92శాతం బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనంలో భయం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా రోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెడ్స్ అన్నీ బాధితులతో నిండిపోయాయని, బెడ్లు లేవనే వార్తలు కలకలం రేపాయి. ఈ వార్తలు జనాల్లో మరింత ఆందోళన నింపాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది.

రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పడకలు, నిండింది 8శాతమే:
రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోందని చెప్పింది. ఇప్పటివరకు 29వేల 536 కేసులు నమోదు కాగా 17వేల 279 మంది డిశ్చార్జి అయ్యారు. బుధవారం(జూలై 8,2020) ఒక్కరోజే 1,924 కేసులు పాజిటివ్‌ రాగా.. 992 మంది కరోనా నుంచి విముక్తి పొంది ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో కరోనా రోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన పడకల్లో 92.2 శాతం ఖాళీగానే ఉంటున్నాయని అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పడకలను అందుబాటులోకి తీసుకు రాగా.. అన్ని ఆసుపత్రుల్లో కలిపి దాదాపు 8 శాతం మాత్రమే నిండాయని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఐసీయూల్లో కూడా 89 శాతం పడకలు ఖాళీగానే ఉన్నాయన్నారు. గాంధీ ఆసుపత్రిలో సైతం 1,141 పడకలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.

కాబట్టి, ఆసుపత్రుల్లో బెడ్స్ అన్నీ కరోనా రోగులతో నిండిపోయాయని, బెడ్లు ఖాళీగా లేవనే వార్తల్లో నిజం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, ఆందోళన పడొద్దని అధికారులు కోరారు. కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

Related Posts