3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మహిళలపై అఘాయిత్యాలపై ప్రధాని స్పందన

మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల అభద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని ప్రధాని మోదీ అన్నారు.

3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మహిళలపై అఘాయిత్యాలపై ప్రధాని స్పందన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. లక్నో- మీరఠ్, మధురై-బెంగళూరు, చెన్నై- నాగర్కోయిల్ మధ్య ఈ వందేభారత్ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లను మోదీ వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవానికి దక్షిణాది రాష్ట్రాలు వేగంగా వృద్ధి చెందడం కీలకమని ప్రధాని మోదీ చెప్పారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పెంచిన బడ్జెట్ కేటాయింపుల వల్ల దక్షిణాదిలో రైలు రవాణా మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. వందేభారత్ రైలు వల్ల మీరఠ్- లక్నో మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట మేర ఆదా అవుతుందని తెలిపారు.

మిగతా రైళ్ల వల్ల కూడా సమయం ఆదా అవుతుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపడంలో భారతీయ రైల్వే ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికీ సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే రైల్వే లక్ష్యమని చెప్పారు.

మహిళలపై అఘాయిత్యాలపై మోదీ స్పందన
మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల అభద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని ప్రధాని మోదీ అన్నారు. న్యాయవ్యవస్థ సదస్సులో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరగా న్యాయం జరిగితే మహిళలు తమ భద్రతపై మరింత నమ్మకంతో ఉంటారని తెలిపారు. ఇందుకు కొన్ని కఠిన చట్టాలు ఉపయోగపడతాయని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలను నిరోధించడానికి కఠిన చట్టాలు తీసుకొస్తామని ఇటీవలే మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేఏ పాల్ పిలుపు