వారియర్స్‌పై కరోనా పంజా, 2వేల 500మంది వైద్య సిబ్బందికి కొవిడ్, రాష్ట్రమే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్ ను కూడా వదలడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది వైద్య సిబ్బందికి కొవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.

నిలోఫర్ ఆసుపత్రిలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కరోనాతో మృతి:
కోవిడ్‌-19 పేషెంట్ల సేవలో ఉన్నవారినీ కరోనా వదలడం లేదు. డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా నిలోఫర్‌ ఆసుపత్రిలో పనిచేసే ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని గాంధీ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మరణించడంతో వారిలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాము వైరస్‌ బాధితులకు చికిత్స చేస్తున్నందున ఎక్కువగా ప్రభావితం అవుతున్నామని, ప్రభుత్వం తమకు సాయం చేయాలని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వేడుకుంటున్నారు. కరోనా పోరాటంలో అమరులైన వైద్య సిబ్బందికి నివాళులు అర్పిస్తూ బుధవారం(ఆగస్టు 26,2020) రాత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.

2వేల500 మంది వైద్య సిబ్బందికి కరోనా.. 12మంది మృతి:
రాష్ట్రంలో అనేకమంది డాక్టర్లు, నర్సులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కలుపుకుని 1,500 మంది ఉన్నారు. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మరో వెయ్యిమంది కరోనాకు గురయ్యారని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే 12 మంది వైద్య సిబ్బంది మృతి చెందారు. చనిపోయినవారిలో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా కారణంగా ఎంతమంది చనిపోయారన్న సమాచారం తమకు అందలేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

బీమా సంస్థ అనేక కొర్రీలు పెడుతుందని ఆవేదన:
కరోనాతో చనిపోయిన ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం బీమా కల్పించింది. ఆ బీమా కింద చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల బీమా అందించాలి. అయితే ఇప్పటివరకు 12 మంది చనిపోతే ఒక్కరికి కూడా ఆ స్కీం కింద బీమా సొమ్ము అందలేదని వైద్య సంఘాలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చనిపోయిన ఇద్దరు నర్సుల కుటుంబాలకు రూ.50 లక్షలు మంజూరయ్యాయని, అయితే వారి చేతికి ఇంకా డబ్బు అందలేదని చెబుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బీమా సంస్థ అనేక కొర్రీలు పెడుతుందని వైద్య సంఘాలు అంటున్నాయి.

బీమా డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు:
కరోనాతో చనిపోయినవారిలో ఎవరికైనా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నాయా అన్న విషయంలో మెలిక పెడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అటువంటివారికి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆ సంఘాలనేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా కరోనా బీమా నిబంధనల్లో అటువంటి షరతు ఏమీ లేదంటున్నారు. వైరస్‌ నియంత్రణ విధుల్లో ఉంటూ ప్రమాదవశాత్తు చనిపోయినా బీమా సొమ్ము ఇవ్వాలన్న నిబంధన ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, మెలికల వల్ల సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చనిపోయే వైద్య సిబ్బంది వివరాలు లేకపోవడంతో ఆయా కుటుంబాలకు ఎటువంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

READ  రేపటి నుంచి విద్యుత్ మీటర్ రీడింగ్, కరెంటు బిల్లు ఇలా లెక్కిస్తారు

రాష్ట్రమే కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి:
కేంద్ర సాయంతో సంబంధం లేకుండా కరోనాతో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నరహరి ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ అంటూ తరతమ భేదం లేకుండా అందరికీ కోటి రూపాయలు అందించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు కేంద్ర బీమా నుంచి ఇప్పటివరకు ఒక్కపైసా రాలేదని విచారం వ్యక్తంచేశారు.

ఇటీవల చనిపోయిన డాక్టర్‌ నరేష్‌ కుటుంబానికి తామే రూ.40 లక్షలు వసూలు చేసి ఇచ్చామన్నారు. ఇక కరోనా సోకి పరిస్థితి తీవ్రంగా ఉన్న వైద్య సిబ్బంది అందరికీ గాంధీ ఆసుపత్రిలో కాకుండా నిమ్స్‌లోనూ, అవసరమైతే ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అధునాతన వైద్యం అందించాలని ఆయన కోరారు.

Related Posts