జంతువుల్లాగే మొక్కల్లో కూడా కొన్ని మాంసాహారులు ఉంటాయి..

కీటకాలు, మిడతలు, చిన్నచిన్న కప్పలు, బల్లుల వంటి వాటిని ఆకుల్లో బంధించి జీర్ణం చేసుకుంటాయి.

వీటిని మాంసాహార మొక్కలు లేదా కీటకాహార మొక్కలు (పిచర్ ప్లాంట్స్) అంటారు. నత్రజని లభ్యత తక్కువగా ఉండే బురదనేలల్లో పెరిగే ఈ మొక్కలు నత్రజని కోసం కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.

సర్రేసీనియా (Sarracenia) ఈ మొక్కలు సర్రేసినియేసీ కుటుంబానికి చెందినవి. ఈ ప్రజాతిలో 8-11 జాతులున్నాయి.

ఈ మొక్కలన్నీ ఉత్తరఅమెరికాలోని సముద్ర తీరాలు, కెనడాలోని ఆగ్నేయ ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిని సాధారణంగా ట్రంపెట్ పిచర్స్ అంటారు.

నెపంథిస్ (Nepenthes) ఈ మొక్కలు నెపంథేసియే కుటుంబానికి చెందినవి. వీటిలో 130కి పైగా జాతులున్నాయి. ఇవి ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే మాంసాహార మొక్కలు. వీటిని సాధారణంగా మంకీ కప్స్ అంటారు.

ఈ మొక్కలు భారత్ తో పాటు చైనా, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మడగాస్కర్, సీషెల్స్, ఆస్ట్రేలియా దేశాల్లోని చిత్తడినేలల్లో పెరుగుతాయి. వీటిలో కొన్ని జాతుల మొక్కలు 10 నుంచి 15 మీటర్ల పొడవుండి తీగల్లా ఇతర ఆధారాలపై ఎగబాకుతాయి.

జాతులకు చెందిన మొక్కలు పెద్దవిగా ఉండి ఎలుకలు, బల్లులు మొదలైన పెద్ద ప్రాణులను కూడా కూజాల్లాంటి నిర్మాణాల్లో బంధించి జీర్ణం చేసుకుంటాయి. నెపంథిస్ అటెన్‌బరోగిని ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార మొక్కగా చెప్పవచ్చు. దీన్ని 2009 ఆగస్టులో కనిపెట్టారు.

యుట్రిక్యులేరియా (Utricularia)ఈ మొక్కలు లెంటిబ్యులారియేసి కుటుంబానికి చెందినవి. ఈ ప్రజాతిలో 230కి పైగా జాతులున్నాయి. ఇవి స్వచ్ఛమైన నీటిలో, తడి నేలల్లో పెరిగే మాంసాహార మొక్కలు. వీటిని సాధారణంగా బ్లాడర్‌వర్ట్‌లు అంటారు.

మంచు ఖండం అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల్లో పెరుగుతాయి. ఈ ప్రజాతిలోని 80 శాతం జాతులు తడి నేలల్లో, 20 శాతం జాతులు మంచినీటి కుంటల్లో ఉంటాయి.

డ్రాసిరా (Drosera)ఈ మాంసాహార మొక్కలు డ్రాసిరేసి కుటుంబానికి చెందినవి. ఈ ప్రజాతిలో దాదాపు 195 జాతులున్నాయి. వీటిని సాధారణంగా సన్‌డ్యూస్ అంటారు.

ఇవి కూడా అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో కనిపిస్తాయి. వీటి పరిమాణం ఒక్కోజాతిలో ఒక్కోతీరుగా ఉంటుంది. జాతిని బట్టి సెంటీమీటర్ నుంచి మీటర్ వరకు ఎత్తు పెరుగుతాయి.  సుమారు 50 ఏళ్ల జీవిస్తాయి.

ఈ మొక్కల ఆకుల పైన  సన్నని కేశాల వంటివి ఉంటాయి. వీటి నుంచి తియ్యని జిగురు స్రావాలు విడుదలవుతాయి.

కీటకాలు ఈ కేశాలపై వాలగానే జిగురు అంటుకుంటుంది. వెంటనే చుట్టూ ఉన్న కేశాలు కూడా కీటకాన్ని చుట్టి ఊపిరి ఆడకుండాచేసి చంపుతాయి.ఆ జిగురు స్రావాల్లోని గ్రంథులు కీటకాలను జీర్ణంచేసి మొక్కకు పోషకాలను అందిస్తాయి.