25 Years Celebrations of "Telugu Cine Writers Association"- "Rajathothsavam" event

రచయితలు లేనిదే మేములేము : మెగాస్టార్ చిరంజీవి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగు సినీ రచయితల సంఘం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..

తెలుగు సినీ రచయితల సంఘం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ : ‘చిత్రసీమలో దర్శక, నిర్మాతల తర్వాత నేను అత్యంత గౌరవించేది రచయితలనే.. వాళ్లతో సన్నిహితంగా ఉంటాను. రచయితలు లేకపోతే మేము (నటీనటులం) లేమన్నది వాస్తవం.. అనుభవజ్ఞులైన, ప్రతిభావంతులైన రచయితలను సన్మానించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభకు నన్ను పిలవకపోయి ఉంటే బాధపడేవాణ్ణి. నా జీవితంలో మరువలేని ఘట్టమిది’ అన్నారు.

జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు ఆదివిష్ణు, రావి కొండలరావు, కోదండరామిరెడ్డి, భువనచంద్రను చిరంజీవి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సింగీతం శ్రీనివాసరావు, కె. విశ్వనాథ్‌గారు ఇక్కడికి వచ్చి ఉంటే పరిపూర్ణంగా ఉండేది. భవిష్యత్తులో వారికి నాతో జీవిత సాఫల్య పురస్కారాలు అందించే అవకాశం ఇస్తే సంతోషిస్తా’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ : ‘నాకు వేషాలు ఇవ్వమని వెంటపడిన సత్యానంద్‌ని సన్మానించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. రచయితలు సరస్వతీ పుత్రులు. వాళ్లను గౌరవించడం అతికొద్ది మందికే తెలుసు. ఎన్నో సిల్వర్‌ జూబ్లీ చిత్రాలు ఇచ్చిన ఆరుద్రగారు మరణిస్తే… ఆయన్ను చూడటానికి ఏ నిర్మాతా వెళ్లలేదు. నా శ్రీమతి, కుమార్తె వెళ్లి మాల వేసి వచ్చారు. నా నిర్మాణ సంస్థలో ఎంతోమంది గొప్ప రచయితలు పని చేశారు. వాళ్ల ఆశీస్సులు మాకు కావాలి’ అన్నారు.

Read Also : ‘A1 ఎక్స్‌ప్రెస్’ – బయలు దేరింది..

కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ : ‘రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. రచయితలందరూ దర్శకులయ్యారు. ఇప్పుడందరూ రచయితలను నమ్ముకోవాలి. దర్శకుడు కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అయితే… కథ, మాటలు రాసే రచయిత షిప్‌. నిర్మాత దాని ఓనర్‌. షిప్‌కు పెట్టే పేర్లు హీరోలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రయాణికులు. జనమే సమ్రుదం. వాళ్లు ఆదరిస్తే ఒడ్డున చేరతాం. లేదంటే మునుగుతాం’ అన్నారు. ఈ వేడుకలో ప్రతిభ, విశిష్ఠ రచన, గౌరవ పురస్కారాలను రమణాచారి, రాఘవేంద్రరావు, మోహన్‌బాబు అందజేశారు. ‘తెలుగు సినీ రచయితల సంఘం’ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు, బలభద్రపాతుని రమణి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Related Tags :

Related Posts :