5,000 Feral Camels Shot Dead in Five Days in Drought-hit Australia

ప్రభుత్వ ఆదేశాలతో 5 వేల ఒంటెలు కాల్చివేత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆదివాసీ తెగలవారికి ఇబ్బంది కలిగిస్తున్న అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఒక వైపు అడవి… కార్చిచ్చుతో దహనం అవుతుంటే మరో వైపు అధికారులు ఈ పశుమేధం చేపట్టారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్ మెన్ లు ఒంటెల తలపై తుపాకులు గురిపెట్టి ఏకబిగిన 5వేల ఒంటెలను చంపేశారు. ఎందుకింత పశుమేధం అంటే జనావాసాల పరిరక్షణ కోసమని అధికారులు చెప్పుకొచ్చారు.

కరవు కాటకాలతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియాకు.. ఈ ఒంటెలు మోయలేని భారంగా మారాయని అధికారులు తెలిపారు. ఈ ఒంటెలు ఆస్ట్రేలియాకు చెందినవి కావన్నారు. 18వ శతాబ్దంలో మొదటిసారి భారత్, అఫ్గానిస్తాన్, అరబ్‌ దేశాల నుంచి ఒంటెల్ని ఇక్కడికి తీసుకొచ్చారని వెల్లడించారు. స్థానిక రవాణా అవసరాల కోసం ఒంటెల్ని వినియోగించేవారని… అలా అలా ఆ ఒంటెలు ఆస్త్రేలియన్ల జీవన విధానంలో ఒక భాగం అయ్యాయని తెలిపారు.

”19వ శతాబ్దంలో రవాణ అవసరాల కోసం మోటార్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఒంటెల అవసరం ప్రజలకి తీరిపోయింది. దీంతో వాటిని పెంచడం మానేశారు. ఆ ఒంటెలు చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్లిపోయాయి. ఇవి క్రమంగా అడవుల్లోకి వెళ్లి చెట్టూ చేమ తింటూ వీటి సంతతిని విపరీతంగా పెంచాయి. 1969లో కేవలం 20 వేలు మాత్రమే ఉండే ఒంటెలు, 1988 నాటికి 43 వేలకి చేరుకున్నాయి. 2001-08 మధ్య కాలంలో వాటి సంఖ్య ఏకంగా 10 లక్షలకు చేరుకుంది” అని అధికారులు వివరించారు.

”ఇప్పుడు ఆస్ట్రేలియాలో అడవులు తగలబడిపోతుంటే నీటి కోసం ఇవి జనావాసాల పైకి వచ్చి దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అడవి ఒంటెల్లో అత్యధికంగా ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. పెరిగిన ఒంటెల మందలు చెట్టూ, చేమలను, నీటి వనరులను పాడు చేస్తూ ఆదివాసీలకు ఇక్కట్లు కల్పిస్తున్నాయి. ప్రస్తుత పశుమేధం దక్షిణ ఆస్ట్రేలియాలోని అనంగు ఆదివాసీ ప్రాంతంలో జరిగింది. పచ్చదనం కొంచెం అధికమొత్తంలో కనిపించే ఆ ప్రాంతంలో 2300 మంది ఆదివాసీలు జీవిస్తున్నారు” అని అధికారులు తెలిపారు.
 

జంతు ప్రేమికులు తీవ్రంగా విమర్శిస్తున్నా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దానికి కారణం ఒంటె స్థానిక జంతువు కాదు. అది వలస జంతువే.. మారుమూల ప్రాంతంలోని స్థానిక తెగలవారు ఒంటెల కారణంగా అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను తప్పించాల్సి ఉందని వారికి ప్రభుత్వం సమాధానం చెబుతోంది. బయటి నుంచి దిగుమతైన ఒంటెలు స్థానికుల పాలిట శాపంలా తయారయ్యాయని  అధికారులు వాపోయారు.

2012లో ఏకంగా ఏడాదికి 75 వేల ఒంటెల్ని కాల్చేసింది. గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితుల కారణంగా కూడా ఆస్ట్రేలియాలోని  కొన్ని ప్రాంతాల్లో ఆహారానికి, నీటికి   ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. అందుకే వాటిని చంపేయడమే పనిగా పెట్టుకుంది ఆస్ట్రేలియా. అలా వాటి సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది. అప్పుడెప్పుడో వలస పాలకులు తమ అవసరం కోసం చేసిన పని ఇప్పుడు ఈ మూగజీవాలకు పెనుశాపమైంది. రోడ్లమీద కార్లలో ప్రయాణించేవారిని  అవి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఐదురోజుల పాటు సాగిన వేట మంగళవారంతో ముగిసింది.