ఎలోన్‌ మ‌స్క్‌కు బిగ్ షాకిచ్చిన బ్రెజిల్ సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవలపై నిషేదం.. ఎందుకంటే?

అధికారికంగా బ్రెజిల్ లో ‘ఎక్స్’ 22 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది. 

ఎలోన్‌ మ‌స్క్‌కు బిగ్ షాకిచ్చిన బ్రెజిల్ సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవలపై నిషేదం.. ఎందుకంటే?

Elon Musk

Elon Musk : ఎలోన్ మస్క్ కు బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానం బిగ్ షాకిచ్చింది. మస్క్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ సేవలను దేశ వ్యాప్తంగా నిలిపివేయాలని నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఏజెన్సీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం బ్రెజిల్ ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ద్వారా ఒక ప్రకటన విడుదలైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా బ్రెజిల్ అంతటా ‘ఎక్స్’ సేవలను నిలిపివేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. దేశంలో కంపెనీ ప్రతినిధిని నియమించే వరకు కోర్టు ఆర్డర్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. యాపిల్, గూగుల్ వంటి కంపెనీలకు ‘ఎక్స్’ ను దాని అప్లకేషన్ స్టోర్ ల నుంచి తొలగించడానికి, ఐఓఎస్, ఆండ్రాయిడ్ సిస్టమ్ లలో ‘ఎక్స్’ వినియోగాన్ని నిరోధించడానికి న్యాయస్థానం ఐదు రోజులు గడువు ఇచ్చింది. అంతేకాదు.. ఇతర మార్గాల ద్వారా ‘ఎక్స్’ ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించే వ్యక్తులకు భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.

Also Read : Jio PhoneCall AI : జియో ఫోన్‌కాల్ ఏఐ అంటే ఏంటి? ఇదేలా పనిచేస్తుంది? ఎప్పుడు వస్తుంది?

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు డజన్ల కొద్దీ ఎక్స్ ఖాతాలను సస్పెండ్ చేయాలని బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి కొద్ది నెలల క్రితం ఆదేశించారు. కోర్టు సూచనకు స్పందిస్తూ.. ఎలోన్ మస్క్ ‘ఎక్స్’ ఖాతాలో తన అభ్యంతరాన్ని తెలిపాడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యానికి పునాది. బ్రెజిల్ లో ఎన్నుకోబడని నకిలీ న్యాయమూర్తి రాజకీయ ప్రయోజనాల కోసం దానిని నాశనం చేస్తున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుంది.

Also Read : Motorola Edge 50 Neo : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ సిరీస్ వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలివే..!

బ్రెజిల్ దేశంలో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ తమ వ్యాపారంకోసం చట్టపరమైన ప్రతినిధి నియమించుకోవడానికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం మస్క్ కు 24గంటల సమయం ఇచ్చింది. కోర్టు నిబంధనలు పాటించకుంటే దేశంలో ‘ఎక్స్’ కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంటుందని, అంతేకాక భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంసైతం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, మస్క్ ఆ ఉత్తర్వులను పాటించలేదు. గురువారం సాయంత్రం వరకు అవకాశం ఇచ్చినప్పటికీ మస్క్ స్పందించక పోవటంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రెజిల్ లో ఎక్స్ సేవలను నిలిపివేయాలని నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఏజెన్సీని కోర్టు ఆదేశించింది. ఇదిలాఉంటే.. అధికారికంగా బ్రెజిల్ లో ‘ఎక్స్’ 22 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది.