ఏపీని వణికిస్తున్న వర్షాలు.. స్తంభించిన రవాణా వ్యవస్థ.. పలు రైళ్లు రద్దు

ఏపీలో దంచికొడుతున్న వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షాలతో ఏపీలో రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదవుతున్నాయి. 

ఏపీని వణికిస్తున్న వర్షాలు.. స్తంభించిన రవాణా వ్యవస్థ.. పలు రైళ్లు రద్దు

heavy rains badly hit andhra pradesh and trains cancelled

AP heavy rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమైయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరంలో జనజీవనం స్తంభించింది. పలు కాలనీలు మునిగిపోయాయి. రహదారులు చెరువులను తలపిస్తుండడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. మరికొన్ని గంటల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలపడంతో ఏపీ వాసులు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది.

రికార్డు స్థాయిలో వర్షపాతం
ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షాలతో ఏపీలో రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదవుతున్నాయి. వీరులపాడులో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కంచికచర్ల 20.3, ఇబ్రహీంపట్నం 15.3, నందిగామ 13.8, విజయవాడలో 13.5, గంపలగూడెం 13.1, చందర్లపాడులో 11, జగ్గయ్యపేట, విసన్నపేటలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈరోజు రాత్రి, రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

స్తంభించిన రవాణా వ్యవస్థ.. పలు రైళ్లు రద్దు
కుండపోత వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో రహదారులపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల రైల్వే ట్రాకులపైకి నీళ్లు చేరడంతో భద్రతా కారణాల రీత్యా విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. శని, ఆది, సోమవారాల్లో 20 వరకు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది.

విజయవాడ- తెనాలి, విజయవాడ- గూడురు, తెనాలి- రేపల్లె, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు, గుంటూరు- రేపల్లె, విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- ఒంగోలు తదితర టౌన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది.

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దురగుడి ఫ్లైఓవర్ తాత్కాలికంగా క్లోజ్ చేశారు.

Also Read: గుంటూరు జిల్లాలో వరద బీభత్సం.. కారు కొట్టుకుపోయి టీచర్, ఇద్దరు విద్యార్థుల మృతి

నెమలిగుండ్లలో చిక్కుకున్న భక్తులు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతికి సుమారు 30 మంది భక్తులు చిక్కుకుపోయారు. శనివారం కావడంతో నెమలిగుండ్ల రంగస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి వచ్చారు. ఎడతెరపి లేని వర్షానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ ట్రాక్టర్, లారీ సహాయంతో భక్తులకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రాచర్ల ఎసై, ఆలయ ఈఓ, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.