లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

అమెరికాలో కరోనా మరణ మృదంగం…ఒకే రోజులో 3,157 మంది మృతి

Published

on

America corona deaths : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పుడీ మరణాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 3 వేల 157 మంది ఈ వైరస్‌ బారిన పడి మరణించారు. అసలు అగ్రరాజ్యంలో కరోనా మరణాలు పెరగడానికి కారణాలు ఏంటీ? కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఎందుకివ్వడం లేదు? లెట్స్‌ వాచ్‌ దిస్ స్టోరి..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 2 లక్షల 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతేగాకుండా 3వేల 157 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయి మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో తొలిదశ విజృంభణ సమయంలో నమోదైన 2 వేల 603 మరణాలే ఇప్పటి దాకా అత్యధికం. అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 2 లక్షల 76 వేల 148కి పెరిగింది.కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా ఎక్కువవుతోంది. నెల వ్యవధిలో ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. పండగ సీజన్‌ కావడంతో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడంతోనే కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. పెరుగుతున్న కేసులు వైద్య సిబ్బందికి కూడా ప్రమాదకరంగా మారాయి. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా మరణాల్లో 39శాతం మంది వైద్యారోగ్య సిబ్బందే ఉండడం అందరినీ కలచివేస్తోంది.అమెరికాలో ప్రస్తుతం పండగ సీజన్‌.. కొద్ది రోజులుగా అమెరికన్లు దేశం మొత్తం చక్కర్లు కొడుతున్నారు.. కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేసి గుంపులు గుంపులుగా వేడుకలు చేసుకుంటున్నారు.. ఈ విషయంపై అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.గడచిన వారంలో అమెరికాలో 10 వేల మంది కరోనా బారిన పడి మృతి చెందగా.. 11 లక్షలకు పైగా మంది ప్రజలకు ఈ వైరస్‌ సోకింది.. ప్రస్తుతం అక్కడ సెలవులు కొనసాగుతున్నా.. ఆసుపత్రులను మాత్రం తెరిచే ఉంచుతున్నారు.మరోవైపు అమెరికాలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి.. దీనిపై డిసెంబరు 10న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫైజర్‌కు అనుమతి లభిస్తే.. అమెరికాలోని కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ మరుసటి రోజు నుంచే టీకా పంపిణీ ప్రారంభించాలని సంస్థలు భావిస్తున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *