేదన్నారు. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, నిమ్స్‌ చైర్మన్‌ డాక్టర్‌‌ బల్బీర్‌‌ సింగ్‌ తోమర్‌‌, డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ అనురాగ్‌ తోమర్‌‌, సైంటిస్ట్‌ అనురాగ్‌ వర్షణేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. జఖర్‌‌ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 420 కింద చీటింగ్‌ కేసు పెట్టామన్నారు.

కరోనా మందు విడుదల చేసిన పతంజలి:
కరోనా వైరస్ నివారణ కోసం ఆయుర్వేదంతో ఔషధం తయారు చేశామని ఇటీవలే పతంజలి ప్రకటించింది. కరోనిల్ పేరుతో ఔషధాన్ని మంగళవారం( జూన్ 23,2020) బాబా రాందేవ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మందు ద్వారా 100 శాతం రోగం నమయమవుతుందని ఆయన చెప్పారు. కాగా ఎమర్జెన్సీ పేషెంట్లు కాక.. కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారి కోసమే ఈ మెడిసిన్ అని వెల్లడించారు. ఈ ఔషధంతో కేవలం 3 నుంచి 7 రోజుల్లోనే పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటారని స్పష్టం చేశారు.

పతంజలికి నోటీసులు పంపిన కేంద్ర ఆయుష్ శాఖ:
పతంజలి సంస్థ కరోనా ఔషధాన్ని ఇలా విడుదల చేసిందో లేదో అలా వివాదం మొదలైంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థ విడుదల చేసిన ఔషధంపై ఆంక్షలు పెట్టింది. పతంజలి చెబుతున్న వివరాలేవీ తమకు తెలియవంది. సదరు మెడిసిన్‌కు చెందిన క్లినికల్‌ ట్రయల్స్‌, రీసెర్చి వివరాలతోపాటు అందులో వాడిన పదార్థాల వివరాలను తమకు తెలియజేయాలని నోటీసులు కూడా పంపింది. అప్పటివరకు ఈ మెడిసిన్‌పై ప్రచారం చేయకూడదని, మెడిసిన్‌ను అమ్మకూడదని స్పష్టం చేసింది. ఇక మహారాష్ట్ర, రాజస్థాన్‌ ప్రభుత్వాలు కూడా ఆ మందును అమ్మొద్దని, అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. పర్మిషన్‌ లేకుండా క్లినికల్‌ ట్రయల్స్‌ చేసినందుకు నిమ్స్‌ డైరెక్టర్‌‌కు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాయి.

అయితే తాము నిబంధనలను ఉల్లంఘించలేదని పతంజలి సంస్థ చెబుతోంది. అన్నీ సక్రమంగానే నిర్వహించామని, మెడిసిన్‌ విక్రయాలకు అనుమతులు కూడా పొందామని, త్వరలోనే వివరాలన్నింటినీ అందజేస్తామని వెల్లడించింది. అన్ని అనుమతులు తీసుకున్నాకే రోగులపై కరోనిల్ ప్రయోగించామని నిమ్స్ చైర్మన్ బల్బీర్ సింగ్ తోమర్ కూడా తెలిపారు. ఐసీఎంఆర్ పరిధిలోని సీటీఆర్ఐ నుంచి పర్మిషన్ తీసుకున్నామని వివరించారు. దానికి సంబంధించి పత్రాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. కరోనా రోగులపై ప్రయోగించగా 100 మందిలో 69 శాతం మంది మూడు రోజుల్లో కోలుకున్నారని.. 7 రోజుల్లో మొత్తం 100 శాతం మంది కోలుకున్నారని ఆయన వెల్లడించారు.

Categories
Latest Movies

కరోనా స్పెషల్ షర్ట్-యంగ్ హీరో ఐడియా అదిరిందిగా!

లాక్‌డౌన్ టైంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే తారాలంతా అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సోషల్ మీడియా ద్వారా పలువురు సెలబ్స్ నెటిజన్లకు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన స్టైల్లో ఓ స్పెషల్ కరోనా మాస్క్ ధరించాడు. తలను కూడా పూర్తిగా కప్పి ఉంచేలా డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన టీషర్ట్ వేసుకున్నాడు. రామ్ ఆ మాస్క్ ధరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల రూపొందిస్తున్న థ్రిల్లర్ ‘రెడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 9న విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ నటించనున్నట్టు ఫిలిం నగర్ సమాచారం.

Categories
Andhra Pradesh Andhrapradesh Crime Latest

గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య, అర్థరాత్రి కాపు కాసి మర్డర్

గుంటూరు జిల్లా గురజాల మండలం పాత అంబాపురంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ కార్యకర్త విక్రమ్ ను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. శనివారం(జూన్ 27,2020) అర్ధరాత్రి బైక్‌ పై వెళ్తుండగా కాపు కాసిన ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్‌ తీవ్రగాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఆ కోణంలో మృతుడితో గతంలో గొడవలకు దిగిన పలువురు వ్యక్తుల్ని విచారించే పనిలో పడ్డారు.

బోరు వేసే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ:
ఇంటి దగ్గర బోరు వేసుకునే విషయంలో విక్రమ్ వర్గానికి మరో వర్గానికి వివాదం నెలకొంది. ఈ క్రమంలో అర్ధరాత్రి 15మందితో కాపు కాసి ప్రత్యర్థులు విక్రమ్ వర్గంపై దాడి చేసినట్టు సమాచారం. దాడిలో విక్రమ్ కాలు, చేయి నరికేశారు. తీవ్రగాయాలు కావడంతో విక్రమ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విక్రమ్ ఓ పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు మోహరించారు. గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పలువురు టీడీపీ నేతలు ఈ ఘటన గురించి ఆరా తీశారు. విక్రమ్ కుటుంబాన్ని వారు పరిమర్శించారు.

Categories
Andhra Pradesh Andhrapradesh Crime Latest

కృష్ణా జిల్లాలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా, డబ్బాలు నింపుకున్న జనాలు, ఏదైనా జరిగి ఉంటే..

కృష్ణా జిల్లా గన్నవరం హైవేపై ప్రమాదం జరిగింది. పెట్రోల్, డీజిల్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే డబ్బాలతో అక్కడికి చేరుకున్నారు. వృథాగా కారిపోతున్న పెట్రోల్ ను డబ్బాల్లో నింపుకుని ఇంటికి వెళ్లారు. పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడిన విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డబ్బాల్లో పెట్రోల్ పట్టుకునేందుకు పోటీలు:
కాగా ట్యాంకర్ బోల్తాపడి పెట్రోల్ లీక్ కావడంతో ఏం జరుగుతుందోనని ఫైర్ సిబ్బంది, పోలీసులు బాగా భయపడ్డారు. జనాలు మాత్రం డబ్బాల్లో పెట్రోల్ నింపుకోవడానికి పోటీలు పడ్డారు. స్థానికుల తీరు ఫైర్ సిబ్బందిని, పోలీసులను మరింత టెన్షన్ కు గురి చేసింది. పెట్రోల్ ఎంత ప్రమాదమో తెలిసిందే. వారు డబ్బాలతో పెట్రోల్ పట్టుకునే క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే, ఊహించని స్థాయిలో ప్రమాదం ఉంటుంది.

ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే:
బైక్ ని తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో ట్యాంకర్ బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. ఆ ట్యాంకర్ లో పెట్రోల్ తో పాటు డీజిల్ కూడా ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ట్యాంకర్ ను రోడ్డుపై నుంచి పక్కకు జరిపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కపోవడంతో స్థానికులు సహా అంతా ఊపిరిపీల్చుకున్నారు. డబ్బాల్లో పెట్రోల్ పట్టుకుని వెళ్తున్న స్థానికులను ముందుగా అదుపు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ట్యాంకర్ ను పక్కకి జరిపించారు. ఆ సమయంలో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరక్కపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల తీరుపై పోలీసులు మండిపడ్డారు. ప్రమాదం అని తెలిసినా డబ్బాలతో పెట్రోల్ పట్టుకునేందుకు పోటీలు పడటాన్ని తప్పుపట్టారు. పొరపాటున నిప్పు రాజుకుని ఉంటే, బ్లాస్ట్ జరిగి ఉంటే ఘోరం జరిగి ఉండేదన్నారు.

Categories
Latest Movies

కోడలు కాదండోయ్.. మళ్లీ మామాకే ఓటేశారు..

బుల్లితెరపై రియాలిటీషోలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కంటెంట్, దాన్ని ఇంట్రెస్టింగ్‌గా డీల్ చేసే కెపాసిటీ కలిగిన సెలబ్రిటీ ఉంటే ఇక ఆ షో సూపర్ హిట్టే.. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు బాలీవుడ్‌లో పలు సీజన్లను తమదైన శైలిలో హోస్ట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా మన తెలుగు బుల్లితెరపై కింగ్ నాగార్జున అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయనున్నారు.
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ 1, 2, 3…  ఈ మూడు సీజన్లను వరుసగా ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్ట్‌ చేశారు.

ఈసారి వ్యాఖ్యాత స్థానంలో ఓ అందాల భామ ఉంటుందని, ఆమె మరెవరో కాదు కింగ్ కోడలు సమంత అక్కినేని అంటూ కొద్ది రోజులుగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. కట్ చేస్తే బిగ్ బాస్  తెలుగు నాలుగో సీజన్‌కి హోస్ట్ కోడలు సమంత కాదు.. ఆమె మామ నాగార్జున అనే మాట గట్టిగా వినబడుతోంది. నాగ్ మూడో సీజన్‌ని తన స్టైల్లో నడిపించడంతో రెస్పాన్స్ బాగా వచ్చింది కాబట్టి  మళ్లీ ఆయన్నే కొనసాగించాలని ఫిక్స్ అయ్యారట నిర్వాహకులు. నాగార్జున కూడా మళ్లీ హోస్ట్‌ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. ఫస్ట్‌ సీజన్‌ ముంబైలో జరిగింది. రెండు, మూడు సీజన్లు హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. జూలైలో సెట్‌ వర్క్‌ స్టార్ట్ చేయనున్నారు. ఆగష్టులో బిగ్ బాస్-4 పట్టాలెక్కే అవకాశముందని తెలుస్తోంది.

Categories
Latest Political Telangana

పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి కారణం చెప్పిన సీఎం కేసీఆర్

ఆదివారం(జూన్ 28,2020) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి దగ్గర భారత మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పీవీ జ్ఞానభూమిలో నివాళులు అర్పించారు. ఆ తర్వాత మాట్లాడిన కేసీఆర్ పీవీ నరసింహారావుపై ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, గొప్ప సంస్కరణ శీలి అని కితాబిచ్చారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని కీర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. గురుకుల పాఠశాలలను తీసుకొచ్చింది పీవీనే అని, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చిన నేత పీవీ నరసింహరావని.. మన పీవీ మన ఠీవీ అని సీఎం కేసీఆర్ గర్వంగా చెప్పారు.

సంస్కరణలకు నిలువెత్తు రూపం పీవీ:
కాగా, పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి కారణం ఏంటో చెప్పారు సీఎం కేసీఆర్. నిన్నటి గతమే నేటి చరిత్ర. నాకు చాలా సంతోషంగా ఉంది. పీవీ నరసింహారావు గొప్ప తెలంగాణ బిడ్డ. దేశానికే కాదు ప్రపంచానికే ఆయన కంట్రిబ్యూషన్ చేశారు. ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చారు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ప్రతి సందర్భాన్నీ సద్వినియోగం చేసుకున్నారు. ఏ అంశం అయినా తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పగలిగిన వ్యక్తి. ప్రపంచమంతా కలోనియల్ విధానం ఉన్నప్పుడు విదేశాంగ మంత్రిగా కొత్త డైలాగ్ చెప్పారు. లుక్ టు ఈస్ట్. ఎంత సేపు మీరే కాదు. ఈస్ట్ వరల్డ్ లో కూడా చాలా పెద్ద సంస్కరణలు ఉన్నాయి. మాకూ సంస్కారం, చరిత్ర, సంస్కృతి, వైవిధ్యం ఉంది. లుక్ ఈస్ట్ అని కొత్త ఫిలాసపీ చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం ఈస్ట్ వైపు తిరిగేలా చేశారు” అని పీవీని ఉద్దేశించిన కేసీఆర్ చెప్పారు.

గొప్ప తెలంగాణ బిడ్డ:
నేడు(జూన్ 28,2020) పీవీ నరసింహారావు 100వ జయంతి. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు.

2021 జూన్ 28వ తేదీ వరకు పీవీ శత జయంతి ఉత్సవాలు:
పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. గడ్డు కాలంలో ప్రధాని పీఠం అధిష్టించి చక్రం తిప్పిన అపర చాణక్యుడు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ఈ తరం పాలకులకు ఆదర్శంగా నిలిచిన మహా నేత పీవీ నరసింహారావు అని కేసీఆర్ ప్రశంసించారు. దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తి పీవీ. ఆధునిక భారత దిశా నిర్దేశకుడు పీవీ అని కితాబిచ్చారు.

Categories
National

కీచక టీచర్.. నీచపు పని.. 69మంది మహిళల వీడియోలు చిత్రీకరించాడు

సింగపూర్‌లోని ఒక పాఠశాల ప్రాంగణంలో మహిళల 160 అసభ్యకర వీడియోలను మూడేళ్ల వ్యవధిలో చిత్రీకరించాడు ఓ 47 ఏళ్ల ఉపాధ్యాయుడు. మహిళలను అవమానించినందుకు మరియు అశ్లీల చిత్రాలను కలిగి ఉన్నందుకు అతనిపై నేరం నమోదు చేశారు పోలీసులు.

నిందితుడు ఏప్రిల్ 2015 మరియు జూలై 2018 మధ్య పాఠశాల ప్రాంగణంలో తన మొబైల్ ఫోన్‌తో మహిళల 169 అసభ్యకర వీడియోలను చిత్రీకరించినట్లు గుర్తించారు. ఏప్రిల్ 2015నుంచి 2016 మొదటి సగం మధ్య పాఠశాలలో నిందితుడు 16 మంది మహిళల 24 అసభ్యకర వీడియోలను పలు సందర్భాల్లో రికార్డ్ చేశాడు.

నిందితుడు సుమారు 69 మంది మహిళల అసభ్యకర వీడియోలను రికార్డ్ చేశారు. అతను 2017 లో ఒకే పాఠశాలలో 32 మంది మహిళల 105 అప్‌స్కిర్ట్ వీడియోలను పలు సందర్భాల్లో చిత్రీకరించాడు. అప్పుడు, 2018 జనవరి మరియు జూలై మధ్య, 21 మంది మహిళల 39 అసభ్యకర క్లిప్‌లను నిందితుడు షూట్ చేశాడు.

మూడు సంవత్సరాల వ్యవధిలో 69మంది మహిళల వీడియోలు షూట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇవే కాకుండా, నిందితుడు తన బంధువులలో ఒకరు మరియు ఒక మహిళ షాపింగ్ మాల్‌లో ఉన్న మహిళలను కూడా చిత్రీకరించాడు.

Categories
Andhra Pradesh Andhrapradesh Latest

పీవీ శత జయంతి…సీఎం జగన్ ట్వీట్

భారత మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలువురు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం జరిగింది. 2020, జూన్ 28వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు పీవీ శత జయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా పీవీ ఘాట్‌ వద్ద సీఎం పుష్పాంజలి ఘటించారు. ఏపీ సీఎం జగన్…పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

పీవీ నరసింహరావు బహుభాషా కోవిదుడు అంటూ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. పీవీ నరసింహారావు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయన్నారు. దేశాభివృద్ధికి పీవీ చేసిన కృషిని భవిష్యత్తు తరాల వారు కూడా గుర్తుంచుకుంటారన్నారు.

పీవీ ఒక తెలివైన రాజకీయ వేత్త..అంతేగాకుండా..రాజనీతిజ్ఞులు, బహుభాషా పండితుడన్నారు. భారత దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిన సందర్భంలో ధైర్యంగా ప్రధాని పదవి చేపట్టి.. పీవీ గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారనే విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. దేశాన్ని ఆర్ధిక సరళీకరణ వైపు పరుగులు పెట్టించారని తెలిపారు.

Categories
Crime National

సార్..నా భార్య చిత్ర హింసలు పెడుతోంది..అరెస్టు చేయండి : వీడియో వైరల్

సార్..నా భార్య చిత్ర హింసలు పెడుతోంది..అరెస్టు చేయండి.. గృహహింస కింద కేసు బుక్ చేయండి..బాబోయ్ నేను చిత్ర ఈ హింసలు భరించలేను అంటున్నాడో ఓ భర్త. ఏంటీ సీన్ రివర్స్ అయ్యింది అనుకుంటున్నారా ? భార్యలు కదా గృహహింస కింద కేసులు బుక్ చేయాలని అంటుంటారు. ఇప్పటి వరకు మహిళలే ఈ గృహహింస కేసుల్లో బాధితులుగా ఉండడం చూస్తుంటాం. కానీ ఓ భర్త..భార్య చేతిలో హింసకు గురవుతున్నాడంట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పశ్చమ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాకు చెందిన జ్యోతిర్మయిమజుందార్ ఓ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ..భార్య, తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుతం కరోనా విస్తరిస్తుండడంతో ఎందుకైనా మంచిదని తల్లిదండ్రులను సొంత గ్రామమైన బైద్యబతిలో వదిలిపెట్టాడు. ప్రస్తుతం లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో…ఇటీవలే తల్లిదండ్రులను మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు. ఇది..మజుందర్ భార్యకు నచ్చలేదు.

ఏమో వారి వల్ల కరోనా వైరస్ వస్తుందని ఆమెకు భయం పట్టుకుంది. వెంటనే సొంతూరులో వదిలిపెట్టాలని చెప్పేది.  మజుందర్ వినిపించుకోలేదు. దీంతో చిత్ర హింసలకు గురి చేసేది. మెల్లిగా…ఆమెకు తెలియకుండా..వీడియోను రికార్డ్ చేయాలని భావించారు. అంతే..రహస్యంగా సెల్ ఫోన్ పెట్టాడు. చెంప దెబ్బలు కొట్టడం, పిన్నులతో గుచ్చడం, సిగరేట్లతో కాల్చడం చేసేది.

భార్య చిత్రహింసలను భరించలేక..జ్యోతిర్మయి మజుందార్ భీదాన్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. భార్య చిత్రహింసలు పెడుతోంది…గృహహింస కేసు కింద అరెస్ట్‌ చేయాలని కంప్లైట్ చేశాడు. భార్యపెట్టే చిత్రహింసను వీడియో రికార్డు చేసి పోలీసులకు చూపించాడు. చివరకు హైకోర్టుకు కూడా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Categories
Sports

పొలంలో ట్రాక్టర్ నడుపుతూ కనిపించిన ధోనీ.. వైరల్ వీడియో!

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. చాలాకాలం తర్వాత ధోనీని ఐపీఎల్‌లో చూడవచ్చు అని భావించిన అభిమానులకు కరోనా కారణంగా కుదరలేదు.  అయితే లేటెస్ట్‌గా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మిస్టర్ కూల్ ధోనీ, రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తుండగా.. తన సొంత పొలంలో ట్రాక్టర్ నడుపుతూ కనిపించారు. ఎంఎస్ ధోని ట్రాక్టర్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ధోని కొత్త రూపంలో కనిపిస్తున్నాడు.

వీడియోలో, ధోని తన పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా.. ఆ వీడియోను ధోని భక్త  ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. 2019 ప్రపంచ కప్ తర్వాత ధోని భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. 2019 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ధోని చివరిసారి భారత్ తరఫున ఆడాడు. అప్పటి నుంచి అతను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ కారణంగా, భారతదేశంలోని క్రికెట్ నియంత్రణ మండలి కూడా అతన్ని వార్షిక ఒప్పందం నుంచి మినహాయించింది.

ధోని రిటైర్‌మెంట్ ప్రకటిస్తారంటూ చాలాసార్లు వచ్చాయి. కానీ ధోని తన పదవీ విరమణ గురించి ఏమీ మాట్లాడలేదు. ఐపీఎల్ 2020 తర్వాత ధోని భారత జట్టులోకి తిరిగి వస్తాడని అందరూ భావించారు. కాని కరోనా వైరస్ కారణంగా, ఐపిఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్‌ బ్రేక్‌లు కారణంగా ధోని అంతర్జాతీయ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది.