1992, డిసెంబర్ 6న కొంత మంది రైట్ వింగ్ కార్యకర్తలు అయోధ్యలోని బాబ్రీ మసీదుపై దాడికి దిగారు. మసీదును విధ్వంసం చేస్తూ అయోధ్యలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ ప్రదేశంలో రామాలయం ఉండేదని, దాన్ని కూల్చి మసీదు నిర్మించారనే ఏళ్ల నాటి వివాదాన్ని.. 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ విధ్వంసం మరో మలుపుకు తీసుకెళ్లింది. చివరగా సుప్రీం కోర్టు ప్రమేయంతో మసీదు స్థలాన్ని హిందువులకు కేటాయించాలని తీర్పు వచ్చింది. దేశంలో సుదీర్ఘ కాలం సాగిన ఈ అనిశ్చితి గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1528లో మొఘల్ చక్రవర్తి బాబార్ ఆదేశాలతో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది. మూడు శతాబ్దాల అనంతరం మసీదు నిర్మించిన ప్రాంతంలో రామమందిరం ఉండేదని, అది కూల్చి మసీదు నిర్మించారనే వాదనలు పైకి లేచాయి.

ఈ విషయమై అయోధ్యలో హిందూ-ముస్లింల మధ్య 1855లో మొదటిసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో 1859లో బ్రిటిష్ పాలకులు మసీదు చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. మసీదు వెలుపల హిందువులకు పూజకు అనుమతి ఇచ్చారు.

1934లో హిందూ-ముస్లింల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. 1947లో ఈ మసీదుపై అధికారం సున్నీ వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉందని, షియా వక్ఫ్ బోర్డుకు లేదని స్థానిక కోర్టు తీర్పు చెప్పింది.

అయితే ఈ మసీదులో హిందూ మహాసభ సభ్యులు పెట్టిన విగ్రహాలను తొలగించేందుకు ఆదేశించబోనని జిల్లా మేజిస్ట్రేట్ 1949 డిసెంబరు 22న తీర్పు చెప్పారు. ఆ తర్వాత ఈ మసీదుకు తాళాలు వేశారు.

1984లో బీజేపీ అగ్రనేత ఎల్‭కే అద్వాణీ ఆధ్వర్యంలో రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది. అనంతరం, 1986లో మసీదు తలుపులు తెరిచి పూజలు చేసుకోవడానికి హిందువులకు అనుమతి లభించింది.

రామాలయం కోసం శిలాన్యాసం చేయడానికి వీహెచ్‌పీకి 1989 నవంబరు 9న అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇక 1990 సెప్టెంబర్ 25న ఎల్‭కే అద్వాణీ చేపట్టిన రథయాత్ర ఈ వివాదాన్ని మరోవైపుకు తీసుకెళ్లింది.

1992 డిసెంబరు 6న బీజేపీ సహా ఇతర హిందూ సంఘాలు రామమందిరం కోసం బాబ్రీ మసీదు వద్ద సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు వచ్చిన జనాలు ఉన్నట్లుండి మసీదులోకి దూసుకెళ్లారు. కొద్ది గంటల్లోనే దానిని కూల్చేశారు.

వాజ్‌పాయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కల్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమా భారతి, విజయరాజే సింథియా, వీహెచ్‌పీ నేతలు గిరిరాజ్ కిశోర్, అశోక్ సింఘాల్, శివ సేన చీఫ్ బాల్ థాకరే, ఆరెస్సెస్ మాజీ నేత కేఎన్ గోవిందాచార్య తదితరులు దోషులుగా తేలారు.

2019 నవంబరు 9న బాబ్రీ మసీదు స్థలాన్ని పూర్తిగా హిందువులకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్మానం చేసింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ స్థలంలో 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించింది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వాణీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్ సహా ఇతరులను సీబీఐ ప్రత్యేక కోర్టు 2020 సెప్టెంబర్ 30న నిర్దోషులుగా ప్రకటించింది.

2020 ఆగస్టు 5న మసీదు కూల్చిన ప్రాంతంలోనే రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేశారు. 2024 లోక్‭సభ ఎన్నికల లోపు నిర్మాణం పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.